అక్షరార్చన–14
“ప్రకటిత భూత సంతతికి భర్తవు నీవ, చరాచర ప్రవృ
త్తికి మఱి హేతుభూతుడవు, దేవ ముఖుండవు నీవ, లోక పా
వకుడవు నీవ, యిట్టి అనవద్య గుణుండవు నీకు విశ్వభా
రక! భువన ప్రవర్తన పరాౙఖ భావము బొంద పాడియే?”
నన్నయ భట్టారకుడు
ఉదంకుడు జనమేజయునికి సర్పయాగం చేయాలనే సంకల్పం కలిగించే ఘట్టాన్ని ఉగ్రశ్రవసువుచే విన్న శౌనకాది మహామునులు, ఆతనితో ఇట్లా అన్నారు:
“అమిత జగద్భయంకర విషాగ్నియు నప్రతిహన్యమాన వీ
ర్యము గలయట్టి సర్పములకా జనమేజయు చేయు సర్పయా
గమున నుదగ్ర పావక శిఖాతతులన్ దొరుగంగ కారణం
బమల చరిత్ర! యేమి చెపుమయ్య వినం కడు వేడ్క యయ్యెడిన్!”
“లోకాలకు అపారభీతి కలిగించే విషాగ్నితో, అప్రతిహత పరాక్రమశాలులైన సర్పరాజములు అగ్నిజ్వాలల్లో పడడానికి కారణమేమి దయచేసి చెప్పు”
వారి ప్రశ్నకు జవాబుగా ఉగ్రశ్రవసుడు, జరత్కారుని సుతుడు, భృగువంశజుడు, సర్పయాగాన్ని మధ్యలో మాన్పింపజేసిన వాడైన ఆస్తీకుని పుట్టు పూర్వోత్తరాలను ఇట్లా తెలుపుతున్నాడు.
Also read: మహాభారతం – ఆదిపర్వం – ఉదంకోపాఖ్యానం-4
భృగుడనే విప్రుడున్నాడు. అతని పత్ని పులోమ. ఒకనాడు భృగుడు, తన పత్ని పులోమను, అగ్నికార్యానికి అగ్నులను ప్రజ్వరిల్ల జేయమని ఆదేశించి, స్నానానికి వెళతాడు. ఆ సమయంలోనే పులోముడనే రాక్షసుడు అగ్ని గృహానికి మెల్లగా వచ్చి పులోమను చూచి మోహితుడౌతాడు. ప్రజ్వరిల్లుతున్న ఆగ్నిని పులోముడిట్లా అడుగుతాడు: “అగ్నీ! ఈయమ ఎవరు?”. అగ్ని అసత్యం చెప్పడానికి భయపడి పులోమ భృగుపత్ని అని చెబుతాడు. ఆ రాక్షసుడు వరాహరూపం దాల్చి భయవిహ్వల యైన ఆ సాధ్విని ఎత్తుకొని పోతాడు. అప్పుడు భృగుపత్ని గర్భంలో పెరుగుతున్న అర్భకుడు అలిగి మాతృగర్భం నుండి క్రిందపడతాడు. అట్లా జారిపడడంచే చ్యవనుడనే పేరు అతనికి కలుగుతుంది. వేయి విభాత సూర్యుల తేజస్సుతో, ప్రళయకాలాగ్నితో సమానమైన ఆ మునికుమారుణ్ణి చూస్తూ, చూస్తూనే, పులోముడు కాలి భస్మమైపోతాడు.
అగ్నికి భృగుడి శాపం
కొడుకుతో కలిసి పులోమ ఇంటికి వస్తుంది. విషయం తెలుసుకొన్న భృగుడు అగ్నితో, “నీవు అతి క్రూరుడవు! సర్వభక్షకుడవు కా!” అని శాపం పెడతాడు.
అగ్ని భృగునితో ఇట్లా అంటాడు: “ఎవరైనా వచ్చి నీకు తెలిసిన విషయాన్ని ఎరిగించమన్నప్పుడు, చెప్పడానికి నిరాకరించే వాడు, లేదా తెలిసి అబద్ధం చెప్పేవాడు నరకమనే పంకిలంలో పడతాడు. అఖిల జగత్కర్మ సాక్షినైన నేను ఉన్న నిజం చెప్పినాను. నీవు బ్రాహ్మణుడవు. నీవేది చేసినా చెల్లుతుంది. కానీ కర్మసాక్షినైన నేనే సర్వభక్షకుడనైతే అపవిత్రుడనై వేదక్రతువులు, పూజలు మూలపడతాయి. కర్మలోపం జరుగుతుంది. లోకగమనం ఆగిపోతుంది” అంటూ లోకంలో తన కాంతిమయ రూపాన్ని లేకుండా చేస్తాడు. అప్పుడు ఏర్పడ్డ దుష్ప్రభావం క్రింది పద్యంలో:
“త్రేతాగ్నులెల్లను తేజరిల్లమి జేసి
క్రతుకృత్యములు వినిర్గతము లయ్యె;
నగ్ని హోత్రములందు నౌపాసనాది సా
యంప్రాతిరాహుతు లంత నుడిగె;
దేవతార్చనలందు దీపధూపాది స
ద్విధులు వర్తిల్లక నిరతి బొందె;
పితృకార్యముల పితృపిండ యజ్ఞక్రియ
లడగె విచ్ఛిన్నంబులై ధరిత్రి;”
“అంత జనులు సంభ్రమా క్రాంతులై
మహా మునుల కడకు జనిరి, మునులు నమర
వరుల కడకు జనిరి వారును, వారును,
బ్రహ్మ కడకు జనిరి భయము నొంది!”
భృగుమహర్షి అగ్నికిచ్చిన శాపాన్ని, ఆ శాపకారణంగా పూజనీయుడైన అగ్ని తన తేజస్సును ఉపసంహరించుకోవడము, అందుమూలంగా, సమస్తలోకాల్లో ఏర్పడిన కర్మ సంక్షోభాన్ని తెలుసుకొన్న బ్రహ్మ, అగ్నిని రావించి అతనితో ఇట్లా అంటాడు:
“ప్రకటిత భూతసంతతికి నీవే భర్తవు. చేతనకు, అచేతనకు నీవే హేతుభూతుడవు. దేవతా ముఖుడవు నీవే. లోకాలను పవిత్రం చేసేవాడవు నీవే. విశ్వభారం వహించేవాడవూ నీవే. ఇట్టి అనవద్య గుణాలు కలిగిన వాడవైన అగ్నీ! భూతల ప్రవర్తనను నిర్దేశించే నీవే విముఖత్వం ప్రదర్శించడం శ్రేయస్కరమా?” నేటి పద్యానికి తాత్పర్యమిదే!
Also read: మహాభారతం – ఆదిపర్వం – ప్రథమాశ్వాసం
బ్రహ్మదేవుడి పరిష్కారం
పిదప బ్రహ్మదేవుడు తన సంభాషణనిట్దా కొనసాగిస్తాడు:
“భృగుమహర్షి మాట వృథా కాదు. నీవు సమస్తం భక్షించే వాడివైనా, శుచుల్లో అత్యంత శుచివై, పాత్రులలో అమిత పాత్రుడవై, పూజ్యుల్లో అగ్రపూజ్యుడవై, వేదవిధుల్లో విప్రులకు సహాయుడవై, భువనాలను నడుపు!”
ఒక తండ్రి మాత్రమే, ఆప్యాయతతో, వాత్సల్యతతో తన పుత్రుణ్ణి సముదాయించి ఇట్టి ఆదేశం ఇవ్వగలడు. బ్రహ్మ సృష్టికర్త. పంచభూతాలకు, పాంచ భౌతికమైన దేహానికి అతడే కారకుడు. మొట్ట మొదట అగ్నియే జన్మించిందని ఉపనిషత్తులు పేల్కొంటున్నవి. “అగ్నిమీళే పురోహితం!” అనే సంబోధనతో ఋగ్వేదంలోని మొట్టమొదటి శ్లోకమే అగ్నిని ఆహ్వానిస్తున్నది.
అగ్ని లేక సృష్టిలోని జీవజాలం మనగలదా? ప్రభుసమ్మితంగానే గాక, మిత్రసమ్మితంగాను, సృష్టికర్త అగ్నిదేవునికి కర్తవ్యాన్ని నిర్దేశిస్తున్నాడు.
ఈ సన్నివేశం కోసం ఆదికవి సరళమైన చంపకమాలను ఎన్నుకున్నాడు. గురువుకు గురువుకు మధ్య వివిధ నిష్పత్తుల్లో లఘువులను ప్రవేశపెట్టి పరంపరాగతమైన విరామాలను పాటించడమే ఉత్పల, చంపకమాలల యొక్క ప్రత్యేకత. ఈ విరామాలు పద్యాన్ని సున్నితంగా నడిపించడానికి దోహదపడతాయి.
Also read: భారత్, పాకిస్తాన్ మధ్య 1971లో జరిగింది ధర్మయుద్ధం
వర్ణసమ్మేళనం, శబ్దసమ్మేళనం
వాగనుశాసనుడీ పద్యంలో, సరళమైన చంపకమాలతో బాటు, పలు సరళమైన శబ్దాలను కూడా ఎన్నుకున్నాడు. ఒక వర్ణచిత్రంలోని కోమల వర్ణసమ్మేళనం ఆహ్లాదాన్ని కలిగించినట్లే, ఒక పద్యంలోని కోమల శబ్దసమ్మేళనం కూడా ప్రసన్నత కలిగించగలదు. చిత్రకారుని సున్నిత వర్ణాల వంటివే, కవియొక్క కోమల పదప్రయోగాలు కూడా.
సరళశబ్ద బాహుళ్యంతో అలరారే పద్యధారలో కొన్నికొన్ని పరుషశబ్దాలున్నా, సరళశబ్ద సమూహంలో అవన్నీ కలిసిపోయి, పద్యం యావత్తూ వినూత్నమైన ఒకానొక శబ్ద మాధుర్యంతో కర్ణపేయమై అలరారడం పఠితలందరూ ఎరిగిన విషయమే.
నేటి పద్యంలో వాగను శాసనుడు ప్రయోగించిన “భువన ప్రవర్తన పరాన్ముఖ భావము” అనే వాక్యప్రయోగం మనోహరమే గాక చింతనాత్మకమైనది కూడా. మఘవ మస్తక మాణిక్య మకుట రాజ్ఞి వంటి యీ వాక్యప్రయోగం నేటి పద్యానికకంతటికీ శోభాయమానం. అగ్నికి బ్రహ్మదేవుడు తండ్రి, ప్రభువు, మార్గదర్శి. అట్టి సృష్టికర్త అగ్నికి చేస్తున్న కర్తవ్యబోధ వైశ్వానరునికే గాక కర్తవ్య విమూఢులైన నరమానవులందరికినీ వర్తిస్తుంది. “కర్తవ్యం ధర్మ సంగ్రహం” అని కదా వేద వేదాంత సారం?
అల్లారఖా తబలా సహాయ వాద్యంగా, అర్ధనిమీలిత నేత్రాలతో, గాఢమైన సంగీత తపస్సులో మునిగిపోయిన పండిత రవిశంకర్ వ్రేళ్ళ కొసలు తెరపి లేని సముద్ర తరంగాల వలె సితార తీగలను నిరవధికంగా మీటుతూ అలవోకగా ఆవిష్కరించే సున్నిత తంత్రీనాదం వంటి పద్యాలనేకములు, నన్నయ భట్టారకునివి, శ్రోత్రపేయమై, మహాభారత సంహితలోని పలుపుటల్లో సాక్షాత్కరించి, పాఠకులను ఉక్కిరిబిక్కిరి చేస్తాయి.
ఈ గాథలో ఖగోళ, జ్యోతిష్య శాస్త్ర పరములైన అర్థాలు దాగి వున్నవి. వాటిని మరొక్కమారు ముచ్చటించుకుందాము.
Also read: మహాభారతం: ఆదిపర్వం: ఉదంకోపాఖ్యానం-3
నివర్తి మోహన్ కుమార్