Sunday, December 22, 2024

దసరా రోజున తెగి పడవలసిన పది తలలు ఇవే

దసరా అంటే ‘దశ హర’ అంటే పది తలలను సంహరించడం అని అర్థం. పది రకాల చెడు ఆలోచనలను పరిహరిస్తేనే దసరా  సరదా అని చెప్పే పండుగ ఇది. మనదేశంలో ప్రతి పండుగకు ఒక పరమార్థం ఉంటుంది. మంచితనం నేర్పడం పర్యావరణాన్ని రక్షించడం. మనం చంపేయవలసిన పది దుర్మార్గపు ఆలోచనలు ఇవి:

  1. కామవాసన తొలి తల:  (ఎంత చదువుకున్నా, లైంగిక వేధింపులు చేసే వెధవ లక్షణం అన్నమాట.. మనం ఇటీవలే చూశాం, చాలా అత్యున్నత స్థానంలో ఉన్న ఒకాయన లైంగిక వేధింపులకు గురిచేశాడనే ఆరోపణ ఎదుర్కోవడం, అన్యాయపు విచారణ ద్వారా బయటపడ్డట్టు ఓ తీర్పు సృష్టించుకోవడం, పదవిలో ఉన్నంత కాలం సర్కారువారికి ఇష్టపూర్వకంగా వ్యవహరించి, తరువాత వారు పెట్టిన భిక్ష గా ఒక చట్టసభలో సభ్యత్వం స్వీకరించి ధన్యుడు కావడం. ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా అథః పాతాళంలోకి తోసేది కామవాసన. రేప్ చేసే నేరగాళ్లకు, లైంగిక వేధింపులు చేసే పెద్దవాళ్లకు పెద్ద తేడా ఏమీ ఉండదు. ఇది నేటి రావణాసురుడి మొదటి తల.
  2. కోపం లేదా క్రోధం రెండో తల. విభీషణుడి వంటి ఉత్తమమైన సోదరుడిని తన్ని తగలేసే కోపం రావణుడి రెండో తల. ప్రతి కుటుంబంలో కోపమే కలహానికి కారణం. అందుకే విడాకులు, వివాదాలు, హింసలు, హత్యలు.
  3. మోహం మూడో తల: మోహం వస్తువులంటే చాలా ప్రేమ. సంపద, గాడ్జెట్ల మీద ప్రేమ. తన బంధువైన కుబేరుడి పుష్పక విమానం ఎత్తుకుపోతాడు రావణుడు. బాంధవ్యాలు విలువలు అక్కర్లేదు.
  4. నాలుగో తల లోభం: లోభం అంటే అంతా నాకే కావాలనే దరిద్రులు: ఎవడెట్లపోయినా సరే నాకు కోట్ల రూపాయలు సమకూరాలనే లంచగొండి అధికారులు, కార్పొరేట్ మోసగాళ్లకు వేల కోట్లు సంపాదించి అందులో పరోక్షంగా కొన్ని కొట్టేసే రాజకీయ నాయకులు ఈనాటి రావణాసురుని నాలుగో తల.
  5. గర్వం  అయిదోతల. నా అంతగొప్పవాడు మరొకడు లేడనే అభిప్రాయం.  నా అంత అందగత్తె మరెవతీ కాదనే నమ్మకం. ఈ గర్వం వల్ల సంబంధాలు దెబ్బతింటాయి. మిత్రులు ఉండరు. బాంధవ్యాలు పోతాయి. బాగా చదువుకున్నానని గర్వం. గొప్ప భక్తుడిని నేనే అనే గర్వం. నెలకోసారి లేదా రెండు సార్లు తిరుపతికో కాశీకో పోయి దేవుడి దీవెనలు పొందుతాననే గర్వం. అసలు గర్వానికి పరిమితులు లేవు. ప్రధానమంత్రిలో కూడా కనిపించనంత గర్వం గ్రామంపంచాయతీ సభ్యుడికి ఉంటుంది. రావణుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కంసుడు, ఇట్లా మన పురాణాల్లో బోలెడు పాత్రలు గర్వానికి ప్రతీకలు గా ఉంటాయి.
  6. ఆరోది ఈర్ష్య… అసూయ టన్నులకొద్దీ ఉంటుంది కొందరిలో. దాంతో వారు చంపడానికి కూడా వెనుకాడరు. కుటుంబాల్లో తోటి సభ్యులు, ఆఫీసుల్లో తోటి ఉద్యోగుల ఈర్ష్య వల్ల వారూ ప్రశాంతంగా ఉండరు మరొకరిని ఉండనివ్వరు. ఇది ఆరో తల. రాముడి మీద రావణుడికి ఈర్ష్య. ఈర్ష్యకు దుస్తులు వేస్తే దుర్యోధనుడు, కర్ణుడు అవుతారు. 
  7. ఏడో తల స్వార్థం. నేను నాకు నాది అంతా నాకే అనే లక్షణాలకు తోడు నాకోసం నాకే కావాలి అనేవి కొన్ని.  పక్కవాడు ఏమైపోతే నాకేం. నా కడుపు నిండితే చాలు. సమాజం గురించి పట్టించుకోరు. పక్కవాడి బతుకు అక్కరలేదు. మహాభారతంలో ధృతరాష్ట్రుడు దీనికి గుర్తు. అపార్ట్ మెంట్ మెదళ్లు ఇరుగూ పొరుగూ పై వాడు కింది వాడు పట్టని వారు. వీరికి కింద పునాది ఉండదు, పైన ఆకాశం ఉండదు. నేటి నవనాగరిక రావణుని ఏడో తల ఇది.
  8. ఎనిమిదోది ‘అన్యాయం’: అసలు న్యాయం ఏమిటనేదే పట్టని వారు మన వారు. రాజకీయ నాయకులు, అధికారంలో ఉన్నవారిలో చాలా మంది, డబ్బు సంపాదన తప్ప మరో లక్ష్యం లేని వారు న్యాయాన్యాయాలను పట్టించుకోరు. మరొకరి భార్యను ఎత్తుకు పోవడం అన్యాయం అని అనిపించదు. నేనే బలవంతుడిని నేను చేసే పని ఏదైనా న్యాయమే అంటాడు ఆనాటి రావణుడు ఈ నాటి కిడ్నాపర్, మనుషులు ఎత్తుకుపోయే నేతలు, రేపిస్టులు ఈ కోవకే చెందుతారు. కోర్టుల్లో కూడా అన్యాయం చేస్తారు. న్యాయవాదులు కొందరు డబ్బు తీసుకుని అన్యాయానికి అండదండలు ఇస్తారు. న్యాయమూర్తులు కొందరు అన్యాయపు తీర్పులు ఇస్తారు. కులపక్షపాతం, మాజీ జూనియర్ పట్ల పక్షపాతం, పార్టీ పక్షపాతం, పక్షపాతానికి ఎన్నో రూపాలు. ఇవన్నీ అన్యాయానికి ప్రతిరూపాలు. దుర్యోధనుడు, రావణాసురుడు తన పని న్యాయమైందని చేసే వాదన వింటే కొందరు లాయర్ల వాదన గుర్తుకు వస్తుంది.
  9. క్రూరత్వం తొమ్మిదో తల: ఇది మానవత్వానికి వ్యతిరేకం. ఇదివరకు రాక్షసులు మాత్రమే క్రూరంగా వ్యవహరించే వారు. ఈ రోజుల్లో మనుషులు , ఆప్త బంధువులు అనుకున్నవారు కూడా క్రూరంగానే ఉంటున్నారు. లేకపోతే ఈ రేప్ లు హత్యలు ఎందుకు జరుగుతున్నట్టు? ప్రతిరేపిస్టూ పైకి కనిపించే క్రూరుడు. డబ్బు తీసుకుని వారిని తప్పించే పెద్ద కులాల వాళ్లు, సాక్ష్యాలు తారుమారు చేసే పోలీసు అధికారులు, వారిని సమర్థించే ముఖ్యమంత్రులు వారిని రక్షించే పార్టీలు, వారివెనుక ఉండే సోకాల్డు సేవా సంఘాలు పైకి కనిపించని క్రూరులు. మన పార్టీ వాడైతే చాలు వాడు రేపిస్టయినా హంతకుడయినా ఫరవాలేదు. కన్న కూతురైనా సరే కులంకాని వాడిని ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్లిపోతే బతక నివ్వని వాడు క్రూరుడు. 
  10. పదోది అహంకారం: నేనే గొప్ప అనే దురహంకారం. ఇది నిజంగా ఒక మానసిక రోగం. పిచ్చి. ఇంత పెద్దలోకంలో ఒక ఎకరం జాగ ఉంటే వాడు ప్రపంచ విజేత అలెగ్జాండర్ అనుకుంటాడు. అలెగ్జాండర్ విశ్వవిజేత అవునో కాదో కాని ఓ చిన్న రోగానికి బలై చనిపోయాడు. కరోనా ముందు ఘనాఘనులంతా తల వంచి పోతుండడం మనం చూస్తూనే ఉన్నాం. వీళ్ల అహంకారం అంతులేనిది. రాముడు అలవోకగా ఎక్కుపెట్టి తాడు బిగిస్తూ విల్లును విరగ్గొట్టిన శక్తిమంతుడు. ఆ విల్లు కనీసం ఎత్తడం చేతకాదని తేలిసినప్పుడైనా రాముడి బలం అర్థం కావాలి. కాని అహంకారం అడ్డొచ్చి బుద్ది పనిచేయదు. ఇది రావణుడి పదోతల.

బ్రహ్మరుద్రులను ప్రత్యక్షం చేసుకోవడానికి తన పదితలలు తానే తెగనరికి అపూర్వమైన త్యాగం చేసి రావణుడు ప్రపంచం మొత్తాన్ని జయించేంత వీరుడవుతాడు. కాని ఇప్పడిదాకా వివరించిన పది దుర్మార్గ లక్షణాలతో భయంకరంగా పెరిగిపోయిన ఈ రాక్షసుడి పది తలలను మంచివాడైన రాముడు మాత్రమే నరికి పారేస్తాడు. అదే దశ హరా… విజయదశమి. తొమ్మిది రాత్రుల తరువాత వచ్చే విజయోత్సవం.

పంట పర్యావరణం

ఖరీఫ్ పంట చేతికొచ్చే కాలం కనుక పండుగ చేసుకుంటారు. రబీ పంట దీపావళితో మొదలవుతుంది. వర్షాలు తగ్గిపోయి చల్లని కాలం ఆరంభమవుతుంది. జమ్మిచెట్టును పూజించడం, బతుకమ్మ పేరుతో పసుపు గౌరమ్మ తల్లిని తొమ్మిదిరోజులు రకరకాల పూలతో పూజించడం వెనుక పర్యావరణాన్ని రక్షించడం, పూల బతుకమ్మలను చెరువులో చేర్చి చెరువులను రక్షించడం ఈ పండుగల లక్ష్యం.

Prof M Sridhar Acharyulu
Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles