Thursday, November 7, 2024

విభీషణుడిని లంకాధిపతిగా చేసిన రాముడు

రామాయణమ్ 176

ఈ విభీషణుడు మంచివాడే అని నా అంతరాత్మ చెప్పుచున్నది ఊహను బట్టి, ఇతనిలో కనపడు భావమును బట్టి యీతడు మంచివాడే కావున మన మిత్ర బృందంలో ఇతనిని చేర్చుకొనవచ్చును.

రాముడు అభయమిచ్చిన వెంటనే విభీషణుడు క్రిందకు తొంగి చూసెను. అనుచరులతో కలిసి భూమికి చేరుకొని రాముని పాదముల పైబడి శరణువేడెను.

Also read: తనను శరణు కోరినవారిని రక్షించి తీరెదనని పలికిన రఘుపతి

‘‘నేను రావణుని తమ్ముడను. అతనిచేత అవమానింపబడి నీవద్దకు వచ్చితిని. లంకను, మిత్రులను, ధనమును కుటుంబమును పరిత్యజించి వచ్చితిని . నా జీవితము సుఖములు ఇక నీపై ఆధార పడివున్నవి రామా!’’

ఆతనిని ప్రేమపూర్వకమైన చూపులతో పలుకరించి తియ్యనైన మాటలతో ఓదార్చి, ‘‘విభీషణా రావణ శిబిరంలో బలాబలములు వివరించుమయ్యా’’ అని కోరాడు రాఘవుడు.

‘‘రామా, రావణుడు బ్రహ్మ వర ప్రసాది. అతనిని గంధర్వ, పన్నగ   జాతుల  వారేవరూ ఏమీ చేయజాలరు.  ఏ ప్రాణులు గానీ దేవతలు గానీ ఏమీ చేయ లేవు.

Also read: విభీషణుడు స్వాగతించదగినవాడేనన్న రామచంద్రుడు

‘‘రామా నాకు ఇంకొక సోదరుడు కలడు. ఆతని పేరు కుంభకర్ణుడు. మహాబలశాలి. దేవేంద్రుని నైనా ఎదిరించగల శక్తీ సామర్ధ్యములు గలవాడు. ఇక రావణ సేనాపతి ప్రహస్తుని గూర్చి విని ఉంటావు. అతడు కైలాసములో మణిభద్రుని ఓడించినాడు.

‘‘రావణ కుమారుడు ఇంద్రజిత్తు. ఇతను మాయా యుద్ధ విశారదుడు. నానా శస్త్రాస్త్ర కోవిదుడు. ధనుస్సు ధరించి యుద్దములో నిలబడెనా ఎవరికీ కనిపించడు’’  అనుచూ వైరి పక్షంలోని వారి బలా బలములు చెప్పుట కొన సాగించాడు విభీషణుడు.

‘‘ఇంద్రజిత్తు మాయా యుద్ధ ప్రవీణుడు …లోకపాలురవంటి ప్రహస్తుడు ,అకంపనుడు శత్రుభయంకరులు. వీరికి తోడుగా రక్తముపీల్చి మాంసభక్షణము చేయు రాక్షసులు కోటానుకోట్లుగా గలరు. వారంతా స్వేచ్ఛారూపధారులు!

అని విభీషణుడు లంకానగర సైనిక శక్తిని వీరుల బలాబలములను రామునకు ఎరిగించెను.

Also read: విభీషణుడిని మిత్రుడిగా స్వీకరించమని రాముడికి హనుమ సూచన

‘‘విభీషణా, బాగు బాగు …రాక్షసరాజు రావణుడు అతల, వితల, తలాతల, రసాతల, మహాతల, పాతాళ లోకాలలో ఎచ్చటదాగినా సరే నా శరములు వానిని వెంటాడి వేటాడగలవు! అతని బలాన్ని బలగాన్ని సపుత్రబాంధవముగా యమపురికి పంపెదను.

‘‘నిన్ను లంకాధినాధుడను గావించెదను. సోదరా లక్ష్మణా శీఘ్రమే సముద్ర జలములు తీసుకొని రమ్ము. ఆ జలములతో అభిషేకించి లంకాసామ్రాజ్యానికి చక్రవర్తిగా విభీషణుని చేసెదను…’’

వెంటనే లక్ష్మణునిచే కొనితేబడ్డ జలములతో సకల వానర ప్రముఖులు, వానర సైన్యముల సమక్షములో విభీషణుని అభిషేకించి లంకానగర సామ్రాజ్యలక్ష్మిని చేతికందించెను

అంత రాముడు విభీషణుని ‘‘ఈ సముద్రమెటుల దాట వలెను’’ అని ప్రశ్నించెను.

‘‘రామా, ఈ సాగరుడు మీ పూర్వీకుడైన సగరుని వలననే కదా రూపుదాల్చినది. సాగరుని ఉపాసింపుము. ఆయనే అనుకూలుడై దారిచూపును’’ అని తెలిపెను.

అప్పుడు రాముడు సముద్ర తీరమందు కుశలు పరచుకొని దీక్షామగ్నుడాయెను.

Also read: మగువల విషయంలో శాపగ్రస్తుడు రావణుడు

వూటుకూరు జానకిరామారావు

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles