Sunday, December 22, 2024

బహుముఖ ప్రజ్ఞాశాలి కమల్ హాసన్

పార్థ‌సార‌థి శ్రీ‌నివాస‌న్‌… ఎవ‌రో అనుకుంటున్నారా? అంద‌రి అభిమాన న‌టుడు కమల్‌ హాసన్‌. విశిష్ట నటుడే కాదు ఒక విచిత్రమైన వ్యక్తి, మంచి కథకుడు, స్కీన్ర్‌ ప్లే రచయిత, నిర్మాత, దర్శకుడు… అజ్ఞాత సంగీత దర్శకుడు కూడా. తను నటించే సినిమాలో ఏదో ఒక ప్రత్యేకత ఉండాలనీ, రొటీన్‌ పాత్రలకు అది భిన్నంగా వుండాలనీ కోరుకునే వ్యక్తి. దక్షిణభారత చలనచిత్ర పరిశ్రమ నుంచి బాలీవుడ్‌కు వెళ్లి అక్కడ కూడా తన ప్రత్యేకతను నిలుపుకున్న ఒక మంచి నటుడు. చలన చిత్రరంగానికి ఆయన ఒక ‘వసూల్‌ రాజా’. భారతీయుడు సినిమా రెండు వందల మిలియన్లు ఆర్జించి పెట్టిన విషయం ఈ మాటను నిజం చేసింది. నవంబర్‌ 7, 1954న తమిళనాడులోని రామనాథపురానికి చేరువలో వున్న పరమక్కుడి పట్టణంలో జన్మించాడు.

తొలి చిత్ర‌తం క‌ళ‌త్తూర్ క‌న్న‌మ్మ‌

తండ్రి డి. శ్రీనివాసన్‌ న్యాయవాద వృత్తిలో వుండేవారు. కమల్‌ తల్లి రాజలక్ష్మి మంచి డ్యాన్సర్‌. కమల్‌ ప్రాధమిక విద్యాభ్యాసం పరమక్కుడిలోనే జరిగింది. తరువాత వారి కుటుంబం మద్రాసులో స్థిరపడింది. మైలాపూరులోని శాంతోం పాఠశాలలో కమల్‌ చదువు కొనసాగింది.1960 అక్టోబరులో ‘కళత్తూర్‌ కన్నమ్మ’ సినిమాలో నటించాడు. ఆ సినిమాను తెలుగులో ‘మావూరి అమ్మాయి’ పేరుతో‌ అనువదించి ఆంధ్రదేశంలో విడుదల చేయగా. తొలి ప్రయత్నంలోనే ఉత్తమ బాలనటుడుగా రాష్ట్రపతి చేతుల మీదుగా బంగారు పతకం అందుకున్నాడు.

కమల్‌ తల్లి రాజలక్ష్మి తంగప్పన్‌ వద్ద నాట్యం నేర్చుకుంటూ వుండేది. ఆ సమయంలోనే కమల్‌ చదువుకుంటూనే కొన్ని సినిమాలలో చిన్నచిన్న పాత్రలు పోషిస్తూ ఉండేవాడు. అలా తన తొలి వెండితెర పరిచయం 1970లో విడుదలైన శాండో చిన్నప్ప దేవర నిర్మించిన ‘మాణవన్‌’ చిత్రం లో కమల్‌ కుట్టి పద్మిని చేసే డ్యాన్స్‌ సన్నివేశంలో ఆమెతో కలిసి కనిపిస్తాడు. డ్యాన్స్‌ డైరెక్టర్‌ తంగప్పన్‌ నిర్మించి దర్శకత్వం వహించిన ‘అణ్నై వేలంకణ్ణి’ సినిమాలో కాసేపు జీసస్‌ క్రైస్త్ గా కనిపిస్తాడు. కమల్‌ కొంతకాలం తంగప్పన్‌ వద్ద సహాయకుడిగా ఉంటూ డ్యాన్స్‌ నేర్చుకున్నారు. 1973లో ముత్తురామన్‌ నిర్మించిన ‘కాశి యాతిరై‘ సినిమాలో తంగప్పన్‌కు సహాయ డ్యాన్స్‌ డైరెక్టర్‌గా పనిచేశాడు.

1973లో ప్ర‌తినాయ‌క పాత్ర‌

అదే సంవత్సరం కె.బాలచందర్‌ తొలిసారి కమల్‌ హాసన్‌ చేత ‘సొల్లత్తాన్‌ నినిక్కిరేన్‌’ అనే సినిమాలో ఒక ప్రతినాయకుడిగా ప్లేబాయ్‌ పాత్రను పోషింపజేశారు. తరువాత ‘అరంగేట్రం’  సినిమా విజయంతో హిందీలో పునర్నిర్మించిన ‘ఆయినా’ సినిమాలో రాజేష్‌ ఖన్నాతోబాటు కమల్‌ కూడా నటించారు. హిందీలో అతడు నటించిన తొలి చిత్రం ఇదే కావడం విశేషం. తరువాత 1974లో తమిళంలో చాలా సహాయక పాత్రలు పోషిస్తూ వచ్చాడు. వాటిలో ‘గుమస్తావిన్‌ మగళ్’, ‘ ‘నాన్‌ అవనిల్లై’ సినిమాలు ముఖ్యమైనవి. సేతుమాధవన్‌ మలయాళంలో నిర్మించిన ‘కన్యాకుమారి’ సినిమాలో హీరోగా నటించే అవకాశం వచ్చింది. అందులో రీటా భాదురి హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాలో నటనకు కమల్‌కు తొలి ఫిలింఫేర్‌ బహుమతి లభించింది. 1975లో బాలచందర్‌ దర్శకత్వంలో వచ్చిన ‘అపూర్వ రాగం’ (తెలుగులో తూర్పూపడమర) సినిమా హీరోగా మంచి బ్రేక్‌ ఇచ్చింది. రజనీకాంత్‌ ఈ సినిమాతోనే తెరంగేట్రం చేశాడు. ఈ సినిమా ద్వారా కమల్‌కు రెండవ ఫిలింఫేర్‌ బహుమతి వచ్చింది.

మ‌న్మ‌ధ‌లీల క‌మ‌ల్‌కు ట్రెండ్ సెట్ట‌ర్‌

బాలచందర్‌ దర్శకత్వంలో 1976లో ‘మన్మధ లీలై’ అనే సినిమా లో కమల్‌ హీరో. ఈ సినిమాతోనే జయప్రద, వై.విజయ, హేమా చౌదరి తొలిసారి వెండితెరకు పరిచయమయ్యారు. విజయవంతమైన ఈ చిత్రాన్ని తెలుగులో ‘మన్మధలీల’గా, హిందీలో ‘మీఠీ మీఠీ బాతే’గా 1977లో డబ్‌ చేశారు. ఈ చిత్రం కమల్‌కు ఒక ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచి అతనికి హీరోగా మంచి హోదా కలిపించింది. ఈ సినిమా తరువాత వచ్చిన ముత్తురామన్‌ సినిమా ‘ఒరు ఊధప్పు కన్‌ సిముట్టిగిరదు’లో కమల్, సుజాత నటించారు. కమల్‌కు మూడవసారి ఫిలింఫేర్‌ బహుమతి తెచ్చిపెట్టిన చిత్రమిది. ఈ రెండు సినిమాలతో కమల్‌ తమిళ చిత్రరంగంలో స్థిరపడిపోయారు. తరువాత వచ్చిన మరో బాలచందర్‌ సినిమా ‘అవర్గ’ (ఇది కథ కాదు) కమల్‌ హాసన్‌ హోదాను పెంచింది. బాలచందర్‌ దర్శకత్వం వహించిన మరొక చిత్రం ‘మూండ్రు ముడిచ్చు’ (ఓ సీత కథ) కూడా మంచి హిట్టయింది. ఈ సినిమా ద్వారా శ్రీదేవి 13 ఏళ్ల ప్రాయంలో హీరోయిన్‌గా నటించింది. రజనీకాంత్‌ విలన్‌ పాత్ర పోషించాడు. భారతీరాజా దర్శకత్వం వహించిన ‘పత్తినారు వయత్తినిలే’ (తెలుగులో పదహారేళ్ల వయసు)లో కమల్‌ పోషించిన పాత్రకు ఫిలింఫేర్‌ అవార్డుతోబాటు తమిళనాడు రాష్ట్ర బహుమతి కూడా లభించింది. కమల్‌ హాసన్‌ కన్నడంలో బాలుమహేంద్ర నిర్మించిన ‘కోకిల’ సినిమాలో తొలిసారి నటించారు. అదే సంవత్సరం ‘అవళ్‌ ఒరు తొడర్‌ కథై’ సినిమాను ‘కబిత’ పేరుతో బెంగాలి భాషలో పునర్నిర్మిస్తే అందులో హీరోగా కమల్‌ నటించారు.

