Tuesday, January 28, 2025

దార్శనికుడూ, సంస్కరణలకు ఆద్యుడూ పీవీ : ఉపరాష్ట్రపతి

హైదరాబాద్, డిసెంబర్ 27 :  ప్రముఖ జర్నలిస్ట్, కవి అప్పరసు కృష్ణారావు రచించిన ” విప్లవ తపస్వి పివి” పుస్తకాన్ని భారత ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు హైదరాబాద్ లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పీవీ పరిపాలనాదక్షత, వ్యక్తిత్వాన్ని తన ప్రసంగంలో ఆవిష్కరించారు. సామాన్యుడుగా కనిపించే అసామాన్యుడుగా పీవీని అభివర్ణించారు. దార్శనికుడు, సంస్కరణలకు ఆద్యుడుగా పీవీని గుర్తుంచుకోవాలని తెలిపారు. ఆయన ఐదేళ్లపాలనలోని ముఖ్యాంశాలను, తదుపరి కాలంలో వాటి ప్రభావాలను గుర్తుచేసుకున్నారు.

దేశ స్వాతంత్ర్యం కోసం తమ జీవితాన్ని పణంగా పెట్టిన దేశ భక్తుల చరిత్రలతో పాటు దేశాభివృద్ధికి పాటు పడిన మహనీయుల జీవితాలను యువత అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి  మప్పవరపు వెంకయ్య నాయుడు సూచించారు. భారతదేశం అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్న సమయంలో దేశ ప్రధానిగా పివి నరసింహారావు  బాధ్యతలు చేపట్టారని వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. మైనారిటీ ప్రభుత్వంలో కొనసాగుతూనే రాజకీయ పండితుల అంచనాలను తలకిందులు చేస్తూ, అయిదు సంవత్సరాల పాటు అధికారంలో కొనసాగడమే గాక, దేశం ఎదుర్కొంటున్న అనేక సమస్యల్ని పరిష్కరించే ప్రయత్నం చేశారని తెలిపారు. పీవీ అధికార పగ్గాలు చేపట్టిన సమయంలో దేశంలోని రాజకీయ అస్థిరత, అంతకు ముందు ప్రభుత్వాలు దేశ అవసరాలకు తగ్గట్టు వేగంగా చర్యలు తీసుకోకపోవడం లాంటివి తీవ్రమైన ఆర్థిక సంక్షోభానికి దారి తీసాయన్న ఆయన, ఆర్థిక సంస్కరణలు అమలు చేయాల్సిన బాధ్యత పివి  భుజస్కందాల మీద పడిందని, వాటిని ఆయన సమర్థవంతంగా నిర్వహించారని తెలిపారు.

vice president venkaiah naidu launches vi
సుప్రసిధ్ధ హాస్యనటుడు బ్రహ్మానందం చిత్రించిన వేంకటేశ్వరస్వామి చిత్రపటాన్ని బ్రహ్మానందం తరపున ఉపరాష్ట్రపతికి అందజేసిన సీనియర్ జర్నలిస్ట్ మాశర్మ

బలమైన పారిశ్రామిక సంస్కరణలు

కేవలం ఆర్థిక సంస్కరణలు మాత్రమే కాకుండా బలమైన పారిశ్రామిక సంస్కరణలు ప్రవేశపెట్టిన ఘనత పివి నరసింహారావుదేనని కితాబు ఇచ్చారు.లైసెన్స్ రాజ్ ను రద్దు చేసి, ప్రభుత్వానికి ఉన్న విచక్షణాధికారాలు తొలగించి ఎగుమతులకు ప్రోత్సాహం ఇవ్వడమే గాక, దిగుమతుల విధానాలను సరళం చేశారని తెలిపారు. విదేశీ పెట్టు బడుల బోర్డు, బ్యాంకింగ్ సంస్కరణలు, టెలికామ్ రంగ ఆధునీకరణ, విద్యుత్ రంగ ప్రైవేటీకరణ, కరెన్సీ మరియు క్యాపిటల్ మార్కెట్లకు స్వేచ్ఛ కల్పించడమే గాక విమానయాన రంగంలో ప్రైవేటీ కరణ, ప్రైవేట్ బ్యాంకులకు అనుమతి లాంటి వాటి ద్వారా ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యానికి గట్టి పునాదులు వేశారని అన్నారు.

వ్యవసాయరంగంలో కీలకమైన సంస్కరణలు

వ్యవసాయం రంగంలో పి.వి.నరసింహారావు చేపట్టిన సంస్కరణలను ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి, ఆహారధాన్యాల రవాణాపై ఆంక్షలు ఎత్తేసేందుకు కీలక చర్యలు తీసుకుని సేకరణ ధరలు పెరగడంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. సంక్షేమ రంగానికి ప్రాధాన్యత ఇవ్వడమే గాక, ప్రపంచ ఆర్థిక సంస్థ (డబ్ల్యుటీవో)లో భారతదేశాన్ని సంస్థాపక దేశంగా చేర్చి, దేశ ఆర్థిక వ్యవస్థను సమూలంగా మార్చేయగల చర్యలకు పివి శ్రీకారం చుట్టారని వివరించారు.

స్వావలంబనకూ, స్వయంసమృద్ధికీ పెద్దపీట

కొన్ని అంశాల్లో పివితో  విభేదించినప్పటికీ, స్వావలంబన, స్వయం సమృద్ధికి పివి  పెద్ద పీట వేశారని  ఉపరాష్ట్రపతి తెలిపారు. ఆ కారణంగానే నేడు పరిశ్రమలు, శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారతదేశం అంతర్జాతీయ దేశాల సరసన నిలబడేందుకు మార్గం సుగమమైందని అన్నారు. ప్రారంభంలో అనేక రాజకీయ సవాళ్ళు ఎదురైనా, ఎంతో సాహసంతో అధిగమించి దేశ ఆర్థికాభివృద్ధిలో ప్రైవేట్ రంగలకు, మానవవనరులకు ప్రాధాన్యత ఇచ్చారన్నారు. దేశం తన కాళ్ళ మీద తాను నిలబడాలంటే కఠిన నిర్ణయాలు తప్పవన్న పివి  మాటలను ప్రస్తావించారు.పివి నరసింహారావు  అనేక మొక్కలు నాటారని, ఇప్పుడు అవి బలమైన వృక్షాలుగా  ఎదిగాయన్నారు. కొన్ని సవాళ్ళు ఎదురైనా, ఒక్కసారి మొక్కలు వృక్షాలుగా ఎదిగితే ఏనుగులు కూడా వాటిని పెకిలించడం కష్టసాధ్యమన్న  పివి  మాటలను ఈ సందర్భంగా గుర్తు చేశారు.

viplava tapasvi pv book unveiled by vice president venkaiah naidu

73, 74 రాజ్యాంగ సవరణలు

పంచాయితీల నుంచి మున్సిపాలిటీల వరకూ ఎన్నికలు జరిగేందుకు వీలుగా 73, 74వ రాజ్యాంగ సవరణలు, వీటిలో 33 శాతం రిజర్వేషన్ ద్వారా రాజకీయాల్లో మహిళల ప్రాధాన్యతను పెంచే చర్యలు సైతం పివి  హయాంలోనే జరిగిన విషయాన్ని  ఉపరాష్ట్రపతి గుర్తుచేశారు. పార్లమెంట్ స్థాయీ సంఘాల వ్యవస్థను ప్రవేశపెట్టి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చెయ్యడం, పార్లమెంట్ సభ్యుల నియోజకవర్గాల అభివృద్ధి కోసం ఎంపీ లాడ్స్ పథకాన్ని ప్రారంభించడం లాంటివి ఆయన క్రాంతదర్శనానికి నిదర్శనమని తెలిపారు. దేశ భవిష్యత్ ను విశాలమైన దృష్టితో వీక్షించి, తనకు ఘనత దక్కపోయినా, ఒక యోగిలా దేశానికి ఏది అవసరమో ఆయా కార్యక్రమాలను చేపట్టిన ద్రష్ట  పివి  అనడంలో  ఎలాంటి సందేహం లేదని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.

ప్రాచీన భారత ఆలోచనా విధానం

అవకాశాలను ఒడిసి పట్టడం, ప్రాచీన భారత ఆలోచనా విధానం ద్వారా మనిషి ఆధ్యాత్మిక బలాన్ని పెంచుకోవడం గురించి పివి గతంలో చెప్పిన అనేక అంశాలను ఉపరాష్ట్రపతి ప్రస్తావించారు.పివి  జీవితం నుంచి ఉదారవాద భావాన్ని, నిరాడంబరతను యువత అలవరచుకోవాలని సూచించారు. ముఖ్యంగా ప్రజా జీవితంలోకి రావాలనుకుంటున్న వారు, పివి  జీవితం గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలని తెలిపారు. బహుభాషా కోవిదుడు, సాహితీ వేత్త, పండితుడు. స్వాతంత్ర్య సమరయోధుడు అయిన పివి  నిజమైన దేశ భక్తుడని, అలాంటి వ్యక్తి తెలుగువారు కావడం జాతికి గర్వకారణమని వెంకయ్య  పేర్కొన్నారు.

కృష్ణారావుకి ప్రశంసలు

పివి ప్రధానమంత్రి పదవిని చేపట్టిన  కాలం నుంచి ఢిల్లీలో పని చేస్తున్న పుస్తక రచయిత  ఎ.కృష్ణారావు అనేక ఘట్టాలను దగ్గర నుంచి పరిశీలించారని, వాటన్నింటినీ సంకలనం చేసి ఈ పుస్తకాన్ని తీసుకురావడం అభినందనీయమని తెలిపారు. పాత్రికేయ వృత్తిలో రాణిస్తూనే కవిగా, రచయితగా తన కలానికి పదును పెట్టి అనేక రచనలు చేస్తున్న కృష్ణారావు  సాహితీ వ్యాసాంగాన్ని ఇలానే కొనసాగించి, మరిన్ని రచనలు తీసుకు రావాలని  ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. పివి శతజయంతిని పురస్కరించుకుని ఈ పుస్తకాన్ని ప్రచురించే చొరవ తీసుకున్న రాఘవేంద్ర పబ్లికేషన్స్ అధినేత  రాఘవేంద్రరావును ఉపరాష్ట్రపతి అభినందించారు.

ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు  కె.కేశవరావు, పుస్తక రచయిత  ఎ.కృష్ణారావు, పుస్తకర ప్రచురణకర్తలు రాఘవేంద్రరావు, రాఘవ, పాత్రికేయులు ఎ.శ్రీనివాసరావు, మా శర్మ పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles