రామాయణమ్ – 206
పెనిమిటి పోయికొందరు
కుటుంబ పెన్నిధి పోయి కొందరు
తోడబుట్టినవాడు పోయి కొందరు
తోడివారు పోయి కొందరు
తలకొరివి పెట్టు వారు పోయి కొందరు
లంకానగర స్త్రీలందరూ అనాధలై అతిదీనముగా విలపించసాగిరి.
‘‘ఈ ముసలిముండకు దసరాపండుగ కావలసివచ్చెనా? దీనికి సుకుమారుడు రాకుమారుడు లోకోత్తరవీరుడైన రాముడు కావలసివచ్చెనా?
Also read: రాముడి చేతిలో రాక్షస సంహారం
‘‘దాని కామాగ్ని రగిల్చిన చితిమంటలలో నేడు లంకాపురి మొత్తము తగులబడుచున్నదే. అయ్యో! ముసలి దానా, నీ ముఖము ముడుతలు పడ్డది. నీ తలపండి ముగ్గుబుట్ట అయినది. ఏల నీకు కామ వికారము కలిగినది? కలిగెనుపో. ఓసి శూర్పణఖా, నీకు రాముడే కావలసి వచ్చెనా? ‘‘అయ్యో రావణా, వేదవేదాంగవేత్తవే, వ్యాకరణపండితుడవే, ఎచటికి పోయెనయ్యా నీ విద్వత్తు? ఏ గంగలో కలసినది నీ వివేకము?
‘‘ఖరుడు పోయినాడు. త్రిశిరుడు పోయినాడు. దూషణుడు పోయినాడు. అప్పుడైనా ఎరుకపడలేదా రాముడు ఏపాటి వీరుడో! రామునితో అంతములేని ఈ వైరము రాక్షసాంతమునకే వచ్చినది. ఒక్క నిదర్శనము చాలదా! విరాధుడు సీతాపరిష్వంగము కోరి మృత్యువు గాఢపరిష్వంగములోకి జారినపుడైనా తెలియరాలేదా? రామ క్రోధాగ్నిలో కబంధుడు మాడి మసి అయినప్పుడు తెలియరాలేదా? ఇంద్రసుతుడు వాలి. మేరుపర్వత సమానుడు. రామునిబాణముతో నేలకూలినాడని తెలిసినప్పుడు తెలియరాలేదా? హీనుడై కడుదీనుడై విలపించు సుగ్రీవుని రాజును చేసిన మగటిమి కలవాడు, మేటిపోటరి రాముడని తెలియరాలేదా?
Also read: ఇంద్రజిత్తును కూల్చివేసిన లక్ష్మణుడు
‘‘ధర్మాత్ముడైన నీ తోడబుట్టినవాడు విభీషణుడు చెప్పిన హితవు ఏల నీ తలకెక్కలేదు. సరే !యుద్ధములో ఒకరొకరుగా మహాయోధులు నేలకూలుతున్నప్పడైనా తెలియరాలేదా? నిప్పును బట్టలో చుట్టుకొను వాడెవడైనా ఉన్నాడా?
‘‘ఇక ఆ సీతమ్మ ప్రళయాగ్నిజ్వాల లంకను కాల్చివేయక మానదు. సుతుడు పోయినాడు, హితుడుపోయినాడు, మిత్రుడు పోయినాడు, మొగుడు పోయినాడు అని విలపించని అతివలేదు.ఆ రాముడు రుద్రుడా? వీరభద్రుడా? లేక నూరుయజ్ఞములు చేసిన దేవేంద్రుడా? ఎవరైన నేమి మనపాలిటి కాలయముడు.’’
రాక్షస స్త్రీలందరూ పరస్పరము కౌగలించుకొని దుఃఖితలై, భయపీడితులై అంతులేని దిగులు మానసములాక్రమించగా దిక్కులుపిక్కటిల్లునట్లుగా రోదించసాగిరి.
Also read: ఇంద్రజిత్తుతో తలబడిన రామానుజుడు
….
మహోదరా, మహాపార్శ్వా, విరూపాక్షా బయలు దేరండి రణభేరిమ్రోగించండి రాముని కడతేర్చండి. అతివల ఆర్తనాదములు నా హృదయములో ప్రతీకారేచ్ఛను రగులుకొల్పుచున్నవి.
భర్తపోయి, సోదరుడుపోయి, సుతుడుపోయి వలవల ఏడ్చుచున్న రాక్షసస్త్రీల హృదయవేదన రామలక్ష్మణుల మృతితో తీరిపోవును. ఇదుగో వారిని ఇప్పుడే నా శరవర్షములో ముంచి వేసి ఉక్కిరిబిక్కిరి కావించి కాటికి సాగనంపెదను.
రండి నా వెనుక
కదలండి కదనానికి !
ప్రళయమేఘంలాగర్జించండి,ఉప్పెనలా ముంచెత్తండి. రండి నా తో!
భీకర గర్జనలు, భీషణ ప్రతిజ్ఞలు చేయుచూ రావణసేన ముందుకు కదిలింది.
ఇక జరగబోవు యుద్ధమును చూచుట నావల్ల కాదన్నట్లుగా సూర్యభగవానుడు తన తేజస్సును తగ్గించి కాంతిహీనుడయ్యెను. గుర్రములు నడకలో తొట్రుపడినవి. గ్రద్దలు ధ్వజములపై వాలినవి. నక్కలు ఘోరముగా ఊళలు వేయసాగినవి. కాకుల కూతలు వినపడుచుండెను. దారిలో ఎన్నో ఉత్పాతములు, ఉల్కాపాతములు జరిగినవి వేటినీ లక్ష్యపెట్టక రావణుడు రామలక్ష్మణులున్న చోటికే సరాసరి తన రధమును పోనిమ్మని సారధిని ఆజ్ఞాపించెను.
వచ్చు దారిలో రావణుడు శరవర్షము కురిపించుచూ వానరసైన్యమును ముంచెత్తెను. ఏ దిక్కుకు ధనుస్సు వంగినదో ఆ దిక్కున వానరమూకల శవాలగుట్టలు క్షణములో ప్రత్యక్షమాయెను.
అదిచూసి సుగ్రీవుడు ఒక మహాశైలమును చేతబూని శిలావర్షముకురిపించగా వాటిక్రింద నలిగి రాక్షసులు నామరూపములు లేకుండా పోయిరి.
Also read: మాయాసీత మరణవార్త విని కుప్పకూలిన రాముడు
అంత విరూపాక్షుడు అదిచూసి తీవ్రమైన వేగముతో సుగ్రీవుని ఢీకొట్టి ముఖాముఖి తలపడెను. హోరాహోరీ బాహాబాహీ యుద్ధము ఇరువురి మధ్య జరిగెను. వారి ముష్టిఘాతములు పిడుగులవలే యుండెను. సుగ్రీవుడు ఒడుపుగా విరూపాక్షుని వెనుకజేరి ఆతనిమెడమీద ఒక ఘోరప్రహారము కావించెను. అది వేయిమణుగుల శక్తితో అతనిని తాకెను. అంతవిరూపాక్షుడు విరూపుడై నేలమీదపడి రక్తము గ్రక్కుచూ ప్రాణములు వదిలిపెట్టెను.
రావణుడు మహోదరుని వైపు చూసి, ‘‘వీరుడా విజృంభింపుము!’’ అని ప్రోత్సహించెను.
Also read: మాయాసీతతో రణరంగానికి వచ్చిన ఇంద్రజిత్తు
వూటుకూరు జానకిరామారావు