Sunday, December 22, 2024

దండకారణ్యంలో విరాధుడి వధ

రామాయణమ్59

అరణ్యకాండము ప్రారంభము

ప్రవిశ్య తు మహారణ్యం దణ్డకారణ్యమాత్మవాన్.

రామోదదర్శదుర్దర్షస్తాపసాశ్రమమణ్డలమ్.

బుద్ధిమంతుడు, ఎవరూ కూడ తేరిపారచూడసాధ్యముకాని వాడు, ఎదిరింప శక్యము కాని వాడు అయిన రాముడు దండకారణ్యములో ప్రవేశించి మునుల ఆశ్రమ సముదాయాన్ని చూశాడు.

Also read: సీతారామలక్ష్మణుల అరణ్య ప్రవేశం

ఆ ముని వాటికలలో అన్ని మృగాలూ నిర్భయంగా సంచరిస్తున్నాయి. వాకిళ్ళు అన్నీ రంగవల్లులతో తీర్చిదిద్దబడి మనోహరంగా ఉన్నాయి.

ఆ ఆశ్రమం చుట్టూ మధురఫలాలనిచ్చే ఎన్నో వృక్షాలు దట్టంగా ఏపుగా పెరిగి చూడటానికి మనోహరంగా ఉన్నాయి.

ఆ ఆశ్రమంలో బలిహోమాలతో దేవతాపూజలు, వేదఘోషలతో ప్రాంగణమంతా మారుమ్రోగుతూ బ్రహ్మలోకాన్ని తలపిస్తున్నది.

సూర్యుడితో సమానమైన తేజస్సుగల మహామునులంతా ఆ ఆశ్రమంలో నివసిస్తున్నారు. వారందరినీ చూసి తన ధనస్సుకు ఉన్న నారి విప్పివేసి మెల్లగా వినయపూర్వకముగా వారున్న వైపుకు రాముడు వెళ్ళాడు.

సీతారామలక్ష్మణులను కాంచినంతనే మునులు ఎదురేగి స్వాగతము పలికారు. వారందరికీ ఒకటే ఆశ్చర్యం అబ్బ! ఎంత నయనమనోహరంగా ఉన్నాడు రాఘవుడు. మంచి శోభతోకూడిన శరీర సౌష్ఢవము, సౌకుమార్యము!

Also read: సీతారామలక్ష్మణులకు అత్రి, అనసూయల ఆతిథ్యం

అద్భుత రూపసౌందర్యము చూసి రెప్పవాల్చకుండా తదేకంగా వారినే చూస్తూ ఉండిపోయారు ఆ ముని గణమంతా!

సీతారామలక్ష్మణులకు ఆశ్రమ ప్రాంగణంలో ఒక పర్ణశాలలో బస ఏర్పాటు చేసి ఆయనను సత్కరించి వినయపూర్వకముగా వేడుకున్నారు. “రాఘవా, నీవే మాకు రాజువు. రక్షకుడవు. కావున సర్వదా తల్లి గర్భమును రక్షించినట్లు నీవు మమ్ములను రక్షించ వలెను” అని పలికారు అందరూ. వారి ఆతిధ్యము స్వీకరించి సూర్యోదయమైన వెంటనే మరల బయలు దేరాడు శ్రీ రాముడు.

అరణ్యమధ్యంలోకి ప్రవేశించారు.

అడవి ఈగలు రొదపెడుతున్నాయి. క్రూరమృగాలు గుంపులుగా తిరుగుతూ కనపడుతున్నాయి. ఆ ప్రదేశంలో ఉన్న లతలూ వృక్షాలూ పాడుబడ్డట్టుగా కనిపిస్తున్నాయి. ఎక్కడా జలాశయమన్నదే కానరావడంలేదు. ఇంతలో ఎక్కడనుండో వస్తున్న భయంకరమైన అరుపులు పెడబొబ్బలతో అరణ్యమంతా మారు మ్రోగిపోతున్నది.

