`అడుసు తొక్కనేల కాలు కడుగనేలా..?` అనే సామెతలా రాజ్యసభ చైర్మన్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుపై నిన్న (సోమవారం) తాను చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈ రోజు (మంగళవారం, 09 జనవరి 2021) న క్షమాపణలు కోరారు. ఆవేశంతో అలా అన్నాను తప్ప మిమ్మల్ని, మీ స్థానాన్ని కించపరిచే ఉద్దేశం లేదని, ఇలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్త పడతానని కూడా విజయసాయిరెడ్డి వివరణ ఇవ్వడంతో వెంకయ్య `వదిలేయండి` (లీవ్ఇట్) అని క్లుప్తంగా స్పందించారు. `వెంకయ్య నాయుడు పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారనీ, ఆయన మనసు బీజేపీతో, తనువు టీడీపీతో ఉన్నాయనీ ఎంపీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆయన వ్యాఖ్యలను రాజకీయాలకు అతీతంగా అన్ని పక్షాల నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ వాటిని రికార్డుల నుంచి తొలగించాలనీ, ఆయనపై చర్య తీసుకోవాలనీ పట్టుబట్టాయి. విజయసాయిరెడ్డి క్షమాపణలకు ముందు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి కల్పించుకుంటూ `నిన్న వైసీపీ సభ్యుడు చేసిన వ్యాఖ్యలు సరికాదు. ఆ సంఘటన గర్హనీయం` అన్నారు. జరిగిన దానికి వెంకయ్యనాయుడకి క్షమాపణ చెప్పాలని విజయసాయరెడ్డిని కోరారు.
‘‘ఆ వ్యాఖ్యలు పట్టించుకోను..నేను ఎవరి వ్యాఖ్యలు పట్టించుకోను. కానీ వైసీపీ సభ్యుడి వ్యాఖ్యలు వ్యక్తిగతంగా నన్ను బాధించాయి. నేను పార్టీలకు అతీతుడిని. ఉప రాష్ట్రపతి పదవికి నా పేరు ప్రతిపాదించిన వెంటనే అప్పటి పదవికి రాజీనామా చేశాను. నా మనసు దేశ ప్రజలతో మమేకమై ఉంది` అని వెంకయ్యనాయుడు వివరించారు.
Also Read: బడ్జెట్ తో ఎన్నికల రాజకీయాలా …?
ఈ నెల 4వ తేదీన రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగం చర్చ సందర్భంగా టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ చేసిన ప్రసంగంపై సోమవారం నాటి సమావేశంలో పాయింట్ ఆఫ్ ఆర్డర్ కింద విజయసాయిరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేయగా, ప్రస్తుత అంశం పాయింట్ ఆఫ్ ఆర్డర్ కిందకి రాదనీ, మీకున్న అభ్యంతరాలు రాసి పంపితే పరిశీలిస్తాననీ వెంకయ్యనాయుడు సమాధానమిచ్చారు. సభ్యుడు మాట్లాడేటప్పుడు మాత్రమే పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తేందుకు వీలుంటుందనీ, మిగతా సమయాల్లో కాదనీ కూడా వివరించారు. అయితే తెదేపా సభ్యుడు లేవవనెత్తిన అంశాలు సభకు సంబంధించినవి కావంటూ విజయసాయిరెడ్డి ప్రసంగాన్ని కొనసాగిస్తూ వెంకయ్యనాయుడిపై వ్యక్తిగత విమర్శలు చేశారు. దీనిపై ప్రధాన ప్రతిపక్ష నేత గులాంనబీ అజాద్, కాంగ్రెస్ సీనియర్ ఎంపీ జైరాం రమేష్, బిజూ జనతాదళ్ సభాపక్ష నేత ప్రసన్న ఆచార్య తీవ్ర అభ్యంతరం తెలిపారు.