Sunday, December 22, 2024

యాగరక్షణకు రాముని తనతో అడవులకు పంపమని దశరథుడిని కోరిన విశ్వామిత్రుడు

రామాయణమ్ – 5 

కుశిక వంశీయుడు,గాధి కుమారుడు అయిన విశ్వామిత్రుడు వచ్చినాడని మీ రాజుకు ఎరుక పరచండి! మహారాజ దర్శనం కోరుతూ వచ్చిన ఒక మునిపుంగవుడు పలికిన పలుకులివి.

ద్వారపాలకులు ఆ వచ్చిన వ్యక్తిని చూచి భయముతో వణకిపోయి దశరథ సముఖమునకు శీఘ్రమే చేరి మహర్షి విశ్వామిత్రుని ఆగమనాన్ని ఆయనకు తెలిపినారు!

అంతటి పరమపూజనీయుడయిన మహర్షి తన నగరుకు రావటాన్ని తన పుణ్యఫలంగా భావించిన దశరథుడు ఆయనకు ఎదురేగి అర్ఘ్యపాద్యాదులనిచ్చి ఒక ఉచిత ఆసనం మీద కూర్చుండబెట్టి  అంజలిఘటించి వినయంగా నిలుచున్నాడు.

Also read: శ్రీరామ జననం

మహారాజు వినయ విధేయతలకు సంతసించిన మహర్షి  కుశలప్రశ్నలు వేసి అందరి క్షేమము విచారించినాడు!.

మహర్షి ఎదుట నిలుచున్న దశరథుడు ఆయన రాకలోని ఆంతర్యమేమిటో తెలియనివాడై ,మహర్షిని ఏ పని మీద మీరు ఇచటికి వచ్చినారో సెలవిండు , ‘మీ కార్యము ఎటువంటిదైనా తప్పక నెరవేర్చెదను, నా వద్దనున్న సమస్తము మీ పాదాక్రాంతము చేయుచున్నాను మీ కేమి కావలుయునో తీసుకొనుడు’ అని సవినయంగా ప్రార్ధించాడు.

అప్పుడు బ్రహ్మర్షి తాను వచ్చిన పని బయటపెట్టాడు !

మహర్షి కోరిక తెలుసుకొని ఒక్కసారిగా నవనాడులూ కృంగిపోయి, జవసత్వాలుడిగినవానిలాగా నీరసించాడు దశరథుడు!

ఆ కోరిక ఏమై ఉంటుంది? .

మహారాజును పంచప్రాణాలు అడిగినా సంతోషంగా అప్పటికప్పుడు ఇచ్చేవాడు,

కానీ ఆయన అడిగింది శ్రీరాముని తనతో పంపమని !

 క్రూర, ఘోర రాక్షసులైన మారీచ, సుబాహులనుండి మహర్షి చేసే యాగాన్ని రక్షించడం కోసం ముక్కుపచ్చలారని తన ముద్దుబిడ్డడిని పంపాలట!

మహర్షి కోరిక వినగానే మ్రాన్పడిపోయాడు దశరథుడు!

మహర్షి కోరిక ఆయన హృదయాన్ని నిలువునా కత్తితో చీల్చినట్లయినది. తన ముద్దులమూట,  ముక్కుపచ్చలారని పసికూన, నిండా పదహారు నిండనివాడు, అరవిచ్చిన తామరల వంటి కన్నులుగల తన గారాలపట్టిని ఈ మహర్షివెంట అడవులకు పంపడమా! మనసు ససేమిరా అంటున్నది!

మహారాజు మదిలోని ఆలోచనలు పసిగట్టిన మహర్షి!

దశరథా !

రాముని గురించి నీ కేమి తెలుసని అలా ఆలోచిస్తున్నావు!

అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమమ్

వసిష్టోపి మహాతేజా యే చేమే తపసి స్థితాః.

రాముడెవరో నాకు తెలియును, నీ కుల గురువైన వసిష్ఠునకు తెలియును, ఈ ముని సంఘాలకూ తెలియును!

రామునికి తప్ప నా కార్యము చేయుటలో ఎవరికినీ సామర్ధ్యము లేదు! రాముని ఎదుట మారీచ, సుబాహులు ఏవిధముగనూ నిలువజాలరు!

న చ తౌ రామమాసాద్య శక్తౌ స్థాతుం కథం చన!

అని ఇంకా చెపుతున్నారు మహర్షి!..

విశ్వామిత్రమహర్షి మాటలు విన్నాడు దశరథుడు.

మనసొప్పటంలేదు ఆయనకు! ఇలా అంటున్నాడు!

ఊన షోడశ వర్షేణ రామో రాజీవ లోచనః

న యుద్ధయోగ్యతామస్య పశ్యామి సహ రాక్షసైః

రాజీవ లోచనుడైన నా రామునకు పదహారు సంవత్సరాలు ఇంకారాలేదు ( పదహారుకు ఒకటి తక్కువ , ఊన అంటే -1)

రాక్షసులతో యుద్ధం చేసే యోగ్యత ఉన్నదని నేను అనుకోవడంలేదు!

Also read: దశరధ కుమారుడిగా అవతరిస్తానని దేవతలకు హామీ ఇచ్చిన విష్ణు

నా రాముడు ఇంకా బాలుడయ్యా! పూర్తిగా ఇంకా విద్యలే నేర్వలేదు! అస్త్రాలు ఇంకా తెలువవు! అలాంటి వాడు మాయావులైన రాక్షసులతో ఎలా యుద్ధం చేయగలడు! కోరి కోరి కొడుకును కొలిమిలో ఎవరైనా నెట్టివేస్తారా!.

మహర్షీ నేనే ధనుస్సు ధరించి మీవెంట నడుస్తాను, నా వెంట మెరికల్లాంటి యోధులు ఒక అక్షౌహిణి సైన్యం నడుస్తుంది!

మీ యాగసంరక్షణ నేనుగావిస్తాను మునీంద్రా!

నా రాముడు బాలుడు! ముక్కుపచ్చలారని ముద్దుబిడ్డడు వాడిని విడచి ఒక్కక్షణమైనా నేను బ్రతుకజాలను!

అంతగా నీకు రాముడే కావలెనంటే అతనితోపాటు నన్ను నా చతురంగబలాలనూ కూడా తీసుకొని వెళ్ళు.  అంతేకానీ ఒంటరిగా రాముని నే పంపజాలను!

మునిచంద్రా అసలు ఆ రాక్షసులు ఎవరు? ఎవరు పంపగా వారు నీ యాగానికి విఘ్నం గావిస్తున్నారు?

రాజా ఆ రాక్షసులు రావణాసురుడు పంపగా వచ్చినవారు. రావణుడు బ్రహ్మవరప్రసాది! విశ్రవసు పుత్రుడు!

వాడిచే ప్రేరేపింపబడి మారీచ సుబాహులనెడి వారు యజ్ఞవిఘ్నానికి పూనుకొన్నారు!

అసలు విషయం వినగానే దశరథ మహారాజు తీవ్రమైన వేదనకు గురి అయి మహర్షీ! దేవ, దానవ,యక్ష, గంధర్వ, పతగ, పన్నగులలో రావణుని ఎదిరించువారులేరే ! నా పసికూన రాముని, వానికి ఎదురు వెళ్ళమంటావా! నన్ను క‌నికరించు మహర్షీ! నా కొడుకు పట్ల అనుగ్రహము చూపు!

మహర్షీ ! అంతటి బలవంతుడికి నేను గానీ, నా సైన్యముగానీ ,నా కుమారుడుగానీ ఎదురునిలవలేము. యుద్ధము చేయజాలము!

ఆ మారీచ ,సుబాహులు మాయావులు మహాబలవంతులు వారిలో నా స్నేహితులతో కలసికూడా ఎవరో ఒకరితోనే తలపడగలను. అలాంటిది ఇద్దరితో  తలపడమని రాముని పంపటమా!

 నా వల్ల కాదు! పంపనుగాక పంపను ! అని ఖండితముగా పలికాడు దశరధుడు!

దశరధుడి ఈ అసంబద్ధ ప్రేలాపనలు విని మహర్షి ఒక్కసారిగా తోకతొక్కిన త్రాచు అయినాడు! యజ్ఞ కుండంలో నేయివోయగా భగ్గున లేచిన పెనుమంట అయినాడు ,తీవ్రమైన కోపంతో కనులు అరుణ వర్ణం దాల్చాయి!

‘‘అడిగినది ఇస్తానని ప్రతిజ్ఞ చేసి మాట తప్పుతున్నావ్ దశరథా! ఇది రఘువంశ సంజాతులు చేయవలసిన పనికాదు! సరే నీ కొడుకుతో, బంధుమిత్రులతో సుఖంగా ఉండు! వచ్చిన దారినే నే వెడతాను’’ అని తీవ్రమైన ఆగ్రహావేశాలతో కంపించిపోయాడు!.

Also read: రామకథ రచించమని వాల్మీకికి విరించి ఉద్బోధ

విశ్వామిత్రుని గురించి సకలము తెలిసిన మహర్షి వసిష్ఠుడు కల్పించుకొని ‘‘రాజా ! నీవు ఇక్ష్వాకుడవు ! నీ వంశమెట్టిది? లోకంలో మీరే ఆడిన మాట తప్పితే ఇంక మాటమీద నిలబడే వారెవరయ్యా! నీ మనసులో ఏ విధమైన శంకకు తావివ్వకు. రాముని విశ్వామిత్రునితో యాగసంరక్షణార్ధమై పంపు! ఈ విశ్వామిత్రుడెవరనుకొన్నావు? ఈయన సంరక్షణ లొనున్న రామునికి అస్త్రములు తెలిస్తే నేమి? తెలియకున్న నేమి? విశ్వామిత్రుడు మూర్తీభవించిన ధర్మము! పరాక్రమవంతులలో శ్రేష్టమైన వాడు! ఈయనకు తెలిసినన్ని అస్త్రములు సకలభువనాలలో ఎవరికీ తెలియవు! మరి భవిష్యత్తులో కూడా ఈయనకంటే ఎక్కువగా ఎవరికీ తెలవవు! ఈయనకు తెలిసిన శస్త్రాస్త్రాలెలాంటివో చెపుతాను విను!’’

Also read: రామాయణం -1

-వూటుకూరు జానకిరామారావు

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles