Sunday, December 22, 2024

సార్థక జీవి హేతువాది రావిపూడి వెంకటాద్రి

  • బి ఎస్ రాములు జ్ఞాపకాలు
    2023 జనవరి 21న శనివారం మధ్యాహ్నం 3 గంటలకు సుప్రసిద్ద హేతువాది భావజాల సంఘసంస్కర్త, యం యన్ రాయ్ బాటలో నడిచిన రాడికల్ హ్యూమనిస్టు రావిపూడి వెంకటాద్రి (101) ప్రకాశం జిల్లా చీరాల స్వగృహంలో కన్ను మూశారు. రావిపూడి వెంకటాద్రి గారు 9 ఫిబ్రవరి1922 ప్రకాశం జిల్లా ఇంకొల్లు మండలం నాగండ్లలో జన్మించారు. 1956 నుండి 1995 దాక 40 ఏండ్లు ఆ వూరికి సర్పంచ్ గా చేశారు. హేతువాదికి నమ్మకాలుండవు. సమ్మాతాలు కన్విక్షన్స్, మానవీయ విలువలు సంస్కృతి ఉంటాయి. మానవవాదంతో సమాజాన్ని ప్రేమమయం చేయాలని అంటారు. వారికి జోహార్లు అర్పిస్తూ నివాళిగా వారితో పెనవేసుకున్న కొన్ని జ్ఞాపకాలు.
  • రావిపూడి వెంటాద్రి గారు 1991 నుండి నాకు పరిచయం లోకి వచ్చారు. ప్రముఖ సోషలిస్టు రావెల సోమయ్య, ప్రముఖ బుద్దిస్టు అంబేద్కరైట్ రావిపూడి గారిని పరిచయం చేశారు.రాడికల్ హ్యూమనిస్టు యం వి రామమూర్తి, మల్లాది సుబ్బమ్మ, ఇంకా ఎందరో యువకులు హాజరైన సభలో హైదరాబాద్ బిర్లా ప్లానిటోరియం పక్కన ప్రాంచైజీ కొండగుహ హాలులో తొలి కలయిక. ఆ రోజు ప్రొఫెసర్ శిబ్ నారాయణ్ రాడికల్ హ్యూమనిస్టు, హేతువాది యం ఎన్ రాయ్ సహచరుడు కలిసారు. చక్కని ప్రసంగం చేశారు. హేతువాదులు రాడికల్ హ్యూమనిస్ట్ లు చాలామంది కలిసారు . రావెల సోమయ్య, కె ఎన్ రామదాసు తదితర మిత్రులం కలిసి శిబి నారాయణ్ గారిని ఇంటర్వ్యూ చేశాను. (అది ప్రింటు కాలేదు) ఆ సమయంలో రావిపూడితో సంభాషణ సాగింది. ఆ సందర్భంగా నాపై అపార ప్రేమతో తాను రాసిన అన్ని పుస్తకాలు ఒక్కొక్క కాపీ ఇచ్చారు. కొన్ని పుస్తకాలు పర్సనల్ కాపీ చివరి కాపీ తనకు లేకున్నా పరవా లేదని ఇచ్చారు. అలా రావిపూడి వారి పుస్తకాలు సమగ్రంగా చదివే అవకాశం కలిగింది. అంతకు ముందు కొన్ని చదివి ఉన్నప్పటికీ సమగ్రంగా చదవడం వల్ల ఎన్నో విషయాలు వారి కోణాలు అర్థమయ్యాయి. యం యన్ రాయ్ గారి జీవితం కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపకులుగా చేసిన కృషి, రష్యా లోని లెనిన్ తో చేసిన చర్చలు, జాతుల సమస్య పై రాయ్ చేసిన సూచనలు స్వకరించి లెనిన్, కమ్యూనిజం సిద్దాంతం నుండి వైదొలగి నవ్య మానవతా వాదం( రాడికల్ హ్యూమనిజం) తాత్వికతను రూపొందించి "బియాండ్ ది కమ్యూనిజం" అని చేసిన ప్రతిపాదనలు రావెల సోమయ్య, రావిపూడి వెంకటాద్రి గారి ద్వారానే తెలుసుకోగలిగాను. రావిపూడిగారు ప్రతి పుస్తకంపై వివరమైన నా అభిప్రాయాలు కోరారు. అలా పుస్తకం చదవగానే చేతి రాతతో నా అభిప్రాయాలు పేజీల కొద్దీ రాసే వాడిని. అలా ఉత్తరాలు రాశాను. రావిపూడి సాహిత్యం కళల గురించి వెలిబుచ్చిన అభిప్రాయాలు విశ్లేషణలు ప్రత్యేకమైనవి. సాహిత్యం కళలు గురించి 1956 రాసినా సంకోచించడం 1980లో అచ్చువేసిన పుస్తకం బాగా ఆలోచింప జేసింది. సాహిత్యం కళలు గతంలోకి నడిపిస్తాయి. లాంటిది వెనక చూపు. వెనక్కి నడిపిస్తాయి అన్న మాట నన్ను బాగా కదిలించింది. బాగా ఆలోచింప జేసింది. ఆ విషయమై చర్చించాను. రావిపూడి గారు చెప్పిన తర్వాత కన్విన్స్ అయ్యాను. సాహిత్యం కళలు నిరంతరం గతాన్ని ఆరాధిస్తారు ఆదర్శీకరిస్తాయి అనే మాటను ఆనాటి నుండి బలంగా ప్రచారం చేస్తూ వస్తున్నాను. వేదాలు మొదలుకొని రామాయణ మహాభారతాలు అన్ని గతాన్ని ఆదర్శీకరించి గతంలోకి నడిపేవే. కూచిపూడి, భారత నాట్యం, జాన పద కళలు సాహిత్యం గతాన్ని ఆరాధిస్తూ ఆదర్శీకరిస్తూ గతంలోకి నడిపేవే. రావిపూడి గురించిన ఈ అవగాహన సిద్దం సమాది యోగ యోగ, మెడిటేషన్, ఈ క్షణంలో జీవించు అనేవి ప్రాక్టీస్ చేస్తున్నపుడు జిడ్డు కృష్ణమూర్తి, ఓషో రజనీష్ రచనలు చదువుతున్నపుడు మరింత స్పష్టమయింది. చరిత్ర రచన అధ్యయనం కూడా గతాన్ని ముందుకు తెచ్చి వర్తమానాన్ని గతానికనువుగా వెనక్కి నడిపే స్వభావాన్ని కలిగి వుంటుంది. అందువల్ల వర్తమానంలో తమ కర్తవ్యాలకు, సంస్కృతికి, ప్రేరణ స్పూర్తి నిచ్చే అంశాలను కోణాలను, చారిత్రక వ్యక్తులను, సంఘటనలను తీసుకొని ఎప్పటికప్పుడు చరిత్రను తిరగ రాయవలసి వుంటుంది, రాస్తుంటారు అని ఒక భావం కలిగిందప్పుడు. గతితర్కం మార్క్సిజం అశాస్త్రీయమని చర్చిస్తూ పుస్తకం రాశారు. నాస్తికున్నారు జాగ్రత్త అని విరుచుకు పడి పుస్తకం రాశారు. శంకరాచార్య బౌద్దంలోకి మారుతున్నాడని గ్రహించి హత్య చేశారని "శంకరాచార్య హత్య" అనే పుస్తకం వేశారు. వందకు పైగా రాసిన పుస్తకాలు వేలాది ప్రసంగాలు వ్యాసాలలో ఆయన తడమని అంశంలేదు. హేతువాదానికి మతం ఉండదు. ప్రశ్నించే వారంతా హేతువాదాన్ని కోరుకున్నట్టే అంటారు. పెరియార్ రామస్వామి, త్రిపురనేని రామస్వామి ప్రభావం రావిపూడి పై వారసత్వంగా కొనసాగింది. ఎందుకోగాని తెలుగు విశ్వ విద్యాలయం నాకు త్రిపురనేని రామస్వామి హేతువాద (ధర్మనిధి) పురస్కారం 1994 లో ఇచ్చినపుడు వ్యతిరేకిస్తూ పత్రికలకు ఎక్కారు. మా “గతితర్క తత్వ దర్శన భూమిక,” “బహుజనవాదం” లో హేతువాదం లేదనుకున్నారేమో! రావిపూడి హేతువాదంలో భౌతిక ఆచరణ కన్నా కార్య కారణ చర్చకే ప్రాధాన్యత. ఆలోటును రాడికల్ హ్యూమనిజం కొంత పూరించేది.
    ఒకసారి రావిపూడి వెంకటాద్రి బృందం పుట్టా సురేంద్ర బాబు గారితో చర్చకు కూర్చున్నారు. “భాగాలు సైకిలు కారణమా? సైకిలుకు భాగాలు కారణమా ?” అనే అంశం పై గంటల తరబడి చర్చ సాగింది. ఆ చర్చను పుట్టా సురేంద్ర బాబు గారు మేలుకొలుపు/వివేక పథం అనే తాను తీసే మాస పత్రికలో అచ్చు వేశారు. దానిపై సుదీర్ఘంగా చర్చిస్తూ రాసి ఇద్దరికి ప్రచురణ కోసం పంపాను. ఎవరూ వేయలేదు.
    నా వ్యాసం నుండి రావిపూడి తనకు నచ్చిన భాగాలను హేతువాది పత్రికలో ప్రచురించారు. నా అభిప్రాయాలను 1996 లో పుస్తకంగా వెలువరించారు. ఆ పుస్తకం పేరే ” జ్ఞానం పుట్టుక” . దీంతోపాటు ” భౌతికవాద ప్రాపంచిక దృక్పథం” అనే పుస్తకాన్ని ప్రచురించాను. అది ఒక ఉపాధ్యాయ సంఘంలో చేసిన ప్రసంగం. మొదట ప్రసంగాన్ని గబ్బిలం పత్రికలో వేసాను. ఈ రెండు పుస్తకాలు ప్రజలను బాగా ఆకర్షించాయి. ఆతరువాత వీటిని “బహుజన తత్వం” గ్రంథం లో రీ ప్రింటు చేశాను.
    ఇలా భావజాల తాత్విక ఉద్యమాల్లో రావిపూడి వెంకటాద్రి గారు ఎందరినో కదిలించారు. ఎందరినో ప్రభావితం చేశారు. జీవితమంత దానికే అంకితం చేశారు. కులవ్యవస్థ హేతువాద , మానవతా వాద విరుద్దమైనది. కుల వివక్ష, కుల నిర్మూలన హేతువాదంతో ఖండించి పీడితులైన దళితుల పక్షాన నిలబడాలి అనే చర్చ వచ్చినప్పుడు రావిపూడి ఏకీభవించ లేదు. రాడికల్ హ్యూమనిస్ట్ లు ఆ కోణంలో గుర్తించ నిరాకరించిన నేపథ్యంలో కత్తి పద్మారావు గారు విభేదించారు. కత్తి పద్మారావుగారు హేతువాదాన్ని అంబేద్కర్ బుద్దిస్టు కోణంలో దళితవాదంగా మలిచారు.నేను దళిత బహుజన తత్వంలో హేతువాద రాడికల్ హ్యూమనిస్ట్ తాత్వికతను సంశ్లేషించాను.
    ఇలా రావిపూడి వెంకటాద్రి గారితో పూర్తిగా ఏకీభవించక పోయినా వారు దళిత బహుజన వాదాన్ని స్వీకరించక పోయినా పరస్పర ప్రభావాలు ఒక ప్రవాహంలా కొనసాగాయి. వారి కృషి సమాజంలో ఒక ప్రత్యేక అధ్యాయం. గోరా , సివి, రావిపూడి, యం ఎన్ రాయ్ , యం వి రామ్మూర్తి , మల్లాది సుబ్బమ్మ , రంగనాయకమ్మ, క్రాంతి కుమార్ , నాస్తిక చార్వాక బి రామకృష్ణ , డాక్టర్ మలయశ్రీ , పుట్టా సురేంద్రబాబు , వల్లంపట్ల , దేవరాజు మహరాజు, కె బి గోపాలం, టి రవిచంద్, బైరి నరేష్, దేవీప్రాద్ ఛటోపాధ్యాయ, రాహుల్ సాంకృత్యాయన్, వేమన, నార్ల వెంకటేశ్వరరావు, నారిసెట్టి ఇన్నయ్య, డాక్టర్ కత్తి పద్మారావు, విశాఖ జయగోపాల్, మార్క్సిస్టులు త్రిపురనేని గోపీచంద్,బొజ్జా తారకం , జాషువా కూతురు హేమలతా లవణం , గుమ్మా వీరన్న, కదిరె కృష్ణ, జిలుకర శ్రీనివాస్, భాను ప్రసాద్ మొదలైన వారి కృషి మరువ లేనిది. ఈ కాస్తయినా నాస్తిక శాస్త్రీయ హేతువాద రాడికల్ హ్యూమనిజం కొనసాగుతున్నదంటే, ప్రభావ శీలంగా ఉన్నదంటే రావిపూడి కృషి సార్థకమైనట్టే. ఒక చారిత్రక కాలంలో స్వాతంత్రానంతర సామాజిక తాత్విక రంగాలలో తనదైన విశిష్ట పాత్ర నిర్వహించారు రావిపూడి వెంకటాద్రి గారు. భావజాల సామాజిక తాత్విక రంగాలలో పలు రూపాల్లో రావిపూడి, యం యన్ రాయ్ గారల హేతువాద, రాడికల్ హ్యూమనిజం మనకు చరిత్ర అందించిన వారసత్వంగా కొనసాగుతూనే వుంటుంది.
    వారికి నివాళి జోహార్లు.
  • బి ఎస్ రాములు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles