- వైజాగ్ స్టీల్ లో ఏపీకి హక్కులేదన్న కేంద్రం
- ప్రైవేటీకరణ కచ్చితంగా ఉంటుందన్న నిర్మలా సీతారామన్
- రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ వాటాలూ విక్రయం
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గేదిలేదని మరోమారు స్పష్టం చేసింది. పలు కార్మిక, ప్రజాసంఘాలు రాజకీయ పార్టీలు ఆందోళనల చేస్తున్నా కేంద్రం కనికరించలేదు. ప్రైవేటీకరణ మాత్రం జరిగే తీరుతుందని లోక సభలో ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో కేంద్ర ప్రభుత్వానికి ఉన్న వాటాలతో పాటు ఆ ప్లాంటు అనుబంధ సంస్థలు, సంయుక్త భాగస్వామ్య సంస్థల్లో రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ కు ఉన్న వాటాలను పూర్తిగా విక్రయిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ స్పష్టం చేశారు. ఈ మేరకు జనవరి 27న కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదముద్ర వేసినట్లు ఆమె తెలిపారు.
ఉత్పత్తి పెంచేందుకే ప్రైవేటీకరణ:
పార్లమెంటు సమావేశాల సందర్భంగా విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై లోక్ సభలో వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఆంధ్రప్రదేశ్ కు ఈక్విటీ షేర్ లేదని నూటికి నూరు శాతం పెట్టుబడులు ఉపసంహరిస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. మెరుగైన ఉత్పాదకత కోసమే విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తున్నట్లు తెలిపారు. భాగస్వాములు, ఉద్యోగులు, షేర్లు కొనుగోలు చేసేలా ప్రత్యేక ప్రతిపాదనలు చేశామని తెలిపారు. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ లో రాష్ట్రానికి వాటా లేకపోయినప్పటికీ అవసరం మేరకు ఏపీ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామన్న నిర్మలా సీతారామన్ ప్రభుత్వ జోక్యం అవసరమైతే కోరుతున్నామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: ఉక్కు సంకల్పమే శరణ్యం
కూర్మన్న పాలెం హైవేపై ఆందోళన :
మరోవైపు పార్లమెంటులో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రక్రియ కొనసాగుతుందని నిర్మలా సీతారామన్ ప్రకటించడంతో ఏపీలో కార్మిక సంఘాలు భగ్గుమన్నాయి. కేంద్ర ప్రభుత్వ ప్రకటనపై విశాఖలోని కూర్మన్న పాలెం వద్ద పలు ప్రజా, కార్మిక సంఘాలు రాస్తారోకో చేపట్టాయి. నేతలు జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ప్రైవేటీకరణ నిర్ణయం వెనక్కి తీసుకోవాలి:
కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు ఆందోళన కొనసాగిస్తామని కార్మిక సంఘాల నేతలు స్పష్టం చేశారు. మలిదశ ఉద్యమానికి ప్రజలంతా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఆంధ్రులను కేంద్ర ప్రభుత్వం అవమానించిందని అవసరమైతే రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేయటానికి సిద్ధంగా ఉండాలని కార్మిక సంఘాల నేతలు కోరారు.
విశాఖ ఉక్కు ఆస్తుల విలువ 32 వేల కోట్లు :
విశాఖ ఉక్కు పరిశ్రమ ఆస్తుల స్థూల విలువ సుమారు 32 వేల కోట్లని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. లోక్ సభలో టీడీపీ, వైసీపీ ఎంపీలు కింజారపు రామ్మోహన్ నాయుడు, వల్లభనేని బాలశౌరి, మార్గాని భరత్ లు సంయుక్తంగా అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. సంస్థకు చెందిన భూములు, ప్లాంట్, యంత్ర పరికరాలు, చరాస్తుల విలువ 2020 డిసెంబరు 31 నాటికి సుమారు 32 వేల కోట్లని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: సమష్టి పోరాటమే విశాఖ ఉక్కుకు శ్రీరామరక్ష