Friday, December 27, 2024

మహాభారతము – ఆది పర్వము – ఉదంకుని నాగస్తుతి

అక్షరార్చన

బహువన పాదపాబ్ధి కులపర్వత పూర్ణ సరస్సరస్వతీ

సహిత మహామహీభర మజస్ర సహస్ర ఫణాళి దాల్చి దు

స్సహతర మూర్తికిన్ జలధి శాయికి పాయక శయ్య యైన అ

య్యహిపతి దుష్కృతాంతకు డనంతుడు మాకు ప్రసన్నుడయ్యెడున్

అరిది తపోవిభూతి నమరారుల బాధల నొందకుండగా

నురగుల నెల్ల కాచిన మహోరుగ నాయకు డానమత్సురా

సుర మకుటాగ్ర రత్నరుచి శోభిత పాదున కద్రినందనే

శ్వరునకు భూషణంబయిన వాసుకి మాకు ప్రసన్నుడయ్యెడున్

దేవమనుష్య లోకముల ద్రిమ్మరుచున్ విపుల ప్రభావ సం

భావిత శక్తి శౌర్యులు నపార విషోత్కట కోప విస్ఫుర

త్పావక తాపితాఖిల విపక్షులు నైన మహానుభావు లై

రావతకోటి ఘోరఫణిరాజులు మాకు ప్రసన్నుడయ్యెడున్

గోత్ర మహామహీధర నికుంజములన్ విపినంబులం కురు

క్షేత్రములం ప్రకామగతి ఖేలన నొప్పి సహాశ్వసేనుడై

ధాత్రి పరిభ్రమించు బలదర్ప పరాక్రమదక్షు డీక్షణ

శ్రోత్ర విభుండు, తక్షకుడు శూరుడు మాకు ప్రసన్నుడయ్యెడున్

నన్నయ భట్టారకుడు

ఉదంకమహర్షి తన గురువైన పైలమహర్షి యొక్క ఆజ్ఞ మేరకు పౌష్యమహాదేవి నుండి  కర్ణాభరణాలు స్వీకరిస్తాడు. అవి తన గురుపత్ని ధరింపడం కోసం.

తక్షకుడనే సర్పరాజు వీటిని తస్కరించడానికి ప్రయత్నం చేస్తున్నాడని, తిరిగి వెళ్ళేటప్పుడు అప్రమత్తంగా వుండమని, ఉదంకుణ్ణి పౌష్యమహాదేవి హెచ్చరిస్తుంది.

ఆ తరువాత పౌష్యమహారాజు అభ్యర్థనచే అయన ఇంట్లో భోంచేస్తూ, అన్నంలో వెంట్రుక పడినందుకు కోపగించి, పౌష్యమహారాజును అంధుడవు కమ్మని శపిస్తాడు. పౌష్యుడు బ్రతిమలాడగా, శాపాన్ని ఉనసంహరించుకుంటాడు. ఆ రాజుచే  సంతానహీనుడవు కమ్మని తిరుగు శాపం పొందుతాడు.

ఉదంకుని మనస్సును తప్పక ఈ శాపం కలచి వుంటుంది.  ఏది ఏమైనా కర్ణాభరణాలు లభ్యమైనాయన్న తృప్తితో అతడు తన ఆశ్రమానికి తిరిగి వెళుతూ, మార్గంలో సరోవరాన్నొకటి చూసి  ఒక శుచిప్రదేశంలో ఆ కుండలాలను పెట్టి ఆచమనం చేయ నారంభిస్తాడు.

Also read: మహాభారతం – ఆదిపర్వము : ఉదంకోపాఖ్యానము

ఉదంకుణ్ణీ వెంబడిస్తూ, సకలం గమనిస్తున్న తక్షకుడు దిగంబరవేషంలో హటాత్తుగా వచ్చి కుండలాలను అపహరించుకొని పారిపోతాడు. ఉదంకుడు వెంబడిబడి అతణ్ణి పట్టుకుంటాడు. తక్షకుడు దిగంబరవేషం విడనాడి, తప్పించుకొని, కర్ణాభరణాలతో సహా సర్పరూపం ధరించి, భూమిలోని కన్నం గుండా నాగలోకానికి వెళ్ళిపోతాడు. ఉదంకుడు సైతం అదే రంధ్రం గుండా సర్పలోకానికి వెళ్ళి, ఆ కర్ణాభరణాలు తిరిగి రాబట్టడానికై, సర్పరాజుల నందరినీ, పారిపోయిన తక్షకునితో సహా, స్తుతిస్తాడు. ఆ నాగస్తుతియే పై పద్యాల్లో.

మూలంలో ఉదంకుని నాగస్తుతి తొమ్మిది శ్లోకాల్లో ఉన్నది. వాటి తాత్పర్యం నన్నయ నాలుగు పద్యాల్లో చెబుతున్నాడు. ఈ పద్యాల్లో  మూలశ్లోకాల వ్యస్తపదాలు గానీ, సమస్తపదాలు గానీ అనుకరించడానికి, ఆదికవి, ఎట్టి ప్రయత్నము చెయ్యలేదు. ఈ నాలుగు పద్యాలు స్వతంత్రగమనం కలిగినవి. అక్షరరమ్యతకే గాక, వ్యంగ్య వైభవానికి కూడా యివి పెట్టింది పేరు.

Also read: మహాభారతంలో శునకాల ప్రసక్తి

నాగస్తుతి

మొదటి పద్యంలో ఉదంకుడు సర్పరాజైన అనంతుణ్ణి స్తుతిస్తున్నాడు. “అనేక అరణ్యాలతో, వృక్షాలతో, సముద్రాలతో, కులపర్వతాలతో, పూర్ణ సరస్సులతో, నదులతో, అలరాలే భూభారాన్ని, తన సహస్ర ఫణిసముదాయంతో భరించడమే గాక,  దుస్సహ తరుడైన నారాయణ మూర్తి వంటి పాపహరునికి, సముద్రమే పడకటిల్లుగా గలవానికి, పాన్పుగా అమరిన  అనంతుడు మాకు ప్రసన్నుడగును గాక!”

రెండవ పద్యంలో ఉదంకుడు సర్పరాజు వాసుకిని ఇట్లా స్తుతిస్తున్నాడు: “అపారమైన తన తపఃసంపదచే అసురుల బాధ పడకుండా సర్పజాతినంతా రక్షించిన మహోరుగ నాయకుడు, ఏ పరమేశ్వరుని పాదాల వద్ద సురాసురులందరు సదా మోకరిల్లుతారో, అట్లా మోకరిల్లినప్పుడు ఏ పరమేశ్వరుని పాదద్వంద్వంపై ఆ సురాసురుల మస్తక మకుటాగ్ర రత్న కాంతి ధగద్ధగాయమానంగా మెరిసిపోతుందో, అట్టి పరమేశ్వరుని భూషణమైన వాసుకి మాకు ప్రసన్నుడగును గాక!

మూడవపద్యంలో ఉదంకుడు ఇరావత సర్పవంశం లోని నాగరాజులనందరినీ స్తుతిస్తున్నాడు: “విపుల ప్రతాపంతో, దేవమనుష్య లోకాల్లో సంచరిస్తూ, తమ శక్తి శౌర్యాలచే పూజింపబడుతున్న వారు, అంతులేని విషాన్ని అధికమైన కోపాన్ని, అగ్నిని వెడలగ్రక్కి సమస్తశాత్రవ సంహారం చేయగల వారు, మహాత్ములు, ఇరావత నాగవంశంలోని కోట్లాది సర్పరాజులు మాకు ప్రసన్నమగుదురు గాక!”

చివరి పద్యంలో తనవద్ద గల కర్ణాభరణాలు తస్కరించి పారిపోయిన తక్షకుణ్ణి కూడా ఉదంకుడు స్తుతిస్తున్నాడు: “ఉన్నత గోత్ర పర్వతాలల్లో, నికుంజములలో, విపినాలలో, కురుక్షేత్రంలో, విచ్చలవిడిగా క్రీడించేవాడు, తన తనూజుడైన అశ్వశేనునితో భూతలంపై సదా పరిభ్రమించేవాడు, బలంతో, గర్వంతో, శౌర్యంతో, దక్షతతో వ్యవహరించే వాడు, నేత్రములే కర్ణములుగా గల తక్షకుడు మా పట్ల ప్రసన్నుడగును గాక!”

