* ఫైనల్లో యూపీకి ముంబై షాక్
* పృథ్వీ షా సరికొత్త రికార్డు
జాతీయ వన్డే క్రికెట్ చాంపియన్లకు ఇచ్చే విజయ్ హజారే ట్రోఫీని మూడుసార్లు విజేత ముంబై నాలుగోసారి గెలుచుకొంది. న్యూఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ముగిసిన హైస్కోరింగ్ మ్యాచ్ లో ముంబై 6 వికెట్లతో ఉత్తరప్రదేశ్ ను చిత్తు చేసింది. ముంబై కెప్టెన్ కమ్ యువఓపెనర్ పృథ్వీ తన జట్టును విజేతగా నిలపడంతో పాటు రికార్డుల మోత మోగించాడు.
ఉత్తరప్రదేశ్ ఆశలు ఆవిరి
దేశవాళీ వన్డే క్రికెట్ ఫైనల్స్ కు మూడోసారి చేరి…రెండో టైటిల్ కు ఉరకలేసిన ఉత్తరప్రదేశ్ ఆశలను పవర్ ఫుల్ ముంబై అడియాసలు చేసింది. ఈ టైటిల్ సమరంలో కీలక టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ ఎంచుకొన్న ఉత్తరప్రదేశ్ జట్టు 50 ఓవర్లలో 4 వికెట్లకు 312 పరుగుల భారీస్కోరు నమోదు చేసింది.
Also Read : లెజెండ్స్ సిరీస్ లో మాస్టర్ క్లాస్
ఓపెనర్ మాధవ్ కౌశిక్ 156 బాల్స్ లో 15 బౌండ్రీలు, 4 సిక్సర్లతో 158 పరుగుల నాటౌట్ స్కోరు సాధించాడు. మిడిలార్డర్ ఆటగాడు ఆకాశ్ దీప్ నాథ్ 55 పరుగులు సాధించాడు. ముంబై బౌలర్లలో తానుష్ కొటియాన్ 2 వికెట్లు, ప్రశాంత్ సోలంకీ 1 వికెట్ పడగొట్టారు.
పృథ్వీ, తారే ధూమ్ ధామ్
యూపీజట్టు తనముందు ఉంచిన 313 పరుగుల లక్ష్యాన్ని ముంబై…41.3 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికే సాధించింది. ఓపెనర్లు పృథ్వీ షా- యశస్వి జైశ్వాల్ మొదటి వికెట్ కు 89 పరుగుల భాగస్వామ్యంతో అద్దిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు.
యశస్వీ 29 పరుగుల స్కోరుకు అవుట్ కాగా…పృథ్వీ షా కేవలం 39 బాల్స్ లోనే 10 బౌండ్రీలు, 4 సిక్సర్లతో 73 పరుగుల స్కోరుకు అవుటయ్యాడు. లీగ్ దశ నుంచి సెమీస్ వరకూ ఓ డబుల్ సెంచరీతో సహా మొత్తం నాలుగు శతకాలు బాదిన పృథ్వీ షా టైటిల్ సమరంలో మాత్రం 27 పరుగుల దూరంలో అవుటయ్యాడు.
Also Read : విజయ్ హజారే టోర్నీలో టైటిల్ సమరం
అయితే… విజయ్ హజారే టోర్నీ చరిత్రలోనే అత్యధిక వ్యక్తిగత స్కోరు, అత్యధికంగా 800కు పైగా పరుగులు సాధించిన ఆటగాడిగా సరికొత్త రికార్డులు నెలకొల్పాడు.
వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ ఆదిత్య తారే 107 బాల్స్ ఎదుర్కొని 18 బౌండ్రీలతో 118 పరుగుల నాటౌట్ స్కోరుతోతన జట్టు విజయంలో ప్రధానపాత్ర వహించాడు. మిడిలార్డర్ ఆటగాళ్లు ములానీ 36, శివం దూబే 42 పరుగులు సాధించారు.
2018-19 సీజన్లో చివరిసారిగా విజయ్ హజారే ట్రోఫీ గెలుచుకొన్న ముంబై.. తిరిగి ఏడాది విరామం తర్వాత విజేత కాగలిగింది. సెంచరీ హీరో ఆదిత్య తారేకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. టోర్నీ మొత్తంలో అత్యధికంగా 800కు పైగా పరుగులు సాధించిన పృథ్వీ షా ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు.
Also Read : టీ-20ల్లో చహాల్ సరికొత్త రికార్డు