వారి ఎదురుగా పర్వతకాయుడైన ఒక రాక్షసుడు వికృతంగా అరుస్తూ నిలబడి ఉన్నాడు.

Also read: రాముడి పాదుకలతో చిత్రకూటం నుంచి అయోధ్యకు బయలుదేరిన భరతుడు

ఎదురుగా నిలుచున్న పర్వతాకారుడైన రాక్షసుని పేరు విరాధుడు.

అత్యంత జుగుప్సాకరమైన ఆకారం గలవాడు. ఏ అవయవమూ కూడా ఒక దానితో ఒకటి పొంతనలేకుండా అమరిఉన్నది వాడి వికృతాకారము చూపరులకు భయం కలిగిస్తున్నది.

ఒకపెద్ద శూలానికి మూడు సింహాలను, నాలుగు పెద్దపులులను, పదిచుక్కలజింకలను, పైన పసతో నిండిన దంతాలతో కూడిన ఏనుగు తలను గుచ్చి మోసుకుపోతున్నాడు.

సీతా రామలక్ష్మణులను చూడగనే వారిని చంపటం కోసం వారి మీదకు దూసుకుంటూ వస్తున్నాడు.

వచ్చీ రావడం తోనే వాడు సీతను లాగి తన ఒడిలో కూర్చోపెట్టుకుని ‘‘అందమైన ఈమెను నా భార్యను చేసుకొని మీ ఇద్దరినీ ఆహారంగా చేసుకుంటాను. బాగా కండబట్టి ఉన్నారు మీ ఇద్దరూ’’ అంటూ వికృతంగా వికటాట్టహాసం చేస్తుంటే పెనుగాలికి ఊగే చివురుటాకులా గజగజవణికి పోతున్నది సీతమ్మ.

Also read: తండ్రి ఆజ్ఞ అమలు కావలసిందేనన్నరాముడు

వాడి ఒడిలో సీతమ్మ స్థితి చూసిన రాముడికి దుఃఖమాగటంలేదు. లక్ష్మణా అదిగో చూడు సుకుమారి, అల్లారుముద్దుగా పెరిగిన నా సీత ఎలా పరాయిమగాడి ఒడిలోకి నెట్టబడ్డదో చూశావా!

కైక కళ్ళు చల్లబడ్డాయి ఇప్పటికి! అయ్యో నాకెందుకు ఇంత దుఃఖము సంప్రాప్తించినది! నా రాజ్యము నాకు కాకుండా పోయినది. నా తండ్రి మరణించాడు. నా భార్యను పరపురుషుడు తాకాడు.

రాముడి దీనాలాపాలు వింటున్న లక్ష్మణుడు ఒక్కసారిగా మహాసర్పము(పాము)లాగ బుసలుకొట్టాడు.

‘‘రామా! దేవేంద్ర సమానపరాక్రమము గల నీవు చింతించడమా? నేను నీ దాసుడను. ఇదిగో ఇప్పుడే నేను ప్రయోగించే బాణము విరాధుడి రక్తమును భూమికి గల దాహం తీర్చగలదు..

వీరి సంభాషణ వింటున్న విరాధుడు ‘‘ఎవరురా మీరిద్దరూ ఆడుదానిని వెంట పెట్టుకొని ముని వేషాలతో అడవులలో సంచరిస్తున్నారు’’ అని అడిగాడు. అప్పుడు తామెవరో రాముడు తెలియచేసి ‘‘మరి నీవెవరు’’ అని అడిగాడు.

అప్పుడు వాడు, ‘‘నేను జవుడు, శతహ్రదలకు పుట్డినవాడను. ఎవ్వరిచేత ఛేదించబడకుండా, చంపబడకుండా బ్రహ్మవద్దనుండి వరాలు పొందాను. మీరు నన్నేమి చేయలేరు. ఈ ఆడదానిని నాకు వదిలేసి వచ్చిన దారినే త్వరగా పారిపొండి నేనేమీ చేయను మిమ్ములను అని పలికాడు.

Also read: జాబాలిని చీవాట్లు పెట్టిన రాముడు, వశిష్టుడి సాంత్వన వచనాలు

వాడి మాటలకు ఒక్కసారిగా రాముడి కన్నులు ఎర్రగా అయిపోయినాయి. ధనస్సును ఎక్కుపెట్టి బంగారుపొన్నులు గల ఏడు బాణాలను ఒక్కసారే సంధించి మహావేగంగా వదిలిపెట్టాడు.  అవి రయ్యిన దూసుకుంటూ వెళ్ళి వాడి శరీరాన్ని చీల్చి అవతలపడ్డాయి. బుస్సుమంటూ రక్తం పొంగి వాడి శరీరంనుండి కార సాగింది. ఆ బాధకు వాడికి కోపం వచ్చి, సీతాదేవిని దింపి, శూలాన్ని ఎత్తి రామలక్ష్మణులవైపు పరుగెత్తాడు. వాడి మీదకు అన్నదమ్ములిరువురూ ఏకధాటిగా బాణవర్షం కురిపించినా వాడు లెక్కచేయక వారివురునీ చెరొక చేతిలో ఒడిసి పట్టుకుని తన భుజములకెక్కించుకొని అరణ్యంలో పరుగెత్తసాగాడు. అది చూసి బిగ్గరగా ఏడుస్తూ సీతమ్మకూడా వాడివెంట పరుగెత్తింది.

పరుగెత్తుకుంటూ ఏడుస్తూ తమను అనుసరిస్తున్న సీతాదేవిని చూడగనే రాముడి హృదయంలో అగ్నిపర్వతము బ్రద్దలయినప్పుడు ప్రవహించే విధముగా క్రోధము కట్టలు తెంచుకొని ప్రవహించింది.

రామలక్ష్మణులు ఇరువురూ ఒకరికొకరు చెప్పుకుని వారు కూర్చుని ఉన్న రాక్షసుడి భుజాలను ఒక్కవేటుతో ఒకేసారి తెగ నరికారు.ఆ దెబ్బకు ఆ రాక్షసుడు నేలపై కూలబడ్డాడు.

నేలపై పడ్డవాడిని కత్తులతో పొడిచి, ఖడ్గాలతో నరుకుతున్నా వాడు చావడంలేదు.

అప్పుడు బ్రహ్మ వరప్రసాది అయిన  వాడిని చంపడం తమ వల్లకాదని గ్రహించి, తమ్ముడూ వీడిని మరల లేవకుండా భూస్థాపితం చేద్దాం! నీవు వెంటనే వీడికి సరిపడా పెద్ద గొయ్యి తవ్వు అని చెప్పి తాను వాడి కంఠం మీద కాలుపెట్టి వాడు లేవకుండా అణచిపట్టి ఉంచాడు.

శ్రీ రామచంద్రుడి చేతిలో చావుదెబ్బలు తిన్న వాడికి అప్పటికి గాని స్పృహ వచ్చి, ‘‘రామా! మహానుభావా,  నీవెవరో తెలుసుకొనలేక అజ్ఞానముతో ప్రవర్తించాను. ఓ కౌసల్యానందనా నిన్ను, లక్ష్మణుని, సీతామాతను గుర్తించాను. కుబేర శాపము వలన నాకీ రూపము వచ్చింది. ఎప్పుడైతే రాముడి చేతిలో చంపబడతావో నీ నిజ రూపం నీకు వస్తుందని చెప్పాడాయన. స్వామీ నా కళేబరాన్ని పాతిపెట్టండి’’ అని పలికి నిజరూపాన్ని ధరించి, ‘‘ఓ రామా, ఇటనుండి ఒకటిన్నర యోజనముల దూరములో శరభంగ మహర్షి ఆశ్రమము ఉన్నది. అక్కడికి వెళ్ళండి మీకు శుభము కలుగుతుంది’’ అని చెప్పి అంతర్ధానమయ్యాడు.

Also read: తండ్రి ఆజ్ఞను శిరసావహించవలసిందే: భరతుడితో రాముడు

వూటుకూరు జానకిరామారావు

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles