Sunday, December 22, 2024

పీవీ విశ్వరూపానికి అద్దం పట్టిన పుస్తకం

ఇది (అ)పూర్వ ప్రధానమంత్రి  పివి నరసింహారావు శత జయంతి వత్సరం.ఈ సందర్భంగా ప్రముఖ పాత్రికేయుడు అప్పరసు కృష్ణారావు పివిపై గొప్ప రచన చేశారు. ఇది “విప్లవ తపస్వి పివి” పేరుతో పుస్తకంగా వచ్చింది. ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు ఇటీవలే ఈ గ్రంథాన్ని ఆవిష్కరించారు. అతి తక్కువ కాలంలోనే పాఠకుల నుండి విశేష గౌరవ మర్యాదలు పొందుతోంది. పుస్తక రచనకై   ఎంచుకున్న వస్తువు ఎంతటి విరాట్ స్వరూపమో! రాసిన రచయిత కూడా అంతటి చేయితిరిగిన ప్రతిభావంతుడు కావడం ఈ ప్రభకు కారణాలని చెప్పవచ్చు.

సాక్షీభూతం

పివి గురించి గతంలో అనేక పుస్తకాలు వచ్చాయి. కానీ, ఈ పుస్తకం వాటికి పూర్తి భిన్నంగా ముస్తాబయ్యింది. కృష్ణారావు జర్నలిస్ట్ గా ఢిల్లీలో కాలుమోపిన కాలం, పివి ప్రధానిగా పాలన చేపట్టిన సమయం  ఒకటే కావడంతో, తను చూచిన, విన్న, తెలుసుకున్న విషయాలన్నీ ఒక సాక్షిగా ఇక్కడ గుదిగుచ్చాడు. అక్షరగుచ్ఛంగా మనకు అందించాడు. 214 పేజీల ఈ పుస్తకాన్ని పట్టుకుంటే, ఉన్నపళంగా ఆసాంతం చదివించేట్లుగా రచన సాగింది. నన్ను అట్లాగే చదివించింది. ఎంచుకున్న రచనా శిల్పం, అందులో పొందుపరిచిన విషయాలు అంత ధారగా, ధాటిగా  రసపుష్టితో  ఉన్నాయి. పివి పాలనా సమయం మొదలు, మహాప్రస్థానం వరకూ ఎంతో ఉత్కంఠను కలిగించేట్లుగా ఈ పుస్తకం సాగింది.

పీవీతో రచయితకు సాన్నిహిత్యం

ఇది గడచిన కాలపు చరిత్ర ఐనప్పటికీ, ఒక నవలలా నడిచింది. ఈ రచయిత  కేవలం పాత్రికేయుడే కాదు. కవి, సాహిత్యవేత్త కావడం వల్ల ఈ రచన ఇంత గొప్పగా వచ్చిందని నా అభిప్రాయం. పివి నరసింహారావు… ఆధునిక పోకడలు కలిగిన శ్రీశ్రీని ఎంత ప్రేమిస్తాడో, సంప్రదాయకవిగా ముద్ర వేసుకున్న విశ్వనాథ సత్యనారాయణను కూడా  అంతే ఎత్తున గౌరవిస్తారు. ఈ లక్షణం కృష్ణారావుకు కూడా ఉండడం వల్ల జోడీ బాగా కుదిరింది. పీవీ ప్రధానిగా దిగిపోయి, ఢిల్లీలో ఒంటరిగా కూర్చున్నప్పుడు  అనేక సార్లు కలుస్తూ, సన్నిహితంగా మెలిగినవారిలో కృష్ణారావు తొలి వరుసలో ఉంటారు. పివిని దగ్గర నుంచి చూచి, విని, తెలుసుకునే అదృష్టం అనుభవాలుగా ఈ రచయితను వరించడం రచనకు ఎంతో ఉపకరించింది.

విలక్షణమైన పేరు

అసలు ఈ పుస్తకానికి పెట్టినపేరే విలక్షణంగా నిలిచింది. “విప్లవ తపస్వి పివి ” అని అనడం ఆరంభించినప్పటి నుండే రచనలో జవజీవాలు ఊపందుకున్నాయని నాకు అనిపించింది. ఈ పుస్తకానికి ఈ పేరు ఎందుకు అంత బాగా కుదిరిందో  పివి స్వయంగా రాసిన కవిత చదివితే అర్ధమవుతుంది. ఆ కవిత ఇందులో ఉంది. ఈ పుస్తకంలో మొత్తం ఏడు అధ్యాయాలు ఉన్నాయి. (1)పివి -ఒక చారిత్రక అవసరం (2)అయోధ్య -ఒక అధ్యాయం (3)వ్యూహాలు -ప్రతి వ్యూహాలు (4)కుంభకోణాల వెనుక కోణాలు (5)ఇంటా బయటా సాహసాలు (6) తెలుగదేలయన్న (7)విప్లవ తపస్వి. ఈ అధ్యాయాల విభజనను చూస్తేనే, ఈ రచన ఎంత ప్రణాళికబద్ధంగా సాగిందో తెలుస్తోంది.

Also Read : ధర్మపురి తో పి.వి.అనుబంధం

పీవీ యుగం

వీటికి ముందుగా రాసిన “నా మాట” చదివితే పుస్తకం యొక్క పూర్వాపరాలు విశదమవుతాయి. ఆర్ధిక సంస్కరణలు, బాబ్రీ మసీదు కూల్చివేత, తాత్కాలిక ప్రధానిగా అందరు జమకట్టిన వ్యక్తి, శాశ్వత ప్రధానిగా ఐదేళ్లు ఎట్లా ఉన్నాడు, కనపడని స్నేహితులు చేసిన మేళ్లు ఏంటో, ఆరోపణల పర్వాన్ని ఎలా ఢీకొన్నాడు, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత వచ్చిన ప్రధానమంత్రులలో జవహర్ లాల్ నెహ్రు నుండి రాజీవ్ గాంధీ వరకూ గడచిన ఘట్టం ఒకటైతే, పివి ఘట్టంగా ప్రత్యేకంగా నిలిచి, పివి యుగంగా ఎలా ఆవిష్కారమైంది.

దిల్లీలో అసలైన చరిత్రలు సమాధి

ఇప్పుడు నరేంద్రమోదీకి వున్న మెజార్టీ అప్పుడు పివికి ఉండిఉంటే ఏ రీతిలో ప్రగతిరథ చక్రాలు పరుగులెత్తేవో, సమాధుల నగరమైన దిల్లీలో బూటకపు చరిత్రలు నమోదు కావడం, అసలైనవారి చరిత్రలు సమాధికావడం నడుస్తున్న హీన చరిత్రలో భాగం…. అంటూ “నా మాట “లోనే కృష్ణారావు బోలెడు అంశాలు వివరించారు. పెక్కు కోణాలను ఆవిష్కరించారు. ఎవ్వరూ ముట్టని విషయాలను స్పృశించారు.  “పివి-ఒక చారిత్రక అవసరం” ఇది మొదటి అధ్యాయం. ఆయనదొక రికార్డుకాని విజయవంతమైన చరిత్ర…. అంటూ ప్రపంచ ఆర్ధిక వేదికపై నాటి అధ్యక్షుడు క్లాస్ స్క్వాబ్ 1994లోనే  పివిని అభివర్ణిస్తూ బహిరంగంగా ప్రకటించారు.

పీవీ దార్శనికత

మన చరిత్రను, చారిత్రక పురుషులనూ విదేశీయులు గుర్తించిన తర్వాత మనం గుర్తిస్తున్నాం. పివి విషయంలో ఆ గుర్తింపు ఇప్పటికీ సంపూర్ణతను ధరించలేదు. ఆర్ధిక సంస్కరణలు అనగానే పివికి క్రెడిట్ ఇచ్చినా, అందులో ఎక్కువ శాతం మన్ మోహన్ సింగ్ ఖాతాలో వేయడం ఎందరికో పరిపాటై పోయింది. చంద్రశేఖర్ ప్రధానిగా ఉన్నప్పుడు మన్ మోహన్ సింగ్ అయనకు ఆర్ధిక సలహాదారుడుగా ఉన్నారు. అప్పుడెందుకు ఈ సంస్కరణలు జరుగలేదు? పివి నరసింహారావు తర్వాత పదేళ్లపాటు మన్ మోహన్ ప్రధానిగా ఉన్నారు. సంస్కరణలలో  వేగం ఎందుకు అందుకో లేదు? పివి దార్శనికత, తెగువ, ధైర్యం వల్లనే ఆర్ధిక సంస్కరణలు పురుడుపోసుకున్నాయి.

