Sunday, December 22, 2024

ఉక్కు సంకల్పానికి వంద రోజులు

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉద్యమాలు ఆరంభమయ్యాయి. ఈ పోరాట పర్వానికి నేటితో 100రోజులు పూర్తయ్యింది. కరోనాను, కష్టాలను లెక్కచేయకుండా పోరాటం నిరాఘాటంగా సాగుతూనే వుంది. కేంద్రం దిగి వచ్చేంత వరకూ ఉద్యమాన్ని ఆపేది లేదని కార్మిక సంఘాలు భీష్మ ప్రతిజ్ఞతో ఉన్నాయి. ప్రైవేటీకరణ దిశగా జనవరిలో కాబినెట్ సబ్ కమిటీ ఏర్పడి, ప్రాథమిక నివేదికను  రూపొందించింది.

Also read: గాజాలో శాంతి ఎంతకాలం నిలుస్తుంది?

ప్రభుత్వం మొండి వైఖరి

నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను లాభాలబాట పట్టించాలనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ , ఉక్కు మంత్రి ధర్మేంద్ర ప్రధాని పలుమార్లు ప్రకటించారు. దీన్ని వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రజాప్రతినిధులు ఉభయ సభల్లో గళమెత్తారు కానీ, కేంద్ర మంత్రులు వారి గొంతు నొక్కే ప్రయత్నమే చేశారు. వారి విన్నపాలకు ఏ మాత్రం విలువనివ్వలేదు. సరికదా,స్టీల్ ప్లాంట్ ను మూసెయ్యడం తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదంటూ  బెదిరింపు ధోరణిలో విరుచుకు పడ్డారు. ఫిబ్రవరిలో సబ్ కమిటీ ఏర్పడినా, ఇంకా సమగ్రమైన నివేదిక రూపకల్పన జరుగలేదు. వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల నేపథ్యంలో బహుశా ఆలస్యమైఉంటుంది తప్ప, కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటుందని భావించలేం.

Also read: కరోణా కట్టడికి విశ్వప్రయత్నం

కార్మికవర్గం తీవ్రవ్యతిరేకత

విశాఖ ఉక్కును ప్రైవేటీకరీంచే దిశగా కేంద్రం నుంచి మాటలు వినిపించిన వెనువెంటనే, విశాఖలోని కార్మిక సంఘాల నుంచి తీవ్రవ్యతిరేకత ఎగిసిపడింది. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం ఉపసంహరించుకోకపోతే పెద్దఎత్తున ఉద్యమాన్ని చేపడతామని కార్మిక లోకం హెచ్చరించింది. వెనువెంటనే సమావేశమై పోరాటానికి శ్రీకారం చుట్టారు. ఫిబ్రవరి మొదటివారంలోనే ఉద్యమం ఊపందుకుంది. ర్యాలీలు, నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. విశాఖపట్నం ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేక పోరాట కమిటీ ఏర్పడింది. కార్మిక సంఘాలు,వివిధ ట్రేడ్ యూనియన్లు, బిజెపి తప్ప మిగిలిన రాజకీయ పార్టీలన్నీ ఏకమయ్యాయి. ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని ఉక్కు సంకల్పం చేసుకున్నాయి. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కమిటీ కూడా ఏర్పాటైంది.

Also read: బెంగాల్ లో కేంద్రం పక్షపాత వైఖరి

సమష్టి పోరాటం

వీరందరూ విడివిడిగా,కలివిడిగా పోరాటాలు చేపట్టారు. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ, మొన్న జరిగిన  అసెంబ్లీ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టింది. ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే పలుమార్లు ప్రధానమంత్రికి లేఖలు రాశారు.  ప్రైవేటీకరణను చేపట్టకుండానే, విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఏ విధంగా కాపాడవచ్చు, ఏ తీరున లాభాల్లోకి తీసుకెళ్లవచ్చో ఆ లేఖల్లో సవివరంగా విశదపరచారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైసిపి  కూడా వివిధ రూపాల్లో నిరసనలు చేపట్టింది. కార్మిక సంఘాలకు సంఘీభావం తెలుపుతూ వారితో కలిసి ఉద్యమంలో పాల్గొన్నది. ప్రముఖ నటుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి కూడా ఉద్యమానికి మద్దతుగా పలుమార్లు తన వైఖరిని తెలియజేశారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తన పదవికి రాజీనామ చేస్తున్నట్లు ప్రకటించి ఉద్యమబాటలోకి వచ్చారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి, టి ఆర్ ఎస్ అగ్రనేత కెటిఆర్ ప్రైవేటీకరణ వ్యతిరేక పోరాటానికి తన మద్దతును ప్రకటించారు. గంటా శ్రీనివాస్ కూడా హైదరాబాద్ వెళ్లి కెటిఆర్ ను కలిసి మద్దతును కోరారు.

Also read: వ్యాపార ప్రయోజనాలకు వాట్సప్ పెద్దపీట

దిల్లీ రైతు ఉద్యమకారుల సంఘీభావం

కేంద్ర వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా దిల్లీలో పోరాట బాట పట్టిన రైతు సంఘాలు కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల పక్షాన నిలిచాయి. ఏప్రిల్ 18 వ తేదీన, రైతు ఉద్యమ ప్రధాన నేత రాకేష్ టికాయిత్ స్వయంగా విశాఖపట్నం వచ్చి, స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితితో కలిసి పోరాటంలో పాల్గొన్నారు. జాతీయ ట్రేడ్ యూనియన్ల ప్రధాన నేతలు తపన్ సింగ్, సంజీవరెడ్డి మొదలైనవారు విశాఖపట్నం తరలి వచ్చి ఉద్యమంలో చేయి కలిపారు. దిల్లీ వీధుల్లోనూ పోరాట శంఖారావం వినిపించాలని ఉక్కు పరిరక్షణ సమితి ఆలోచన చేసింది. కరోనా ఉధృతి బాగా పెరగడం, లాక్ డౌన్, కర్ఫ్యూల నేపథ్యంలో ఇప్పటి వరకూ దిల్లీ వెళ్లలేకపోయారు. కరోనా వాతావరణం కాస్త సద్దుమణిగిన తర్వాత ఆ భేరి తప్పకుండా ఉంటుందని భావించవచ్చు. విశాఖపట్నంలో ప్రారంభించిన ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మహోధృతం చేయాలనే కార్మిక సంఘాలు, పోరాట సంఘాలు భావిస్తున్నాయి. ఇప్పటికే రెండుసార్లు రాష్ట్ర వ్యాప్త బంద్ జరిగింది.

Also read: కాంగ్రెస్ కు కాయకల్ప చికిత్స ఎప్పుడు?

తెలుగోళ్ళు చూస్తూ ఊరుకోరు

ఈ 100రోజుల పోరాటాన్ని గమనిస్తే,ఎప్పుడు ఏ కార్యక్రమం నిర్వహించినా వేలాదిమంది అందులో పాల్గొన్నారు. నష్టాల సాకు చూపించి, ప్రైవేట్ వారికి అప్పనంగా అప్పగిస్తే తెలుగువారు చూస్తూ ఊరుకోరు అనే సంకేతాన్ని ఇంకా బలంగా పంపించాలని పలువురు కోరుకుంటున్నారు.జాతీయ స్థాయిలో తీవ్ర పోరాటం చేసి, కేంద్రం దిగివచ్చేలా చెయ్యాలంటే, రాజకీయాలకు అతీతంగా అధికార, ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమై తీరాలి. తమిళనాడు నాయకుల విధానాన్ని అనుసరించాల్సిందే.ఈ కొత్త ఆర్ధిక సంవత్సరం ప్రారంభంలోనే, లాభాలు వచ్చాయని స్టీల్ ప్లాంట్ అధికారులు సైతం నివేదికలను ప్రకటించారు. ఎన్నో విలువైన ఆస్తులు, ఎంతో ఉత్పాదక సామర్ధ్యం, నిపుణులు, అనుభవజ్నులైన సిబ్బంది స్టీల్ ప్లాంట్ కు చెరగని సంపదగా ఉంది. గతంలో అనేకసార్లు లాభాలు వచ్చిన ఘన చరిత్ర ఉంది. మరిన్ని లాభాల బాటలో నడిపించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. కేంద్రం ప్రభుత్వం కొంచెం సహకరిస్తే చాలు,ఏ సమస్యా ఉత్పన్నమవదని నిపుణులు సైతం చెబుతున్నారు.

Also read: పాలస్తీనా – ఇజ్రాయిల్ ఘర్షణ

ప్రత్యామ్నాయ మార్గలను స్వాగతించాలి

స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చెయ్యకుండా, ఏ ఏ మార్గాలను అనుసరించాలో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటు పలువురు మేధావులు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. వాటన్నింటినీ స్వాగతించి, ఆమోదిస్తే సరిపోతుంది. ఎన్నో ప్రాణ త్యాగాలు, దశాబ్దాల ఉద్యమ ఫలితంగా ఆంధ్రప్రదేశ్ కు దక్కిన పరిశ్రమ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాదిమంది బతుకులకు ఆధారమైన సంస్థ.” విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు ” అనే నినాదాలకు, సెంటిమెంట్ కు ప్రతీక ఈ స్టీల్ ప్లాంట్. దీనిని కాపాడుకోవడం అందరి హక్కు. తెలుగువారి గోడును వినడం కేంద్ర బాధ్యత.

Also read: పాకిస్తాన్ కొత్త పాచిక?

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles