హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెరాసకు ఓటు వేయాలని నటుడు పోసాని కృష్ణమురళి కోరారు. హైదరాబాద్ లోని సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో దర్శకుడు ఎన్.శంకర్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఒకప్పుడు భాగ్యనగరంలో ఎక్కువగా మతకలహాలే ఉండేవని. కేసీఆర్ శాంతి భద్రతల పరిరక్షణకు తీసుకున్న చర్యలతో శాంతియుత హైదరాబాద్‌ని చూస్తున్నామని అభిప్రాయపడ్డారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టిన కేసీఆర్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజలకు అన్నివేళలా విద్యుత్, మంచినీరు, సాగునీటిని అందించారని పేర్కొన్నారు.
కొన్ని రాజకీయ పార్టీలు ఓట్ల కోసం మత రాజకీయాలు చేస్తున్నాయని దర్శకుడు శంకర్ మండిపడ్డారు. ప్రజలకు మంచి చేసే రాజకీయాలు చేయాలని కోరారు. తెరాసతోనే అభివృద్ధి సాధ్యమవుతుందన్న ఆయన ప్రజలు తెరాసకు ఓటు వేయాలని కోరారు.