పాతాళైక నికేతనాంతరమునన్ పర్వెన్ తదశ్వాఖిల
స్రోతోమార్గ వినిగ్రతోగ్ర దహనా ర్చుల్, పన్నగ వ్రాతముల్
భీతిల్లెన్ భుజగాధినాథ మనమున్ భేదిల్లె కల్పాంత సం
జాతప్రోద్ధత బాడబానల శిఖా శంకాధికాతంకమై!
–నన్నయ భట్టారకుడు
కథ, నేపథ్యం:
తక్షకుడు ఉదంకుని వద్ద గల కర్ణాభరణాలు తస్కరించి, వాటితో పాతాళ లోకానికి పారిపోతాడు. ఉదంక మహాముని అతణ్ణి వెంబడించి తానూ పాతాళ లోకానికి పోతాడు. అక్కడ నాగదేవత లందరినీ, తక్షకునితో సహా స్తుతిస్తాడు.
నాగలోకంలో అతనికొక దృశ్యం కంటబడుతుంది. తెల్లని, నల్లని, దారాలు కలిపి ఇద్దరు స్త్రీలొక వస్త్రం నేస్తుంటారు. ఆరుగురు యువకులు పన్నెండు ఆకులు గల ఒక చక్రం తిప్పుతుంటారు. పెద్ద అశ్వరాజంపై తేజస్వి యైన ఒక దివ్యపురుషుడు కనబడతాడు. ఉదంకుడు ఆ దివ్యపురుషుణ్ణి విపులార్థ వంతమైన మంత్రాలతో, భక్తి వినమ్రతలతో స్తుతిస్తాడు.
ఆ దివ్యపురుషుడు ప్రసన్నుడై ఉదంకునితో ఇట్లా అంటాడు: “మహామునీ! నీ స్తోత్రాలచే ప్రీత మానసుడనైనాను. నీ కోరిక నాకు తెలుపు. నేను తీరుస్తాను!”
బదులుగా ఉదంక మహాముని ఇట్లా అంటాడు: “ఈ నాగకులమంతా నాకు వశమై పోయేటట్లు అనుగ్రహించు”. దానికా దివ్య పురుషుడంటాడు:”అట్లైతే ఈ అశ్వరాజపు కర్ఢరంధ్రంలో ఊదు!”. ఆయన చెప్పినట్లే, ఉదంకముని తన నోరుపెట్టి గుఱ్ఱం కర్ఢరంధ్రాల గుండా ఊదుతాడు.
అప్పుడేమి సంభవించిందో నేటి పద్యం వివరిస్తుంది. ఆ పద్య తాత్పర్యమిది: “అశ్వరాజం యొక్క సర్వేంద్రియాల నుండి వెలువడిన భయంకరమైన అగ్నిజ్వాలలతో పాతాళ లోకపు మహాభవనాంతరాళం నిండి పోయింది. సర్పరాజములన్నీ భీతితో తల్లడిలాలినవి. ప్రళయకాలాగ్ని జ్వాలలా యివి? అన్న సందేహం ఉత్పన్నమై, భుజగాధి నాథులకందరికీ భయంతో హృదయగోళం బ్రద్దలైంది.”
Also read: మా ఊరు ఓరుగల్లు
ఉదంకుని స్వభావం
ఉదంకుడు మహాముని. కానీ ఆయన తొందరపాటుతనం, ఆయన కోపతాపాలు, పౌష్యమహారాజుకు శాపం ఇవ్వడంలో, ఆ శాపాన్ని వెనువెంటనే పరిహరించడం లోనే మనకు తేటతెల్లమౌతాయి.
ఆయన నగలను దొంగిలించింది తక్షకుడనే సర్పం. కానీ కట్టెదుట ప్రత్యక్షమైన దివ్యపురుషుణ్ణి ఉదంకుడు కోరే కోరిక ఏది? “నాకీ నాగవంశమంతా వశమయ్యేట్లు అనుగ్రహించు!” అని అతడు అడుగుతున్నాడు. కేవలమొక తక్షకుడు చేసిన తప్పుకు నాగలోకాన్నంతా తన స్వాధీనంలోకి తీసుకొనవలసిన అవసరం ఏమున్నది? మహామునులు సమస్త సృష్టితో సహజీవనం కోరుకుంటారు.
ఇక్కడ ఉదంకుడు కోరుకుంటున్నది ప్రకృతి విరుద్ధం. దీని అంతరార్థం ఏమున్నది? ఇవన్నీ చేయమని ఉదంకుణ్ణి విధియే నిర్దేశించిందా? రాబోయే ఘట్టాలీ విషయాన్ని తెలుపుతాయి.
అశ్వరాజం అగ్నిని వెదజల్లి సర్పజాతిని భయపెట్టడం రాబోయే మహా సర్పయాగానికి నేపథ్యం. ఆ యాగానికి కూడా ఉదంకమునియే కారకుడౌతాడు. సంస్కృతమూలంలో దివ్యపురుషుడు గుఱ్ఱం యొక్క అపానంలో ఊదమని ఉదంకుణ్ణీ ఆదేశిస్తాడు. అది అనుచితమనే భావనతో నన్నయ భట్టారకుడు కర్ణరంధ్రాలను ఎన్నుకున్నాడు.
ఉదంకుని నాగస్తుతి గల నాలుగు పద్యాలు ఒక ఎత్తైతే, వాటిని అనుసరించే నేటి పద్యం మరొక ఎత్తు. ఆ నాలుగు పద్యాల్లోనూ ఉదంకుడు నాగదేవతలను ప్రసన్నం చేసుకోవడానికి మాత్రమే ప్రయత్నిస్తాడు. పద్యాలలోని నాల్గవ దానిలో ఉదంకునికి ధ్వనిపూర్వకమైన హెచ్చరిక కూడా వున్నది.
మొదటి నాలుగు పద్యాల్లో నాగలోకాన్ని ప్రసన్నం చేసుకోవాలనేదే ధ్యేయమైతే, నేటి పద్యంలో ఉదంకుని ఉద్దేశ్యం అదే నాగలోకాన్ని తన వశం చేసుకొవడం, అంతేకాక నాగరాజుల గుండెల్లో ప్రళయభీతిని సృష్టించడం. కడకు భయం చెంది తక్షకుడు నగలను వాపసు చేసినా ఉదంకుని కోపం చల్లారదు. సర్పయాగ ప్రయత్నాలు ఆగవు.
నన్నయ పద్యనిర్మాణం, అక్షరరమ్యత
సర్పస్తుతిలోని నాలుగు పద్యాలు, నేటి పద్యము, వెరసి ఐదు పద్యాల్లో ఒక పద్ధతి ప్రకారం పద్యాల ఎత్తుగడలో ఆరోహణా ప్రక్రియ వున్నది. మొదటి రెండు పద్యాలు చంపకమాలలు. నాలుగు లఘువులతో మొదలయ్యే చంపకమాల అత్యంత సరళమైనది. తర్వాతి రెండు పద్యాలు ఉత్పలమాలలు. ప్రతి పాదం ఒక గురువుతో మొదలౌతుంది. ఉత్పలమాల కూడా సరళమే. ఈ పద్యం ఎత్తుగడలో ఒక్క గురువు మాత్రమే ఉన్నది. నేటి పద్యం, క్రమంలో ఐదవది శార్దూల విక్రీడితానికి చెందినది. రౌద్రాన్ని ప్రదర్శించడంలో ఇది పతాకస్థాయికి చెందుతుంది. ఈ పద్యం ఎత్తుగడలోనే మూడు గురువులు ఉన్నాయి. దేశీయ ఛందానికి, మార్గచ్ఛందానికి తేడా వున్నది. మార్గచ్ఛందంలో మూడక్షరాల గణం ప్రాథమిక విభాగం. ఈ విభాగాల్లో మొదటిది నగణం. ఇందులోని మూడు అక్షరాలు లఘువులే. ఈ గణం అటు ఆరోహణను గానీ, ఇటు అవరోహణను గానీ సూచించని నిశ్చలత్వాన్ని తెలుపుతుంది. తరువాతది సగణం-రెండు లఘువులు ఒక గురువు. పిదప యగణం-ఒక లఘువు రెండు గురువులు. ఇవి రెండూ లఘువు నుండి గురువుకు ఆరోహణక్రమాన్ని తెలుపుతాయి. తదుపరి మగణం. అన్నీ గురువులే. ఇది శిఖరాగ్ర స్థాయి. మగణం సైతం కదలిక లేని నిశ్చలస్థితినే తెలుపుతుంది. మగణంతో ఆరోహణ క్రమం పూర్తి చెందుతుంది. తర్వాత తగణం, రెండు గురువులు దాని తర్వాత ఒక లఘువు. పిదప భగణం. ఒక గురువు, రెండు లఘువులు. దీనితో అవరోహణ క్రమం సైతం సమాప్తి చెందుతుంది.
Also read: భారత్, పాకిస్తాన్ మధ్య 1971లో జరిగింది ధర్మయుద్ధం
ఈ క్రమక్రమారోహణకు గానీ అవరోహణకు గానీ చెందనివే ర గణము, జగణము. రగణంలో గురువు, లఘువు, మళ్లీ గురువు. అనగా ఒక ఉత్తుంగ కెరటం క్రిందకు పడి మళ్లీ లేవడం వంటిది. జగణం దీనికి భిన్నం. మొదట లఘువు, పిదప గురువు, మళ్ళీ లఘువు. అనగా ఒక నిమ్న తరంగం ఉత్తుంగమై మళ్లీ క్రింద పడడం వంటిది. జగణంలో దాగిన సోగసులను ప్రత్యేకంగా ఆవిష్కారం చేయగల వృత్తాలు, ఆవిష్కరించిన కవులు తెలుగు సాహిత్యంలో తక్కువ. హిందీ, ఉరుదూ, పారశీక కవిత్వాల్లో జగణం యొక్క ప్రయోగం ఆయాబాషల్లోని గేయరచనల్లో సర్వసాధారణం. ఆధునిక తెలుగు కవుల్లో జగణాన్ని విరివిగా ప్రయోగించిన గౌరవం మహాకవి శ్రీశ్రీకి దక్కుతుంది.
నాలుగు వృత్తాలూ ఏకగర్భజనితాలే
తెలుగులో ప్రధానమైన నాలుగు వృత్తాలూ ఏకగర్భ జనితములే. “సిరికిన్ చెప్పడు శంఖుచక్ర యుగమున్” అన్న వాక్యశకలంలో “సిరికిన్” అన్న పదం తీసివేస్తే, చెప్పడు శంఖుచక్ర యుగమున్” అనే వాక్యశకలం ఉత్పలమాల లోని “భ/ర/న” గణాలకు సరిపోతుంది. ఉత్పలమాలలో ఇవే గణాలు పునరావృతమౌతాయి: “భ/ర/న/భ/భ/ర/వ”. ఇట్లే “త్రేతా ద్వాపర సంధి ఉద్ధత మదాంధీభూత విద్వేషి” అనే శార్దూలపాదంలో, త్రేతా అనే పదం తీసివేస్తే, “ద్వాపర సంధి ఉద్ధత మ” అన్న వాక్యశకలం ఉత్పలమాల లోని పూర్వార్ధంగా గమనింపగలరు. ఇట్టిదే ఆది శంకరుల శార్దూల విక్రీడితం లోని: (లక్ష్మీమ్) క్షీర సముద్ర రాజతనయాం” అనే వాక్యశకలం. తెలుగులో తరతరాలుగా వాడుకలో వున్న ఈ నాలుగు వృత్తాలూ ఏకగర్భ జనితములే అనడానికి ఇవి స్వల్ప ఉదాహరణలు. పేరుకు నాలుగు వృత్తాలైనా , కొన్ని కొన్ని మార్పులతో ఇవన్నీ ఒకటే. ఆదికవి ఈ నాలుగు వృత్తాలనూ తన “మహాభారత” రచనకు ఎన్నుకోవడం ఒక ప్రణాళిక ప్రకారం జరిగిందనే అబిప్రాయం కలుగక మానదు.
నన్నయ భట్టారకుడు సీసము, తేటగీతి వంటి దేశీయ ఛందోవిశేషాలు వాడినా, ఆదికవి ప్రతిభ మార్గచ్ఛందో విశేషాలైన వృత్తాలలోనే ఎక్కువగా గోచరిస్తుంది. ఆయన లేఖిని నుంచి వెలువడే ప్రతి వృత్తం అలవోకగా దొరలి పోతుంది. ఆదికవి దృక్పథంలో ఫలానా యతిమైత్రి ఖండయతియా, అఖండయతియా అనే పట్టింపుకు తావులేదు. అదే సమయంలో నన్నయ ప్రతి వృత్తము, దేనికదే, ఆయా సందర్బానికే ప్రత్యేకమైన విలక్షణ గుణాన్ని ప్రదర్శింపజేసి మనస్సును రంజింపజేస్తుంది. నేటి పద్యమూ అంతే.
Also read: భారత్, పాకిస్తాన్ మధ్య 1971లో జరిగింది ధర్మయుద్ధం
నేటి పద్యం
నేటి పద్యంలో “స్రోతో మార్గ,”, “పన్నగవ్రాతముల్” “వినిర్గతోగ్ర దహనార్చుల్”, “కల్పాంత సంజాత”, “శిఖాశంఖాది కాతంకమై”, వంటి ప్రయోగాలు, ద్విత్వాక్షరాలు, భ,ధ, వంటి పదాలు, భయానక రసాన్ని అద్భుతంగా ప్రదర్శిస్తాయి. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో నన్నయ భట్టారకుడు పద్యంలోని ఎత్తుగడలో తానే శబ్దాలు ప్రయోగిస్తాడో, పద్యం ముగింపులో సైతం వాటినే పునః ప్రయోగిస్తాడు. నేటి పద్యంలోనూ అట్టి పదప్రయోగం వున్నది. దీనిలోని మొదటి పాదం ఎత్తుగడలో “పాతాళైక నికేతనాంతరమునన్” అనే ప్రయోగం వున్నది. నాలుగవ పాదం కొసలో “శిఖాశంకాధి కాతంకమై” అనే ప్రయోగం ఉన్నది. రెంటిలోనూ “త” కారంతో బాటు “క” కారమూ సరిసమాన నిష్పత్తిలో ఆవిష్కరింపబడుతున్నాయి. మొత్తం పద్యాన్ని ఈ రెండు శబ్దాలే, ప్రధానంగా పాలిస్తున్నాయి. ముఖ్యంగా “త” కారం ఈ పద్యానికి సార్వభౌముని వలె స్ఫురిస్తుంది.
వాగనుశాసనుడి లయవిన్యాసాలు
నన్నయ పద్యశోభ కేవలం శబ్ధపునరావృతిచే సిద్ధించినది మాత్రమే కాదు. సంస్కృతంలో వందలాది ఛందోవిశేషాలున్నా, ఆదికవి తన రచనకు ప్రధానంగా, ఉత్పల, చంపకమాలలు, శార్దూల, మత్తేభాలనే ఎంచుకున్నాడు. ఏకగర్భ జనితములైన యీ నాలుగు వృత్తాలనే తరుచుగా వాడుతూ, వాగనుశాసనుడు ప్రదర్శించే లయావిన్యాసాలు వివిధానేకములు. అవి అప్రయత్న పూర్వకములే గాక, అనర్గళములు కూడా. ఆదికవి రచనలో ఆరోహణా క్రమం గల ఒకానొక గణం, అవరోహణా క్రమంగల మరొక గణంతో సంగమించినప్పుడొక విలక్షణ లయ, ఒకానొక విశిష్ట శబ్దాకృతి ఏర్పడతాయి.
నన్నయ భట్టారకుని పద్యనిర్మాణ ప్రతిభ, సాంకేతిక నైపుణ్యం అనితర సాధ్యమైనవి. వీనులకు విందు కలిగించడమే గాక, కేవలం వినికిడి మాత్రంచే పద్యభావాన్ని పఠిత అంతఃచేతనలో స్ఫురింప జేయగల నైపుణ్యం నన్నయ భట్టారకునిది. ఆమెరికన్ కవి ఆర్చిబాల్డ్ మాక్లిష్ పద్యం ఈ సందర్బంలో ఉటంకించక తప్పదు:
“A poem should be like the speechless flight of birds;
A poem should not mean but be”.
చేయితిరిగిన చిత్రకారులు వాడే రంగులు కడు స్వల్పం. ఆ రంగులనే ఒకదానితో ఒకటి వివిధ పాళ్ళలో కలుపుతూ వారొక అపూర్వ వర్ణ సమ్మేళనాన్ని సాధిస్తారు. ప్రతిభావంతులైన వాద్యకారులు కూడా అతి తక్కువ వాద్యాలతో అనంత శబ్దజాలాన్ని సృష్టిస్తారు. నన్నయ శబ్దసమ్మేళనం సైతం అట్టిదే. అది బీతోవన్ సంగీతంలోని వాద్యసంగమం వంటిది, మైఖెలేంజెలో చిత్రాల్లోని వర్ణసంయోగం వంటిది. నన్నయ గారి పద్యము, గద్యము, ధీర, గంభీర శైలితో సాగుతూ మనస్సును రంజింపజేస్తాయి. స్పెషల్ ఎఫెక్ట్స్ ఆయన ఎప్పుడో తప్ప ఉపయోగించడు. వేయి యేండ్ల తెలుగు పద్యం ఆదికవి పెట్టిన భిక్షయే.
Also read: మహాభారతం – ఆదిపర్వము : ఉదంకోపాఖ్యానము
నన్నయ్యకు పంపడు ఆదర్శం
నన్నయకు కన్నడ మహాకవి పంపడు ఆదర్శం. తెలుగులో నన్నయ వాడిన ప్రధాన వృత్తాలు పంపమహాకవి నుండి స్వీకరించినవే. అవి తొలుత సంస్కృతం నుండి పంపనికి బట్వాడాయై, ఆయన ద్వారా తెలుగుకు సంక్రమించినవి. తెలుగులిపికి కూడా కన్నడలిపియే మూలం. ఈ విషయంలో తెలుగుజాతి కన్నడిగులకు ఎంతో ఋణపడి వున్నది. నన్నయ భట్టారకుని రచనా మాధుర్యానికి మరొక ముఖ్యమైన కారణం ఆదికవి వాడే గణాలన్నీ బీజ “మంత్రాలవలె” పొదగబడి వుండడం. కొన్నికొన్ని నన్నయ పద్యాలు పఠించినప్పుడు, అవి వైదిక మంత్రోచ్ఛారణను తలపిస్తాయి. “బహువన పాదపాబ్ధి” అనే పద్యం అందులో ఒకటి.
పలువురు పాశ్చాత్య మహాకవులు తమతమ జీవన పరిపక్వ దశల్లో ఆడంబరంగా వుండే ఛందోవిశేషాలను త్యజించి బ్లాంక్ వర్స్ అనే ఛందస్సును ఎన్నుకోవడం గమనింపదగినది. బ్లాంక్ వర్స్ ఇయాంబిక్ పెంటామీటర్ అనే నడకపై ఆధారపడి వుంటుంది. ఉత్పల శార్దూలాది తెలుగువృత్తాల వలె బ్లాంక్ వర్స్ కూడా పొడుగు, పొట్టి కాని పంక్తుల్తో సమతుల్యంగా వుంటుంది. తెలుగు వృత్తానికి అంత్యప్రాసలు లేవు. బ్లాంక్ వర్స్ కు సైతం అంత్యప్రాసలుండవు. రెంటిలోనూ వృత్యనుప్రాసలు వాడడం రచయితలకందరికీ సర్వ సాధారణం. అంత్యప్రాస పద్యం యొక్క అందాన్ని ఇనుమడింప జేస్తుంది, కానీ పద్యగమనాన్ని నిరోధిస్తుంది. అనుప్రాసలు పద్య సౌందర్యాన్ని ఇనుమడింప జేయడమే గాక వేగాన్ని పెంచుతాయి కూడా. కాకపోతే, తెలుగు పద్యానికి నాలుగు పాదాలు. బ్లాంక్ వర్స్ కు పాదనియమం లేదు. చేంతాడు వలె అది సాగిపోతూనే వుంటుంది.
షేక్స్పియర్ తొట్టతొలుత తన నాటకాల్లో అంత్యప్రాసలను విరివిగా ప్రయోగించినా, నిజజీవితపు ఉత్తరార్థంలో ఆయనచే వెలువరింపబడిన విషాద నాటకాలన్నీ అంత్యప్రాసాలంకృతులను త్యజించిన బ్లాంక్ వర్స్ లోనే రచింపబడినవి.
ఆర్గాన్ వాయిస్
మిల్టన్ మహకవి “పారడైజ్ లాస్ట్” కావ్యం కూడా బ్లాంక్ వర్స్ లోనే రచింపబడింది. ఆంగ్లభాషకు మిల్టన్ మహాకవి “ఆర్గాన్ వాయిస్” వంటివాడనే ప్రసిద్ది వున్నది. ఆంధ్రభాషకు సంబంధించినంత వరకు, నన్నయయే “ఆర్గాన్ వాయిస్”. నిసర్గ సుందరమైన నన్నయ పద్యశైలియే నన్నయ ఆర్గాన్ వాయిస్ గా పిలవబడడానికొక కారణం. నన్నయను మిల్టన్ తో ఆర్గాన్ వాయిస్ తో పోల్చింది ఎవరో కాదు. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. “ఆర్గాన్” (organ) పాశ్చాత్య లోకంలోని సరళసుందర మైన ఒకానొక ప్రాధమిక వాద్యవిశేషం. మన వేణువు లేదా మన కంజరి వంటిది.
“Milton! Thou shouldest be living at this hour/England hath need of thee!” అన్నాడు తన సమకాలీనపు ఇంగ్లండు సమాజం పోకడలచే దుఃఖితుడైన మహాకవి వర్డ్స్ వర్త్.
“నేడు నీవు జీవించి వుంటే, నన్నయ మహాకవీ! ఎంత బాగుండును! తెలుగునేలకు నీ ఆవసరం ఎంతో వున్నది” అంటూ మనస్సు నిర్వేదంతో మరో నన్నయకై ఎదురు తెన్నులు చూస్తున్నది.
Also read: మహాభారతంలో శునకాల ప్రసక్తి
నివర్తి మోహన్ కుమార్