- కుమార్తెతో సంఘీభావంగా కొనసాగాలని నిర్ణయం
- 2024లో కూడా జగన్ గెలుస్తాడని విశ్వాసం
- రెండు పార్టీలలో ఉండటం ధర్మం కాదని రాజీనామా
వైఎస్ఆర్ సీపీ గౌరవ అధ్యక్ష పదవికి వైఎస్ విజయలక్ష్మి (విజయమ్మ) రాజీనామా ప్రకటించారు. గురువారం ఉదయం గుంటూరులో ప్రారంభమైన వైఎస్ఆర్ సీసీ ప్లీనరీలో ప్రసంగిస్తూ ఆమె ఈ ప్రకటన చేశారు. అప్పుడు వేదికపైన వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉన్నారు. తన కుమార్తె వైఎస్ షర్మిల తెలంగాణలో ఒంటరి రాజకీయ పోరాటం చేస్తోంది కనుక ఆమెతో ఉండటమే న్యాయమని తన అంతరాత్మ చెబుతోందని విజయమ్మ అన్నారు.
‘‘నా కుమారుడు కష్టాలలో ఉన్నప్పుడు అతనితో ఉన్నాను. ఇప్పుడు వాళ్ళు హాయిగా ఉన్నారు. ప్రస్తుతం పొరుగురాష్ట్రమైన తెలంగాణలో నా కుమార్తె రాజకీయ పోరాటం చేస్తోంది. ఆమె మహిళ. ఆమెకు నా అవసరం ఉంది. రెండు పార్టీలలో ఉండటం పద్దతి కాదని భావించి ఈ పార్టీకి రాజీనామా చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత రెండు రాష్ట్రాల మధ్య అభిప్రాయభేదాలు రావడం సహజం. జగన్ నాయకత్వంలోని పార్టీకీ, షర్మిల నడుపుతున్న పార్టీకీ మధ్య కూడా భిన్నాభిప్రాయాలు ఉండటంలో తప్పు లేదు. ఎవరో తాను రాసినట్టు ఒక లేఖను నా సంతకంతో విడుదల చేశారు. ఆ లేఖలోని అంశాలతో కానీ, ఆ సంతకంతో కానీ నాకు సంబంధం లేదు. ఇష్టం వచ్చినట్టు కొందరు తల్లీకొడుకుల మధ్య విభేదాలనీ, అన్నా చెల్లెల్ల మధ్య గొడవలనీ రాస్తున్నారు. దుర్మార్గంగా ప్రచారం చేస్తున్నారు. ఇటువంటి వివాదాలకు అతీతంగా ఉండేందకే నేను వైఎస్ఆర్ సీపీకి రాజీనామా చేస్తున్నాను,’’అంటూ విజయమ్మ చెప్పారు.
షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీ స్థాపించడానికి ప్రయత్నాలు ప్రారంభించినప్పుడు జగన్ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి అటువంటి ఆలోచనను తప్పుపట్టారు. సరిగా సంవత్సరం కిందట షర్మిల పారీ నెలకొల్పిన తర్వాత ఆ పార్టీతో వైఎస్ఆర్ సీపీ ఎటువంటి సంబంధబాంధవ్యాలూ లేవని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత మిగిలిన ఆంధ్రప్రదేశ్ కు జగన్ మోహన్ రెడ్డి 2019 లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనకూ, తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు (కేసీఆర్)కూ సత్సంబంధాలే కొనసాగుతున్నాయి. నదీజలాలలో వాటా, కృష్ణ, గోదావరి నదులపైన ప్రాజెక్టుల గురించి అభిప్రాయభేదాలు ఉన్నప్పటికీ ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య స్నేహసంబంధాలు చెక్కుచెదరలేదు.