- 13వ నాకౌట్ కు విజేందర్ రెడీ
- గోవా వేదికగా రష్యన్ బాక్సర్ తో ఢీ
ప్రో-బాక్సింగ్ చరిత్రలోనే ఓ అరుదైన సమరానికి గోవా రాజధాని పనాజీ వేదికగా రంగం సిద్ధమయ్యింది. మాండోవి నదిలో మెజిస్టిక్ ప్రైడ్ క్యాసీనో షిప్ పై భాగంలో ప్రత్యకంగా ఏర్పాటు చేసిన బాక్సింగ్ రింగ్ లో జరిగే ఈ సమరంలో రష్యన్ బాక్సర్ లొప్సన్‌తో భారత ప్రో-బాక్సింగ్ స్టార్ విజేందర్ తలపడబోతున్నాడు. శుక్రవారం జరిగే ఈ పోరులో విజేందర్ నాకౌట్ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాడు. 2019 తరువాత విజేందర్ కు ప్రో-బాక్సర్ గా ఇదే తొలిసమరం.
సూపర్ మిడిల్ వెయిట్ విభాగంలో జరిగే ఈ బౌట్‌లో విజేందర్ ప్రత్యర్థి లాప్సన్ ఇప్పటివరకు ఆరు ప్రొఫెషనల్ బౌట్‌లలో పాల్గొనగా… నాలుగింటిలో విజేతగా నిలిచాడు. కాగా, 2019, నవంబర్‌లో చివరిసారి బాక్సింగ్ రింగ్ లోకి దిగిన విజేందర్..కామన్వెల్త్ గేమ్స్ మాజీ చాంపియన్ చార్లెస్ అడామూ (ఘనా)ను ఓడించాడు. దాంతో తన విజయాల సంఖ్యను 12కు పెంచుకున్నాడు.
ప్రో- బాక్సర్ గా 12-0 రికార్డు
2008 బీజింగ్ ఒలింపిక్స్ బాక్సింగ్ లో, 2009 ప్రపంచ బాక్సింగ్ లో భారత్ కు పతకాలు అందించిన తొలి బాక్సర్ ఘనతను సొంతం చేసుకొన్న 36 ఏళ్ల విజేందర్ సింగ్ 2015లో ప్రొఫెషనల్ బాక్సర్ గా మారాడు. అమెరికాలోని విఖ్యాత బాక్సింగ్ ప్రమోటర్ బాబ్ ఆరుమ్ పర్యవేక్షణలో శిక్షణ పొందుతూ…గత ఐదేళ్ల కాలంలో తలపడిన 12కు 12 ప్రోఫైట్లలో విజేందర్ అజేయంగా నిలిచాడు.
కొత్త దశాబ్దం తొలి సంవత్సరంలో నాలుగు పైట్లతో పాటు…ప్రపంచ టైటిల్ సాధించాలన్నది తన లక్ష్యమని విజేందర్ ప్రకటించాడు. 2019 నవంబర్ లో ఘనా బాక్సర్ చార్లెస్ ఆడం పై అలవోక విజయం సాధించడం ద్వారా గత ఏడాదిని విజేందర్ అజేయంగా ముగించగలిగాడు. ప్రముఖ ట్రెయినర్ లీ బియర్డ్ శిక్షణలో సాధన చేస్తున్న విజేందర్ గురుగ్రామ్ లోని జిమ్ లో ప్రాక్టీస్ అనంతరం పనాజీ చేరుకొన్నాడు. ఇప్పటికే ప్రపంచ బాక్సింగ్ ఆసియా-పసిఫిక్, ఓరియంటల్ సూపర్ మిడిల్ వెయిట్ టైటిల్స్ సాధించిన విజేందర్…ప్రపంచ టైటిల్ సాధించడమే లక్ష్యమని చెబుతున్నాడు.