- విరాట్ కోసం నాలుగు రికార్డులు సిద్ధం
- రికీ పాంటింగ్ రికార్డుకు విరాట్ గురి
అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఇంగ్లండ్ తో జరిగే ఆఖరిటెస్టు మ్యాచ్ లో విరాట్ కొహ్లీ తనదైన శైలిలో రాణించగలిగితే భారత కెప్టెన్ గా పలు సరికొత్త రికార్డులు నెలకొల్పే అవకాశం కనిపిస్తోంది. 2011 సీజన్లో టెస్టు అరంగేట్రం చేసిన విరాట్ కొహ్లీ గత దశాబ్దకాలంలో అంతైఇంతై అంతింతై అన్నట్లుగా ఎదిగిపోయాడు. 2014 లో ధోనీ నుంచి భారత టెస్టుజట్టు పగ్గాలు అందుకొన్న కొహ్లీ కెప్టెన్ గా 60వసారి నాయకత్వం వహించబోతున్నాడు. ఇంగ్లండ్ తో నాలుగుమ్యాచ్ ల సిరీస్ లోని ఆఖరు మ్యాచ్ కెప్టెన్ గా కొహ్లీకి 60వ టెస్టు గా రికార్డుల్లో చేరనుంది. ఇప్పటి వరకూ అత్యధికంగా 60 టెస్టుల్లో భారతజట్టుకు నాయకత్వం వహించిన మహేంద్రసింగ్ ధోనీ సరసన కొహ్లీ చేరనున్నాడు.
17 పరుగుల దూరంలో 12 వేల మైలురాయి :
32 సంవత్సరాల విరాట్ కోసం మరో అరుదైన రికార్డు సైతం వేచిచూస్తోంది. భారత కెప్టెన్ గా 12వేల అంతర్జాతీయ పరుగుల మైలురాయిని చేరాలంటే కొహ్లీ మరో 17 పరుగులు చేస్తే చాలు. అహ్మదాబాద్ రెండోటెస్టు ద్వారా ఆ రికార్డును సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. క్రికెట్ చరిత్రలో కెప్టెన్ గా అత్యధిక అంతర్జాతీయ పరుగులు సాధించిన క్రికెటర్లలో రికీ పాంటింగ్, గ్రీమ్ స్మిత్ మాత్రమే ఉన్నారు. ఆస్ట్ర్రేలియా దిగ్గజం రిక్కీపాంటింగ్ తన జాతీయజట్టుకు కెప్టెన్ హోదాలో 15 వేల 440 పరుగులు సాధించడం ద్వారా అగ్రస్థానంలో నిలిచాడు. సౌతాఫ్రికా కెప్టెన్ గా గ్రీమ్ స్మిత్ 14 వేల 878 పరుగులతో రెండోస్థానంలో కొనసాగుతున్నాడు.
ఇదీ చదవండి:భారత్-ఇంగ్లండ్ టెస్టు సిరీస్ లో ఆఖరాట
సెంచరీ బాదితే మరో రికార్డు :
కెప్టెన్ గా అంతర్జాతీయ మ్యాచ్ ల్లో అత్యధిక సెంచరీలు సాధించిన ఘనత కూడా రికీ పాంటింగ్ దే. పాంటింగ్ పేరుతో ఉన్న రికార్డును అధిగమించాలంటే కొహ్లీ మరొక్క శతకం బాదితే చాలు. భారత కెప్టెన్ గా విరాట్ ఇప్పటి వరకూ 41 అంతర్జాతీయ శతకాలు సాధించాడు. 2019 డే-నైట్ టెస్టులో చివరిసారిగా బంగ్లాదేశ్ పై తన ఆఖరి సెంచరీ బాదిన కొహ్లీ ఆ తర్వాత నుంచి మూడంకెల స్కోరు కోసం ఎదురుచూస్తున్నాడు.
అంతేకాదు ప్రస్తుత సిరీస్ ఆఖరి టెస్టులో సైతం భారత్ నెగ్గితే కెప్టెన్ గా కొహ్లీకి అది 36వ విజయమవుతుంది. వెస్టిండీస్ మాజీ కెప్టెన్ క్ల్లైవ్ లాయిడ్ పేరుతో ఉన్న 36 టెస్టు విజయాల రికార్డును కొహ్లీ సమం చేయగలుగుతాడు. ప్రస్తుతసిరీస్ లోని మొదటి మూడుటెస్టుల్లో కొహ్లీ రెండు అర్థశతకాలు మాత్రమే సాధించగలిగాడు. అహ్మదాబాద్ టెస్టు ను భారత్ డ్రాగా ముగించినా లేదా మ్యాచ్ నెగ్గినా ఐసీసీ టెస్టు లీగ్ ఫైనల్స్ బెర్త్ ఖాయం చేసుకోగలుగుతుంది.
ఇదీ చదవండి:అశ్విన్ ను ఊరిస్తున్న మరో రికార్డు