Thursday, January 2, 2025

కళాతపస్వికి పర్యాయపదం

  • దాదాసాహెబ్ పురస్కార గ్రహీత
  • అద్భుతమైన కళాత్మక, కథాత్మక చిత్రాల దర్శకుడు
  • భారతీయ సినిమాకి వన్నె తెచ్చినవాడు

‘కళాతపస్వి’ అనే దానికి పర్యాయపదం కె విశ్వనాథ్. ‘కె’ అంటే కాశీనాథుని అనే విషయం జగద్విదితం. అది ఆయన ఇంటిపేరు. కె’ అంటే కళాస్వరూపం అని కూడా అనుకుందాం. “తాను ఏ రంగాన్ని ఎంచుకుంటే అందులో అద్భుతమైన ఫలితాలను అందించాలని నిరంతరం ఎవరైతే తపన పడతారో వారే తపస్వి” ఈ మాటలు అన్నది ఎవరో కాదు! మహాకవి, మహాపండితుడు, బహుభాషావేత్త పుట్టపర్తి నారాయణాచార్యులు. ‘కళాతపస్వి’అనే బరువైన, పరువైన బిరుదును అందుకొనే అర్హత నాకు లేదంటూ విశ్వనాథ్ తటపటాయిస్తున్నప్పుడు పుట్టపర్తివారు చెప్పిన వాక్కులు, చేసిన వ్యాఖ్యలు సముచిత సుందరం. ఈ మాటలు వినగానే ధైర్యం వచ్చి ఆ బిరుదును స్వీకరించానని విశ్వనాథ్ తరచూ గుర్తుచేసుకుంటూ ఉంటారు. ‘కొప్పరపు కవుల ప్రతిభా పురస్కారం’ సమర్పిస్తున్న సందర్భంలోనూ ఆ పురస్కారాన్ని తీసుకొనే అర్హత నాకున్నదా? అంటూ విశ్వనాథ్ భయాన్ని, సంశయాన్ని వ్యక్తం చేశారు. అదే వేదికపైనున్న ‘సద్గురు’ కందుకూరి శివానందమూర్తి సమన్వయ పరుస్తూ ఇలా అన్నారు. “కొప్పరపు కవులు శబ్ద కావ్య నిర్మాతలైతే… మీరు దృశ్య కావ్య నిర్మాతలు, మీకు ఈ పురస్కారాన్ని గ్రహించే అర్హత సంపూర్ణంగా ఉంది.”  ఈ మాటలు విశ్వనాథ్ లో ఊపును, ఊపిరిని పోశాయి. ఈ సందర్భాన్ని కూడా వారు గురుతు తెచ్చుకుంటూ ఉంటారు.’అవధాన సరస్వతి’ పేరాల భరతశర్మ చేసిన విశ్లేషణాత్మక ప్రశంసావాక్యాలను కూడా ‘కళాతపస్వి’ తన మదిలో పదిలంగా నిలుపుకున్నారు. కొప్పరపు కవుల పురస్కార సంరంభంలోనే గరికిపాటి నరసింహారావు విశ్వనాథ్ పై అద్భుతమైన పద్యం చెప్పారు. ఆ పద్యం కూడా వారికి చాలా ఇష్టం.

Also read: రాహుల్ జైత్రయాత్ర

చాగంటి అద్భుత ప్రసంగం

‘శంకరాభరణం’ సినిమాపై చాగంటి కోటేశ్వరరావు హైదరాబాద్ సత్యసాయి నిగమాగమంలో మూడు రోజుల పాటు అద్భుతమైన ప్రసంగం చేశారు. మూడు రోజులు సరిపోవు, వారం రోజులు మాట్లాడినా తనివి తీరదు, ఎన్ని రోజులైనా మాట్లాడడానికి తాను సిద్ధంగా ఉన్నానని చాగంటివారు ప్రకటించి అద్భుతరీతిన ప్రశంసలు కురిపించారు. ఇలాంటి ఎన్నో సంఘటనలు, సందర్భాలు, సంరంభాలు విశ్వనాథ్ సినిమా విశ్వయాత్రలో ఉన్నాయి. కవిపండితులు, ప్రవచనకర్తల నుంచి ఆటో కార్మికుల వరకూ కె విశ్వనాథ్ సినిమాలను ఇష్టపడనివారు లేరు. ‘శంకరాభరణం’ ద్వారా తెలుగు సినిమాకు, భారతీయ చిత్ర ప్రపంచానికి ప్రపంచఖ్యాతిని తెచ్చిపెట్టిన ప్రథమ శ్రేణీయులు. ‘నర్తనశాల’ సినిమా తాష్కెంట్ చిత్రోత్సవంలో ప్రదర్శన పొంది అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించినా, ప్రపంచ సినిమా పటంపై ‘శంకరాభరణం’ వేసిన ముద్ర వేరు. దేవులపల్లి కృష్ణశాస్త్రి నుంచి సిరివెన్నెల సీతారామశాస్త్రి వరకూ ప్రతి గీత రచయితనూ అద్భుతంగా సద్వినియోగం చేసుకున్న కవికుల ప్రేమికుడు. ధారా రామనాథశాస్త్రి, మాడుగుల నాగఫణిశర్మ, సామవేదం షణ్ముఖశర్మ వంటి సంప్రదాయ పద్యకవులతో తన సినిమాలకు పాటలు రాయించుకున్న విలక్షణ ప్రతిభా పక్షపాతి. ‘శంకరాభరణం’ సినిమాకు వచ్చేవారు కొందరు చెప్పులు బయటవిడచి, ఆ సినిమా ధియేటర్ ను దేవాలయంగా భావించి ఎంతో భక్తితో సినిమాను చూసిన ఘట్టాలు భారతీయ సినిమా సీమలో ఏ గొప్ప భక్తి సినిమాకు కూడా జరుగలేదు.

Also read: అస్తమించిన ‘అపర సత్యభామ’

విశ్వనాథ్ అంటే శంకరాభరణం

కె విశ్వనాథ్ అనగానే మొట్టమొదటగా అన్ని తరాలవారికి జ్ఞప్తికి వచ్చేది ‘శంకరాభరణం’. ఆయన దర్శకత్వంలో వచ్చిన చాలా సినిమాలు ఆభరణాలే తొలి సినిమా ‘ఆత్మగౌరవం’ నుంచి ఆ ప్రతిభా ప్రభ నవ నవలాడుతూ వెలిగిపోతూనే ఉంది. తదనంతరం కళాత్మక సినిమాలు ఎక్కువ దర్శకత్వం వహించినా, తొలినాళ్లలో కథాత్మక సినిమాలు ఎన్నో నిర్మించారు. ఉండమ్మా బొట్టు పెడతా, జీవనజ్యోతి, శారద, నిండు హృదయాలు, కాలం మారింది, చెల్లెలి కాపురం, ఓ సీత కథ ఇలాంటి ఎన్నో వైవిధ్యమైన కథాంశాలు కలిగిన సినిమాలు తీసి తన ప్రతిభను చాటుకున్నారు. సిరి సిరి మువ్వలు, సీతామహాలక్ష్మి అద్భుతమైన పాటలు, మాటలు దృశ్యాలతో చరిత్ర సృష్టించాయి. విశ్వనాథ్ ఎన్నో ప్రయోగాలు, సాహసాలు చేశారు. ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘నిండు హృదయాలు’ ఆ కాలంలో మల్టీ స్టారర్ మూవీ. అందాలనటుడు, హీరో శోభన్ బాబుతో ‘చెల్లెలు కాపురం’ లో అందవిహీనమైన పాత్రలో నటింప జేశారు. ఫుల్ కమర్షియల్ హీరోగా సుప్రీంగా వెలిగిపోతున్న చిరంజీవితో ‘స్వయంకృషి’లో చెప్పులు కుట్టుకొనే పాత్ర ఇచ్చి, చిరంజీవిలోని అద్భుతమైన నటుడిని ఆవిష్కరించారు. చిరంజీవి తొలి నాళ్లలో వచ్చిన ‘శుభలేఖ’ కళా ఖండం. చిరంజీవిలోని నటనా ప్రతిభను తొలి అడుగుల్లోనే చూపించిన దార్శనికుడు మన ‘కళా తపస్వి’. సాగర సంగమం, స్వాతిముత్యం వంటి సినిమాల ద్వారా కమల్ హాసన్ ను సద్వినియోగం చేసుకున్న దర్శకత్రయంలో విశ్వనాథ్ ఒకరు. మిగిలిన ఇద్దరు బాలచందర్, సింగీతం శ్రీనివాసరావు.

Also read: ‘ఆస్కార్’లో చోటు దక్కిన నాటు నాటు…

విలన్ సత్యనారాయణతో కేరక్టర్ రోల్స్

విలన్ గా ప్రసిద్ధుడైన సత్యనారాయణతో క్యారెక్టర్ రోల్స్ వేయించి ఆయనలోని మిగిలిన రసాల ఆవిష్కరణకు అంకురార్పణ చేశారు. హీరో వెంకటేష్ కు ‘స్వర్ణకమలం’ అనే స్వర్ణాన్ని అందించి పుణ్యం మూటగట్టుకున్నారు. దర్శకేంద్రుడుగా ప్రసిద్ధుడైన కె రాఘవేంద్రరావు తన కాలేజీ డేస్ లో కాలేజీ ఎగ్గొట్టి కె విశ్వనాథ్ తీసిన సినిమాలకు వెళ్లానని చెప్పుకున్నారంటే కాశీనాథునివారు వేసిన ముద్ర అటువంటిది. ఎక్కడో రెవిన్యూ ఆఫీస్ లో పనిచేసుకుంటూ నాటకాలు వేసుకొనే మధ్య వయస్కుడైన సోమయాజులును తీసుకువచ్చి హీరోగా ‘శంకరాభరణం’ సినిమా తియ్యాలంటే ఎంత ధైర్యం ఉండాలి? హాటు హాటు పాత్రలు వేసే మంజుభార్గవితో ఉదాత్తమైన పాత్ర వేయించారంటే ఎంతటి దార్శనికత ఆయన సొత్తు. మంజుభార్గవి, భానుప్రియ వంటి సంప్రదాయ నృత్యమూర్తులను సంప్రదాయబద్ధంగా పాత్రలకు అన్వయం చేసిన తీరు అజరామారం. కె విశ్వనాథ్ సినిమా అంటేనే మధురమైన పాటలకు విలాసం. ఎక్కువ భాగం కెవి మహాదేవన్ ను సద్వినియోగం చేసుకున్నారు. ఆ తర్వాత స్థానం ఇళయరాజాదే. పాత్రలను నటులకు వివరిస్తున్న క్రమంలో ప్రతి పాత్రను ఆయనే నటించి చూపిస్తుంటే ఇంతకంటే మేమేమి నటించగలమని మహానటులు సైతం అనుకొనే వారు. అలా నటుడుగా మరో రూపం ఎత్తారు. ఆ సినిమా శుభ సంకల్పం. ఆయన సినిమాలోని చాలా పాటలకు తొలిగా పల్లవులను అందించి గీత రచయితలకు మార్గదర్శనం చేసిన దిగ్దర్శకుడు.

Also read: ఐటీ ఉద్యోగుల ఇక్కట్లు

గొప్ప నటుడు, గీతాకారుడు కూడా

విశ్వనాథ్ లో అద్భుతమైన దర్శకుడితో పాటు గొప్ప నటుడు, గొప్ప గీతాకారుడు కూడా ఉన్నారు. ‘కాశీ తత్త్వం’ పై ఆయన రాసిన పాటను చూస్తే వారిలోని తాత్త్వికత, కవితా బంధురతలు కనిపిస్తాయి. ప్రతిభను ప్రోత్సహించడం, భారతీయ కళా రూపాలకు పెద్దపీట వేయడం, కథను గౌరవించడం, సంగీత, సాహిత్యాలకు సమ ప్రాధాన్యతను ఇవ్వడం మొదలైనవి వారి విలక్షణ స్వరూపాలు. ఎన్నో బిరుదు సత్కారాలు ఆయన సిగలో జేరాయి. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన దాదా సాహెబ్ వరించింది. ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి ఆయనను మరో తండ్రిగా భావించారు. ‘శుభలేఖ’ సుధాకర్, ‘శంకరాభరణం’ రాజ్యలక్ష్మి మొదలు ఎందరికో విశ్వనాథ్ సినిమా పేర్లే ఇంటిపేర్లయి పోయాయి. హరిప్రసాద్ చౌరాసియా వంటి దిగ్దంత కళామూర్తులను తెలుగులో వినిపింపజేసిన విలక్షణమూర్తి. ‘సిరివెన్నెల’ సినిమా కూడా ఆయన చేసిన సాహసాల్లో ఒకటి. జమునకు గోదావరి మాటలు నేర్పించి, కృష్ణను ఎంపిక చేసి… ఇలాంటివి ఎన్నో చేశారు. సౌండ్ ఇంజినీర్ గా మొదలై తన కళాత్మక, కథాత్మక చిత్రాల ద్వారా విశ్వనాదం వినిపించిన విశ్వనాథ్ విశ్వరూపం నాలుగు మాటల్లో చెప్పలేం. ఆయనలోని దర్శకత్వ ప్రతిభను గుర్తించి, ఆదుర్తి సుబ్బారావుకు పరిచయం చేయడమే కాక,’ఆత్మగౌరవం’ సినిమా ద్వారా మొట్టమొదటగా దర్శకుడిగా విశ్వనాథ్ ను పరిచయం చేసిన అక్కినేని నాగేశ్వరావుకు కూడా మనం రుణపడాలి. 2 ఫిబ్రవరి 1980 వ తేదీన శంకరాభరణం విడుదలైంది. కాకతాళీయమైనా అదే రోజు మరణించి శివైక్యం చెందిన ధన్యజీవి. తొలి సినిమా ‘ఆత్మగౌరవం’ తోనే నంది పురస్కారాన్ని గెలుచుకున్న ధీమణి. వైవిధ్యాలకు, ప్రయోగాలకు, సంస్కరణలకు, సాహసాలకు, సంప్రదాయాలకు నిలయంగా మారిన వినూత్న కీర్తిశ్రీమంతుడు. ఆ మువ్వలు సవ్వడి చేస్తూనే ఉంటాయి, ఆ నాదం విశ్వనాదమై, విశ్వనాథమై వినిపిస్తూ, విహరిస్తూనే ఉంటాయి.

Also read: తగ్గుతున్న సంతానోత్పత్తి

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles