విరాట్ కోహ్లీ కల నెరవేరలేదు. విరాట్ అభిమానుల స్వప్నం ఛిద్రమైంది. బాగానే ఆడుతున్నాడు, వందో మ్యాచ్ లో శతకం కొట్టేస్తాడని ఎదురు చూసినంత కాలం పట్టలేదు ఆశాభంగం చెందడానికి. రెండున్నర సంవత్సరాలుగా అంతర్జాతీయ క్రికెట్ లో శతకం కొట్టలేదనే బాధతో మదనపడుతున్న కోహ్లీ శుక్రవారంనాడు శ్రీలంకతో మొదలైన మొదటి అయిదు రోజుల టెస్ట్ మ్యాచ్ లో మొదటి రోజు శతకం కొట్టవలసిందే. మొదట్లో ఒక బంతిని తేడాగా ఆడి ఆందోళన కలిగించినా తర్వాత సెటిల్ అయ్యాడు. ఏ బంతికి ఎట్లా ఆడాలో అట్లాగే ఆడుతున్నాడు.
అంతకుముందు, ఆట ప్రారంభం కావడానికి కొద్ది నిమిషాల ముందు చీఫ్ కోచ్ ద్రావడ్ కొహ్లీకి ప్రత్యేక క్యాప్ బహుకరించాడు. దాన్ని ధరించి కదనరంగంలో దిగాడు కోహ్లీ. మయాంక్ అగర్వాల్ లాసిత్ ఎంబుల్దేనియా బౌలింగ్ లో వలలో పడిపోయాడు. అవుటైన అగర్వాల్ పూర్తిగా పెవిలియన్ దరిదాపుల్లోకి రావడానికి ముందే విరాట్ కొహ్లీ రంగంలో దిగాడు. ఏది ఏమైనా సరే రెండున్నరేళ్ళుగా వీడని గ్రహాన్ని వదిలించుకోవాలనీ, నూరు పరుగులు తీయాలని దృఢసంకల్పంతో విరాట్ కొహ్లీ పిచ్ లోకి చేరుకున్నాడు. అతడి సతీమణి, అందాల సినీనటి అనుష్కాశర్మ పెవిలియన్ లో ఈ మధురక్షణాలను ఆస్వాదించడానికి సిద్ధంగా కూర్చొని ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొహ్లీ అభిమానులు ఎప్పుడు శతకం పూర్తి చేస్తాడా, ఎప్పుడు పండగ చేసుకుందామా అని ఎదురు చూస్తున్నారు. స్టేడియంలో ఉన్న అభిమానులు క్షణంక్షణం ఊపిరి బిగబట్టి ప్రతిబంతినీ కోహ్లీ ఆడుతుంటే జాగ్రత్తగా గమనిస్తూ కూర్చున్నారు. ఫోర్ కొట్టినా, సింగిల్ కొట్టినా చప్పట్లు కొట్టి ప్రోత్సహిస్తున్నారు. ఇది చాలా రమణీయమైన, హృద్యమైన దృశ్యం. ఆటగాళ్ల మద్య ఇటువంటి సుహృద్భావం వెల్లివిరయడం చాలా సంతోషించదగిన విషయం.
గార్డ్ ఆప్ ఆనర్
కోహ్లీ ఈ మధ్య శతకం చేయకపోయినప్పటికీ అతడు చాలా విలువైన శతకకర్త. ఆడిన వంద మ్యాచ్ లలో 27 శతకాలు చేసి శభాష్ అనిపించుకున్నాడు. ప్రస్తుత జట్టులో అందరికన్నా మిన్న అయిన ఆటగాడు. అందుకే శనివారంనాడు శ్రీలంకతో మొదటి టెస్టు, తనకు వందో టెస్టు రెండో రోజు ఆడ ప్రారంభించేందుకు మొహాలీలోని బింద్రా స్టేడియంలో రంగంలో దిగుతున్న కోహ్లీకి రోహిత్ శర్మ, అతడి సహచరులు కలిసి గార్డ్ ఆఫ్ ఆనర్ ఇచ్చారు. దారికి రెండు వైపులా నిలబడి కోహ్లీ వస్తుంటే చప్పట్లు కొడుతూ అబినందించారు. కోహ్లీ కుడి చేయి ఎత్తి అభివాదం చేస్తున్నట్టు ఊపుకుంటూ వేగంగా మైదానంలో ప్రవేశించాడు. జట్టు సభ్యులతో కలసి సంతోషంగా కొన్ని క్షణాలు గడిపారు. వంద టెస్టు మ్యాచ్ లో ఆడిన భారత క్రీడాకారులలో పన్నెండవ వ్యక్తిగా కోహ్లీ చరిత్ర పుటలలోకి ఎక్కారు. అంతకంటే ముందు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, వివిఎస్ లక్ష్మణ్, అనిల్ కుంబ్లే, కపిల్ దేవ్, సునీల్ గావస్కర్, దిలీప్ వెంగ్ సర్కార్, సౌరవ్ గంగూలీ, ఇశాంత్ శర్మ, వీరేంద్ర షెహవాగ్, హర్భజన్ సింగ్ లు ఈ చారిత్రాత్మకమైన ఘనకార్యం సాధించారు. రవీంద్ర జడేజా 175 పరుగులతో అజేయంగా ఉండటం శనివారంనాటి విశేషం. ఇండియా మొదటి ఇన్నింగ్స్ ను ఎనిమిది వికెట్లకు 574 పరుగుల దగ్గర డిక్లేర్ చేసింది.