- ఆగస్టు 15 నాటికి ప్రారంభించాలని అధికారులకు ఆదేశం
- కొవిడ్ ను సమర్దవంతంగా ఎదుర్కొనేందుకు క్లినిక్ ల ఏర్పాటు
- సీఎం వైఎస్ జగన్ నిర్ణయం
మే నాటికి గ్రామ సచివాలయాల నిర్మాణం పూర్తి కావాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ పనులు, గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ఏప్రిల్, మేనెలల్లో అమలు చేయనున్న సంక్షేమ పథకాలకు సంబంధించి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం వర్చువల్ గా సమీక్ష నిర్వహించారు. కొవిడ్ మహమ్మారిని సమర్దవంతంగా ఎదుర్కోవడానికి విలేజ్ క్లినిక్ లు ఏర్పాటు చేయనున్నట్లు సీఎం తెలిపారు. యుద్దప్రాతిపదికన వాటి నిర్మాణం పూర్తి చేసి ఆగస్టు 15న ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అధికారుల సమీక్షలో సీఎం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
రోగి ప్రాణాలు కాపాడటమే క్లినిక్ లక్ష్యం:
రెండు వేల జనాభా ఉన్న గ్రామాన్ని ఒక యూనిట్‌గా పరిగణించి విలేజ్ క్లినిక్‌ను ఏర్పాటు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. వైఎస్‌ఆర్ విలేజ్ క్లినిక్‌లో 24 గంటలు ఒక బీఎస్సీ నర్సింగ్ చదివిన నర్సింగ్ స్టాఫ్ ను అందుబాటులో ఉంచనున్నారు. రోగికి ఏదైనా జరిగితే సదరు ఆస్పత్రికి వెళ్తే ఉచితంగా వైద్యం అందుతుందని సలహాలు, సూచనలు ఇచ్చేలా విలేజ్ క్లినిక్ ఉండాలని సీఎం అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రాథమిక చికిత్స ఇచ్చి రోగిని అపాయంనుండి కాపాడటమే విలేజ్ క్లినిక్ లక్ష్యమని సీఎం అన్నారు. చిన్న చిన్న సమస్యలకు చికిత్సలు చేసి మందులు ఇవ్వాలని, పెద్ద సమస్యలకు రెఫరల్ పాయింట్‌గా పనిచేయాలని అన్నారు.
ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గంలో బీఎంసీ:
రాష్ట్రవ్యాప్తంగా 9899 బల్క్ మిల్క్ కూలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. సెప్టెంబరు నెలలో బీఎంసీలను ప్రారంభించాలని అధికారులకు లక్ష్యాన్ని నిర్దేశించారు. 25 ప్రాసెసింగ్ యూనిట్ల కోసం సరైన ప్రదేశాల్లో భూములను గుర్తించాలని ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక యూనిట్ చొప్పున ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
Also Read: ఏపీలో అంగన్ వాడీ కేంద్రాలకు మహర్దశ