Monday, January 27, 2025

విలక్షణ నటుడు సంజీవ్ కుమార్

ఒక విలక్షణమైన నటుడు. రంగస్థలం అంటే అతనికి ప్రాణం. సినిమాల్లోకి రావాలని ప్రయత్నిస్తున్న సమయంలో రాజశ్రీ సంస్థ  స్కీన్ర్‌ టెస్ట్‌లో  విఫలమయ్యాడు. అతడే ఆ తర్వాత జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడుగా రెండుసార్లు ‘భారత్‌’ అవార్డులను అందుకోవడం విశేషం. ఆయనే సంజీవ్‌కుమార్‌.

22వ ఏటే ముస‌లి వేషాలు

సంజీవ్ కుమార్ అసలు పేరు హరిహర్ జెఠాలాల్ జరీవాలా (హరిభాయ్ అని కూడా పిలిచేవారు.) ఇతడు గుజరాత్ లోని సూరత్ లో ఒక గుజరాతీ పటేల్ కుటుంబంలో జన్మించాడు. ఇతని బాల్యం సూరత్‌లో గడచింది. తరువాత ఇతని కుటుంబం ముంబాయికి తరలి వెళ్ళింది. అక్కడ ఒక ఫిలిం స్కూలులో సంజీవ్ కుమార్ శిక్షణ పొందాడు. తద్వారా బాలీవుడ్‌లో నటుడిగా స్థిరపడ్డాడు. నట జీవితాన్ని నాటకరంగం ద్వారా ప్రారంభించాడు. మొదట ఇతడు ముంబాయిలోని “ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్(IPTA)”, తర్వాత “ఇండియన్ నేషనల్ థియేటర్” సంస్థల నాటకాలలో వేషాలు వేశాడు. రంగస్థల నటుడిగా ఇతడు 22 ఏళ్ల వయసులో ముసలి వేషాలు వేసేవాడు.

తొలి చిత్రం హ‌మ్ హిందూస్తానీ

1952లో శశిధర్‌ ముఖర్జీ బెంగాలి సినిమా ‘బసు పరివార్‌’ చిత్రాన్ని హిందీలో ‘హమ్‌ హిందుస్తానీ’ పేరుతో 1960లో పునర్నిర్మించారు. సునీల్‌ దత్, ఆశాపరేఖ్‌ జంటగా నటించిన ఈ చిత్రం ద్వారా సంజీవ్‌ కుమార్‌ బాలీవుడ్‌కు పరిచయ మయ్యాడు. ఇతనితోపాటే ప్రేమ్‌ చోప్డా కూడా వెండితెరకు చేరువయ్యాడు.

హీరోగా హిందీ సినిమాలో పరిచయం కావడానికి సంజీవ్‌ కుమార్‌కు ఐదేళ్లు పట్టింది.  1965లో ‘నిశాన్’ అనే సినిమా ద్వారా కథా నాయకుడి వేషాలు వేయడం మొదలు పెట్టాడు. 1968లో ‘సంఘర్ష్’ సినిమాలో ప్రముఖ నటుడు దిలీప్ కుమార్‌తో కలిసి నటించాడు. తరవాత ‘స్మగ్లర్‌’, ‘పతి పత్ని’, ‘హుస్న్‌ అవుర్‌ ఇష్ఖ్‌’, ‘బాదల్‌’ వంటి సినిమాల్లో నటించినా సంజీవ్‌ కుమార్‌కు పెద్దగా గుర్తింపు రాలేదు. హిందీ సినిమాలలోనే కాక మారాఠీ, తెలుగు, పంజాబీ, సింధీ, తమిళ, గుజరాతీ సినిమాలలో కూడా నటించాడు. ఇతడు గుల్జార్, ఎ.కె.హంగల్, హృషీకేశ్ ముఖర్జీ, యశ్ చోప్రా, సుభాష్ ఘాయ్, సత్యజిత్ రే మొదలైన దర్శకులతో పనిచేశాడు. అరుణా ఇరానీ, జయ బాధురి, ఎల్.విజయలక్ష్మి, రాఖీ, లీనా చంద్రావర్కర్, సులక్షణా పండిట్, మౌసమీ చటర్జీ, యోగీతా బాలీ, అపర్ణా సేన్, షర్మిలా ఠాగూర్ మొదలైన నటీమణుల సరసన నటించాడు. ఇతడు నటించిన షోలే చిత్రంలో ఠాకూర్ పాత్ర ఇతడికి మంచి పేరు తెచ్చిపెట్టింది. ‘నయాదిన్ నయీరాత్’ సినిమాలో తొమ్మిది పాత్రలను ధరించాడు. ఈ పాత్రలను తమిళం (నవరాత్రి)లో శివాజీ గణేశన్, తెలుగు (నవరాత్రి)లో అక్కినేని నాగేశ్వరరావు పోషించారు. బాలీవుడ్‌లో ప్రవేశించిన తొలిరోజుల్లో లఘు బడ్జెట్‌ సి-గ్రేడ్‌ చిత్రాల్లో నటించాడు.

versatile actor sanjeev kumar

‘కోషిష్‌’తో మంచిపేరు

1965లో ‘నిషానా’ సినిమాతో హీరో అవతారమెత్తిన సంజీవ్‌ కుమార్‌ అచిరకాలంలోనే ‘ఖిలోనా’ వంటి విభిన్న సినిమాల్లో అద్భుత నటనా వైదుష్యాన్ని చూపి, భవిష్యత్‌ ప్రస్థానానికి పునాదులు నిర్మించు కున్నాడు. రాజిందర్‌ సింగ్‌ బేడి నిర్మించిన ‘దస్తక్‌’ సినిమా ఉత్తమ కథానాయకునిగా సంజీవ్‌ కుమార్‌కు జాతీయ పురస్కారాన్ని అందించింది. తరువాత గుల్జార్‌ దర్శకత్వం వహించిన ‘కోషిష్‌’, ‘పరిచయ్‌’ సినిమాలు విభిన్న పాత్రలను ప్రసాదించి సంజీవ్‌ కుమార్‌లోని అసలు సిసలైన నటుణ్ణి వెలికి తీశాయి. గుల్జార్‌ పర్యవేక్షణలోనే వచ్చిన ‘ఆంధీ’, ‘మౌసమ్’ సినిమాలు సంజీవ్‌ కుమార్‌ నట ప్రస్థానాన్ని సుస్థిరం చేశాయి.  తరువాత గుల్జార్‌ దర్శకత్వంలో వచ్చిన ‘కోషిష్‌’ సినిమా సంజీవ్‌ కుమార్‌కు ఉత్తమ నటుడిగా జాతీయ బహుమతి తెచ్చిపెట్టింది. ఇక ‘షోలే’ సినిమాలో ఠాకూర్‌ బలదేవ్‌ సింగ్‌ పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. ఆయనకు పుట్టుకతోనే గుండెలో లోపం వుండేది. అది జన్యుపరంగా సంక్రమించినదే. 1976లో తొలిసారి గుండెపోటు వచ్చినప్పుడు అమెరికాలో బైపాస్‌ చికిత్స చేయించు కున్నారు. అయితే 1985 నవంబరు 6న సంజీవ్‌ కుమార్‌కు తీవ్రమైన గుండెపోటు వచ్చింది. దాంతో బ్రతికే అవకాశం లేకుండా పోయింది. అయితే ఆరోగ్యాన్ని సరిగ్గా పట్టించుకోక 47 సంవత్సరాలకే బ్రహ్మచారిగా మిగిలి తనువు చాలించాడు.

సూర‌త్‌లో వీధికి సంజీవ్ పేరు

గుజరాత్ రాష్ట్రం సూరత్ లో ఒక వీధికి ఇతని స్మృత్యర్థం “సంజీవ్ కుమార్ మార్గ్” అని నామకరణం చేశారు. ఇతనిపేరుతో సూరత్‌లో ఒక పాఠశాల నెలకొల్పారు. 2013, మే 3వ తేదీ భారతప్రభుత్వం ఇతనిపై ఒక తపాలాబిళ్ల విడుదల చేసింది. 14 ఫిబ్రవరి 2014లో ఇతని స్వంత పట్టణం సూరత్‌లో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి, ప్రస్తుత భారత ప్రధాని నరేంద్ర మోడీ 108 కోట్ల విలువైన సమావేశ మందిరాన్ని “సంజీవ్ కుమార్ ఆడిటోరియం” పేరుతో ప్రారంభించాడు.

ఇతని పేరుతో “సంజీవ్ కుమార్ ఫౌండేషన్” ఒక జాతీయ స్థాయి సేవా సంస్థ ఏర్పాటు చేయబడింది. ఈ సంస్థ బాలల విద్య, ఆరోగ్య, సాంస్కృతిక అభ్యున్నతికై పనిచేస్తున్నది.

(నవంబర్ 6 సంజీవ్ కుమార్ వర్ధంతి)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles