Thursday, November 7, 2024

వినుము వినుము విరాట్ డకౌట్ల గాథ!

  • టెస్టు క్రికెట్లో కొహ్లీ 11వ డకౌట్
  • స్పిన్ బౌలింగ్ లో తొలిసారి డకౌట్

ఆధునిక క్రికెట్లో తరచూ శతకాలతో వార్తల్లో వ్యక్తిగా నిలిచే భారత కెప్టెన్, ప్రపంచ మేటి బ్యాట్స్ మన్ విరాట్ కొహ్లీ డకౌట్లకూ కేంద్రబిందువుగా మారాడు. చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండోటెస్టు తొలిరోజుఆటలో యువఓపెనర్ శుభ్ మన్ గిల్ డకౌటైన వెంటనే క్రీజులోకి వచ్చిన విరాట్ కొహ్లీని ఆఫ్ స్పిన్నర్ మోయిన్ అలీ డకౌట్ గా పడగొట్టాడు. ఐదు బాల్స్ మాత్రమే ఎదుర్కొన్న కొహ్లీ ఒక్క పరుగూ చేయకుండానే బౌల్డయ్యాడు. పైగా తాను అవుట్ కాలేదన్నట్లుగా క్రీజులోనే నిలబడి పోయాడు. బౌల్డ్ అయినట్లుగా అంపైర్ ప్రకటించిన తర్వాతే పెవీలియన్ కు తిరిగి వచ్చాడు. భారత గడ్డపై ఆడిన టెస్టుమ్యాచ్ ల్లో కొహ్లీకి ఇదే తొలిడకౌట్ కాగా 2014 తర్వాత తొలిసారిగా పరుగులేవీ చేయకుండానే పెవీలియన్ దారి పట్టాడు.

తొలి స్పిన్నర్ మోయిన్ అలీ

సాంప్రదాయ టెస్టు క్రికెట్లో విరాట్ కొహ్లీ డకౌట్ కావడం ఇదే మొదటిసారికాదు. ప్రస్తుత టెస్టుకు ముందు వరకూ పదిసార్లు డకౌట్ గా వెనుదిరిగిన రికార్డు కొహ్లీకి ఉంది. అయితే ఓ స్పిన్నర్ బౌలింగ్ లో పరుగులేవీ చేయకుండా వెనుదిరిగడం ఇదే మొదటిసారి. టెస్టు క్రికెట్లో కొహ్లీని డకౌట్ చేసిన స్పిన్ బౌలర్ గా మోయిన్ అలీ రికార్డుల్లో చేరాడు. కొహ్లీని డకౌట్ చేసిన బౌలర్లలో కరీబియన్ పేసర్  రవి రాంపాల్‌, కంగారూ సీమర్ బెన్‌ హిల్పెనాస్‌, ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ లియాన్‌ ఫ్లంకెట్‌, స్వింగ్ కింగ్ జేమ్స్‌ అండర్సన్‌, మిచెల్‌ స్టార్క్‌, సురంగ లక్మల్‌, స్టువర్ట్‌ బ్రాడ్‌, పాట్‌ కమిన్స్‌, కీమర్‌ రోచ్‌, అబి జావెద్‌లు ఉన్నారు. వీరందరూ ఫాస్ట్‌ బౌలర్లే కావడం విశేషం. అయితే… కోహ్లిని డకౌట్‌ చేసిన ఏకైక స్పిన్నర్ మోయిన్ అలీ మాత్రమే.

ఇదీ చదవండి: చెపాక్ లో రోహిత్ షో

మూడు ఫార్మాట్లలోనూ 26 డకౌట్లు

తన కెరియర్ లో ప్రస్తుత చెన్నై మ్యాచ్ వరకూ 89 టెస్టులు, 251 వన్డేలు, 85 టీ-20 మ్యాచ్ లు ఆడి 70 శతకాలు, 19వేలకు పైగా పరుగులు సాధించిన కోహ్లికి మొత్తం 26 డకౌట్లున్నాయి. భారత టెస్టు కెప్టెన్‌గా ఉంటూ అత్యధికసార్లు డకౌటైన రెండో ఆటగాడిగా కోహ్లి చెత్త రికార్డును మూటగట్టుకొన్నాడు. మహేంద్ర సింగ్ ధోనీ తర్వాతి స్థానంలో నిలిచాడు. భారత కెప్టెన్ గా అత్యధికంగా 13 డకౌట్ల రికార్డు సౌరవ్‌ గంగూలీ పేరుతో ఉంది. గత 14 మాసాలుగా మూడంకెల స్కోరు లేక వెలవెలబోతున్న విరాట్ కొహ్లీ ప్రస్తుత సిరీస్ లోని చెన్నై తొలిటెస్టు రెండో ఇన్నింగ్స్ లో 72 పరుగుల స్కోరుతో ఫామ్ ను అందిపుచ్చుకొన్నా రెండోటెస్టు తొలి ఇన్నింగ్స్ల్ లో డకౌట్ కావడం ఈ ప్రపంచ 5వ ర్యాంక్ ఆటగాడిని అయోమయంలో పడవేసింది.

ఇదీ చదవండి : భారీశతకాల మొనగాడు రోహిత్

Related Articles

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles