ప్రసిద్ధ కథకుడు రావిశాస్త్రి రాసిన కథల్లో ” సొమ్ములు పోనాయండి” కథ ప్రసిద్ధం. ఉత్తరాంధ్ర వాసుల గుండెకు గొంతిచ్చి, వారి గోడు వినిపించాడు. అందుకు, ఆ భూమి భాషనే, యాసనే ఎంచుకున్నాడు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో నిర్మాణమైనా, సకల ఆంధ్రజనుల హక్కుగా సాధించుకున్నది విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ. దీని ప్రయివేటీకరణకు రంగం సిద్ధమై పోయింది. దీన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమాలు, ఆందోళనలు ప్రారంభమయ్యాయి. వీటి ఉధృతిని పెంచడానికి కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు సిద్ధమయ్యాయి. విశాఖ ఉక్కు పరిరక్షణ వేదిక మార్చి 5వ తేదీ నాడు ఆంధ్రప్రదేశ్ బంద్ కు పిలుపునిచ్చింది.
ఉద్యమం తీవ్రతరం
విశాఖపట్నం, విజయవాడ, నెల్లూరు ఇలా ఎక్కడికక్కడ రాష్ట్రమంతా ఉద్యమాన్ని తీవ్రతరం చేయడానికి ఉక్కు కమిటీ ప్రతినిధులు ప్రణాళికలు చేస్తున్నారు. అన్ని ట్రేడ్ యూనియన్లు కలిసి ఒక వేదికగా ఏర్పడ్డాయి. అదే, విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక. విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకోవడానికి మేము దేనికైనా సిద్ధం అంటూ ప్రతి పార్టీ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఇప్పటికే ఉత్తరం రాశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీర్మానం కూడా చేసింది. టీడీపి ఎంఎల్ ఏ, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తన శాసనసభా సభ్యత్వానికి రాజీనామ సమర్పించారు. వైసీపీ ముఖ్యనేత విజయసాయిరెడ్డి 25కిలోమీటర్ల పాద యాత్ర చేశారు. బిజెపి ఎంఎల్ సి మాధవ్, తదితరులు కేంద్రానికి లేఖాస్త్రం సంధించారు.
Also Read : జగన్ తో ఉక్కు పరిరక్షణ సంఘం నేతల భేటీ
ప్రతిపార్టీ పోరాడుతానంటోంది
ప్రతిరాజకీయ పార్టీ కలివిడిగా, విడివిడిగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తమ వాణిని వినిపిస్తోంది. యావత్తు ఆంధ్రప్రదేశ్ లోనే కాక, దిల్లీ వీధుల్లోనూ పోరాటబాట పడతామని విశాఖ ఉక్కు పరిరక్షణ వేదిక చైర్మన్ సిహెచ్ నరసింగరావు అంటున్నారు. కేంద్రం మెడలు వంచి లక్ష్యాన్ని సాధిస్తామనే విశ్వాసాన్ని ఆయన ప్రకటిస్తున్నారు. పబ్లిక్ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ అంశాన్ని తాము మొదటి నుంచీ వ్యతిరేకస్తున్నామని, మూడు దశాబ్దాల నుంచీ తమ పోరాటంలో, వైఖరిలో ఎప్పుడూ రాజీపడలేదని వామపక్ష పార్టీలు చెబుతున్నాయి. ఇవన్నీ ఉద్యమానికి ఊతం ఇచ్చే అంశాలే. కానీ, కేంద్ర ప్రభుత్వ వైఖరిని చూస్తుంటే, స్టీల్ ప్లాంట్ దక్కడం కష్టమనే అనిపిస్తోంది. విశాఖ ఉక్కు పోయింది… అంటూ టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు రోజుల క్రితం బహిరంగంగానే వ్యాఖ్యానించారు.
Also Read : విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పాదయాత్ర
నరేంద్రమోదీ ప్రకటన
ప్రభుత్వ రంగ సంస్థలను నడిపే పరిస్థితుల్లో లేనేలేమని సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్రమోదీ రెండు మూడు రోజుల క్రితమే ప్రకటించారు. ప్రైవేటీకరణ ద్వారా లక్షల కోట్ల రూపాయలను సృష్టిస్తామని ప్రధాని అంటున్నారు. దేశ ప్రధానిగా నరేంద్రమోదీ పీఠాన్ని అధిరోహించినప్పటి నుంచి తీసుకున్న ఏ నిర్ణయంలోనూ వెనక్కి తగ్గలేదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పెట్టుబడుల ఉపసంహరణ అంశంలోనూ ప్రధాని వెనక్కి తగ్గరని పరిశీలకులు గట్టిగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవడం కష్టమేనని మెజారిటీ విశ్లేషకుల అభిప్రాయం. ఆ మధ్య కేంద్రంలోనూ -ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్న సమయంలో జరిగిన పరిణామాలను నేడు మరోమారు గుర్తుతెచ్చుకుందాం.
Also Read : విశాఖ ఉక్కుపై నాయకుల తుప్పు రాజకీయాలు
సమైక్య ఉద్యమానికి యూపీఏ చలించలేదు
ఆంధ్రప్రదేశ్ ను సమైక్యంగానే నిలుపుకోవాలని ఆంధ్ర ప్రాంతంలో తీవ్రంగా జరిగిన ఉద్యమాలను, ఆందోళనలను, ప్రజా ప్రతినిధుల రాజీనామాలను కేంద్రం ఏమాత్రం పట్టించుకోలేదు. తాను అనుకున్నట్లుగానే రాష్ట్రాన్ని విడదీసింది. ‘వోక్స్ వ్యాగన్’ కార్ల ఫ్యాక్టరీ విశాఖపట్నం ప్రాంతంలో వస్తుందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ ఊపందుకుంది. కొంతమంది అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి మరీ భూములు కొనుగోళ్లు చేశారు. కానీ, ‘వోక్స్ వ్యాగన్’ అక్కడ ఏర్పడలేదు. వేరే రాష్ట్రానికి తరలిపోయింది. దీని వల్ల ఉత్తరాంధ్ర ప్రాంతంలోని కొందరు సామాన్యులు కూడా ఎంతో నష్టపోయారు. ఆ తరుణంలో, ఉత్తరాంధ్ర ప్రాంతానికే చెందిన ఒక మంత్రిగారు ” సొమ్ములు పోనాయ్, మరేటి సేత్తాం” అంటూ చాలా వెటకారంగా సమాధానం చెప్పారు. రేపు స్టీల్ ప్లాంట్ విషయంలోనూ అదే జరుగుతుందని పరిశీలకులు దృఢంగా అభిప్రాయ పడుతున్నారు.
Also Read : “ఆంధ్రుల” హక్కులంటే అందరికీ “అంత” అలుసా…?
ఉక్కు ఫ్యాక్టరీ పోనాది, మరేటి సేత్తాం?
ఇప్పుడు ఇంత హడావిడి చేస్తున్న ఈ రాజకీయ నాయకులందరూ “ఉక్కు ఫ్యాక్టరీ పోనాది, మరేటి సేత్తాం” అంటూ రేపు చేతులెత్తేస్తే చేయగలిగింది ఏమీ ఉండదు. రావిశాస్త్రిగారి కథను, ఆ మంత్రిగారి మాటలను మరోమారు గుర్తుచేసుకోవడం తప్ప. స్టీల్ ప్లాంట్ -పోస్కో సంస్థ మధ్య ఒప్పందం ఎప్పుడో కుదిరిందని, మరో సంస్థ కూడా వాటాగా జత కలిసే అవకాశం ఉందనే వార్తలు కోడై కోస్తున్నాయి. పెట్టుబడుల ఉపసంహరణ, ప్రైవేటీకరణ అంశాల్లో మిగిలిన సంస్థలకు -విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కు ఎటువంటి పోలికా లేదు. ఆ అంశాన్ని ఇక్కడ పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు.
Also Read : విశాఖ ఉక్కు ఆంధ్రులకు దక్కుతుందా?
విశాఖ ఉక్కు లాభాల బాటలో నడిచింది
విశాఖ ప్లాంట్ కు లాభాలు వచ్చిన సందర్భాలూ ఉన్నాయి. ఉత్పత్తి సామర్ధ్యం కూడా బాగా పెరిగింది. గనులను కేటాయిస్తే, లాభాలు ఉరకలెత్తుతాయని నిపుణులు చెబుతూనే ఉన్నారు. సంస్థ నిర్వహణలో, సిబ్బంది పనితీరులో ఏవైనా లోపాలుంటే సరిచేసుకొని ముందుకు వెళ్తే సరిపోతుంది. ఉక్కు పరిశ్రమ స్థాపన కోసం ఎందరో భూములను దానం చేశారు. ఎందరో అతి తక్కువ ధరకే భూములను ఇచ్చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ప్రాంతాల ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. ఎందరో బలిదానం చేశారు. ఇన్ని త్యాగాలు, దానాలు, బలిదానాలు, పోరాటాల ఫలితమే విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ స్థాపన. ఇది కార్యరూపం దాల్చడానికి దశాబ్దాల సమయం పట్టింది.
Also Read : విశాఖ ఉక్కు అమ్మకం మరణ శాసనమే
ఆరంభశూరులుగా మిగులుతారా?
ఇంతటి గత చరిత్ర, భావి ఘన వైభవం కలిగిన స్టీల్ ప్లాంట్ ను కాపాడుకొని తీరాలి. లేకపోతే, ఆంధ్రులు ఓడిపోయినట్లే. ఆరంభశూరులుగా మిగిలిపోయినట్లే. కేవలం రాజకీయ పార్టీల ఆందోళనలకు కేంద్రం దిగి వస్తుందని నమ్మలేమని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రజావ్యతిరేకత పెరిగి, పెద్ద స్థాయిలో ప్రజాఉద్యమం జరిగితే తప్ప, స్టీల్ ప్లాంట్ నిలబడదు. ఈ దిశగా నడవాల్సిన, నడిపించాల్సిన బాధ్యత అందరికీ ఉంది. మార్చి 8 నుంచి మళ్ళీ పార్లమెంట్ సమావేశాలు జరుగనున్నాయి. పార్లమెంట్ సభ్యులు ఏ స్థాయిలో గొంతెత్తుతారో చూద్దాం.దేశానికి తలమానికం, ఆంధ్రప్రదేశ్ కు మణిమకుటం, వేలాది కుటుంబాల ఉపాధికి నిధి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్.మొదటి నుంచీ కేంద్రం ఆంధ్రప్రదేశ్ ను తక్కువగానే చూస్తోంది.
Also Read : విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై పునరాలోచించండి: ప్రధానికి ముఖ్యమంత్రి లేఖ
దిల్లీ పెద్దల సవతి తల్లి ప్రేమ
దక్షిణాదిలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పై దిల్లీ పెద్దలు సవతితల్లి ప్రేమనే చూపిస్తున్నారు. టంగుటూరు ప్రకాశంపంతులు కాలం నుండీ అదే జరుగుతోంది. హస్తినలో ఏ ప్రభుత్వం ఏలుబడిలో ఉన్నా, తీరు మారడం లేదు. తెలుగువాడి ఉనికిని, పౌరుషాన్ని, ఆత్మగౌరవాన్ని, హక్కును, కాపాడుకోవడం కనీసం ఈ స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో నైనా చూపించుకుంటారని ఆశిద్దాం. ఆంధ్రప్రదేశ్ లో విస్తరించాలనుకుంటున్న బిజెపి తన ఆశలు నెరవేర్చుకోవాలంటే, స్టీల్ ప్లాంట్ కు ఎటువంటి నష్టం, కష్టం జరగకుండా చూడాలి. లేకపోతే, రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ కు పట్టిన గతే బిజెపికి కూడా పడుతుందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సన్నాయి నొక్కుళ్ళు కాక, ఉక్కు సంకల్పమే శిరోధార్యం.
Also Read : మళ్ళీ విశాఖ ఉక్కు ఉద్యమం