తెలుగులో తొలి చిత్రం అంతులేని క‌థ‌                                                                                                                                                                                                                
కమల్‌ తెలుగులో నటించిన తొలి స్ట్రెయిట్‌ సినిమా ‘అంతులేని కథ’ (1976). అప్పుడే ‘మన్మధలీల’ డబ్బింగ్‌ వర్షన్‌ కూడా విడుదలైంది. ఈ రెండు సినిమాలు ఆంధ్ర రాష్ట్రంలో శతదినోత్సవాలు చేసుకున్నాయి. కాగా ‘మరోచరిత్ర’ సినిమా రెండవ స్ట్రెయిట్‌ చిత్రం, . బాలచందర్‌ దర్శకత్వం వహించిన ఈ  చిత్రాన్ని బాలచందర్‌ హిందీలో ‘ఏక్‌ దూజే కేలియే’ చిత్రంగా నిర్మిస్తే ఆ సినిమా రికార్డుల మీద రికార్డులు సృష్టించింది. కమల్‌ హీరోగా, శ్రీదేవి హీరోయిన్‌గా ‘సిగప్పు రోజాక్కళ్‌’  సినిమాలో నటనకు నాల్గవసారి ఫిలింఫేర్‌ బహుమతి గెలుచుకున్నారు.  దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెలుగులో ‘సొమ్మొకడిది సోకొకడిది’ పేరుతో సినిమా నిర్మించారు. అందులో కమల్‌ ద్విపాత్రాభినయం చేయగా ఆయన సరసన జయసుధ, రోజారమణి హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా పెద్ద మ్యూజికల్‌ హిట్‌గా నిలిచింది.  1970 దశకంలో ఆరు ఫిలింఫేర్‌ అవార్డులు లభించాయి. 1981లో బాలచందర్‌ తెలుగులో ‘ఆకలి రాజ్యం’ సినిమా సూపర్‌ హిట్టయింది.

సాగ‌ర సంగ‌మంతో ఎన‌లేని ఖ్యాతి

కె.విశ్వనాథ్‌ దర్శకత్వంలో వచ్చిన ‘సాగర సంగమం’ సూపర్‌ డూపర్‌ హిట్టయింది. అదే ఊపులో వచ్చిన ‘స్వాతి ముత్యం’ అత్యధిక మహిళా ప్రేక్షకులను ఆకట్టుకొని విజయవంతమైంది. సింగీతం శ్రీనివాసరావు కమల్‌తో సంభాషణలు లేకుండా ‘పుష్పక విమానం’ చిత్రాన్ని నిర్మించారు. ఆయన ప్రయోగం సఫలమైంది. విశ్వనాథ్, బాలు కలిసి కమల్‌తో ‘శుభసంకల్పం’ చిత్రాన్ని నిర్మిస్తే అదికూడా శతదినోత్సవం చేసుకుంది. సింగీతం దర్శకత్వం వహించిన మరొక సినిమా ‘ఇంద్రుడు చంద్రుడు’. అందులో కమల్‌ హసన్‌ ద్విపాత్రాభినయం చేశారు. ‘భామనే సత్యభామనే’ కూడా ఆ కోవలోనిదే.

