* అందరికళ్లూ పృథ్వీ షా పైనే
* ముంబైకి ఉత్తరప్రదేశ్ సవాల్
దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నీ విజయ్ హజారే టోర్నీ ఫైనల్స్ కు న్యూఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో రంగం సిద్ధమయ్యింది. మాజీ చాంపియన్లు ముంబై, ఉత్తరప్రదేశ్ జట్లు టైటిల్ సమరానికి సై అంటే సై అంటున్నాయి.
సెమీఫైనల్లో కర్ణాటకపైన ముంబై, గుజరాత్ పైన ఉత్తరప్రదేశ్ జట్లు విజయాలు సాధించడం ద్వారా ఫైనల్స్ కు అర్హత సంపాదించాయి.
Also Read : టీ-20ల్లో చహాల్ సరికొత్త రికార్డు
హాట్ ఫేవరెట్ ముంబై
ఇప్పటికే మూడుసార్లు విజేతగా నిలిచిన ముంబైజట్టు నాలుగో టైటిల్ కోసం ఉరకలేస్తోంది. లీగ్ దశ నుంచి సెమీస్ నాకౌట్ వరకూ దూకుడుగా ఆడుతూ, తిరుగులేని విజయాలు సాధిస్తూ ఫైనల్స్ చేరిన ముంబైజట్టు హాట్ ఫేవరెట్ గా పోటీకి దిగుతోంది.
21 సంవత్సరాల స్టార్ హిట్టర్ పృథ్వీ షా నాయకత్వంలోని ముంబైజట్టులో యశస్వీ జైస్వాల్, సర్ ఫ్రాజ్ ఖాన్, శివం దూబే, ఆదిత్య తారే, శామ్స్ ములానీ, ధవళ్ కులకర్ణీ లాంటి మేటి ఆటగాళ్లున్నారు.
Also Read : డకౌట్ల ఊబిలో విరాట్ కొహ్లీ
ఇప్పటికే ఓ డబుల్ సెంచరీతో సహా మొత్తం నాలుగు శతకాలు, 754 పరుగులు సాధించిన ముంబై కెప్టెన్ పృథ్వీ షా…టైటిల్ సమరంలోనూ అదే దూకుడు కొనసాగించాలన్న పట్టుదలతో ఉన్నాడు. ఇప్పుడు అందరిచూపు భారత మాజీ జూనియర్ కెప్టెన్ పృథ్వీ షాపైనే కేంద్రీకృతమై ఉంది.
సీనియర్ పేసర్ ధవళ్ కులకర్ణీ, తుషార్ దేశ్ పాండే, స్పిన్ త్రయం ప్రశాంత్ సోలంకీ, తనుష్ కోటియాన్, శామ్స్ ములానీ లతో ముంబై బౌలింగ్ ఎటాక్ అత్యంత సమతూకంతో కనిపిస్తోంది.
Also Read : విరాట్ డక్… భారత్ ఫట్
నాలుగోసారి ఫైనల్లో అడుగుపెట్టిన ముంబై 2018-19 సీజన్లో చివరిసారిగా విజయ్ హజారే ట్రోఫీ గెలుచుకొంది. ఇప్పటికే మూడుసార్లు విజేతగా నిలిచిన ముంబై…నాలుగోసారి ట్రోఫీ అందుకోవాలన్న పట్టుదలతో ఉంది.
ఆత్మవిశ్వాసంతో ఉత్తరప్రదేశ్
మరోవైపు..యువఆటగాడు కరణ్ శర్మనాయకత్వంలోని ఉత్తరప్రదేశ్ జట్టు సైతం లీగ్ దశ నుంచి సెమీస్ నాకౌట్ వరకూ భారీవిజయాలతో ఫైనల్లో అడుగుపెట్టిన ఆత్మవిశ్వాసంతో ముంబైకి సవాలు విసురుతోంది.
యాశ్ దయాల్, అఖిబ్ ఖాన్, ఉపేంద్ర యాదవ్, ఆకాశ్ దీప్ నాథ్, అభిషేక్ గోస్వామి, మాధవ్ కౌశిక్ లాంటి ఆటగాళ్లతో ఉత్తరప్రదేశ్ సమతూకంతో కనిపిస్తోంది. స్థాయికి తగ్గట్టుగా ఆడితే ఫైనల్లో ముంబైకి గట్టిపోటీ ఇచ్చే అవకాశం లేకపోలేదు.
ఇప్పటికే రెండుసార్లు ఫైనల్స్ లో తలపడిన అనుభవం ఉన్న ఉత్తరప్రదేశ్ జట్టు 2004-05 సీజన్లో తమిళనాడుతో కలసి సంయుక్త విజేతగా నిలవడం ద్వారా టైటిల్ పంచుకొంది. రెండోసారి విజయ్ హజారే ట్రోఫీ అందుకోడమే లక్ష్యంగా ఉత్తరప్రదేశ్ జట్టు సమరానికి సై అంటోంది.
Also Read : విజయ్ హజారే ట్రోఫీ ఫైనల్లో ముంబై
ముంబై తురుపుముక్క పృథ్వీ షాను ఎంతవరకూ యూపీజట్టు కట్టడి చేయగలదన్న అంశంపైనే జయాపజయాలు ఆధారపడి ఉన్నాయి.
Also Read : టీ-20 రికార్డుల వేటలో కొహ్లీ,రోహిత్