- పల్లె నుంచి దిల్లీ వరకూ స్వతంత్ర ప్రయాణం
- భాషలంటే ప్రేమ, మాతృభాషపైన మక్కువ
- దిగ్విజయంగా సఫలమైన జీవితం
రాజకీయ వాచస్పతిగా, తెలుగుదనం మూర్తీభవించిన వ్యక్తిగా, సుదీర్ఘ రాజకీయ అనుభవశాలిగా, అనేక పదవులు అధిరోహించిన అదృష్టవంతుడిగా విజయవంతమైన ప్రస్థానం సాగించిన ముప్పవరపు వెంకయ్యనాయుడు అత్యున్నతమైన ఉపరాష్ట్ర పదవి నుంచి అధికారికంగా నేడు నిష్క్రమిస్తున్నారు. మొన్ననే ఘనంగా వీడ్కోలు సభ జరిగింది. పెద్దలంతా వెంకయ్యనాయుడును పెద్దఎత్తున ప్రశంసలతో ముంచెత్తారు. స్ఫూర్తిదాత, ప్రజ్ఞామూర్తి అంటూ విశేషణాలు గుప్పిస్తూ పొగడ్తల జల్లులు కురిపించారు. అదే పెద్దలు రాష్ట్రపతిగా ఎందుకు ఎంపిక చెయ్యలేదు? కనీసం మరోపర్యాయం ఉపరాష్ట్రపతిగా ఉండేలా పదవీకాలాన్ని ఎందుకు పొడిగించలేదు? అనే గుసగుసగుసలు వినిపించకపోలేదు.
Also read: మణిపూర్ లో మంటలు రగిల్చిన విద్యార్థులు
పార్టీని నమ్ముకున్నందుకు మేలే జరిగింది
సాధారణ సభ్యుడి స్థాయి నుంచి ఎంఎల్ ఏ,ఎంపీ,కేంద్రమంత్రి,పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఉపరాష్ట్రపతి వంటి ఎన్నో పదవులు పొందే గొప్ప అవకాశాలను, అదృష్టాలను పార్టీ కల్పించిన నేపథ్యంలో, పార్టీ వల్ల ఆయనకు ఎన్నో మేళ్లు జరిగాయి తప్ప ఎటువంటి నష్టం జరగలేదనే వారు కూడా ఎందరో ఉన్నారు. తెలుగువాడు ఉపరాష్ట్రపతి స్థానంలో కూర్చున్నందుకు ఎక్కువమంది తెలుగువారు ఆనందించారు. రాష్ట్రపతిగా పదోన్నతి కల్పించి వుంటే తెలుగువారు మరింత సంతోషించేవారు. సరే, పెద్దల వ్యూహాలు,ఆలోచనలు వేరుగా ఉంటాయి కదా! నాయుడుగారి సుదీర్ఘ ప్రస్థానాన్ని గమనిస్తే ఆయన జీవితం అత్యాశ్చర్యకరంగా సాగిందని అనుకోవచ్చు. తన ప్రసంగాలలో, ఆత్మీయ సమ్మేళనాలలో అదే మాట వెంకయ్యనాయుడు పదే పదే గుర్తుచేసుకుంటుంటారు. అది నూటికి నూరుపాళ్ళు నిజం. నిజంగా చాలామంది విజయవంతమైన వ్యక్తుల జీవితాలు అలాగే సాగాయి. పల్లె నుంచి దిల్లీకి ఎదిగిన పీవీ నరసింహారావు వంటి మనిషామూర్తుల చరిత్రలు చెబుతూనే ఉన్నాయి. పల్లెజీవనం, మధ్యతరగతి మందహాసం, ఘనమైన వారసత్వం లేకపోవడం మొదలైన ఎన్నో ప్రతికూల పరిస్థితుల మధ్య ముప్పవరపు వెంకయ్యనాయుడు ఉప్పెనలా ఎదిగిన క్రమం గొప్పది. చిన్ననాడే తల్లిని కోల్పోయారు. నెల్లూరు జిల్లాలో ఎక్కడో చిన్న పల్లెటూరు. సామాన్య రైతు కుటుంబం. అక్కడ నుంచి మొదలు పెట్టి,రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లో అడుగుపెట్టి, బిజెపి పూర్వరూపం జనసంఘ్ కాలంలో సాధారణ సభ్యుడుగా చేరి, వాజ్ పెయి, అడ్వాణీ వంటి అగ్రనాయకుల వెనకాల తిరిగి, తిరిగి వారి మధ్యనే కుర్చీవేసుకొని కూర్చునే స్థాయికి ఎదిగిన సాధకుడు వెంకయ్య. ఈ ఇరువురి నేతలు నాకు దైవంతో సమానమని మొన్న వీడ్కోలు సభలోనూ స్మరించుకున్న తీరు ఆదర్శదాయకం. ఈ ఇద్దరు అగ్రనేతలలో వాజ్ పెయి ప్రధానమంత్రి కాగలిగారు. భారతరత్న కూడా వరించింది. కానీ అడ్వాణీకి ప్రధానమంత్రి కావాలనే స్వప్నం కలగానే మిగిలిపోయింది. రాష్ట్రపతి పదవిని కూడా పొందలేకపోయారు. కానీ,వెంకయ్యనాయిడు ఉపరాష్ట్రపతిగా వెలగగలిగారు. ఆ విధంగా, అడ్వాణీ కంటే కూడా వెంకయ్య యోగజాతకుడు.
Also read: ఇటు తైవాన్, అటు చైనా, నడుమ అమెరికా
ఆయన జీవితం తెరచిన పుస్తకం
దాపు ఐదు దశాబ్దాల ప్రజాప్రస్థానం సాగించిన వెంకయ్యనాయుడి రాజకీయ, జీవిత విశేషాలు అందరికీ తెలిసినవే. అది తెరచిన పుస్తకం. రాజ్యాంగబద్ధమైన ఉపరాష్ట్రపదవి నుంచి విరమణ పొందడంతో నాకు ఇక నుంచి స్వేచ్ఛ లభించింది, హాయిగా అందరినీ కలువవచ్చు, స్వేచ్ఛగా మాట్లాడవచ్చు అంటూ మొన్న వెంకయ్య అన్న మాటలు అక్షరసత్యాలు. రాజకీయాల్లో కొనసాగనని, పార్టీలో అసమ్మతులు రాజేయనని కూడా వ్యాఖ్యానించారు. పార్టీ వల్ల, ప్రజాస్వామ్య సౌందర్యం వల్ల ఉన్నతమైన ఎన్నో పదవులు అనుభవించి, అత్యున్నతమైన ఉపరాష్ట్రపతి సింహాసనాన్ని కూడా అధిరోహించిన గత వైభవం ఆయనది. ఈ నేపథ్యంలో, ఏడు పదుల వయస్సు దాటిన ఈ ప్రాయంలో హుందాగా, అర్ధవంతంగా, సమాజహితంగా శేషజీవితాన్ని గడపడమే ఉత్తమం. తన జీవితంలోని అతి ముఖ్య ఘట్టాలు, పదుగురికి స్ఫూర్తిమంతంగా నిలిచే విషయాలను సంస్మరించుకుంటూ ఆత్మకథ రాస్తే బాగుంటుంది. తనకు ఎంతో ఇష్టమైన సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలలో తరచూ పాల్గొనవచ్చు. తాను అనుభవం సంపాయించిన అనేక అంశాలపై వ్యాసాలు రాయవచ్చు, పుస్తకాలు తీసుకురావచ్చు. ఇలా… ఆరోగ్యకరమైన మార్గంలో, జ్ఞానానందభరితంగా ప్రతిక్షణాన్ని గడపవచ్చు. తన పరిచయాల ద్వారా తెలుగువారికి, దేశానికి ఉపయోగపడే నాలుగు మంచిపనులు చేయవచ్చు. స్వర్ణభారతి ట్రస్టును ఇంకా పరిపూర్ణంగా నడుపవచ్చు. సాహిత్య,సాంస్కృతిక సంస్థలకు చేదోడువాదోడుగా ఉండవచ్చు. ఇలా… ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ ఆయనకు తెలిసినవే. కేంద్రమంత్రిగా, పెద్దల సభకు అధ్యక్షుడుగా వెంకయ్యనాయుడి సేవలను, పాత్రను సమీక్షిస్తే మిశ్రమమైన ఫలితాలు ఉన్నాయని చెప్పవచ్చు. తాను వ్యక్తిగతంగా ఎంతో ఎదిగినా, తన స్వరాష్ట్రంలో తన పార్టీ ఎదగుదలకు ఆయన చేసిన కృషి చాలా తక్కువనే అపప్రధ ఉంది. సమకాలీన రాజకీయ ప్రపంచంలో చాలామంది వలె, పార్టీలు మారకుండా ఒకే పార్టీని నమ్ముకొని జీవితాంతం కొనసాగడం వెంకయ్యలోని విశిష్టత. అది ఆయనకు మంచే చేసింది. గొప్ప జీవితాన్ని, ఖ్యాతిని, తృప్తిని, వైభవాన్ని ఇచ్చింది. తెలుగుదేశం ప్రభంజనంలో ఎన్టీఆర్ నుంచి అనేకసార్లు పిలుపు వచ్చినా, వెంకయ్య పార్టీని వీడలేదు. అది గొప్ప విషయం. అందులో వ్యూహం కూడా ఉండి ఉండవచ్చు. బిజెపిలో ఉంటూనే తెలుగుదేశంకు అండగా, ప్రోత్సాహకారుడిగా ఉన్నాడనే మాటను కూడా మూట గట్టుకున్నారు. ఇటువంటి ఎన్నో విమర్శలు, ప్రశంసలు వచ్చినా అన్నింటినీ సమానంగా తీసుకున్న స్థితప్రజ్ఞుడు వెంకయ్యనాయుడు.
Also read: అల్ ఖైదా అధినేత అల్ – జవహరీ అంతం
జీవితాన్ని అందంగా మలచుకున్న వ్యక్తి
నరేంద్రమోదీ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా రాజకీయాల్లో చాలా చురుకుగా ఉన్న దశలో ఆయనను పదవి నుంచి, పార్టీ నుంచి తప్పించి ఉపరాష్ట్రపతి పదవిలో కూర్చోపెట్టారు. ప్రజల మధ్య, నాయకుల మధ్య ఎంతో కలివిడిగా, చురుకుగా తిరిగే ఆయనకు బంగారు పిచ్చుకగా ఉండడం పెద్దగా ఆసక్తి వున్న అంశం కాదు. అయినప్పటికీ ప్రధాని నరేంద్రమోదీ మాటకు గౌరవమిచ్చి, హుందాగా రాజకీయ యవనిక నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు రాష్ట్రపతి పదవి రాకపోయినా, కనీసం ఉపరాష్ట్రపతిగా ఇంకో పర్యాయం కొనసాగించకపోయినా ఎటువంటి బాధను వ్యక్తం చేయకుండా గంభీరంగా దిగిపోయారు. తెలుగుదనమంటే ఎంత ఇష్టమో నెల్లూరు యాస, ఊసులు, మనుషులు అంటే అంతకు మించిన ఇష్టం. ఆయనకుండే గురుభక్తి గొప్పది. తనకు పాఠాలు నేర్పిన పోలూరి హనుమత్ జానకీరామశర్మ మొదలు తనలో నాయకత్వ లక్షణాలు పెరగడంలో,వాక్పటిమ వికసించడంలో స్ఫూర్తిగా నిలిచిన తేన్నేటి విశ్వనాథం వంటి వారిని నిత్యం స్మరిస్తూ ఉంటారు. జూపూడి యజ్ఞనారాయణ (గుంటూరు) వంటివారిని ఎప్పుడూ తలచుకుంటూ ఉంటారు. ఇలా గతాన్ని మరువకుండా సాగడం ఆయన మరో మంచి లక్షణం. మైసూర్ లో ఉన్న తెలుగుకేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్ కు రప్పించడంలో ఆయన చూపిన చొరవ గొప్పది. నెల్లూరుకు తరలి వచ్చిన ఈ కేంద్రానికి స్థలం లేకపోతే, తమ స్వర్ణ భారతి ప్రాంగణాన్ని ఇచ్చిన ఆయన భాషాభిమానం గొప్పది. ఆహారంలో, ఆహార్యంలో నిలువెల్లా తెలుగుదనం నింపుకున్న వెంకయ్యనాయుడి శేషజీవితం విశేషంగా వెలగాలని కోరుకుందాం. జీవితాన్ని అందంగా, గొప్పగా మలుచుకున్న వెంకయ్య శేముషి ప్రశంసాపాత్రం.
Also read: ఉదయశ్రీ కరుణశ్రీ ఉదయించిన సుదినం