వైవిధ్య పాత్ర‌లలో మేటి

కమల్‌ హాసన్‌కు వైవిధ్యమైన పాత్రలు పోషించడమంటే సరదా. కళ్యాణ రామన్‌ చిత్రంలో ఎత్తుపళ్లతో పల్లెటూరివాని పాత్రను పోషించారు. ‘రాజా పార్వై’ చిత్రంలో అంధ వయోలనిస్టు పాత్రలో జీవించారు. ఈ చిత్రానికి కమల్‌ స్కీన్ర్‌ ప్లే అందించడం విశేషం. ‘స్వాతిముత్యం’లో మానసిక వికలాంగునిగా, ‘సాగర సంగమం’లో శాస్త్రీయ నృత్యకళాకారునిగా, ‘నాయకుడు’ సినిమాలో అండర్‌ వరల్డ్‌ డాన్‌గా ప్రేక్షకుల మనసుల్ని దోచుకున్నారు. ‘పుష్పక విమానం’ సినిమాలో నిరుద్యోగ యువకునిగా, వారం రోజులపాటు భోగ భాగ్యాలు అనుభవించే అవకాశం వచ్చిన యువకునిగా నటించారు. ‘విచిత్ర సోదరులు’ సినిమాలో మరుగుజ్జు అవతారం ఎత్తారు. ‘భామనే సత్యభామనే’ చిత్రానికి శంతన్‌ పెనోయ్‌ దర్శకుడు అయినా,  తనే దర్శకత్వ బాధ్యతలు స్వీకరించి సినిమాను హిట్‌ చేశారు. ‘గుణ’ చిత్రంలో కమల్‌ది అద్భుతమైన పాత్ర. ప్రేమలో పడిన ఉన్మాదిగా నటించి గొప్ప పేరు తెచ్చుకున్నారు. ‘ద్రోహి’ చిత్రంలో ఉగ్రవాదాన్ని అణచివేసే పోలీసు అధికారిగా కమల్‌ హసన్‌ నటన అపూర్వం. అలాగే ‘భారతీయుడు’ సినిమాలో స్వాతంత్ర సమరయోధుని పాత్రలో ముసలి వేషం, లంచగొండి అధికారిగా రెండవ వేషం వేసి మెప్పించారు.

18 ఫిలింఫేర్ అవార్డులు

ఫిలింఫేర్‌ బహుమతులను ఏకంగా పద్దెనిమిది సార్లు గెలుచుకున్న ఏకైక నటుడు కమల్‌ హాసన్‌. కమల్ జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా ‘మూండ్రాంపిరై’ (వసంత కోకిల), ‘నాయగన్‌’ (నాయకుడు), ‘ఇండియన్‌’ (భారతీయుడు) సినిమాలో నటనకు మూడుసార్లు పురస్కారాలు అందుకున్నారు. ‘సాగరసంగమం’, ‘స్వాతిముత్యం’ తెలుగు సినిమాలు ఆసియా చలన చిత్రోత్సవాలలో బహుమతులు గెలుచుకున్నాయి. ‌ నటించిన ఆరు సినిమాలు ఆస్కార్‌ బహుమతి కోసం ప్రభుత్వ పక్షాన ఎంపికై, పోటీల్లో పాల్గొన్నాయి. 1990లో కేంద్ర ప్రభుత్వం కమల్‌ను పద్మశ్రీ పురస్కారంతోను, 2014లో పద్మభూషణ్‌ పురస్కారంతోను సత్కరించింది. తమిళనాడు ప్రభుత్వం ‘కలైమామణి’ బిరుదు ప్రదానం చేసింది. చెన్నైలోని సత్యభామ విశ్వవిద్యాలయం కమల్‌కు గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేసింది. మొత్తం మీద కమల్‌ స్వీకరించిన అవార్డులు 170కి పైమాటే..

(న‌వంబ‌ర్ 7 క‌మ‌ల్ హాసన్ జ‌న్మ‌దినం)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles