ఇదీ వరస…
వ్యంగ్యరచన
‘‘ఓటుకు నోటు
ఓటుకు నోటు
ఓటుకు నోటు’’
ఊరు సినిమాహల్లా మారిపోయిందా?
లేకపోతే బ్లాక్ లో సినిమా టిక్కెట్ల అమ్మేవాళ్ళలాగా నోట్లిచ్చి ఓట్లు కొంటమేంటి? అని ఊరంతా గుడ్లు తేలేసి నోళ్ళు వెళ్లబెట్టారు.
కాదంటే చెప్పండి,
‘‘నోటుకు పట్టుచీర
నోటుకు పట్టు చీర
నోటుకు పట్టు చీర’’
అంటూ గొంతు తగ్గించి చెవుల్లో జోరీగల్లా కొందరు, చెవుల్లో గువిలి చేరిందేమోనని చెవుల్లో వేళ్ళు పెట్టి గెలుక్కున్నారు ఊళ్ళోవాళ్ళు.
ఓటుకు నోటూ, ఓటుకు చీరా జనం చెవుల్లోకి ఎక్కడం లేదనుకొని
‘ఓటుక్కారు
ఓటుక్కారు
ఓటుక్కారు’
అని గొణిగారు కార్యకర్తలు. చెవుల్లో దురద వదిలించుకొని,
‘‘ఏమిటి ఓటుకు కారుకూతలు’’ అంటూ గట్టిగా అరిచాడు ఓటరు.
ఓటర్లకి తినిపించి,తాగించి మతిపోగొడుతున్నారు ఎగస్పార్టీ వాళ్ళు’’ అని ప్రకటించి కొత్త ఆశల్ని వెతుక్కుంటూ వెళ్ళిపోయారు కార్యకర్తలు.
ఇంతలో కాషాయ కండువాలు దిగాయి.
‘ఓటుకు కాషాయం
ఓటుకు కాషాయం
ఓటుకు కాషాయం’
అంటూ ఓటర్ల మధ్యకు దిగిపోయారు.
జోగీ జోగీ రాసుకుంటే రాలేది బూడిదే
జోగీ జోగీ జోగీ అంటూ పాడేరు కార్యకర్తలు.
రావణకాష్టం కక్షకట్టి కాషాయం వెంట పడిందేమోనని భయపడి, ‘‘బతికుంటే కాషాయం కట్టుకొని కాశీకైనా వెళ్ళి బ్రతకొచ్చుననుకొని అక్కడినుంచి జారుకున్నారు.
‘ఒస్తున్నాయ్
ఒస్తున్నాయ్
జగన్నాథ రథచక్రాలు
జగన్నాథ రథచక్రాలు
మీ ఓటు మాకెయ్యండి
మీ బతుకు మీరు బ్రతకండి
ఓటుకు బతుకు
ఓటుకు బతుకు’’
అంటూ ఊళ్ళోకి దిగిపోయింది ఇంకోపార్టీ.
జనానికి వాళ్ళ ఘోష వినిపించిందో లేదోనని కూడా పట్టించుకోకుండా వాళ్ళ ఏడుపు వాళ్ళేడుస్తూ, వాళ్ళ అరుపులు వాళ్లు అరుస్తుపూ గెలుపు మాదేనన్న ధీమాతో కిందపడ్డా ముక్కు మాది పైనేనన్నట్టుగా వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళిపోయారు.
ఇలాగైతే లాభం లేదనుకొని ఊరందరుమందీ, కాదు కాదు ఓటర్లంతా, కాదు కాదు ‘నోటా’గాళ్ళంతా ఎన్నికల బరిలో దిగి ‘‘డబ్బు గుర్తుకే మన ఓటు , డబ్బు గుర్తుకే మన ఓటు, డబ్బు గుర్తుకే మన ఓటు’’ అంటూ ప్రచారం చేశారు.
డబ్బు గుర్తు మన జాబితాలో లేదు కదా అన్న ఎన్నికల అధికారిని చూసి అభ్యర్థులంతా తల పట్టుకున్నారు.