రామాయణమ్ – 14
మనస్సు అనేపుట్టలో చుట్టలు చుట్టుకొని పడుకొన్న కామము అనే సర్పానికున్న కోరలు పీకి ప్రశాంత చిత్తుడై మరల తపస్సు మొదలు పెట్టారు మహర్షి.
ఈయన తపస్సు మహోగ్రంగా పదివేల ఏళ్ళుసాగింది. ఈ సారి రంభను పంపాడు దేవేంద్రుడు తపస్సు భగ్నం చేయటానికి!
రంభ సౌందర్యానికి ఏ మాత్రం చలించక ఆవిడను కోపంతో శపించాడు.
Also read: బొందితో కైలాసం, త్రిశంకు స్వర్గం
వెనువెంటనే తన తప్పు తెలుసుకున్నాడు – అయ్యో క్రోధాన్ని జయించలేకపోతిని గదా అని! మరల తపస్సుకు పూనుకున్నాడు మహర్షి! ఇంకొక పదివేల ఏళ్ళు నిరాఘాటంగా సాగింది తపస్సు. కాస్త విరామమిచ్చి భోజనం చేయాలని సంకల్పించుకొని భోజనం సిద్ధం చేసుకున్నాడాయన.అన్నివేల ఏండ్ల తరువాత నకనకలాడే కడుపు పట్టెడన్నం కోరుతున్నది.
దేవేంద్రుడు మరల బ్రాహ్మడి వేషంలో వచ్చి యాచించాడు మహర్షి మారు మాటాడక తనకై సిద్ధం చేసుకున్న ఆహారాన్ని ఆయనకు సంతోషంగా సమర్పించి! మరల తపస్సుకు కూర్చున్నాడు.
Also read: వశిష్ట, విశ్వామిత్రుల సంఘర్షణ
ఈసారి తపస్సు చేసినప్పుడు ఆయన శరీరం నుండి జ్వాలలెగసి పడి ముల్లోకాలను దహించివేయసాగాయి! అప్పుడు బ్రహ్మ దేవుడు ప్రత్యక్షమై “నీవు బ్రహ్మర్షి వైనావు” అని పలికాడు. ఆ మాటలు ఆయనకు తృప్తినివ్వలేదు! వశిష్టుడే వచ్చి ఆ విషయం చెప్పాలన్నాడు. అంతలో వశిష్ట మహర్షి అక్కడ ప్రత్యక్షమై ఆయనను బ్రహ్మర్షీ అని సంబోధించాడు!
విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయినాడు!
ఆ రోజంతా వారికి విశ్వామిత్రమహర్షి కధలే. అబ్బ ఎంత ఉత్తేజకరంగా వున్నాయవి! ఎందుకుండవు? ఒక సాధారణ రాజు, ఒక మనిషి! హిమాలయాలకన్నా ఎత్తు ఎదిగి మహామనీషిగా మారిన కధలు ఎవరికి స్ఫూర్తి నివ్వవు? ఆ కధలలో మునిగి తేలారు అన్నదమ్ములిద్దరూ శతానందులవారు తీయతీయగా చెబుతూ వుంటే!
Also read: అహల్య శాపవిమోచనం
తదుపరి రోజు విశ్వామిత్రమహర్షి రాకుమారులిరువురినీ వెంటపెట్టుకొని యాగశాలకు తీసుకు వెళ్లాడు! జనకుడిని చూసి, రాజా నీవద్ద చాలా గొప్పదయిన శివధనుస్సు ఉన్నదటకదా! వీరిరువురకూ దానిని చూడాలని కుతూహలంగా ఉన్నది అని అడిగాడు!
సుర, అసుర, గరుడ, ఉరగ, కిన్నర, కింపురుషాదులుకూడా దానిని తాకి కదల్చలేకపోయినారు. అది సామాన్యమైన ధనుస్సుకాదని మీకు తెలుసు. ఈ ధనుస్సు మహాదేవుడు దక్షయజ్ఞమప్పుడు ఎక్కుపెట్టినది!
దానిని దాచివుంచమని నిమిచక్రవర్తికి ఇవ్వగా, అటనుండి నాకు ముందు ఆరవ తరమువాడైన దేవరాతుని వద్దకు చేరినది! నేను ఒకప్పుడు యజ్ఞము నిమిత్తము భూమిని పరిశుద్ధముచేయుటకు దున్నుచుండగా నాకు భూమియందు ఒక ఆడపిల్ల దొరికినది. ఆమె పేరు సీత. ఆవిడను వివాహమాడవలెనన్న పరాక్రమమే శుల్కము! (వీర్యశుల్క). ఈ ధనుస్సు ఎక్కపెట్టినవారినే ఆమె వరిస్తుంది!
ఎందరో మహావీరులైన రాజులు ఇప్పటిదాకా ప్రయత్నిస్తూనే వున్నారు! ఎక్కుపెట్టడం మాటదేవుడెరుగు! కనీసం ముట్టుకొని కదల్చలేకపోయినారు! అని జనకుడు పలికాడు.
Also read: భగీరథయత్నం, గంగావతరణం
బాలురవలే ఉన్న రామలక్ష్మణులను చూసి వీరు బాలురు. పైగా నరులు. వీరివల్ల సాధ్యమవుతుందా అని కూడా అనుమాన పడ్డాడు!
అయినా విశ్వామిత్రమహర్షి కోరికను ఆదేశముగా స్వీకరించి ఆ దివ్యధనుస్సును సభకు తెప్పించాడు జనకుడు!
ఆ ధనుస్సు సామాన్యమైనదా!
పది వేల మంది మహాయోధులైన వారు లాగుతుండగా, చక్రాల పెట్టెలో ఉంచిన ధనుస్సు అది! ఆ సభాప్రాంగణానికి తేబడింది!
ఆ ధనుస్సును మహర్షికి జనకుడు చూపగనే విశ్వామిత్రుడు రామునితో ‘‘నాయనా, ఇదిగో ఆ మహాధనుస్సు! దీనిని నీవు ఎక్కపెట్టు!’’ అని ఆదేశమిచ్చాడు. దానిని శిరసావహించి శ్రీరాముడు ధనుస్సును సమీపించాడు!
ఆ ధనుస్సు ఎలావుందంటే ! చిరకాలము భూమిని మోసి అలసి నిద్రిస్తున్న మహానాగుడైన ఆదిశేషుడిలాగ ఉన్నది! మేఘమండలంలోని కరిమబ్బులలో దాగి ఉన్న మెరుపులాగ ఉన్నది!
Also read: కపిల మునిపై సగరుల దాడి
రాముడు ధనుస్సును తాకబోతుంటే విశ్వామిత్రుడు శాంతివచనాలు చెపుతున్నాడు! ఓ భూదేవీ నీవు అదరకు. గుండెచిక్కబట్టుకో. రాముడు విల్లు ఎక్కుపెడుతున్నాడు! ఓ శేషాహి(ఆదిశేషుడు) నీవు ఉలికిపడి కదలకు! రాముడు విల్లు ఎక్కపెడుతున్నాడు! ఓ దిగ్గజాలలార (దిక్కులను మోసే ఏనుగులు) మీరు బెదిరి చెదరకండి. రాముడు విల్లు ఎక్కుపెడుతున్నాడు! ఓ లోకబాంధవుడా సూర్యుడా గడగడవణకబోకు. రాముడు విల్లు ఎక్కుపెడుతున్నాడు! ఓ జంతుసంతతులారా జడిసిపోకండి. రాముడు విల్లు ఎక్కుపెడుతున్నాడు!
శ్రీ రామచంద్రమూర్తి ధనుస్సుకు భక్తిపూర్వకముగా ప్రదక్షిణ చేసి దానిమీద చేయి ఆన్చాడు!
..
N.B..
నవజాత శిశువు మనస్సు ఏ విధమైన మకిలి లేకుండా చాలా స్వచ్ఛంగా ఉంటుంది!
ఎలాగంటే (ఇప్పటి తరాలకు తెలియదుగానీ) ఒక లాంతరు మొదట వెలిగించినప్పుడు దాని గ్లాసు స్వచ్ఛంగా ఉండి లాంతరు వెలుగు చాలా ప్రకాశవంతంగా వుంటుంది. సమయం గడుస్తూ వున్న కొద్దీ లాంతరు గ్లాసుకు మసి పడుతూ వుంటుంది. దీపం లోపట అంతే వెలుగుతో ప్రకాశిస్తున్నా బయటకు మాత్రం తేజోహీనంగా కనపడుతుంది! దీపపు వెలుతురు సరిగా కనపడాలంటే ఎప్పటికప్పుడు గ్లాసు శుభ్రం చేయాల్సిందే.
అదే విధంగా శిశువు పెరిగి పెద్ద అయ్యే క్రమంలో మనసుకు ఎన్నో వాసనలు అంటించుకుంటాడు! మనిషి లౌకిక జీవనంలో తన మనస్సుకు అంటిన మకిలిని ఎప్పటికప్పుడు పూజద్వారా గానీ ,ధ్యానం ద్వారా గానీ, మరింక ఇతరమైన ఏ పద్ధతులద్వారా అయినా సరే తొలగించుకుంటూ ఉండాలి. అలా తొలగించుకొని, మకిలిలేని మనస్సుకల ప్రతి మనిషి విశ్వానికి మిత్రుడు అవుతాడు ,విశ్వామిత్రుడు అవుతాడు!
రామాయణం లోని విశ్వామిత్ర చరిత్ర మనకు చెప్పేది అదే అని నా ఉద్దేశం.
Also read: మారీచ, సుబాహుల సంహారం
వూటుకూరు జానకిరామారావు