పీవీ వేసిన బాటలోనే వాజపేయి, మోదీ

ఆ ఫలాలు ఇప్పటికీ మనం అనుభవిస్తున్నాం. వాజ్ పెయి నుండి నరేంద్రమోదీ వరకూ పివి వేసిన బాటలోనే నడిచారు. దాని విలువ తెలుసుకున్నారు. పివి చేపట్టిన సంస్కరణల పర్వానికి మన్ మోహన్ సింగ్ ఒక ఉపకరణ మాత్రమే నంటూ, ఈ అధ్యాయంలో రచయిత సోదాహరణంగా వివరించారు.1991 జూన్ 22వ తేదీనాడు జాతినుద్దేశించి పివి నరసింహారావు చేసిన ప్రసంగం,1947 ఆగష్టులో భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన క్షణంలో పండిట్ జవహర్ లాల్ నెహ్రూ అందించిన ప్రసంగంతో సమానమైనదని చెబుతూ, ఆ పాఠాన్ని ఇక్కడ రుచి చూపించారు.

Also Read : దార్శనికుడూ, సంస్కరణలకు ఆద్యుడూ పీవీ : ఉపరాష్ట్రపతి

పార్లమెంటు స్థాయీ సంఘాలు

అత్యంత కీలకమైన పార్లమెంట్ స్థాయీ సంఘాల వ్యవస్థను పీవీయే ప్రవేశపెట్టారు. ఎంపీ ల్యాడ్స్ ను ఆయనే పరిచయం చేశారు. ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్ఠం చేయడం అయన పనే. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి, సొంత పార్టీ పెట్టుకుని, ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన ప్రణబ్ ముఖర్జీ తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినప్పుడు, ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్ గా నియమించి, ప్రణబ్ ను నిలబెట్టాడు. పీవీ వల్ల తదనంతర కాలంలో ప్రణబ్ తిరుగులేని శక్తిగా అవతరించాడు.

పీవీ పట్ల ప్రణబ్ కృతజ్ఞతాభావం

పీవీ పట్ల ప్రణబ్ ముఖర్జీకి ఆ కృతజ్ఞత కూడా ఉంది. సందర్భం వచ్చినప్పుడల్లా ఆయన చాటుకున్నాడు. ఈ విశేషాలన్నీ ఈ పుస్తకంలో ఉన్నాయి. ఇప్పుడు దిల్లీలో రగులుతున్న రైతు ఉద్యమాన్ని మనం చూస్తున్నాం. రైతుల పట్ల పీవీకి ఎంతటి ప్రేమ, గౌరవం ఉన్నాయో ఈ వాక్యాలు చెబుతాయి. దయచేసి పేద ప్రజలతో ప్రయోగాలు చేయకండి.. అంటూ హెచ్చరిస్తూ, భూమిని సజీవ మానవుడితో పోల్చాడు. పీవీకున్న గ్రామీణ నేపథ్యం, రైతుగా తనకున్న అనుభవం ఇక్కడ దర్శనమవుతుంది.

కుర్తాళ పీఠాపతి కావలసిన పీవీ

త్రివిక్రమ రామానంద భారతి తర్వాత కుర్తాళ పీఠాధిపతి కావాల్సిన వ్యక్తి, రాజీవ్ గాంధీ అకాలమరణంతో ప్రధాని పీఠాన్ని చేపట్టాల్సి వచ్చింది. ఈ పీఠంతో పీవీకి ఎనలేని అనుబంధం ఉంది. ఆర్ధిక దుస్థితి నుంచి దేశాన్ని గట్టెక్కించడం, సంక్షేమ పథకాలకు అవసరమైన నిధులు సమకూర్చుకోవడంలో ఎన్ని పాట్లు పడ్డాడో, ఎట్లాంటి పథక రచనలు చేశాడో ఈ అధ్యాయం పూసగుచ్చినట్లు చెప్పింది. పంజాబ్, అస్సాం, బోడో ల్యాండ్ లో అశాంతిని అరికట్టడం, అవసరాలకు అనుగుణంగా అన్ని దేశాలతో వ్యూహాత్మకంగా సంబంధాలు ఏర్పరచుకోవడం ఎట్లా సాగిందో ఈ పుస్తకం చదివితే అర్ధమవుతుంది.

తన పాలనపై పీవీ శ్వేతపత్రం

“ఆలోచన మంచిదైనప్పటికీ ప్రజలు వ్యతిరేకిస్తే, అవి చేయకూడదు” అన్న తత్త్వం పీవీకి ఆనాడే బోధ పడింది. ఈ మాటలు సార్వకాలికమైనవిగా ఎప్పటికీ నిలుస్తాయి. ఈ వాక్యాలు తన పాలనపై పీవీ విడుదల చేసిన “శ్వేత పత్రం” గా కృష్ణారావు భావిస్తున్నారు.ఇందులో తెలిపిన పరిణామల్లన్నింటినీ విశ్లేషిస్తే, పీవీ చారిత్రక అవసరం తేటతెల్లంగా విశదమవుతుంది. అయోధ్య అధ్యాయం ఒక నవలలా సాగింది. బాబ్రీ మసీదు కూలిపోతున్న సందర్భంలో జర్నలిస్ట్ కృష్ణారావు అక్కడే వున్నారు. తను పనిచేస్తున్న పత్రికకు వార్తలు కవర్ చేయడం కోసం అప్పుడు అయోధ్య వెళ్లారు.

అయోధ్యపై ఏకాభిప్రాయం కోసం అహరహం కృషి

ఈ అంశంపై తర్వాత పలు సందర్భాల్లో పీవీతో చర్చించే అవకాశం కూడా కృష్ణారావుకు దక్కింది. నిజం చెప్పాలంటే, అయోధ్య అంశంలో ఏకాభిప్రాయ సాధన కోసం  పీవీ ఎంతో  కృషి చేశారు. తన దగ్గర అద్భుతమైన ప్రణాళికలు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఈ అధ్యాయంలో కూలంకషంగా చెప్పారు. ప్రధానంగా అద్వానీ, కొండొకచో మురళీమనోహర్ జోషి వల్ల పీవీ-బిజెపి మధ్య వివాదాలు పెరిగాయి. నరేంద్రమోదీ ప్రాభవం రాజీవ్ గాంధీ హయాంలో బీజప్రాయంగా ప్రారంభమై, పీవీ సమయంలో తిరుగులేని విధంగా  ఎదిగింది.

పీవీ పట్ల మోదీకి వల్లమాలిన అభిమానం

పీవీ పట్ల మోదీకి వల్లమాలిన అభిమానం ఉందనీ, మోదీ పీవీని ఎప్పుడూ పల్లెత్తు మాట అనలేదని రచయిత చెబుతున్నాడు. ఈ అధ్యాయం ఆద్యంతం అత్యంత ఆసక్తిగా సాగింది. వ్యూహాలు -ప్రతి వ్యూహాలు అధ్యాయం ఇంకా రసకందాయంలో పడింది. “ఒకే పార్టీలో రెండు అధికార కేంద్రాలను అనుమతించలేను” అని ఇందిరాగాంధీ చెప్పిన మాటలను పీవీ ఆచరణలో అద్భుతంగా చేసి చూపించారు. ఎటువంటి ఆకర్షణ లేకుండా, కుర్చీలో కూలబడినట్లు కూర్చొనే ఒక 75ఏళ్ళ వృద్ధుడు  మెరుపు నిర్ణయాలు ఎట్లా తీసుకున్నారు?! తిరుపతిలో జరిగిన ప్లీనరీ నుంచి, పార్టీలో అంతర్గతంగా ఏకాభిప్రాయ సాధనకు ఎట్లా కృషి చేశారు? తన ప్రయత్నాలు విఫలమైనప్పుడల్లా ఆచితూచి అడుగులు ఎట్లా వేశారు? ఇవన్నీ ఈ అధ్యాయంలో బలమైన  శిల్పంగా చెక్కారు.

అంతర్గత శత్రువులు

పీవీని గద్దె దించడానికి అంతర్గత శత్రువులు, బయట ప్రత్యర్ధులు ఊపిరాడకుండా ప్రయత్నించినప్పుడు, తన అనుయాయుల ద్వారా పీవీ చేసిన వ్యూహ రచన సామాన్యమైనది కాదు. ప్రతిపక్షాలు మూడు సార్లు అవిశ్వాసాన్ని ప్రవేశ పెట్టినప్పుడు పీవీ  ఏ చాణక్యం ప్రదర్శించారో  కవి కృష్ణుడు బొమ్మ కట్టించాడు. సమాంతరంగా, సోనియాగాంధీ అధికార కేంద్రంగా మారి, పీవీని ఇబ్బంది పెట్టే యత్నాలు చేపట్టినప్పుడు ఎట్లా ప్రవర్తించాడో ఈ భాగం చదివితే అర్ధమవుతుంది. రాజీవ్ గాంధీ కుటుంబాన్ని కాపాడటానికి పాటుపడినా, సోనియాకు ఇవ్వాల్సిన ప్రాధాన్యం ఇచ్చినా పీవీకి ఆ వర్గం నుంచి ఇబ్బందులు తప్పలేదు.

రెండు రకాల ప్రత్యర్థులు

పీవీ తన ప్రత్యర్థులను రెండు వర్గాలుగా విభజించేవారు. (1) అనుకూల శత్రువులు (2) కపట మిత్రులు. వీరందరినీ చాలా చాకచక్యంగా అరికట్టారు. పీవీపై సోనియాగాంధీకి అంత కోపం ఎందుకో? అదొక మిస్టరీ అంటున్నాడు కృష్ణారావు. ప్రధానమంత్రి కావాలనే కోరిక ఆమెకు చాలా బలంగానే వుంది. దీనికి బలపరిచే ఉదాహరణలు ఈ పుస్తకంలో బాగా వివరించారు. కుంభకోణాల వెనక  కోణాలు, ఇంటా బయటా చేసిన సాహసాలు అనే విభాగాల్లో బోలెడు చరిత్రకు ఇప్పటి వరకూ పెద్దగా అందని కోణాలను ఈ పుస్తకం ద్వారా తెలుసుకోవచ్చు. ఇటు పార్టీలోనూ, పాలనలోనూ, అటు అంతర్జాతీయ యవనికలోనూ పీవీ చేసిన సాహసాలు ఆన్నీ ఇన్నీ కావు. అవన్నీ ఇక్కడ కనబడతాయి.

విప్లవమూర్తి, చైతన్యదీప్తి

కోట్ల విజయభాస్కరరెడ్డి ఎంత ఇబ్బంది పెట్టారో, వైఎస్ రాజశేఖరరెడ్డి పట్ల పీవీకి ఉన్న ప్రేమ కూడా ఈ పుస్తకం ద్వారా తెలుసుకోవచ్చు. తెలుగదేలయన్న శీర్షికలో చాలా విషయాలు ఉన్నాయి. పీవీని ఎందుకు “విప్లవ తపస్వి ” అని అనాలో, అదే పేరుతో ఉన్న అధ్యాయం చదివితే అర్ధమవుతుంది.పీవీలోని రాజనీతిజ్నుడు, దార్శనికుడు, దేశభక్తుడు,భాషాసాహిత్యానురక్తుడు, తాత్వికుడు, మానవతావాది,కవి, విమర్శకుడుని ఎంతగా చూపించాడో, పీవీలోని విప్లవమూర్తిని, చైతన్యదీప్తిని, తపస్విని అంతకంటే ఎక్కువగా ఈ గ్రంథంలో రచయిత మనకు దర్శనం చేయించాడు.

ఇతర భాషలలోకి అనువదించవలసిన పుస్తకం

పీవీపై వచ్చిన పుస్తకాల్లో ఇది చాలా గొప్ప పుస్తకం. త్వరలో ఇంగ్లిష్, హిందీతో పాటు మిగిలిన భాషల్లోకి స్వేచ్ఛానువాదం కావాల్సిన అవసరం ఎంతో ఉంది.  రాజకీయవేత్తలు, అధికారులు, మేధావులు, జర్నలిస్టులు తప్పకుండా చదవాల్సిన పుస్తకం. పరిశోధకులు, పోటీ పరీక్షలకు తయారయ్యేవారికి  ఈ పుస్తకం ఎంతో ఉపయోగపడుతుంది. ప్రతి తెలుగువాడూ, ప్రతి భారతీయుడూ తప్పకుండా చదవాల్సిన ఇంతటి రచన చేసిన ఏ. కృష్ణారావును అభినందించి తీరాల్సిందే. కవిగా, పాత్రికేయుడిగా ప్రముఖుడైన కృష్ణారావు ఈ పుస్తకం ద్వారా మరింత ప్రసిద్ధుడవుతారు. అందులో సందేహమే లేదు. ఈ పుస్తకాన్ని ఎంతో శ్రద్ధాభక్తులతో, అందంగా ప్రచురించిన శ్రీ రాఘవేంద్ర పబ్లికేషన్స్  వారు అభినందనీయులు.

maa sarma
maa sarma
Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

1 COMMENT

  1. సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ కవి, ప్రఖ్యాత రచయిత, “ఇండియా గేట్” కాలమిస్ట్ గౌ. శ్రీ ఏ. కృష్ణారావు సర్ గారికి హృదయపూర్వక అభినందనలు.
    “విప్లవ తపస్వి పివి” పుస్తక రచయిత గొప్పదనాన్ని వివరించి, రచన లోని సారాన్ని అందించిన సమీక్షకుల వారికి, సంపాదకుల వారికి ధన్యవాదాలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles