ఉద్యమాల ఘోష వినపడనట్లు నటించే పాలకులు, ఉపసంహరణ విషయంలో ఏలినవారు ఎట్టి పరిస్థితుల్లో వెనక్కు తగ్గరని తెలిసీ…నటించే నాయకుల మధ్య విశాఖఉక్కు ప్రభుత్వ రంగం సంస్థగానే మిగిలే అవకాశాలు ఏమాత్రం లేవనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఆ మధ్య ప్రత్యేక తెలంగాణ పోరాట సమయంలోనూ ఇదే తంతు నడిచింది. రాష్ట్ర విభజన తప్పదని తెలిసీ, ప్రజాక్షేత్రంలో వ్యతిరేకత రాకూడదని అన్ని పార్టీలు ఆయా ప్రాంతాలకు అనుగుణంగా ఉద్యమాల విన్యాసం చేశాయి. చివరకు రాష్ట్ర విభజన జరగనే జరిగింది. ఎవ్వరూ ఆపలేకపోయారు. ఏడేళ్లు దాటినా విభజన హామీలు నెరవేరిన దాఖలాలు ఎక్కడా కనిపించడం లేదు.
Also read: ముమ్మరంగా మహమ్మారి, టీకానే పరమావధి
నదీ జలాలపైన రెండు తెలుగు రాష్ట్రాల రచ్చ
పైపెచ్చు, నీరు -నిధులు -నియామకాల విషయంలో పరిష్కారాలు లభించక పోగా, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రచ్చ మరింత రాజకుంది. తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఎట్లా ఉన్నా, ఆంధ్రప్రదేశ్ మాత్రం పచ్చిబాలింతరాలుగా పురిటినొప్పుల నుంచి బయటపడడంలేదు. కష్టాల నడుమ కొట్టుమిట్టాడుతున్న కొత్త రాష్ట్రానికి కొత్త తలనొప్పులు, సరికొత్త కష్టాలు చుట్టుముట్టుతున్నాయి. విశాఖపట్నం ఉక్కు పరిశ్రమను ప్రైవేట్ పరం చేయాలనే నిర్ణయంలోనే కేంద్ర ప్రభుత్వం ఉంది. దీనిపై ఎటువంటి పునరాలోచన లేనేలేదని ఉభయ సభల సాక్షిగా పదేపదే వినిపించింది. తాజాగా జరుగుతున్న సమావేశాల్లోనూ అదే పునరుద్ఘాటమైంది. కేంద్ర ప్రభుత్వ వాటాతో పాటు అనుబంధంగా ఉన్న సంస్థలు, సంయుక్త భాగస్వామ్య సంస్థల వాటాలను 100 శాతం ఉపసంహరించుకుంటున్నట్లు కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి భగవత్ కిషన్ రావ్ కరాద్ తేల్చిచెప్పేశారు. దీనికి ప్రతిగా , దేశ రాజధానిలో అన్ని పార్టీలు ఏకమై ఉక్కు నినాదాన్ని వినిపించాయి. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా నిరసన పర్వాన్ని విజయవంతంగా నిర్వహించారు. అధికార వైసిపి, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలు, వామపక్షాలు, కార్మిక సంఘ నేతలు ఏకమై ఉద్యమించడం అభినందనీయమే. కానీ, కేంద్ర నిర్ణయం ఆగేట్టు లేదు. ప్రైవేట్ వ్యక్తులను స్టీల్ ప్లాంట్ లో అడుగుపెట్టనీయమని కార్మిక సంఘాలు భీషణ ప్రతిజ్ఞ చేస్తున్నాయి. ఇంతటి హోరును కేంద్రం వింటుందా అన్నదే ప్రశ్న. ఉపసంహరణ నిర్ణయం వెనక్కు తీసుకుంటుందా అన్నది సందేహమే. స్టీల్ ప్లాంట్ అన్యాక్రాంతం కాకుండా ఉండడానికి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు పారిశ్రామిక, ఆర్ధిక రంగ నిపుణులు అనేక ప్రత్యామ్నాయ మార్గాలను కేంద్రం ముందు ఉంచారు. సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి,రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పలుమార్లు నివేదించారు, కేంద్ర మంత్రులకూ విన్నవించారు. ఎన్ని చెప్పినా ఎవ్వరూ కనికరంచ లేదు. పట్టు వీడడంలేదు. నిర్ణయం వాపసు తీసుకోవడం లేదు.
Also read: వ్యధాభరిత కథావిశ్వనాధుడు
ఎటువంటి హామీ ఇవ్వని కేంద్రం
ఇదే అంశంపై సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నట్లు కేంద్రం తన అఫడవిట్ లోనూ ఎక్కడా ప్రస్తావించలేదని లక్ష్మీనారాయణ తరుపున న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు కూడా. పరిశ్రమకు భూములిచ్చినవారిని ఎలా ఆదుకుంటారు? ఉద్యోగుల రక్షణ పరిస్థితి ఏంటి? మొదలైనవాటికి కేంద్రం నుంచి అధికారికంగా ఇప్పటి వరకూ ఎటువంటి హామీ లభించలేదు. దశాబ్దాల ఉద్యమాల,ఎందరో ప్రాణ,ధన త్యాగాల కొలిమిపై పుట్టిన ఉక్కు పరిశ్రమ కళ్లెదుటే కరిగిపోతూ,ప్రైవేట్ చేతుల్లోకి వెళ్ళడానికి సిద్ధమవ్వడాన్ని తెలుగు ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారు.ప్రస్తుతం ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్యనాయుడు,మిజోరాం గవర్నర్ గా ఉన్న కంభంపాటి హరిబాబు వంటి వారెందరికో విశాఖ ఉక్కు ఉద్యమంతో విడదీయలేని అనుబంధం ఉంది. నష్టాల నుంచి బయటపడేయ్యడానికి, లాభాలబాటలోకి తీసుకెళ్లడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతున్న కేంద్రం మాటలను ప్రజలు నమ్మడం లేదు. లాభాల్లోకి సంస్థను తీసుకెళ్లడం అసాధ్యం కాదని చెబుతూ పలువురు ఇచ్చిన నివేదికలను కేంద్రం బుట్టదాఖలు చేయడం అత్యంత విషాదకరమని మేధావివర్గం ఆగ్రహోదగ్రమవుతోంది. అప్పుడు పరిశ్రమ సాధన వెనుక కేవలం రాజకీయ పోరాటంగా కాక, ప్రజా ఉద్యమంగా పెద్దరూపాన్ని తీసుకుంది అందుకే,అప్పటి ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. అప్పుడు ఉద్యమానికి ప్రాతినిధ్యం వహించిన తెన్నేటి విశ్వనాథం వంటివారిపై అప్పటి ప్రజలకున్న విశ్వాసం, గౌరవం చాలా గొప్పవి. ప్రజాబాహుళ్యాన్ని చైతన్యపరచడంలో నేటి నేతలు విఫలమయ్యారనే చెప్పాలి. ఇన్నిటి నడుమ విశాఖ ఉక్కు మనకు దక్కుతుందా అన్నది అనుమానమే. ఈ అంశంలో న్యాయస్థానాల తీర్పు తెలియాల్సి వుంది.
Also read: మోదీపై సై అంటున్న దీదీ