- గ్రేటర్ టీఆర్ఎస్ లో అసమ్మతి
- గల్లంతయిన విజయారెడ్డి ఆశలు
- చివరిక్షణం వరకు ఉత్కంఠ
జీహెచ్ఎంసీ మేయర్, డిప్యుటీ మేయర్ ఎన్నిక టీఆర్ఎస్ లో అసమ్మతి బయటపడింది. గ్రేటర్ మేయర్ పీఠంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే దివంగత నేత పి జనార్ధన్ రెడ్డి కుమార్తె విజయారెడ్డి కి టిఆర్ ఎస్ నాయకత్వం షాక్ ఇచ్చింది. మేయర్ ఎంపిక విషయంలో కొత్త వారికి అవకాశం ఇస్తామని ప్రకటించటం, పైగా మహిళలకు రిజర్వ్ కావటంతో మేయర్ పదవిపై పీజేఆర్ కుమార్తె ఆశలు పెట్టుకున్నారు. తను ఎమ్మెల్యేగా పోటీ చేసి రెండోస్థానంలో ఉన్న సమయంలో టీఆర్ఎస్ లో చేరితే తగిన ప్రాధాన్యం కల్పిస్తామని పార్టీ నాయకత్వం హామీ ఇచ్చింది.
దీంతో కార్పొరేటర్ గా రెండో సారి విజయం సాధించిన విజయా రెడ్డి మేయర్ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. అధిష్ఠానం నుంచి దీనిపై పార్టీ స్పష్టత ఇవ్వకపోగా చివరి వరకు సస్పెన్స్ కొనసాగించింది. మేయర్ అభ్యర్థిగా కేకే కూతురు విజయలక్ష్మి, డిప్యుటీ మేయర్ గా మోతే శ్రీలతను చివరి క్షణంలో ఎంపిక చేసింది. దీంతో కార్పొరేటర్ గా ప్రమాణ స్వీకారం చేసి మేయర్ ఎన్నికలో పాల్గొనకుండానే ఆమె కారెక్కి వెళ్లిపోయారు. గతంలో కూడా విజయారెడ్డికి మేయర్ పీఠం దక్కుతుందని పీజేఆర్ అభిమానులు, అనుచరులు భావించారు. అప్పుడు కూడా టీఆర్ఎస్ అధిష్టానం ఆమెను నిరాశపరిచింది. ఈసారైనా మేయర్ పీఠం దక్కుతుందని ఆమె భావించినా టీఆర్ఎస్ మొండి చెయ్యి చూపించడంతో విజయారెడ్డి తీవ్ర అసంతృప్తికి లోనై మేయర్ ఎన్నికల్లో పాల్గొనకుండా వెళ్లిపోయారు. దీంతో టీఆర్ఎస్ నేతలు ఆమెను బుజ్జగించి వెనక్కి రప్పించినట్లు సమాచారం.
పోటీలో పలువురు మహిళలు:
మేయర్ పదవి మహిళలకు రిజర్వు కావడంతో పలువురు మహిళలు ఆశలు పెట్టుకున్నారు. తమ పలుకుబడిని ఉపయోగించి చివరి క్షణం వరకు పైరవీలు చేశారు. మేయర్ పీఠం కోసం మొదటి నుంచి అధికార టీఆర్‌ఎస్ పార్టీలో విపరీతమైన పోటీ నెలకొంది. మాజీ మేయర్ బొంతు రామ్మెహర్ భార్య శ్రీదేవితో పాటు సింధు ఆదర్శ్ రెడ్డి, చింతల శాంతి, పీజేఆర్ కుమార్తె విజయా రెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపించాయి. మేయర్ ఎంపికపై ఇటీవలే మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పార్టీ అధినేతను కూడా కలిశారు. అయితే, రాజకీయ, సామాజిక సమీకరణాలు దృష్టిలో ఉంచుకుని చివరిక్షణం వరకు అభ్యర్థి ఎంపికపై గుంభనంగా వ్యవహరించిన కేసీఆర్ మేయర్ పదవికి కేకే కుమార్తెను ఎంపికచేశారు.
ఇదీ చదవండి: బల్దియాపై గులాబీ జెండా రెపరెపలు