Sunday, December 22, 2024

మొద్దుబారిన `వజ్రాయుధం`

  • ముఖం చాటేసిన ఓటర్లు
  • ఇళ్లకే పరిమితం, పోలింగ్ కేంద్రాలకు దూరం
  • కోవిద్ భయం కొంత, క్షమించరాని బద్ధకం కొంత
  • విజ్ఞాపనలూ, నివేదనలూ నిరర్థకం
  • మేధావులూ, సాఫ్ట్ వేర్ ఉద్యోగులూ ‘నో షో’

డా. ఆరవల్లి జగన్నాథస్వామి

ప్రజాస్వామ్యంలో ఓటు `వజ్రాయుథం`లాంటిదంటారు. దానిని ఉపయోగించు కోవడం బాధ్యత, హక్కు. అయితే  ఓటు వేయడానికి వెళ్లాలని బతిమిలాడి చెప్పడం, బతిమిలాడించుకోవడం వింత పరిణామం. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పరేషన్  (జీహెచ్ఎంసీ)పోలింగ్ దానిని అనుభవంలోకి తెచ్చింది. సార్వత్రిక ఎన్నికలలో ముఖ్యంగా మారుమూల  ప్రాంతాల నుంచి, కుగ్రామాల నుంచి అనారోగ్యవంతులను, వృధ్ధులను కూడా మంచాల మీద, డోళీల మీద తీసుకు వచ్చి ఓట్లేయించడం లాంటి సంఘటనలు కనిపించేవి. పోలింగ్ గడువు ముగిసే సమయానికి పోలింగ్ కేంద్రం ఆవరణలో ఉన్నవారికి ఎంతసేపటికైనా ఓటు వేసే వెసులుబాటు కల్పిస్తారు.  కానీ ఈ సారి జీహెచ్ఎంసీ ఎన్నికలకు గడువు ముగిసిన తరువాత ఓటర్ల నిరీక్ష అటుంచి ఉదయం నుంచే ముఖాలు చాటేశారు. ఓటేయ డానికి అవకాశం ఉన్నా చాలా `జాగ్రత్త` గా పోలింగ్ కు దూరం పాటించారు. పోలింగ్ కేంద్రాల సిబ్బంది ఓటర్ల  రాకకోసం ఎదురుచూసి, వారు రాకపోవడంతో కునుకు తీస్తున్న విచిత్రపరిస్థితి  కనిపించింది. కోటి మందితో  కిటకిటలాడే మహానగరంలో 76 లక్షల మంది ఓటర్లు ఉండగా, కనీసం మూడవ వంతు కూడా  నమోదు కాలేదని సమాచారం. పోలింగ్  శాతం గతంలో ఎన్నడూ లేనంతగా పడిపోయింది. 2010 ఎన్నికల్లో 42 శాతం, 2016 ఎన్నికల్లో 45.27శాతం పోలింగ్ నమోదైంది. ఈ ఎన్నికలల సాయంత్రం 4 గంటల వరకు 30 శాతం పోలైనట్లు అధికారిక సమాచారం.

విద్యావంతుల నిరాసక్తత

వాస్తవానికి జీహెచ్ఎంసీ విద్యావంతులు, సంపన్నులకు నిలయం. వారిలో ఎక్కువ మంది ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆసక్తి చూపలేదని పోలింగ్ సరళని బట్టి తెలుస్తోంది. నగరంలో కీలకంగా చెప్పుకునే జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, అమీర్ పేట, ఖైరతాబాద్, కూకట్ పల్లి, బాలాజీనగర్, మెహిదీపట్నం, విజయనగర్ కాలనీ, హిమాయత్ నగర్, గాంధీనగర్, సాఫ్ట్ వేర్ రాజధాని కొండాపూర్-మాదాపూర్. గచ్చిబౌలి లాంటి ప్రాంతాలలో పోలింగ్ సరళి అత్యంత దయనీయంగా ఉంది. ఈసారి  ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఈ ఎన్నికలలో కనీసం 60 శాతం పోలింగ్ నమోదవుతుందని అంచనా వేశారు. అందులో సగం కూడా వచ్చే అవకాశం లేదు.

Also Read: ఓటింగ్ పట్ల నగర ఓటరు నిర్లిప్తత

పాతబస్తీలో

పాతబస్తీలో పోలింగ్ బూత్ లు ఖాళీగా కనిపించాయి. అక్కడ గత ఎన్నికల్లోనూ అతి తక్కువ శాతం పోలింగ్ నమోదు కాగా, ఇప్పుడది మరింత దారుణంగా పడిపోయింది. సాధారణంగా అక్కడ చివరి గంటల్లో ఎక్కువ మంది ఓటు హక్కు వినియోగించుకుంటుంటారు. ఈ సారి అదీ లేదు.

మరోవంక  ఓటేయడానికి ఉత్సాహంగా వచ్చిన వారికి జాబితాల్లో పేర్లు లేకపోవడం నిరాశ పరిచింది. ఉదాహరణకు,  చాంద్రాయణగుట్ట, జియగూడ డివిజన్లో తమ ఓట్లు గల్లంతయ్యాయని చాలా మంది ఆందోళనకు దిగారు. చనిపోయిన వారి ఓట్లు ఉండడం, బతికి ఉన్నవారి ఓట్లు లేకపోవడం పట్ల ఆశ్చర్యం, నిరసన వ్యక్తం చేశారు. వందలాది ఓటర్లలో ఐదో వంత మంది పేర్లు కూడా లేవని ఆ ప్రాంతంవాసులు మీడియా ఎదుట వాపోయారు.

ఓటింగ్ శాతం పడిపోవడానికి రాజకీయ ఫిరాయింపులూ ఒక కారణమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యాఖ్యానించారు.

ఓటు వేయకపోవడానికి, వేయలేకపోవడానికి కారణాలు ఇవి అని చెప్పడం కంటే కర్ణుని చావుకు ఆరుగురు కారణం అన్న మాదిరిగా విశ్లేషించుకోవచ్చు. అవి:

  1. కొన్ని చోట్ల ఓటర్ల జాబితా నుంచి పేర్లు గల్లంతు కావడం.
  2. గతంలోని పోలింగ్ కేంద్రం జాబితాలోని పేర్లు మరో పోలింగ్ కేంద్రం, డివిజన్ కు బదిలీ కావడం. ఒక డివిజన్ నుంచి మరో డివిజన్ కు ఇళ్లు మారడం.
  3. ఓటర్ గుర్తింపు కార్డులు లేని వారికి ఆధార్ లాంటి కార్డులు ఉన్నా తిరస్కరిం చడం
  4. జాబితాలోని ఓటర్ల పేర్లలో అక్షర దోషాల పట్ల పోలింగ్ అధికారులు అభ్యంత రాలు వ్యక్తం చేయడం
  5. ముందే చెప్పుకున్నట్లు నాలుగు రోజుల వరుస సెలవులు.అత్యధిక  సాఫ్ట్ వేర్   ఉద్యోగులకు `ఇంటి నుంచి పని` (వర్క్ ఫ్రమ్ హోం) వెసులుబాటు, ఆ నెపంతో సొంతూళ్లకు వెళ్లడం.

ఓటేయలేదు కదా?

రాజకీయ పార్టీలు మేనిపెస్టోలో  వరాలు  మూటలు గుప్పించాయి. అయితే పోలింగ్  సమయంలో ఓటర్ల తీరును బట్టి వాటిని అమలు చేయక్కర్లేదని విజేతలు ప్రకటించినా ఆశ్చర్యం లేదు. నిజమే. కష్టపడే వారికి తినే హక్కు, ఓటేయని వారికి ప్రశ్నించే హక్కు లేనట్లే ఉచిత పథకాలు అనుభవించే హక్కు మాత్రం ఎలా ఉంటుందని ఓటేసిన కొందరు సామాన్యుల నుంచే ప్రశ్నలు వస్తున్నాయి. పోలింగ్ కేంద్రాల వైపు కన్నెత్తి చూడని వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిలిపి వేయాలని డిమాండ్లు వస్తున్నాయి.

ఓటు హక్కును వినియోగించుకోవాలని అధికారులు, మాధ్యమాలు, వివిధ రంగాల ప్రముఖులు చేసిన ప్రకటనలు, వినతులు  ఫలించలేదు. ఓటు వేయక పోవడం బాధ్యతారాహిత్యమని  మేథావులు అంటున్నారు. సమాజాన్ని మలుపు తిప్పేది యువశక్తే అనే నినాదంతో 18 ఏళ్లు నిండిన వారికి కల్పించిన ఓటు హక్కు `వోడు`గా మారిందని వ్యాఖ్యానిస్తున్నారు.

కోవిడ్ పరిస్థితులను సాకుగా చూపి ఓటింగ్ కు దూరంగా ఉన్నారని ప్రచారంలో ఉంది. అయితే లాక్ డౌన్ నిబంధనల సడలింపుతో రవాణా వ్యవస్థ మెరుగుపడి నిత్యవ్యవహారాలు సాగుతున్నా ఓటేయడానికి వెనుకంజ వేయడానికి అర్థం కావడం లేదని అంటున్నారు.

ప్రచార హోరే తప్ప…

నగరపాలక సంస్థ ఎన్నిలకు సాధారణ ఎన్నికల  స్థాయిలో  జరిగిన  ప్రచారంలో జాతీయ  స్థాయి అగ్రనేతలు  ప్రత్యేకంగా పాల్గొన్నారు. అధికార పార్టీ టీఆర్ఎస్ ప్రయత్నుల చెప్పనక్కర్లేదు. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రచార గడువుకు ముందు రోజు (శనివారం) ఎల్బీస్టేడియంలో బహిరంగ సభలో ప్రసంగించారు.

ఆయా పార్టీల ఎన్నికల ప్రచార సభలకు, ప్రధర్శనలకు  వచ్చిన జనాన్ని చూసి `బాక్స్`లు బద్దలవుతాయనుకున్న వారి భ్రమలను ప్రస్తుత పోలింగ్ సరళి సన్నివేశం పటాపంచలు చేసింది. జెండాలను బట్టి గెలుపు, జనాన్ని బట్టి ఓట్ల శాతాన్ని అంచనా వేయరాదని బోధపడినట్లయింది.

ఎన్నికల గుర్తు మార్పు

ఓటర్ల బద్ధకం గురించే కాదు. ఎన్నికల సంఘం సిబ్బంది పొరపాటునూ ప్రస్తావించుకోవాలి. ఓల్డ్ మలక్  పేట లోని ఒక డివిజన్  బ్యాలెట్ పత్రంలో ఏకంగా అభ్యర్తి గుర్తే మారిపోయింది. సీపీఐ అభ్యర్థికి సీపీఎం గుర్తు ముద్రితమైంది. దరిమిలా అక్కడ పోలింగ్ రేపటికి (బుధవారం)వాయిదా పడింది.

Also Read: జీహెచ్ఎంసీలో మందకొడిగా పోలింగ్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles