- పోస్కోని రానివ్వమని జగన్ హామీ
- గనుల ఒప్పందంపై పునఃసమీక్ష చేస్తామని సీఎం హామీ
- కార్మిక నాయకుల హర్షం
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యవహారం రాజకీయ పార్టీలకు నిద్రలేకుండా చేస్తోంది. ఎన్నికలు జరుగుతున్నందున ఈ వ్యవహారం అధికార, ప్రతిపక్షాలకు కూడా ఇబ్బందికర పరిణామంగా మారింది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ విశాఖలో పర్యటించారు. పర్యటనలో భాగంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి తో ఉక్కు పరిరక్షణ సంఘం ప్రతినిధులు భేటీ అయ్యారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని కోరారు. ఎన్ఎండీసీని విశాఖ ఉక్కుతో అనుసంధానిస్తే సొంత గనుల సమస్య తీరుతుందని ఉక్కు పరిరక్షణ సంఘం ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.
Also Read: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పాదయాత్ర
పోస్కోని అడ్డుకుంటాం:
స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం జరుగుతున్న పోరాటంపై కార్మిక సంఘాల నుంచి సీఎం జగన్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రధానికి లేఖరాశానని దీనిపై కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతామని ప్రతినిధులకు తెలిపారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో సీఎం జగన్ సానుకూలంగా స్పందించారని కమిటీ తెలిపింది. దక్షిణ కొరియాకు చెందిన పోస్కో కంపెనీని విశాఖ స్టీల్ ప్లాంట్‌లో అడుగు పెట్టనివ్వబోమని సీఎం జగన్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. పోస్కో పరిశ్రమను భావనాపాడు, కడప, కృష్ణపట్నంలో ఏర్పాటు చేస్తామని తెలిపారని ఉక్కు పరిరక్షణ కమిటీ ప్రతినిధులు తెలిపారు.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు తమ ఉద్యమం ఆగదని ఈ సందర్భంగా కార్మిక సంఘం ప్రతినిధులు స్పష్టం చేశారు.
Also Read: విశాఖ ఉక్కుపై నాయకుల తుప్పు రాజకీయాలు
సీఎం జగన్, ఉక్కు పరిరక్షణ కమిటీ ప్రతినిధుల మధ్య గంటకు పైగా జరిగిన సమావేశంలో రాష్ట్ర మంత్రులు అవంతి శ్రీనివాస్, ధర్మాన కృష్ణదాస్, కన్నబాబు, ఎంపీలు విజయసాయిరెడ్డి, ఎంవీవీ సత్యనారాయణలు పాల్గొన్నారు.