ఈ నాగస్తుతిలో మొదటి రెండు పద్యాల్లో గల స్తుతి ఉదంకుడు భక్తిపారవశ్యంతో చేస్తున్నది. నారాయణునికి శయ్యయైన అనంతునిపై, శివునికి కంఠాభరణమైన వాసుకిపై ఉదంక మహామునికి సహజంగానే గల భక్తి తాత్పర్యానికీ స్తోత్రపాఠాలు నిదర్శనం.

Also read: మహాభారత శోభ

ఈ రెండు పద్యాలు సరళమైన చంపకమాలా వృత్తంలో లిఖింపబడినవి. ఈ రెండు పద్యాల్లోనూ ధ్వనిపూర్వకమైన ఒక విజ్ఞాపన కూడా వున్నది: “మీ సర్పజాతికి చెందిన ఒక క్రూర కర్మఠుడు నా నగలను దొంగిలించుకొని పారి పోయినాడు. అవి పైలమహర్షి పత్నికి చెందవలసినవి. దయతో వాటిని తిరిగి ఇప్పించండి!”

సాత్విక శబ్దాలు

మొదటి పద్యంలో “దుష్కృతాంతకుడు అనంతుడు మాకు ప్రసన్నమగును గాక!” అన్నప్పుడు, అనంతుడు దుష్కృతాంతాలను సహించడనీ, వాటిని అంతం చేస్తాడని, కనుక దుష్కర్మలకు పాల్పడే తక్షకుని వంటి సర్పాలనుండి తననే గాక మానవజాతి నంతటినీ కాపాడాలనే సందేశం వున్నది.   తననే గాక మానవకోటినంతటినీ తక్షకుని వంటి దుష్టుల నుండి కాపాడాలనే విజ్ఞాపన “మాకు”  అనే శబ్దంలో దాగి వున్నది. 

మొదటి పద్యంలో గల శబ్దాలు సాత్వికమైనవి. అదే సమయంలో సర్పజాతికి స్వతస్సిద్ధమైన బుసకొట్టడమనే లక్షణం కూడా ఈ పద్యంలోని శబ్దాల్లో వున్నది. “బహువన పాదపాబ్ధి కులపర్వత పూర్ణ” అనే ఎత్తుగడలో “ప/ఫ/బ/భ” శబ్దాలే పదేపదే వినిపించి మనోహర శబ్దక్రీడ వీనుల విందు చేస్తుంది. ఈ సమాసం దాటిన వెనువెంటనే శబ్దాలు మారిపోయి, “సరస్సరస్వతీ సహిత మహామహీధర మజస్ర సహస్ర ఫణాళి దాల్చి దుష్సహతర మూర్తికిన్ జలధిశాయికి పాయక శయ్యయైన అయ్యహిపతి” అనే పదప్రయోగం కట్టెదుట సాక్షాత్కరిస్తుంది. ఈ సుదీర్ఘ సమాసంలో “స” లేక “శ” కారాలతో బాటు “హ”కారాలు కూడా పదేపదే గోచరిస్తాయి. “స/శ” కారాలు, వాటి ఒత్తులు, పాము బుసకొట్టడాన్ని తెలిపితే, “హ” కారాలు ఆ పాము బుసలు కలిగించే “హాహా” కారానికి సంకేతాలు. ఈ పద్యంలో “హ” కారమే పాదప్రాసయై పునరావృతం కావడం విశేషం.

రెండవ పద్యంలో పాదప్రాస “ర” కారం. ఈ  “ర” కారమే విరివిగా పద్యమంతటా ప్రవహిస్తుంది.  సమస్త సర్పజాతినీ తన తపోనిష్ఠతో కాపాడిన వాసుకి ప్రశంస సల్పే సమాస క్రమంలోని “ర” కారాలలో చెవులకింపైన నాదధ్వని మనస్సును రంజింపజేస్తుంది.  శివుణ్ణి పూజించే సురాసురుల కిరీటాల వెలుగును వర్ణించే సమాసాలు  శివుని కంఠాభరణమైన వాసుకి పై ఆ వెలుగులు పడడాన్ని దృశ్యమానం చేస్తాయి.

Also read: గంగిరెద్దు

చివరి రెండు పద్యాలలో ఆగ్రహం

తక్కిన రెండు పద్యాల్లోని స్తుతి అవసరార్థం చేస్తున్నది. తనవద్ద నగలను దొంగలించుకొని అంతర్ధానమై పోయిన తక్షకుని నుండి నయానా భయానా  కర్ణాభరణాలు రాబట్టాలనే తపనతో, మనస్సులో  తరుముకొని వస్తున్న కోపాన్ని ఉగ్గబట్టుకొని చేస్తున్నది. తనకు అపకారం తలపెట్టిన తక్షకునితో బాటు సర్పజాతి నశించాలనే కోరిక కూడా ఉదంకుని ఆత్మలో జ్వలిస్తున్నది. ఆ కోపం తదుపరి కాలంలో సర్పయాగానికి దారి తీస్తుంది కూడా.

మూడవ పద్యం నుండి నాగస్తుతి యొక్క నడక మారిపోతుంది. మొదటి రెండు పద్యాలు చంపకమాలా వృత్తాలు. మూడు నాలుగు పద్యాలు “ఉత్పలమాలలు.  చంపకమాల ఎత్తుగడలో గల లఘువుల బదులు గురువుతో కూడిన ఎత్తుగడకు తెరలేస్తుంది. ఈ పద్యాలన్నీ కలిపి చూసినప్పుడు, ఛందోప్రయోగం లోనే గాక శబ్దప్రయోగంలోనూ ఒక ప్రణాళికా బద్ధమైన ఆరోహణక్రమం గోచరింపగలదు. మూడవపద్యంలోని సమాసాల్లో దొరలే  శబ్దాలెటువంటివి?– “విపుల ప్రభావ సంభవిత శక్తి శౌర్యులు”, “అపార విషోత్కట కోప విస్ఫురత్ పావక తాపితాఖిల విపక్షులు” “మహానుభావులు”, “ఇరావత ఘోర ఫణిరాజులు”. మొదటి పద్యంలోని ప/ఫ కారాలు, రెండవ పద్యంలోని ర/త కారాలతో బాటు, శ కార, ష కార, క కార, ట కారాలు సైతం మేళవింపబడిన మూడవ పద్యం చూడడానికి నాగరాజులపై ఒక స్తుతి. విశదంగా పరిశీలిస్తే, ఆ జాతి క్రోధ స్వభావంపై, విషము, అగ్ని, వెళ్ళగ్రక్కే ప్రవృత్తిపై, ఉదంక మహాముని మోపుతున్న నింద.

చివరి పద్యంలో గోప్యమైన శబ్దాల్లో ఉదంకుడు తక్షకునికొక  తీక్ష్ణమైన హెచ్చరిక చేస్తున్నాడు: “నేను ఉన్నత గోత్ర సంభవుణ్ణీ.  (గోత్ర మహామహీధరాన్ని). కేవలం ఒక సర్పమైన నీవు, నావంటి ఉన్నత గోత్ర సంభవులుండే ప్రాంతాల్లోని నికుంజములలో, విపినములలో, మహావీరులే నేలకొరిగిన కురుక్షేత్రం వంటి స్థలాల్లో సైతం నీ కొడుకు అశ్వశేనునితో కలిసి సంచరిస్తున్నావు (ప్రఖామగతి ఖేలన). పాతాళంలో వుండవలసిన నీవు మానవులు చరించే భూతలంపై (ధాత్రి పరిభ్రమించు)  భుజబల గర్వంతో విఱ్ఱవీగుతూ, తిరుగుతున్నావు (బలదర్ప పరాక్రమ దక్షుడు). చెవులు, కళ్ళు ఒకటే యైన ఇంద్రియ హీనుడవు నీవు (ఈక్షణ శ్రోత్రవిభుడు). జాగ్రత్త!” ఈ నాలుగవ పద్యం దుష్కరప్రాసలో రచింపబడింది. అనగా ఎవరినీ పద్యం ఉద్దేశిస్తున్నదో అతడు దుష్కరుడు. చిట్టచివరకు తక్షకుడు భయంచే కర్ణాభరణాలు వాపసు చేయవలసి వస్తుంది. కానీ, ఉదంకముని ప్రతీకార వాంఛ చల్లారదు.

బుసలు కొట్టిన శబ్ద ప్రయోగం

చంపకమాలలో ప్రతి పాదంలోనూ నాలుగేసి జగణాలు వుంటాయని తెలిసిన విషయమే. ఈ జగణాల సొగసులను ఆదికవి పూర్తిగా వాడుకున్నాడు. “సరస్సరస్వతీ సహిత”, లేక “అజస్ర సహస్ర ఫణాళి ” శబ్ద ప్రయోగాల్లో పాము బుసలు స్పష్టంగా వినిపిస్తాయి. మొట్టమొదట కేవలం బుసకొట్టిన సర్పాలు, క్రమక్రమంగా, అపార విషోత్కట వేగం పుంజుకోవడం   మనమీ పద్యాల్లో దర్శిస్తాము. ఒక్కొకసారి ఈ శబ్దాలన్నీ వివిధ స్థాయిల్లో తమ తమ ప్రత్యేక నాద మాధుర్యంతో పలకుతాయి. అవే  మేళవింపబడి,  మిశ్ర నాద మాధుర్యం తోనూ పలుకుతాయి. ప్రత్యేకంగా పలకడం, కలిసి పలకడం,  మళ్లీ  విడిపోవడం, నన్నయగారి శైలీ విన్యాసం మహాభారతంలో బహుముఖంగా సాగుతుంది.

నన్నయ్యకూ, మిల్టన్ కూ పోలిక

నన్నయ రచనల్లోని శబ్దమాధుర్యానికి, మహాకవి మిల్టన్ రచనల్లోని నాదసౌందర్యానికీ అనేక పోలికలున్నాయి. ఉదాహరణకు మిల్టన్ లొల్లెగ్రో కావ్యఖండిక లోని ఈ ఎత్తుగడ చూడగలరు: “Hence loathed melancholy of Cerbirus in stigian cave forlorn, among horrid shapes and shrieks and sights unholy”. “అమాంగ్ హారిడ్ షేప్స్ అండ్ ష్రీక్స్ అండ్ సైట్స్ అన్ హోలి” అనే మిల్టన్ వృత్యనుప్రాస, “అజస్ర సహస్ర ఫణాళి దాల్చి” అనే ఆదికవి వృత్యనుప్రాస దాదాపు ఒకే ఊపులో సాగుతాయి. నన్నయ పంక్తిలో “స” కారాలెంత రంజింపజేస్తాయో, మిల్టన్ పంక్తిలోని “స” “ష” కారాలు సైతం అంతే శబ్దమాధుర్యాన్ని ప్రదర్శిస్తాయి.

Also read: మహాభారతం అవతారిక

వాసుకి అనే సర్పం శివుని కంఠాభరణం కావడంతో, మలయపర్వతంపై వియోగం అనుభవించే సర్పజాతి స్త్రీలు గంధపు చెట్లను, లవంగపు చెట్లను ఎట్లా ఆశ్రయించి ఉపశమనం చెందుతాయో తెలిపే వచనభాగం అల్లసాని పెద్దన మనుచరిత్రలో ఉన్నది. దానిలోని శబ్ద మాధుర్యం అనిర్వచనీయమైనది. ఆలకించండి:

అంధకరిపు కంధరీవాస వాసుకీ వియోగభర దుర్వ్యథా భోగ భోగినీ భోగభాగ పరివేష్టిత పటీర విటపి వాటికా వేల్లత్ ఏలా లతా వలయంబగు మలయంబునం గల చలువకు విలువ యెయ్యది?”

మానవుడు కాలక్రమంలో మచ్చిక చేసుకున్న కుక్కలు, గోవులు, గుఱ్ఱాల వలె గాక, స్వతంత్ర జీవనానికి అలవాటు పడిన జీవకోటికి సర్పజాతి చెందుతుంది. తమ దారికి మనిషి అడ్ఠు వచ్చినప్పుడు ముందూవెనకా చూడకుండా కాటువేస్తాయి. అరణ్యాలు హరించుకొని పోవడంతో జనావాసాల్లో ఈ జీవాలు చొరబడడంచే మనిషికీ, సర్పాలకు నడుమ పోరాటం సంభవిస్తున్నది. మహాభారతంలోని “సర్పయాగం” ఇట్టి ఒకానొక పోరాటాన్నే తెలియజేస్తుంది. ఈ సర్పయాగానికి ఉదంక మహాముని ప్రతీకార వాంఛయే ప్రేరణ కావడం విశేషం. ఉదంకోపాఖ్యానంలో ముందుముందు మరికొన్ని విశేషాలు తెలుస్తాయి.

Also read: ఎవరి కోసం?

దశాబ్దాల క్రిందట నా బాల్యంలో మొదటి సారి, 1963 లో నా సోదరులతో కలిసి శ్రీశైలం వెళ్ళినాను. త్రోవలో ఆత్మకూరు దాటిన తర్వాత నాగలూటి, బయర్లూటి అనే రెండు ప్రదేశాలకు వెళ్ళినాము. జనసంచారమే లేని స్థలాలవి. పెద్ద అడవి. పెద్దపెద్ద వృక్షాలు. ఒక పురాతన దేవాలయం.  విశాలమైన ఒక రావిచెట్టు వ్రేళ్ళు ఆలయపు పునాదుల్లో చొచ్చుకొని పోయి ఆలయమంతా శిథిలమై పోయింది. ఒకరిద్దరు చెంచువాండ్లు తప్ప అక్కడ జననివాసమే లేదు. ఎక్కడ చూసినా ఐదడుగులు మొదలుకొని పది పదహైదు అడుగుల ఎత్తుగల పాము పుట్టలు, వందలు వందలుగా వున్నాయి. మనం పుస్తకాల్లో చదివే నాగలోకం పాతాళంలో లేదనీ మన కట్టెదుటనే ఉన్నదనీ అర్థమైంది. తర్వాతి దినాల్లో ఇట్టి పొదలనేకం పడమటి కనుమల్లో చూసినాను.

ఉదంకుని “నాగస్తుతి” లో “మాకు ప్రసన్నమయ్యెడిన్” అనే పదప్రయోగపు అంతరార్థం వేరు. “ఈ సర్పాలు నశించిపోవును గాక” అన్నదే ఉదంకుని కోరిక. తెలుగులో వెలువడిన శతకవాౙయపు వివిధానేక మకుటాలకు “మాకు ప్రసన్నుడయ్యెడిన్” అనే సంబోధనయే ప్రేరణ. నేటి నాగస్తుతి నన్నయ భట్టారకుని పద్యాల్లో తరుచూ కవవచ్చే శబ్దసౌందర్యానికి, వ్యంగ్య వైభవానికి మచ్చుతునక.

Also read: మహాభారతం అవతారిక

నివర్తి మోహన్ కుమార్

Mohan Kumar Nivarti
Mohan Kumar Nivarti
నివర్తి మోహన్ కుమార్. జననం 26 ఆగస్టు 1950, నంద్యాల. వృత్తి రీత్యా ఛార్టర్డ్ అకౌంటెంట్. హైదరాబాదులో ప్రాక్టీసు. కవిత్వం, చిత్రలేఖనం, సాహిత్య విమర్శ, జ్యోతిష్యం, చరిత్ర, సామాజిక రాజకీయ శాస్త్రాల్లో ఆసక్తి. మొబైల్ : 96038 27827

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles