Thursday, November 21, 2024

గాంధీపై లేనిపోని ఆరోపణలు చేసినందుకు ఏపీ ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ క్షమాపణ చెప్పాలి : డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్

నాలుగు రోజుల క్రితం పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం రాజులపేట లో జరిగిన ఒక సమావేశంలో  ఆంధ్రప్రదేశ్ ఎస్పీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ ‘జాతిపిత మహాత్మా గాంధీ’ పై  ఉద్దేశ్య పూర్వకంగా అసత్యాలనే బురద చల్లి, దుష్ట ఆలోచనలతో వ్యాఖ్యానించారనీ, అందుకు ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలని డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఆయన చేసిన ప్రసంగంలోని అవాస్తవాలను ఎత్తి చూపించారు.

విక్టర్ ప్రసాద్ తన ప్రసంగంలో ఈ క్రిందివిధంగా వ్యాఖ్యలు చేశారు:

“దేశంలో ఓటు హక్కు ఎవరికి ఇవ్వాలన్న విషయమై 1932లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో చర్చ జరిగింది. అప్పుడు గాంధీ అనే దుర్మార్గుడు ఈ దేశంలో బ్రాహ్మణులు, వైశ్యులు, రాజులతో పాటు ఒకటి రెండు కులాలకు తప్ప మిగిలిన కులాలకు ఓటు హక్కు అసలు వద్దన్నారు. ఆడవారు ఏ కులంలో పుట్టినా వారికి ఓటు హక్కు , విద్య వద్దన్నారు. వారు ఉద్యోగం చేయడానికి పనికి రారన్నారు.  మహిళలకు ఆస్తి హక్కు వద్దన్నారు, అసలు బయటకు రావడానికి వీలు లేదన్నారు .”

వాస్తవాలు:

స్వాతంత్రోద్యమ సమయంలో మొత్తం మూడు రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగాయి. మొదటిది ( 12/11/1930 నుండి 19/01/1931)  ;  రెండవది ( 07/09/1931 నుండి 01/12/1931 )  ;  మూడవది ( 17/11/1932 నుండి 24/12/1932 ) .  మొదటి , మూడవ రౌండ్ టేబుల్ సమావేశాలను భారత జాతీయ కాంగ్రెస్ బహిష్కరించింది. భారత జాతీయ కాంగ్రెస్ తరుపున మహాత్మా గాంధీ  రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు.

ఇంగ్లాండ్ లో 07/09/1931 నుండి 01/12/1931 వరకు  జరిగిన రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో వయోజన ఓటు హక్కు గురించిన చర్చ ” ఫెడరల్ స్ట్రక్చర్ కమిటీ” లో జరిగింది. ఆ సమావేశాల పూర్తి ప్రొసీడింగ్స్  ను 1932 లో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ప్రచురించింది. అందులో ఫెడరల్ స్ట్రక్చర్ కమిటీ ( Federal Structure committee ) సమావేశంలో ‘ ఓటు హక్కు – అర్హత ‘ పై చర్చించారు. అందులో భాగంగా,  17/09/1931 న జరిగిన చర్చల్లో గాంధీజీ ” వయోజన ఓటు హక్కు”  గురించి ఈ విధంగా చెప్పారు..

‘‘ఎన్నికలను జరిపే విధానం ‘ ప్రత్యక్ష ఎన్నికలైనా లేక పరోక్ష ఎన్నికలైనా’  సరే, ఆ విధాన నిర్ణయానికి అనుగుణంగా నేను దేశవ్యాప్తంగా పర్యటించి పెద్దఎత్తున ప్రజాభిప్రాయాన్ని కూడగట్టగలను. ఎన్నికలు జరిపే విధానం ఏదైనా సరే, నేను తెలియజేసే అత్యంత ఆవశ్యకమైన  విషయం ‘నాకు సార్వత్రిక వయోజన ఓటు హక్కు పై పూర్తి విశ్వాసం ఉన్నది.’  దీనికోసం కాంగ్రెస్ కార్యకర్తలు కూడా  ప్రమాణం చేశారు. ముస్లిం లు  మాత్రమే కాకుండా, అంటరాని వాళ్ళుగా పిలవబడుతున్న వారు,  క్రిస్టియన్లు ,  శ్రామికులు మరియు ఇతర వర్గాల వారి యొక్క సమంజసమైన ఆకాంక్షలను తీర్చడానికి సార్వత్రిక వయోజన ఓటు హక్కు ఎంతో అవసరం. సంపద ఉన్నవారికి మాత్రమే ఓటు హక్కు ఉండి ; డబ్బు – చదువు లేని మంచి వ్యక్తిత్వం ఉన్నవారికి, రాత్రి – పగలు నిజాయితీగా కాయకష్టం చేసే వారికి మాత్రం ఓటు హక్కు లేకపోవడం అనే ఆలోచనే భరింపరానిది. నన్ను  అంటరానివాడిగా భావించడాన్ని గర్వపడతాను. గ్రామాలలో ఉన్న అంటరానివారితో కలిసిమెలిసి జీవించిన నేను, వారిలోని పేదవారిలో మానవత్వం మూర్తీభవించిన అత్యున్నతమైన వ్యక్తిత్వం గలవారు కొంతమంది నాకు తెలుసు.  అటువంటి నా అంటరాని సోదరులకు ఓటు హక్కు లేకపోతే,  నాకు నేనుగా నా ఓటు హక్కును వదులుకుంటాను. కొద్దిమంది భావిస్తున్నట్లుగా ఓటర్లకు కనీసం చదవడం, వ్రాయడం, సాధారణ లెక్కలు ( 3Rs) రావాలన్న భావన సరైనదని నేను భావించడం లేదు. కనీసం చదవడం, వ్రాయడం, సాధారణ లెక్కలు ( 3Rs) రావాలనేది అర్హతగా నిర్ణయిస్తే, అందరికీ ఆ అర్హత రావడానికి చాలా సుదీర్ఘకాలం పడుతుంది.  అప్పటి వరకు ఎదురుచూడటానికి నేను సిద్ధంగా లేను. లక్షలాది మంది నిరక్షరాస్యులైన పేదప్రజలకు ఓటు వేసే సమర్థత ఉన్నదని నా నమ్మకం.

( రిఫరెన్స్ :- పేజీ  159 – 160 , వాల్యూం 1 ,  ప్రొసీడింగ్స్ ఆఫ్ ది ఫెడరల్ స్ట్రక్చర్ కమిటీ అండ్ మైనారిటీస్ కమిటీ , ఇండియన్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. )

‘‘సౌత్ ఆఫ్రికా లో భారతీయుల హక్కులపై పోరాడినప్పటి నుండే  కస్తూర్బా గాంధీ (మహాత్మా గాంధీ భార్య ) ప్రజా ఉద్యమాలలో పాల్గొన్నారు , తదుపరి స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు , జైలు శిక్ష కూడా అనుభవించారు.  మహిళలల్లో ఏ మార్పునయితే గాంధీజీ  చూడాలనుకున్నారో,  అది తన ఇంటినుండే మొదలుపెట్టారు. ఆచరించి చూపించారు. గాంధీజీ పిలుపుకి లక్షలాది మహిళలు స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. అటువంటిది  దుర్బుద్ధితో,  చరిత్ర ను వక్రీకరిస్తూ మహిళలకు మహాత్మా గాంధీ  ఓటు హక్కు, విద్య వద్దన్నారని ప్రచారం చేయడం చాలా బాధాకరం.

‘‘1920 కన్నా ముందు నుండే సార్వత్రిక ఓటు హక్కు ఉండాలని నమ్మి …. 1920 లో నాగపూర్ సమావేశాలలో కాంగ్రెస్ పార్టీ  constitution లో  కుల , మత, ప్రాంత , లింగ విభేదాలకు తావులేని విధంగా సభ్యత్వ – నాయకత్వపు  అర్హతల నిబంధనలు తీసుకువచ్చిన గాంధీజీ గురించి ; 4 అణాల సభ్యత్వ ఫీజు కన్నా… శారీరక శ్రమే కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి నిజమైన అర్హత అని నిబంధనలలో మార్పు తీసుకువచ్చిన గాంధీజీ గురించి ;  1931 వ సంవత్సరం మార్చి 26 నుండి 31 వరకు కరాచీలో జరిగిన చారిత్రాత్మకమైన కాంగ్రెస్ జాతీయ మహాసభలలో ఆమోదించిన పౌరుల ప్రాథమిక హక్కులు – సామాజిక ఆర్థిక హక్కులతో కూడిన కరాచీ తీర్మానం చేయడంలో  ముఖ్యపాత్ర పోషించిన గాంధీజీని, ( భారతీయులందరికీ సార్వత్రిక  వయోజన ఓటు హక్కు అనే హక్కును కూడా సంపూర్ణ స్వరాజ్యం యొక్క లక్ష్యంగా చెప్పారు)  ;    రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో   అంటరానివారికి ఓటు హక్కు లేకపోతే , నా ఓటు హక్కును వదులుకుంటాను ‘ అని  చెప్పిన మహాత్మా గాంధీ పై …

..  ఆయన కులాల వారీగా ఓటు హక్కును వద్దన్నారని , మహిళల కు ఓటు హక్కు వద్దన్నారని ప్రచారం చేయడం  …   ఉద్దేశ్య పూర్వక అసత్య ప్రచారం కాక మరేంటి? 

 ఎస్సీ కమిషన్ చైర్మన్ గా ఉండి ‘ జాతిపిత మహాత్మా గాంధీ ‘ పై ఇటువంటి అసత్య ప్రచారం చేయడం వెనుక గల అసలు  ఉద్దేశ్యం ఏమిటి?   కనీస విలువలు లేని మీరు…    దుర్బుద్ధితో  చారిత్రక వాస్తవాలను వక్రీకరించి  గాంధీజీ పై నిరాధారమైన  అసత్యాలను ప్రచారం చేస్తున్నందుకు ….. దేశ ప్రజలందరికీ  క్షమాపణ చెప్పాలి’’ అని డాక్టర్ గుంటురు శ్రీనివాస్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles