జాన్ సన్ చోరగుడి
తప్పు జరిగింది. విజయవాడలో జరగగూడనిది జరిగింది. ఎక్కడ జరిగినా అది తప్పే, కానీ ఇక్కడ జరగడం ద్వారా- ‘మొదటి నుంచి మేము ఎక్కడ ఉండామో… అక్కడే ఉన్నాము’ అని మరొకరు అడక్కుండానే విజయవాడ చెప్పినట్టు అయింది. ఈ పనిచేసి- ‘బెజవాడ’ నుంచి ‘విజయవాడ’కు దశాబ్దాలుగా జరుగుతున్న ‘ప్రయాణం’ ఎప్పటికీ పూర్తికాదేమో అనే సందేహం మనమే కలిగించాము. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి పై 13 ఏప్రెల్ 2024 న విజయవాడలో జరిగిన హత్యా ప్రయత్నం ఒక అతిపెద్ద అసాంఘిక సంఘటనగా ‘రికార్డై’ ఇకముందు అది ఈ నగర చరిత్రలో శాస్వితంగా ఉంటుంది.
ఇప్పటికి పదేళ్ళ క్రితం, మరో నెల రోజుల్లో రాష్ట్ర విభజన జరుగుతుంది అనగా మే 2014 లో రాజధానికి నగరం కోసం అనుకూలమైన ప్రాంతాన్ని కేంద్రానికి సూచించడం కోసం శివరామ కృష్ణన్ కమిటీ రాష్ట్రమంతా పర్యటిస్తూ విజయవాడ వచ్చింది. కమిటీ సభ్యులు జిల్లా, నగర అధికారుల బృందంతో జరిపిన భేటిలో అడిగిన ప్రశ్నల్లో విజయవాడ నగరంలో- కార్మికుల సమ్మెలు, హర్తాళ్లు, బందులు, అసాంఘిక శక్తుల కార్యకలాపాలు, మాదక ద్రవ్యాల లభ్యత, నేరాలు, మహిళల భద్రత, రాజకీయ నేరాలు, హత్యలు వంటి వివరాలు సేకరించారు.
ఆ రోజు మీటింగ్ లో వారు అడిగిన వాటికి కలెక్టర్ కేవలం జనభా వైశాల్యం ప్రభుత్వ భూమి లభ్యత గురించిన సమాచారం ‘వుడా’ అధికారులు తెచ్చిన మ్యాప్ చూపించి వివరిస్తే, ఎక్కువ వివరాలు పోలీస్ కమీషనర్ నుంచి వారు రాబట్టారు. కేంద్ర హోంశాఖ నియమించిన ఆ బృందంలో డా. ఆరోమర్ రెవి ఒక సభ్యుడు. ఆయన బెంగుళూరు- ‘ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఫర్ హ్యూమన్ సెటిల్మెంట్స్’ వ్యవస్థాపక డైరక్టర్. ఈ కమిటీ ప్రభుత్వానికి ఇచ్చిన ‘రిపోర్ట్’ను పక్కకు నెట్టి అ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ‘నారాయణ కమిటి’ని వేసింది కనుకనే, ప్రభుత్వమే రాజధాని ప్రాంతంలో బలహీన వర్గాలకు ఇళ్ళ స్థలాలు ఇస్తే, సామాజిక సమతౌల్యం దెబ్బ తింటుంది, అని అంత ధైర్యంగా అనగలిగింది.
డా. ఆరోమర్ రెవి
సరే, ఇటువంటి సున్నితమైన అంశాలు పట్టించుకునేంత- ‘వేవ్ లెంగ్త్’ మన రాజకీయ నాయకులకు ఉంటుంది అనేంత ఆశ అయితే మనకేమీ ఉండనక్కరలేదు గానీ, ఇక్కడి ‘సివిల్ సొసైటి’కి కూడా అటువంటి దృష్టి లేకపోవడమే అస్సలు సమస్య. అదే కనుక ఉండి ఉంటె, ఈ పాటికి ఒక ‘న్యూట్రల్ థింక్ ట్యాంక్’ ఇక్కడ ఏర్పడి ఉండేది. అదేమీ కనిపించదు సరి కదా, అధికార-ప్రతిపక్షం ఏదో ఒక దాన్ని సమర్ధించే వైఖరి గల వేదికలు మాత్రమే ఇక్కడ తరుచు ‘మీడియా’లో కనిపిస్తాయి.
విజయవాడ నగరం ఇటువంటి ‘మిడియోకర్’ స్థాయికి మించి ఎదగకలేక పోవడానికి కారణాలు వాటి మూలాలు ఏంటి, అనే అరా తీయడానికి ఇది సమయం సందర్భమూ కాదు గానీ, ఈ నగరం ‘సైక్’ను దృష్టిలో ఉంచుకొని, దీని సమీపాన రాష్ట్ర ‘రాజధాని’ నిర్మాణం జరగాలని చేసిన ఆలోచన ఉందే, దాని ఆదిలోనే హంసపాదు ఉందేమో అనిపిస్తుంది!
ఇంత మాట అనడానికి, తప్పనిసరి కావడంతో ఈ వ్యాస రచయిత ఇప్పటికి 25ఏళ్ల క్రితం 1999లో రాసిన ‘మన విజయవాడ’ గ్రంధం ‘కవర్’ పైన ఆంగ్లంలో పెట్టిన సబ్ టైటిల్- ‘ఫ్రం కంటోన్మెంట్ టు కాస్మోపాలిటిన్ ఏ శాగా ఆఫ్ ఏ రివర్ సిటి’ అని మళ్ళీ ఇక్కడ గుర్తు చేయవలసి వచ్చింది. అదే రచనను 2015లో కొన్ని అదనపు అంశాలతో వెలువరించిన రెండవ ఎడిషన్ కు పెట్టిన సబ్ టైటిల్- ‘సోల్ సెర్చింగ్ ట్రావెల్ ఆఫ్ ఏ రివర్ సిటి’. అయితే అది ఎప్పటికి పూర్తి అవుతుందో ఇప్పటికైతే తెలియదు.
ఈ నగరం ‘సైక్’ను మొదటి నుంచి దగ్గరగా చూస్తూ ఫాలో’ అవుతున్న సినిమా దర్శకుడు రామ్ గోపాల వర్మ బెజవాడ ఏలూరు రోడ్డు సెట్స్ వేసి మరీ 1993లో ‘గాయం’ చిత్రం తీసాక, అక్కడితో ఆగలేదు. ఏకంగా ‘బెజవాడ’ అంటూ 2011లో మరో సినిమా తీసాడు. అప్పటి మొదలు ప్రధానంగా రాష్ట్ర విభజన తర్వాత ఆయన తీసిన తెలుగు సినిమాలకు కధా నేపధ్యం అయితే బెజవాడ లేదా టిడిపి రాజకీయాలు అయ్యాయి. సినిమా వాళ్ళు ఒక కధ‘మార్కెట్’ అవుతుంది అనే నమ్మకం ఉంటేనే, దాంతో సినిమా తీస్తారు కనుక దాన్లో తప్పు పట్టడానికి ఏమీ లేదు.
ఎవడో ఆకతాయి ముఖ్యమంత్రి పైకి రాయి విసిరితే, దానికి ఇంత సొద అవసరమా? అనే ‘జెనరేషన్’ ఉన్న కాలంలో మనం ఇప్పుడు వున్నాము. ఆ సంగతి తెలసి, ఆ ఎరుకతోనే ఈ వ్యాసం రాస్తున్నది కూడా. అయితే, విషయం అదికాదు. విజయవాడ నగరం మధ్య ఉన్న కాలువల ఒడ్డున ఉండే ఇళ్ళు అనబడే గుడిసెలు సింగ్ నగర్ బ్రిడ్జి దాటి సుభాష్ చంద్ర బోస్ కాలనీ అయ్యాక, జరిగిన కధ ఏమిటో చూడాల్సి ఉంది. కాల్వ ఒడ్డున ఉన్నప్పుడు చౌకగా దొరికిన ‘కిరాయి మూకలు’ కాలనీల్లో స్వంత ఇళ్ళలోకి వెళ్ళాక వారి ‘సర్వీసు’లు ఖరీదు అయ్యాయి; వాటిని పోషించే వారి ‘ప్రొఫైల్’ కూడా మారింది.
ఇప్పుడు వీళ్ళలో ఎవరికి నగరం ‘ప్రొఫైల్’ పట్ల యావ ఉన్నదీ వెతకాల్సి ఉంది. ఈ వ్యాసం ముగిస్తున్నప్పుడు, ముఖ్యమంత్రి మీదికి రాయి విసిరి గాయానికి కారణం అయిన అనుమానితులు ఐదుగురిని పోలీసులు పట్టుకుని విచారిస్తున్నారు. వాళ్ళలో ఇద్దరి పేర్లు- చిన్నా, దుర్గారావు. చిత్రం ఏమంటే, రామ్ గోపాల వర్మ బెజవాడ మీద తీసే సినిమాల్లో తరుచు ఈ రెండు పేర్లు ఉంటాయి!
‘రిపేర్’ అంటూ చేయడానికి పూనిక కనుక ఉంటే అది జరగాల్సింది ఇక్కడ. అయితే, అటువంటి ప్రయత్నం జరగలేదు సరి కదా, వారి మానాన వారిని బతకనీయకుండా ఇక్కడి ఎస్సీ, ఎస్టీ పిల్లల్ని బాల నేరస్తులని చేసే యంత్రాంగం నగరంలో ప్రజా ప్రతినిధుల ఆఫీసుల్లో పనిచేస్తున్నది. ఒకప్పుడు వీరి కోసం పనిచేసే ‘ఎన్జీవో’లు చురుగ్గా కనిపించేవి. ఇప్పుడు అవి లేవు. ప్రభుత్వాలది ఏముంది ఐదేళ్లకు ఒకసారి ఎవరో ఒకరు వస్తారు వెళతారు. కానీ విజయవాడ పేరు ఎత్తితే చాలు, ‘అమ్మో’ అనే ‘ఫీల్’ను మాత్రం ఎవరూ ఒదిలించ లేకపోతున్నారు.
మేము అధికారంలోకి వస్తే, నాణ్యమైన మద్యం సరఫరా చేస్తాం అనేవాళ్ళ మాటలు అటుంచి, రేపు బందరు పోర్టు రద్దీ పెరిగాక, దాని ఒత్తిడి గంటన్నర ప్రయాణం దూరంలోని విజయవాడ నగరంపై ఎలా ఉండబోతున్నది… అనేది ఇప్పటి నుంచే ఆలోచించడం, ఎన్నిక కాబోయే కొత్త ప్రభుత్వం బాధ్యత అవుతుంది.