రామాయణమ్ – 173
‘‘అన్నా, నీ కిష్టమైన మాటలు చెప్పేవారు ఎల్లవేళలా లభింతురు.
కానీ ప్రియము కాకపోయిననూ హితవు చెప్పువారు అరుదు.
రాముడు నిన్ను చంపుచుండగా నేను చూడజాలను అందుకే వెళ్ళిపోతున్నాను. ఇక సెలవు’’ అని ఆకాశమున నిలచి విభీషణుడు పలికెను.
Also read: మగువల విషయంలో శాపగ్రస్తుడు రావణుడు
వెనువెంటనే ముహూర్తకాలములో విభీషణుడు రామలక్ష్మణులు ఉన్నచోటికి వచ్చెను.
ఆకాశములో మెరుపు వలే మెరుస్తూ నిలుచొని యున్న విభీషణాదులను క్రింద ఉన్న వానరులు చూసిరి.
ఎవడీ రాక్షసుడు? మనలను చంపుటకు వాని అనుచరులతో వచ్చినాడా ఏమి? అని సుగ్రీవుడు హనుమంతుడు మొదలైన వారితో అనెను.
సుగ్రీవుని మాటలు వెలువడగనే అందరూ ఒక్కసారిగా మద్దిచెట్లను, పర్వతములనుచేతపుచ్చుకొన్న వారై, ‘‘రాజా, అనుజ్ఞ ఇమ్ము. ఇప్పుడే వారిని నేలకూల్చెదము’’ అని పలికిరి.
Also read: సీతను తెచ్చుట పొరబాటు, కుంభకర్ణుడు
వానర సేనలో పుట్టిన కోలాహలము గమనించి క్రిందకు దిగకుండగనే పెద్ద కంఠస్వరముతో, ‘‘నేను రావణుని తమ్ముడు విభీషణుడను. మా అన్న చేసిన చెడ్డపనిక, అది తగదు అని నేను హితవు పలుకగా ఆతడు నన్ను అవమానించి వెడలగొట్టినాడు. నేను నా భార్యాపుత్రాదులను విడిచి రాముని శరణు జొచ్చినాను. నా రాక మహానుభావుడైన రామునికి ఎరిగించండి’’ అని బిగ్గరగా పలికెను.
‘‘రామా, విభీషణుడు అని రావణుని తమ్ముడు మనవద్దకు వచ్చినాడు. ఆతడు మాయావి. మనతో చేరవలెనని అనుకుంటున్నాడు.
ఏమైనా ఇతడు రాక్షసుడు. మనము ఆదమరచి ఉన్నప్పుడు గుడ్లగూబ కాకులను చంపినట్లుగా చంపివేయును. పైగా ఆతడు మాయావియైన రాక్షసుడు. మనగుట్టుమట్లు తెలుసుకొనుటకు రావణుడు పంపియుండునేమో! అతనిని మట్టుపెట్టవలెను’’ అని కంగారుపడుతూ సుగ్రీవుడు విభీషణుని రాకను రామునికి ఎరిగించెను.
రాముని చుట్టూ వానరముఖ్యులందరూ చేరియున్నారు.వారి వైపు రాముడు సాలోచనగా చూసి ‘‘మీ అభిప్రాయమేమిటి’’ అని అడిగెను.
Also read: విభీషణుడి సలహాను తిరస్కరించిన రావణుడు
అప్పుడు అంగదుడు, ‘‘రామా మనము ముందుగా విభీషణుని పరీక్షించవలెను. అతడు శత్రుశిబిరమునుండి వచ్చినాడు కావున ఆతని విశ్వాసపాత్రునిగా చేయకూడదు’’ అని పలికెను.
శరభుడు అను వానరుడు, ‘‘రామచంద్రా, ఈతనిని పరీక్షించుటకై గూఢచారిని పంపవలెను’’ అని సలహా ఇచ్చినాడు.
పిమ్మట జాంబవంతుడు లేచి ‘‘ఈతడు దేశముకాని దేశమునకు కాలము కాని కాలములో శత్రువు వైపునుండి వచ్చినాడు .కావున ఈతనిని నమ్మరాదు’’ అని పలికెను.
అటు పిమ్మట మైందుడు లేచి, ‘‘రఘురామా, రావణుని తమ్ముడిని మధురముగా పలుకరించి యదార్ధమేదో గ్రహించవచ్చును’’ అని చెప్పెను.
చివరగా హనుమంతుడు లేచి తన అభిప్రాయమును ప్రకటించెను.
Also read: సీతను రామునికి అప్పగించుము, రావణుడికి విభీషణుడి హితవు
‘‘సహచరులు మన్నింతురుగాక. మీరు తెలిపిన వాటితో నేను ఏకీభవించను. …ఏలనన..
‘‘ఒక వ్యక్తికి ఏ పని అయినా అప్పచెప్పకుండా ఏల పరీక్షించగలము? కావున పరీక్షించుట ఇప్పుడు సాధ్యము కాదు….ఎదుట నిలచి ఉన్నవాని గురించి తెలుసుకొనుటకు గూఢచారులతో పనిలేదు….రావణుని దుష్టత్వమూ నీ పరాక్రమమునూ చూసి ఈ కాలమునందు ఈ దేశమునందు అతడు వచ్చుట యుక్తమే కదా! …. ఇక అతనిని ఏమని ప్రశ్నించగలము? మనము ఎవరమైనా వెళ్ళి ప్రశ్నించినచో అతడు ప్రశ్నించువానిని శంకించడా? ఈతడు నిజముగా మిత్రుడేమో! ప్రశ్నించుటవలన అతనిలో స్నేహభావము నశించదా? అయిననూ ఎదుటి వ్యక్తి స్వరమును పట్టి భావమును తెలుసుకొనగలుగుటకు ఎంతో నేర్పు అవసరము. ఈతని ముఖకవళికలలో దుష్టభావమేదీ కదలాడుతున్నట్లుగా లేదు. ముఖప్రసన్నతను బట్టి ఇతను సదుద్దేశంతోనే వచ్చినాడని నిస్సంశయముగా తెలుసుకొనవచ్చును. ఎంత కప్పుకొన్ననూ మనిషి మనస్సులోని భావము అతని ముఖమునందు ప్రతిఫలించును. కావున శ్రీరామా, ఈతడు రాక్షసరాజ్యము చేజిక్కించుకొనుటకు ఆలోచనచేసి తదనుగుణముగానే నీవద్దకు వచ్చెను. అతనికి సుగ్రీవుని వృత్తాంతము తెలియును. కావున ఇతనిని స్వీకరించుట ఉత్తమము.’’
NB
హనుమ స్వామి ఎంత సహేతుకంగా వాదించారో చూడండి! అదీ “బుద్ధిమతాం వరిష్ఠం” అంటే….ఎంత అద్భుతమైన logic చూడండి…pure psychoanalysis….. ఆ స్వామిని శరణు వేడితే మనకు ఏది రాకుండా ఉంటుంది!
Also read: రావణుడి సేనాధిపతుల ప్రేలాపన
వూటుకూరు జానకిరామారావు