- కేరీర్ పాడుచేసుకోకుండా తప్పుకోమంటూ సలహా ఇచ్చిన ఏస్ బౌలర్
- ‘నంద్రి, వణక్కం’ అంటూ బయోపిక్ ప్రాజెక్ట్ కు గుడైబై చెప్పిన విజయ్ సేతుపతి
- సన్ రైజర్స్ హైదరాబాద్ కోచ్ గా యునైటెడ్ అరబ్ ఎమరేట్స్ లో మురళీథరన్
- తమిళ దర్శకుల, నటుల ఒత్తిడితో ఒక కొలిక్కి వచ్చిన బయోపిక్ కథ
శ్రీలంక బౌలర్ ముత్తయ్య మురళీథరన్ బయోపిక్ నుంచి తమిళ అగ్రశ్రేణి నటుడు విజయ్ సేతుపతి తప్పుకున్నారు. మరళీధరన్ సలహా మేరకే తమిళ నటుడు బయోపిక్ ప్రాజెక్టుకు గుడైబై చెప్పారు. బయోపిక్ ‘800’లో విజయ్ సేతుపతి నటిస్తున్నారనే వార్త పొక్కగానే ఆయన అభిమానులు సోషల్ మీడియాలో మండిపడుతూ ‘ట్రోల్’ చేశారు. అందుకు కారణం ఏమిటంటే 2009లో తమిళ పౌరులను శ్రీలంక సైనికులు ఊచకోత కోసినప్పుడు మురళీథరన్ ఆనందం వెలిబుచ్చాడట. లేదు మొర్రో అని మురళీథరన్ మొత్తుకున్నప్పటికీ తమిళతంబిలు నమ్మడం లేదు. ‘ముడియాదు’ అంటున్నారు.
ప్రసిద్ధ సినిమా దర్శకుడు భారతీరాజా సైతం మురళీథరన్ పైన ఆగ్రహం ప్రదర్శించారు. శ్రీలంకలో తోటి తమిళుల మారణహోమం జరుగుతుంటే మురళీథరన్ ఫిడేల్ వాయిస్తూ వినోదం చూశాడు. రాజపక్సకు అతడు అభిమాని. ‘తోటివారు చస్తుంటే సంబరం చేసుకునేవారు ఆటలో ఎంత ఎత్తు ఎదిగితే మాత్ర ఏం ప్రయోజనం’ అంటూ మందలించారు. చాలా మంది కోలీవుడ్ నటులూ, దర్శకులూ మురళీథరన్ వివరణతో శాంతించలేదు. ఆయన మాటలు నమ్మలేదు. చైన్నైకి చెందిన అమ్మడిని పెళ్ళి చేసుకున్నప్పటికీ మురళీథరన్ ను శత్రువుగానే తమిళనాడులోని తమిళులు పరిగణిస్తున్నారు.
సన్ రైజర్స్, హైదరాబాద్ జట్టుకు బౌలింగ్ కోచ్ గా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ప్రస్తుతం ఉన్న మురళీథరన్ తమిళనాడులో జరుగుతున్న ఖండనలనూ, ఆగ్రహప్రదర్శనలనూ గమనించాడు. తన వల్ల మంచి భవిష్యత్తు కలిగిన నటుడు ఇబ్బందిపడటం మంచిది కాదని తీర్మానించుకున్నాడు. వెంటనే ఒక ట్వీట్ పెట్టాడు. తన కోసం భవిష్యత్తును పాడు చేసుకోవలదని చెప్పారు. ‘‘ఒక ఆర్టిస్టుగా విజయ్ భవిష్యత్తు నా కారణంగా భ్రష్టుపట్టకూడదు. అందుకని తప్పుకోమంటూ అభ్యర్థించాను,’’ అని మురళీథరన్ విలేఖరులతో సోమవారంనాడు అన్నాడు.
వెనకంజ వేయవలసి వచ్చినప్పుడు తాను ఎన్నడూ నిరాశానిస్పృహలకు లోనుకాలేదనీ, సవాళ్ళను ఎదుర్కొంటూనే ఈ రోజు తాను ఉన్న స్థాయికి చేరుకున్నాననీ మురళీథరన్ అన్నారు. తన తల్లిదండ్రుల గురించీ, చిన్నతనంలో తనకు శిక్షణ ఇచ్చిన గురువుల గురించీ ప్రపంచానికి చాటాలనే ఉద్దేశంతోనే తాను బయోపిక్ ప్రాజెక్టుకు ఒప్పుకున్నాననీ, విజయ్ బదులు మరో నటుడిని నిర్మాతలు నిర్ణయిస్తారనీ ఆయన అన్నారు.
మురళీథరన్ ట్వీట్ ను అభిమానులతో పంచుకుంటూ విజయ్ ‘‘నంద్రి. వణక్కం’’ (ధన్యవాదాలు, నమస్కారం)అంటూ క్రికెటర్ కు సమాధానం ఇచ్చినట్టు వివరించారు. ‘అంటా అయిపోయింది. ఆ ప్రాజెక్ట్ నుంచి ఉపసంహరించుకున్నాను,’ అని చెప్పారు. ముత్తయ్య మురళీథరన్ ప్రపంచ క్రికెట్ దిగ్గజం. టెస్ట్ క్రికెట్ లో 800 వికెట్లు పడగొట్టిన గండరగండడు. మంచి వ్యూహకర్త, మేధావి. బౌలింగ్ లో ఆయన నెలకొల్పిన రికార్డు అజేయమైనది. ఆ రికార్డును సమం చేయగలవారు పుట్టుకొచ్చే అవకాశాలు లేవు. ‘తాను ఎన్నడూ అమాయకుల హత్యను సమర్థించలేదనీ, 2009లో అంతర్యుద్ధం ఆగిపోయినందుకూ, ఇరువైపులా మరణాలు ఆగినందుకూ ఆనందం వెలిబుచ్చాను కానీ తమిళులని చంపి పోగులు పెట్టినందుకు సంతోషం వెలిబుచ్చలేదు. నాటి నా మాటలను ఎవరో వక్రీకరించారు, ’’అని మురళీథరన్ ట్వీట్ పెట్టారు. మొత్తం మీద తమిళనాడులో ఆగ్రహజ్వాలలు రేపిన ఉదంతం ముగిసిపోయింది. విజయ్ సేతుపతి గాయపకుండా రిటైర్ అయ్యాడు.