Thursday, December 26, 2024

మోడీ స్టేడియం పిచ్ పై విమర్శల వెల్లువ

  • గెలుపు మజా లేకుండా పోయిన విరాట్ సేన
  • భారత మాజీల తలో మాట
  • కక్కలేక మింగలేక ఉక్కిరిబిక్కిరి

క్రికెట్ ను క్రికెట్ గా చూసే రోజులు పోయాయి. క్రికెట్ ను సైతం దేశభక్తితో ముడిపెట్టి ఆత్మవంచనతో లేని ఆనందాన్ని తెచ్చిపెట్టుకొనే రోజులు వచ్చాయి. అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా భారత్- ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన మూడోటెస్టు మ్యాచ్ మూడురోజుల ముచ్చటగానైనా కాకుండా…రెండురోజుల అరాచకంగా ముగియటం అంతర్జాతీయ క్రికెట్ వర్గాలలో తీవ్రచర్చనీయాంశంగా మారింది.

ఐదురోజులపాటు రోజుకు 90 ఓవర్ల చొప్పున 450 ఓవర్లుగా సాగాల్సిన మ్యాచ్…కేవలం 842 బంతుల ఫార్సుగా ముగియటం, రెండురోజుల ఆటలో 30 వికెట్లు పతనం కావటం, ఆట తొలిరోజు తొలిగంట నుంచే బంతి బొంగరంలా తిరగటం, ఐదోరోజు పిచ్ మాదిరిగా వికెట్ నుంచి దుమ్ముధూళి పేకిలేవటం చూసి క్రికెట్ విమర్శకులు మాత్రమే కాదు…భారత మాజీ క్రికెటర్లు, కెప్టెన్లు సైతం ముక్కుమీద వేలేసుకొన్నారు.

ఆవిరైన ఆనందం

కేవలం రెండురోజుల్లోనే ఇంగ్లండ్ ను రెండు సార్లు ఆలౌట్ చేయడం ద్వారా 10 వికెట్ల విజయం సాధించిన భారతజట్టుకు, ప్రధానంగా కెప్టెన్ విరాట్ కొహ్లీకి ఆ ఆనందమే లేకుండా పోయింది. స్థానబలాన్ని భారత్ ఉయోగించుకొందని, స్థానికజట్లు తమ అవసరాలకు అనుగుణంగా వికెట్లు తయారు చేసుకొంటాయని సమర్థించుకోవాలని చూసినా అది అనైతికంగా, క్రికెట్ స్ఫూర్తిగా విరుద్ధంగా, ఆత్మవంచనగానే కనిపిస్తోంది. క్రికెట్ ను క్రికెట్ గా ప్రేమించే ఓ విమర్శకుడు, అభిమాని మాటల్లో చెప్పాలంటే అహ్మదాబాద్ మోడీ స్టేడియం పిచ్ టెస్ట్ మ్యాచ్ కు తలవంపులు తెచ్చేదిగా ఉంది.

భారత్ గెలిచిందా? ఇంగ్లండ్ ఓడిందా? అన్నది ప్రధానం కాదు…క్రికెట్ మాత్రం అహ్మదాబాద్ టెస్టులో ఘోరపరాజయం చవిచూసిందని దిలీప్ వెంగ్ సర్కార్ లాంటి భారత మాజీ క్రికెట్ దిగ్గజాలు చెబుతున్నారు.

ఇది టెస్ట్ క్రికెట్ కే అవమానం- వెంగీ

ప్రాభవం కోల్పోయిన సాంప్రదాయ టెస్టు క్రికెట్ కు కొత్తఊపిరి పోయాలని ఓవైపు అంతర్జాతీయ క్రికెట్ మండలి పలురకాల మార్పులు, చేర్పులు, ప్రయోగాలు చేస్తుంటే మరోవైపు మోడీ స్టేడియం చెత్త పిచ్ తో ఆటనే అవమానించారని, ఇది ఏవిధంగానూ సమర్థనీయం కాదని భారత మాజీ కెప్టెన్, 100 టెస్టుల మొనగాడు దిలీప్ వెంగ్ సర్కార్ అభిప్రాయపడ్డారు. 1934-35 ఇంగ్లండ్- వెస్టిండీస్ జట్ల సిరీస్ లోని ఓ మ్యాచ్ అతితక్కువ సమయంలో ముగిసిన 86 సంవత్సరాల తర్వాత కేవలం రెండురోజుల వ్యవధిలోనే ఫలితం తేలిన మ్యాచ్ ఇదని వెంగ్ సర్కార్ గుర్తు చేశారు.

వెంగ్ సర్కార్

ఇదీ చదవండి: ఆఖరిటెస్టుకు బుమ్రా దూరం

అజ్జూ మాట అలా

భారత మరో మాజీ కెప్టెన్ మహ్మద్ అజరుద్దీన్ మాత్రం…పిచ్ వైఫల్యం అనేకంటే రెండుజట్ల ఆటగాళ్ల అసమర్థతం అనడం సబుబుగా ఉంటుందని చెబుతున్నారు. టెస్ట్ చరిత్రలో వరుసగా మూడు శతకాల బాదిన అరుదైన ఘనత సంపాదించిన అజార్ కు 99 టెస్టు లు ఆడిన అనుభవం ఉంది. బంతి బొంగరంలా తిరిగే స్పిన్ పిచ్ పైన బ్యాటింగ్ చేయటం ఓ కళ అని, గతంలో సునీల్ గవాస్కర్, వెంగ్ సర్కార్, మొహిందర అమర్ నాథ్ లాంటి భారత దిగ్గజాలు మాత్రమే కాదు…మైక్ గాటింగ్, వివియన్ రిచర్డ్స్ ,అలెన్ బోర్డర్, క్లైవ్ లాయిడ్ లాంటి విదేశీ గ్రేట్లు సైతం స్పిన్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న విషయాన్ని అజార్ గుర్తుచేశారు.

ప్రస్తుత తరం క్రికెటర్లకు ఫుట్ వర్క్ అనేది లేకుండా పోయిందని, రెండురోజుల్లో 30 వికెట్లు పడిపోటం బ్యాట్స్ మన్ చేతకాని తనానికి సంకేతమని అజ్జూ విశ్లేషించాడు. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్లు మైకేల్ వాన్, కెవిన్ పీటర్సన్, కంగారూ మాజీ స్టార్లు మార్క్ వా, షేన్ వార్న్ , భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ సైతం పిచ్ తయారు చేసిన విధానాన్ని తప్పుపట్టారు. ఏదిఏమైనా…ప్రధాని నరేంద్ర మోడీ పేరుతో అట్టహాసంగా ప్రారంభమైన మోతేరా కమ్ సర్దార్ పటేల్ స్టేడియం ప్రారంభ టెస్టు మ్యాచ్ తోనే వివాదాలకు కేంద్రబిందువుగా మారటం విచారకరం.  బ్యాట్స్ మెన్ రెండురోజుల ఊచకోతలా సాగిన ఈ మ్యాచ్ విజయం భారత క్రికెట్ అభిమానులకు, కెప్టెన్ విరాట్ కొహ్లీకి ఆనందం కంటే ఏదో తెలియని అసంతృప్తినే మిగిల్చిందనటంలో ఏమాత్రం సందేహం లేదు.

ఇదీ చదవండి: రెండురోజుల ఓటమిపై ఇంగ్లండ్ మాజీల ఆక్రోశం

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles