- కేంద్ర ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానించాలి
- ముఖ్యమంత్రి జగన్ మెహన్ రెడ్డి చొరవ తీసుకోవాలి
- ఏ నాయకుడూ నోరెత్తి కేంద్రాన్ని ప్రశ్నించకపోవడం ఆంధ్రుల దురదృష్టం
- ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విశాఖ ఉక్కు ఉద్యమంలో భాగస్వామి
ఆంధ్రప్రదేశ్ లో విశాఖ ఉక్కు కార్మాగారం పరిరక్షణ ఉద్యమం తీవ్రతరమవుతోంది. బీజేపీ మినహా అన్ని రాజకీయ పక్షాలూ, ప్రజాసంఘాలూ, కార్మిక సంఘాలూ అండగా నిలుస్తున్నాయి. విశాఖ ఉక్కు కేవలం ఉపాధి కల్పనా కేంద్రమో, విశాఖకే పరిమితమైనదో కాదనీ, 32 మంది ఆత్మార్పణతో సాధించుకున్న ఆంధ్రుల ఆత్మాభిమానమనీ నినదిస్తున్నారు. ప్రైవేటీకరణకు పరిశ్రమలోని నష్టాలను సాకుగా చూపుతున్నారని, కానీ, గనులు లేకపోవడ వల్లే కార్మాగారం నష్టాలను ఎదుర్కొంటోది తప్ప సంస్థాగతంగా ఎలాంటి లోపాలు లేవని చెబుతున్నారు. ఏ ఒక్క నాయకుడూ కేంద్ర ప్రతిపాదనను వ్యతిరేకించకపోవడం, ఉద్యమంలో భాగస్వామి కాకపోవడం ఆంధ్రుల దురదృష్టమని వారు వ్యాఖ్యానించారు.
రాష్ట్రానికి ఏ రూపంలో చూసిన అన్యాయమే జరుగుతోందనీ, రాష్ట్ర విభజన చట్టంలో ప్రతిపాదించిన హామీలు అమలు అటుంచి ఉన్నవాటిని కోల్పోవలసి వస్తోందనే అందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి తీరుతో రాష్ట్రానికి పరిశ్రమలు రాకపోగా ఉన్నవే తరలిపోతున్నాయని విమర్శించిన బీజేపీ నాయకులు తాజా పరిణామాలకు ఎలా స్పందిస్తారని ప్రశ్నిస్తున్నారు. విశాఖకు రైల్వే జోన్ రాకపోగా, ఎన్నో త్యాగాలతో సాధించుకున్న `ఉక్కు` చేతులు మారనుండడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏపీకి సంబంధించిన అంశాలలో ఇంత సులువుగా నిర్ణయాలు తీసుకుంటున్నవారు ఇతర రాష్ట్రాల విషయంలో అలా వ్యవహరిస్తారా? వ్యవహరించగలరా?అని ప్రశ్నలు వస్తున్నాయి. అయినదానికీ కానిదానికీ తెలుగుదేశం పార్టీ (తెదేపా)ని విమర్శించే బీజేపీ రాష్ట్ర పెద్దలు `ఉక్కు` విషయంలో స్పందించాలని ఆ పార్టీ సహా కార్మిక, ప్రజా సంఘాలు పట్టుపడుతున్నాయి. `నోటా`కంటే తక్కువ ఓట్లు వస్తాయనే విమర్శలను తట్టుకోలేనివారు తాజా పరిణామాల నేపథ్యంలో ఎలా కుదురుకోగలరు? అని అంటున్నారు.
Also Read: మళ్ళీ విశాఖ ఉక్కు ఉద్యమం
అవసరమైతే రాజీనామా
విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ బారి నుంచి కాపాడేందుకు అవసరమైతే తన పదవికి రాజీనామా చేస్తానని విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ప్రకటించారు. ప్రభుత్వ నిర్ణయాలను అడ్డుకునే క్రమంలో కార్మిక సంఘం నాయకులతో ప్రధాని, ఆర్థిక మంత్రులను కలుస్తామని చెప్పారు.
`సుజనా` వ్యాఖ్యలకు ఆగ్రహం
కర్మాగారం భాగస్వాముల ప్రయోజనాల కోసం ప్రైవేటీకరణ ప్రతిపాదన అనీ, తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు ఆందోళన చేసినంత మాత్రాన ప్రైవేటీకరణ ప్రక్రియ ఆగదనీ బీజేపీ నాయకుడు సుజనాచౌదరి వ్యాఖ్యలు మరింత ఆగ్రహం కలిగిస్తున్నాయంటున్నారు. రాష్ట్రానికి చెందిన వ్యక్తే అలా అంటే ఇక చేసేదేముంటుందని అంటున్నారు.`మనం ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు, పార్లమెంట్ సభ్యులు మన కోసం ఆలోచిస్తూ, మనకోసం పోరాడుతున్నారనుకోవడం అడియాసే. స్వప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రయోజనాలు మిన్నని వారు గ్రహించేంతవరకు మన గతి ఇంతే` అంటూ ఆ రాష్ట్ర శాసనసభ మాజీ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్ వ్యాఖ్యానించారు. `తెలుగువారిలో చేవచచ్చిందా?`అని ఘాటుగానే ప్రశ్నించారు. `విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు`అని కొట్లాడి సాధించుకున్న దానిని పరులపాలు చేయాలనుకోవడం శోచనీయమని తెలంగాణ కాంగ్రెస్ నేత, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్షయ్య అన్నారు. నాటి ఉద్యమంలో ప్రస్తుత ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు కూడా పాల్గొన్నారని గుర్తు చేశారు.
`ఉక్కు` భవిత సీఎం చేతుల్లోనే
రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలించాలనుకుంటున్న ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి విశాఖ ఉక్కు కర్మాగారం పరిరక్షణ విషయంలో అంతే చిత్తశుద్ధి చూపాలని కోరుతున్నారు. శాసనభలో తీర్మానం చేసి ప్రైవేటీకరణను అడ్డుకోవాలని సూచిస్తున్నారు. తిరువనంతపురం విమానాశ్రయం, సేలం ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిర్ణాయకలు వ్యతిరేకంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు శాసనసభల్లో ఏకగ్రీవ తీర్మానాలు చేశాయని బీజేపీ మిత్రపక్షం జనసేన గుర్తుచేసింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ దిశలో వెళ్లాలని జనసేన రాష్ట్ర వ్యవహారాల కమిటీ సభ్యుడు, `ఉక్కు` మాజీ అధికారి కోన తాతారావు కోరారు.
Also Read: ఆదర్శ సభాపతి అనంత శయనం
విలువైన ఆస్తి కారుచౌకగా….
`బలే మంచి చౌక బేరము..`అన్నట్లు లక్షల కోట్ల రూపాయల విలువైన పరిశ్రమను వందల కోట్లకు ధారాదత్తం చేయాలనుకుంటున్నారని నిరసన వ్యక్తమవుతోంది. సుమారు 23 వేల ఎకరాల్లో విస్తరించి, 7.7 మిటియన్ టన్నుల సామర్థ్యంతో నడుస్తున్న రూ. 2 లక్షల క కోట్లకు పైగా విలువగల సంస్థను కేవలం తక్కువ మొత్తానికి ఎలా ఇవ్వజూపుతారని ఆందోళనకారులు నిలదీస్తున్నారు.