Sunday, December 22, 2024

ఉత్కంఠ కలిగిస్తున్న కోవిద్ టీకామందు

ప్రపంచాన్ని కుదిపేసి, మానవ సంబంధాలను అతలాకుతలం చేస్తున్న కరోనా కల్పిత కష్టాలు అతి త్వరలోనే తీరనున్నాయా? అవును.. అంటూ ఊదరగొట్టే వార్తలు వెల్లువెత్తుతున్నాయి. అదిగో వ్యాక్సిన్, ఇదిగో వ్యాక్సిన్ అంటూ ఆశలు రేకెత్తిస్తున్నారు. నిజంగా అది నిజమైతే, అంతకంటే కావాల్సిందేముంటుంది? కరోనా నియంత్రణకు టీకాయే (వ్యాక్సిన్ ) ప్రధాన ఆయుధంగా అందరూ విశ్వసిస్తున్నారు. దీని అత్యవసర వినియోగానికి అనుమతులు కోరుతూ తయారీ సంస్థలైన ఫైజర్, సీరమ్ ఇన్స్టిట్యూట్, భారత్ బయోటెక్ దరఖాస్తు చేసుకున్నాయి. దీనికి సంబంధించిన అనుమతులు అతి త్వరలోనే రానున్నాయనే విశ్వాసంలో సంబంధిత మార్కెట్ వర్గాలు ఉన్నాయి. కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థకు చెందిన నిపుణుల కమిటీ పరిశీలించనుంది. వ్యాక్సిన్ పనితీరు, పంపిణీ మొదలైన కీలక అంశాలపై విస్తృత స్థాయిలో చర్చలు ముగిసిన పిదప నిర్ణయం వెలువడనుంది.

భారత్ లో మరికొద్ది వారాల్లో టీకామందు

భారతదేశంలో మరికొద్ది వారాల్లోనే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ఈ నెల 4వ తేదీనాడు జరిగిన అఖిలపక్ష సమావేశంలో సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్రమోదీ అశాభావం వ్యక్తం చేసిన నేపథ్యంలో దేశ ప్రజలకు గొప్ప ఊరట, ఉత్సాహం  లబించాయి. అందరికంటే తొలిగా ఫైజర్ సంస్థ అనుమతిని కోరింది. వరుసగా మిగిలిన సంస్థలు కూడా దరఖాస్తు చేసుకున్నాయి. వ్యాక్సిన్ అందుబాటు, రేటు తదితర అంశాలు వెలువడిన వెనువెంటనే ఆ కంపెనీల షేర్ విలువలు ఉన్నపళంగా ఆకాశమెత్తున పెరిగిపోతున్నాయి. వ్యాక్సిన్ అమ్మకాలు మొదలుకాకముందే, ఈ సంస్థలు పెద్దఎత్తున ఆర్ధిక ప్రయోజనాలను  మూటకట్టుకుంటున్నాయి. ప్రజల ఆశలు అంతే ఎత్తున చిగురిస్తున్నాయి.

ఇదొక వ్యాపారక్రీడ

చూస్తుంటే.. ఇదొక వ్యాపార క్రీడలాగానూ అనిపిస్తోంది. మన అజ్ఞానమే ఎదుటి మనిషి జ్ఞానం వలె, మన అవసరాలే వ్యాపార సంస్థలకు లాభాలు కురిపిస్తాయన్నది ఆర్ధిక సిద్ధాంతం. అవసరం ఎంత ముఖ్యమో వ్యాక్సిన్ల పనితీరు అంతకంటే ముఖ్యం. అత్యవసర అనుమతులను  ఇచ్చే ముందు వ్యాక్సిన్ సామర్ధ్యాలు, దుష్ప్రభావాలు, భద్రతా ప్రమాణాలను సూక్ష్మాతి సూక్ష్మంగా పరిశీలించకపోతే, పెను ప్రమాదాలు చుట్టుముడతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.  వ్యాక్సిన్ వినియోగంలో విపరీత పరిణామాలు సంభవించకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలది, అనుమతులనిచ్చే తత్సంబంధిత వ్యవస్థలదే.

ప్రయోగాలలో ఇద్దరి మరణం

ఫైజర్ రూపొందించిన కరోనా వ్యాక్సిన్ ట్రయల్ రన్ లో ఇద్దరు మరణించారని అమెరికాలోని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ తన వెబ్ సైట్ లో ఉంచిన పరిశోధనా పత్రంలో పేర్కొంది. ట్రయల్స్ లో భాగంగా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఇద్దరు వ్యక్తులు అతి తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్ తో మరణించారని ఆ పత్రంలో పేర్కొన్నారు. క్లినికల్ ట్రయల్స్ లో  55 సంవత్సరాల వ్యక్తి హృదయ సంబంధిత రుగ్మతతో మరణించారని, మరో వ్యక్తి రెండు మూడు రోజుల తర్వాత కండరాల వాపు వ్యాధితో మరణించారని ఎఫ్ డి ఏ వెలువరించిన ఈ పరిశోధనాత్మక వ్యాసం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. వ్యాక్సిన్ భద్రతపై పెను దుమారం రేపుతోంది. ఈ పరిణామాల వల్ల పలు   ప్రశ్నలు తలెత్తుతున్నాయి, ఆందోళనలు కలుగుతున్నాయి.

టీకా వేయించుకుంటారా, లేదా అన్నది మీ ఇష్టం

డిసెంబర్ 10,17 తేదీలలో ఎఫ్ డి ఏ మరో రెండు పబ్లిక్ డాక్యుమెంట్లు విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఇంకా అనేక సంస్థలు వ్యాక్సిన్ల రూపకల్పనలో ఉన్నాయి.ఈ రేసులో అన్నింటి కంటే ముందున్న ఫైజర్ పరిస్థితి ఇలా ఉంటే, మిగిలినవాటి పరిస్థితి ఎలా ఉండబోతోందో కాలమే సమాధానం చెప్పాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూ హెచ్ ఓ ) వ్యాక్సిన్ వాడకంపై తాజాగా  ఒక కీలక వ్యాఖ్య చేసింది. వ్యాక్సిన్ వేయించుకుంటారా? లేదా? అన్నది మీఇష్టం అంటూ… నిర్ణయాన్ని ప్రజలకే వదిలేసింది. దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు రాబోతున్న వ్యాక్సిన్లపై సంపూర్ణంగా నమ్మకం లేక ఈ వ్యాఖ్య చేసిందా, లేక అసలు వ్యాక్సిన్ల  అవసరమే లేదా అన్నది స్పష్టంగా చెప్పలేదు. దీనిపై తయారీ సంస్థలు, నిపుణులు, ప్రభుత్వాలు కూడా  స్పష్టత ఇచ్చితీరాలి. అమెరికా తర్వాత ఎక్కువ కేసులు భారతదేశంలోనే ఉన్నాయి. ఇప్పటివరకూ మన దేశంలో 1,40,000 మంది కోవిద్ వల్ల మరణించారు.ఈ నేపథ్యంలో, వ్యాక్సిన్ పురోగతిపై భారత ప్రభుత్వం గట్టిగా దృష్టి పెట్టింది.

60 దేశాల ప్రతినిధులు భారత్ బయోటెక్స్ సందర్శన

సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఒకే రోజు మూడు నగరాల్లో పర్యటించి, వ్యాక్సిన్ ప్రయోగాలను పరిశీలించారు. అరవై దేశాల ప్రతినిధులు బుధవారం హైదరాబాద్ లోని జినోమ్ వ్యాలీలో భారత్ బయోటెక్ సంస్థను సందర్శించి టీకా అభివృద్ధికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు.  ఇప్పటికే,  ఫైజర్ వ్యాక్సిన్ వినియోగానికి బ్రిటన్ లో అనుమతి కూడా లభించింది. పంపిణీ కూడా ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఇండియాలో సీరమ్, భారత్ బయోటెక్ సంస్థ లు కూడా త్వరితగతిన అందించడానికి కార్యాచరణ వేగవంతం చేశాయి. ఈవిధంగా,వ్యాక్సిన్ అంశం ఆశలు, ఆందోళనలు సృష్టిస్తోంది. కరోనా నివారణకు వ్యాక్సిన్లే శరణ్యమని ఎక్కువమంది అభిప్రాయపడుతున్నారు.  మరికొద్ది రోజుల్లోనే వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చి, త్వరితగతిన ఒకప్పటి సాధారణ పరిస్థితులు నెలకొంటాయనే గంపెడు ఆశలో ప్రజలు ఉన్నారు.ప్రభుత్వాలు ఏమిచేస్తాయో చూద్దాం.

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles