రచన: శ్రీ విశ్వనాథ పావనిశాస్త్రి
అది 1974వ సంవత్సరం ఏప్రిల్ నెల 21వ తారీకు. విజయవాడ దుర్గా కళామందిరంలో కీ.శే. ఘంటసాల పాడిన భగవద్గీత గ్రామఫోను రికార్డు ఆవిష్కరణ. ఆవిష్కరించేది నటరత్న ఎన్.టి. రామారావు.
“సభ విజయవాడలో పెట్టేటట్టయితే అక్కడ మా గురువుగారు విశ్వనాథవారున్నారు. వారిని ఆహ్వానించండి. మొదటి రికార్డు వారికి ప్రెజంటు చేద్దాం అని రామారావుగారు కూడా అన్నారండి. తమరు దయచేసి మా ఆహ్వానాన్ని మన్నించాలి” అని హెచ్.ఎమ్.వి. కంపెనీ అధికారులు కొందరు వచ్చి పిలవగా మా నాన్నగారు విశ్వనాథ సత్యనారాయణగారు సరేనన్నారు.
పాపం, గురువుగారు బతికున్నన్నినాళ్లూ విజయవాడలో ఏ సినిమా సభ జరిగినా, ఆయన నాహ్వానింపించి నాలుగక్షింతలు వేయించుకోకుండా ఉండలేదు ఏనాడూ ఆ నటరత్న.
ఆ రోజుకి సభా నిర్వాహకులు వచ్చారు. మా నాన్నగారి వెంట నేనూ బయల్దేరాను. మేం వెళ్లేటప్పటికి కళామందిరం హాలే కాక, స్టేజీ కూడా కిటకిట లాడిపోతోంది. ఎన్.టి. ఆరూ, తదితరులూ విశ్వనాథ వారికి నమస్కారాలతో ఎదురొచ్చి రిసీవ్ చేసుకోగా అంతా ఆసీను లయ్యారు.
పూలమాలలూ, ఫార్మాలిటీలూ అన్నీ అయినాయి. నిర్వాహకులూ, మరి కొందరు పెద్దలూ నాలుగు ముక్కలు ముక్కిన తర్వాత క్షమించాలి – ఎన్.టి.ఆర్. నీ, ఇతర సినిమా జనాన్ని చుద్దామని వచ్చిన జనంతో హాలు కిటకిటగా, రణగొణగా ఉంది మరి ! ఎన్.టి.ఆర్. భగవద్గీత రికార్డు ఆవిష్కరించారు. గురువుగారికి మొదటి రికార్డు బహూకరించారు. తర్వాత ఒక ఇరవై నిమిషాలు మాట్లాడి, “నే నివ్వాళ ఇంత వాడి నయ్యానంటే దానికి మా గురువుగారి ఆశీర్వచనమే కారణం. ఇప్పుడు వారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను” అని కూర్చున్నారు.
ఎన్.టి.ఆర్. అలా అని కూర్చున్న తరువాత, ఈయన మైకు తన ముందుకి లాక్కుని సరైన పొజిషన్లోకి సర్దుకుని, ఆడియన్స్ ని పది పదిహేను సెకన్లు పరకాయించి చూశాడు. హాల్లో సగానికి పైగా కార్మిక ప్రజ. కుఱ్ఱకారు జనం. విశ్వనాథ సత్యనారాయణగా రెవరో తెలిసిన వాళ్లకి తెలుసు తెలీని వాళ్లకి తెలీదు. అంతకుముందు మాట్లాడిన వాళ్ల బట్టి – ఆయనొక కవి అనీ, రామారావుకు గురువు అని మాత్రం స్పష్టంగా తెలిసింది. ఏది ఏమైనా పంచె లాల్చీ ధరించిన ఒక ఎనభై ఏళ్ల పిలక మునలాయన ఏం మాట్లాడతాడో? ఆ గొంతెలా ఉంటుందో ? అని అనుకుంటున్న జనానికి – నిర్భయంగా కూర్చుని, మైకు నిర్మొహమాటంగా ముందుకు లాక్కుని, చిలిపిగా ఆడియన్స్ని పరకాయించి చూస్తున్న ఆయన్ని చూస్తుంటే ఎలా ఉంటుందో చెప్పండి. పది సెకన్లలో హాల్ పిన్ డ్రాప్ సైలెంట్!
అప్పుడు ఈయన మొదలుపెట్టాడు. “మా రామారావు ఇవాళ తానెంత వాడైనాడో నాకైతే తెలీదుగాని, తానెంత వాడనైనానని తాననుకుంటున్నాడో. అంతవా డవటానికి మనం కారణం అంటున్నాడు గదా! అందుచేత అతనెంత వాడయ్యానని అనుకుంటున్నాడో అంతవాడయ్యాడని ఒప్పుకుందాం. నష్టమేం? ఇదీ ఆయన మొదటి వాక్యం.
అధ్యక్షా అనో, సోదరీ సోదరీమణులారా అనో సభనుద్దేశించి ప్రారంభించే సంప్రదాయానికతీతంగా మొదలైన ఆయన ధోరణికీ, ఆయన కంఠంలోని సహజమైన స్టీరియో ఫోనిక్ ఎఫెక్ట్కి, వాక్య విన్యాసంలోని చమత్కారానికీ సభలో నవ్వులూ – చప్పట్లు మారుమ్రోగిపోయాయి. నమ్మండి నమ్మకపోండి. ఆయన ఆ రోజు ఆ సభలో దాదాపు నలభై నిమిషాల సేపు మాట్లాడాడు. ఆ నలభై నిమిషాలలో దాదాపు నలభైసార్లు చప్పట్లు, నవ్వులతో సభ మోగిపోయింది.
అలా కొద్దిసేపు మాట్లాడిన తర్వాత ఆ భగవద్గీత రికార్డుని దాని కవర్ నుంచి బయటికి తీసి పరిశీలిస్తూ, “ఈ రికార్డు నాదీన్ని నేనేం చేసుకోను ? ఎందుకుంటే దీన్ని దేనిమీదో పెట్టి తిప్పుతారు. ఆ తిప్పేది నా దగ్గర లేదు” అన్నాడు. అంతే ! మళ్లీ నవ్వులు – చప్పట్లు, మళ్లీ ఈయన, “నే నిల్లా అన్నానని, ఆ తిప్పేదేదో నా కిప్పించే ప్రయత్నం చేస్తాడేమో మా రామారావు! అల్లాంటి పిచ్చి పని చెయ్యొద్దని మనవి. ఎందుకంటే అది నా కొంప కొచ్చింది మొదలు ఇహ రికార్డులు కొనమని మా పిల్లలు నా ప్రాణం తీస్తారు. ఆ గోల నే భరించలేను.”
మళ్లీ నవ్వులు – చప్పట్లు !!
“సరే! మన దగ్గర ఆ తిప్పేది లేదు గదా ! మరి దీన్నేం చెయ్యాలి ? ఒక పని చెయ్యొచ్చు. అవకాయ జాడీ మీద మూత పెట్టుకోవచ్చు”
నమ్మండి – నమ్మకపొండి – దానిక్కూడా చప్పట్లే ?
చప్పట్లు కొడుతున్న జనాన్ని చెయ్యెత్తి ఆపి, “ఆగండాగండి! దానికీ పని కొచ్చేట్టు లేదు. దీని మధ్యలో ఏదో చిల్లుంది. అందులోంచి పురుగులూ అవీ లోపలికి వెళతాయి. ఇప్పుడు కొట్టండి” – పాపం సిన్సియర్ గా మళ్లీ చప్పట్లు కొట్టారు జనం.
మహాప్రభో ! అది భగవద్గీత రికార్డు! పాడింది కీర్తి శేషుడైన ఒక ప్రసిద్ధ గాయకుడు! ఆయన మరణానంతరం ఒక పెద్ద గ్రామఫోను కంపెనీ వాళ్లు విడుదల చేస్తున్నారు. ఆవిష్కరించింది మరో లబ్ధ ప్రతిష్ఠుడైన నటుడు ! ఈయన గొప్ప మేధానియైన మహాకవి అని మొదటి రికార్డు ఈయనకి బహూకరిస్తున్నారు. ఈయన మాట్లాడే ధోరణి ఇదీ ! దీనికి కొందరు వికట విమర్శ చెయ్యవచ్చు. కాని ఆనాటి సభలో అంతా చప్పట్లతో ఈయన ఉపన్యాసాన్ని ఆమోదించినవారే! తర్వాత మీ ఇష్టం!
అలా కాకుండా సాహిత్యం మీదో, సంగీతం మీదో, ఉపనిషత్సారాంశం మీదో మాట్లాడాడనుకోండి! ఎవడు వింటాడు? ఎవడూ వినకపోతే ఈయన మీ విశ్వనాథ సత్యనారాయణగారెందుకవుతాడు?
ఆయన ఉపన్యాసం ఇంకా ఇలా సాగింది – “సరే! అదల్లా ఉంచితే నా మట్టుకు నేను భగవద్గీత సంపూర్ణంగా ఒక్కసారి కూడా చదవలేదు. ఈ రోజుల్లో తస్సా గొయ్య. ప్రతి బొడ్డూడని వాడూ భగవద్గీతకి వ్యాఖ్యానం వ్రాసేవాడేనాయె! అందులోని ఒక్క శ్లోకం సరిగ్గా ఒంటికి పట్టించుకుంటే ఈ జన్మకి చాలే! ఘంటసాల నా కెందుకు నచ్చాడంటే వ్యాఖ్యానాల వంటి పిచ్చి పనులు చెయ్యకుండా హాయిగా ఆ శ్లోకాలు సంగీతంలో ఆలపించాడు. అయితే ఇది అందరికీ నచ్చుతుందా అని ప్రశ్న. అన్నీ అందరికీ నచ్చాలని రూలెక్కడుంది? కె. ఎల్. సైగల్ అని ఉత్తరాదిన ఒక సినీ గాయకుడున్నాడు. అతని పాటంటే పడి చచ్చిపోయే వాళ్లు వేల మందున్నారు. కాని అతని సంగీతం నా కెప్పుడూ నచ్చేది కాదు. అంతమాత్రన అతని సంగీతం బాగుండనట్లేనా? అంతదాకా ఎందుకు? నా కవిత్వం చాలా మందికి నచ్చదు. అంతమాత్రం చేత నా కవిత్వాని కొచ్చిన నష్ట మేమీ లేదే! అలాగే ఈ రికార్డునూ ఇంకొక్క మాట. అమర గాయకుడు ఘంటసాల గురించి మీ అభిప్రాయం ఏమిటి? అని ఎవరో పత్రికల వాళ్లు నన్నడిగారు. దాని కొక్కటే నా సమాధానం: అతను అమర గాయకుడు. నాకు భూలోక గానం గురించే సరిగ్గా తెలీదు. ఇక అమర గానం గురించి నేనేం చెప్పను ? ఏది ఏమైనా, సంగీతమే వృత్తిగా బ్రతికిన ఒక జీవి – జీవిత చరమ దశలో భగవద్గీత పాడుతూ పోయినాడూ అంటే నిశ్చయంగా అతను ఉత్తమ లోకాలకే పోతాడు. కాదన్నవాడు నరకానికి పోతాడు ” అని ముగించాడు.
ఆయన ఉపన్యాసం అయిపోయిన తర్వాత హెచ్.ఎమ్.వి. కంపెనీ వాళ్లు మైకు ముందుకు వచ్చి “క్షమించాలి. వారి దగ్గర గ్రామఫోను లేదని మాకు తెలీదు. సభాముఖంగా మేము వారి కొక గ్రామఫోను బహూకరిస్తున్నాము” అని ఎనౌన్సు చేశారు.
సభలో చప్పట్లు దద్దరిల్లిపోయాయి. ఆయన హాల్లోంచి బయటికి వెళ్లి కారెక్కేదాకా ఒక్కళ్లు కదిలితే ఒట్టు.
A great thelugu poet and humerus speaker and 100/100 scholar Sri .Viswanadha