ఆదివాసీ అంతరంగం బృందంతో నాగసూరి వేణుగోపాల్
ఆకాశవాణిలోనాగసూరీయం – 9
‘గురజాడ నాలో ఉన్నారు — ఈ వాక్యం చదివిన వారు – వీడికి ఎంత అడాసిటీ … అంటూ ఆశ్చర్యపోతూ ఆగ్రహించగలరు! ఆ మాటకొస్తే ప్రతి పత్రికారచయిత గుండెలోనూ గురజాడ వుంటాడు. గురజాడ అడుగుజాడ పత్రికా రచయితలకు వెలలేని వెలుగు జాడ. విశాలాంధ్ర బుక్ హౌస్ వారు ‘కన్యాశుల్కం – నూరేళ్ళ సమాలోచన’ … అనే బృహత్గ్రంథాన్ని ప్రచురించిన తరవాత గురజాడ గురించి, ఆయన సాహిత్యం గురించి రాయడానికి గానీ, మాట్లాడటానికి గానీ ఇంకా ఏమీ మిగలలేదనే అభిప్రాయం నాకుండేది.
Also read: అన్నమయ్య పదగోపురం
కానీ, దీనికి భిన్నంగా ఆకాశవాణి విశాఖపట్టణం కేంద్రం చేసిన ప్రయత్నం గురజాడ సాహిత్యం ఎన్నటికీ తరగని గని అని నిరూపించింది. గురజాడ జీవితాన్ని, సాహిత్యాన్ని భిన్న కోణాల నుంచి పరిశీలించే ప్రసంగాలను వరుసగా చేయించడం, వాటిని పుస్తకంగా తేవాలని నిర్ణయించడం అభినందనీయం…”
–అంటూ ప్రముఖ పత్రికా సంపాదకులు కె. రామచంద్రమూర్తి తమ వ్యాసం ‘గురజాడ నాలో ఉన్నాడు’లో అన్నారు. ఆ పుస్తకం పేరు ‘వెలుగు జాడ’ – సాహితీ ప్రముఖుల విశ్లేషణలతో కూర్చిన విశాఖ ఆకాశవాణి ప్రసార మాలిక!
జివి కృష్ణారావు ధారావాహిక
1988-’91 మధ్యకాలంలో నేను గోవాలో పనిచేస్తున్న కాలంలో ఆకాశవాణి, దూరదర్శన్ మిత్రులు శిష్ట్లాజగన్నాథరావు నాకో పుస్తకం కానుకగా ఇచ్చారు. అది జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం పరిశోధక విద్యార్థిగా టంకశాల అశోక్ వెలువరించిన వ్యాస సంకలనం ‘భావ విప్లవకారుడిగా కొడవటిగంటి’. కుటుంబరావు జీవితం, సాహిత్యం, పత్రికా సంపాదకత్వం, దృక్పథం వంటి విషయాలను విశ్లేషించే రీతిలో పలువురు రాసిన విశ్లేషణల సమాహారమది. తొలిసారి చదివినప్పటి నుండీ ఆ పుస్తక ప్రణాళిక నన్ను ఎంతో ఆకర్షిస్తూ ఉండేది!
Also read: ఉత్సవరథానికి ఉజ్వల సందర్భం
విభిన్నమైన అధ్యయన నేపథ్యాలు ఉన్న పరిశోధకులు, బహుముఖ ప్రజ్ఞాశాలురను పరిశీలిస్తే కానీ, సార్వత్రికత, సమగ్రత సిద్ధించదు. అలాంటి ప్రయత్నం చేయడానికి నాకు 2002లో విజయవాడ ఆకాశవాణిలో తొలిసారి అవకాశం లభించింది. ‘కీలుబొమ్మలు’ నవలారచయిత, ప్లేటో వంటి పాశ్చాత్య తాత్వికుల ఆలోచనలను తెలుగువారికి పంచిన జి.వి.కృష్ణారావు మీద ఓ ధారావాహిక చేశాం. వెనువెంటనే తాపీ ధర్మారావు, కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి, నార్ల వెంకటేశ్వరరావు వంటి వారి గురించి చేయాలనే ఆలోచన కలిగింది, కానీ అది బదిలీ కారణంగా సాధ్యం కాలేదు. అయితే గురజాడ గురించి అటువంటి ప్రయత్నం చేయగలిగే అవకాశం విశాఖపట్నం ఆకాశవాణి ద్వారా లభించింది.
నా సైన్స్ వ్యాసాల అభిమానులు
నాకు బాగా గుర్తుంది – 2004 నవంబరు 24న వ్యక్తిగత కారణాలతో ఒక రోజు సెలవు మీద ఉండగా ఈ సంఘటన జరిగింది. విశాఖపట్నం, భీమిలి మధ్య ఉండే బౌద్ధ క్షేత్రం తొట్లకొండలో ఉన్నప్పుడు విజయనగరం నుంచి కృష్ణాజీ ఫోన్ చేశారు – “నీ సైన్స్ రచనలు చదివాను, నచ్చాయి, త్వరలో కలుస్తాను” అంటూ మొదటి సారి మాట్లాడినా, గలగలా తన వృత్తి, ప్రవృత్తి వివరించారు. ఈ ఫోన్ కాల్ ‘వెలుగుజాడ’ పేరున గురజాడ అప్పారావు గురించి మూడు నెలలపాటు ధారావాహిక ప్రసంగాలు సాగడానికి మూలబిందువు!
Also read: వెళ్ళలేనిచోటే లేని రెక్కల గుర్రం!
గురజాడ విద్యా సంస్థల పేరున విజయనగరంలో పాఠశాలలు కలిగిన ఎమ్.వి.ఆర్. కృష్ణాజీ, ఎమ్.వి.ఎన్. వెంకట్రావు కలిసి, ఆకాశవాణికి వచ్చి నా సైన్సు రచనలను అభినందించారు. 1991 నుంచి క్రమం తప్పకుండా చెకుముకితో పాటు చాలా పత్రికల్లో సైన్స్ రచనల ద్వారా ఎంతోమంది నాకు మిత్రులయ్యారు. అలా అభిమానించే మిత్రులనే ఉత్తరాంధ్ర ప్రాంతంలో ముఖాముఖి కలవడం ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఆ సమయంలో మాటల మధ్యన తమ విద్యా సంస్థలకు గురజాడ పేరు ఉంచామనీ, తామున్నది విజయనగరమనీ, ఏదైనా మంచి
కార్యక్రమం ఆకాశవాణిలో సూచించమని ప్రతిపాదించారు.
టంకశాల అశోక్ ప్రేరణ
ఉత్తరాంధ్రకే కాకుండా మొత్తం తెలుగు సమాజానికే కొత్త వెలుగులు చిందించిన గురజాడను సమగ్రంగా ఆకాశవాణి ద్వారా పరిచయం చెయ్యాలని స్ఫురించింది. కొడవటిగంటి కుటుంబరావు గురించి టంకశాల అశోక్ తెచ్చిన సంకలనం కలిగించిన స్ఫూర్తి, జి.వి.కృష్ణారావు జీవిత సాహిత్యాల గురించి 2002లో విజయవాడలో చేసిన అనుభవం ఇక్కడ పనికివచ్చింది. జానపద కళలు, సంగీతం పట్ల ఎంతో అభిలాష, అభినివేశం, మక్కువ కలిగిన కె.వి. హనుమంతరావు విశాఖపట్నం ఆకాశవాణి డైరెక్టర్ గా వున్నారు. కార్యక్రమానికి సంబంధించిన కాన్సెప్టు, స్ట్రక్చర్ రెండు, మూడు వాక్యాలలో చెప్పగానే అభినందించి దూసుకు వెళ్ళమని చెప్పారు!
Also read: గుక్క తిప్పుకోనివ్వని ఆ రెండేళ్లు!
కార్యక్రమాల పేర్లకు సంబంధించి ఇదివరకే కొంత చర్చించాం. గురజాడ వెలుగుకు ప్రతీక అని నా అభిప్రాయం. గురజాడ పదంలోని జాడను తీసుకుని దాన్ని వెలుగుకు జోడించి ‘వెలుగుజాడ’ అని నామకరణం చేసుకున్నాను. ఈ పదబంధం చాలామందికి నచ్చటమే కాకుండా, తరువాతి కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురజాడ అప్పారావు గురించి వెలువరించిన బృహత్సంకలనానికి ‘వెలుగుజాడ’ అనే పేరే వినియోగించుకున్నారు. ఆమేర ఈ ‘వెలుగుజాడ’ అనే ఆకాశవాణి కార్యక్రమం నాకెంతో తృప్తిని కలిగించింది!
కష్టమైన ప్రసంగ ప్రక్రియ
రేడియో మాధ్యమంలో అతి సులువైనది, రంజింపచెయ్యడానికి అతి కష్టమైనదీ– ప్రసంగ ప్రక్రియ. ఆకాశవాణిలో ఎన్నో విభాగాలలో ప్రసంగాలు పలు రకాలుగా సాగుతూ వుంటాయి. సరైన అధ్యయనం. అర్థవంతమైన ప్రణాళిక, మేలైన రీతిలో ప్రసంగకర్తల ఎంపిక, ఇచ్చిన అంశానికి న్యాయం చేకూర్చేలా ప్రసంగ ప్రతిని సిద్ధం చెయ్యడమే కాకుండా దానిని మరింత భావయుక్తంగా మైక్రోఫోన్ ముందు సమర్పించగలిగినవారితో రేడియోలో గొప్ప ప్రసంగాలు సాధించవచ్చు. గురజాడ అప్పారావు నేపథ్యం, బాల్యం, చదువు, అభిరుచులు, చేసిన ఉద్యోగాలు, సృజించిన రచనలు …ఇది అన్నింటినీ పరిగణనలోనికి తీసుకుని ఒక పదమూడు ప్రసంగాల అంశాలను నిర్ణయించుకున్నాను.
Also read: మేళత్తూరు భాగవత మేళ నాట్యనాటకాలు
విశాఖపట్నం ఆకాశవాణి కార్యక్రమం పరిధిలో గోదావరి నదికి ఉత్తరాన ఉన్న తెలుగు ప్రాంతమంతా అంటే తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు వస్తాయి. ఈ ప్రాంతం నుంచి గురజాడ అప్పారావు సాహిత్యంపట్ల, దృక్పథం పట్ల అభిరుచి, అధికారం గల ప్రసంగ కర్తలను ఎంపిక చేసుకున్నాం. 2005 ఉగాదితో మొదలైన ఈ ధారావాహికలో సర్వశ్రీ ఆవంత్స సోమసుందర్, పిఠాపురం; కోడూరి శ్రీరామమూర్తి, రాజమండ్రి; విజయనగరం నుంచి యు.ఎ. నరసింహమూర్తి, చాగంటి తులసి, ఎ. గోపాలరావు; ఎస్. రామినాయుడు, రాజాం; విశాఖపట్నం నుంచి అబ్బూరి గోపాలకృష్ణ, చందు సుబ్బారావు, టి.జి.కృష్ణారావు, అత్తలూరి నరసింహారావు, జయంతి పాపారావు, ఎమ్. రామకోటి, బి. పార్వతి; అదృష్ట దీపక్, రామచంద్రాపురం విలువైన ప్రసంగాలు ఈ ‘ వెలుగుజాడ’ ధారావాహికలో చేశారు.
గురజాడ కథల్లో సైన్స్ కోణం
ఈ ప్రసంగాలు ప్రణాళిక చేస్తున్నప్పుడు, ప్రసంగాలు రికార్డు చేసిన తర్వాత ఒక వెలితి కనబడింది. అదేమిటంటే గురజాడ కథల్లోని సైన్సు కోణం! దీనికి సంబంధించిన ఒక వ్యాసాన్ని గురజాడ కథానిర్మాణ సంవిధానపు విశ్లేషణతో కలిపి నేను రాసిన వ్యాసం ‘సాహిత్య ప్రస్థానం’ పత్రిక జనవరి-మార్చి 2006 సంచికలో అచ్చయ్యింది. ఈ కార్యక్రమం ప్రసారం అవుతుండగా సాహిత్య విమర్శకులు, పత్రికా సంపాదకులు తెలకపల్లి రవి తన ప్రసంగం చేస్తానన్నారు. అలాగే ఈ ప్రసంగ ప్రతులను పుస్తకంగా తేవాలని, తొలుతే ప్రణాళికలోనే నిర్ణయించుకున్నాం. ఈ పుస్తకానికి ముందు మాటగా పత్రికా సంపాదకులు కె. రామచంద్రమూర్తిని ముందుమాట రాయమని కోరాం. ఆ ముందుమాటలోని తొలి వాక్యాలే ఈ వ్యాసంలో ప్రారంభ వాక్యాలుగా మారాయని గమనించాలి.
Also read: ఆంధ్రా ‘యూనివర్సిటీ యువత’ గా మారిన సందర్భం!
చాలా రకాల కార్యక్రమాలతో కృష్ణాజీ – వెంకట్రావు ద్వయం బిజీ అయిపోవడం, ఇటువైపు ఆకాశవాణిలో డైరెక్టరుగా పనిచేస్తున్న కె.వి. హనుమంతరావు కాలధర్మం చెందడంతో డిటిపి అయిన పుస్తకం కొన్ని నెలలపాటు మూలబడింది! అన్ని అంశాలు నా చేతుల్లో లేవు, కనుక వేచిచూశాను. మళ్ళీ ఒకటిన్నర సంవత్సరం కాలానికి గానీ, ఆ పుస్తకానికి ముక్తి కలగలేదు. అప్పటికి విశాఖపట్నం ఆకాశవాణి డైరెక్టర్ గా వచ్చిన శ్రీమతి ప్రయాగ వేదవతి ఈ వ్యవహారం గురించి ఆరా తీసి ఉత్సాహం కలిగించారు. వారి తోడ్పాటుతోనే విజయవాడలో ‘శతవసంత సాహతీ మంజీరాలు’ అనే బృహత్తర ధారావాహికను మూడేళ్ళపాటు నేను నిర్వహించాను. డా. పి.ఎస్. గోపాలకృష్ణ గారి మున్నుడి తో సెప్టెంబర్ 2006లో ఈ పుస్తకం ప్రచురణ అయ్యింది. అబ్బూరి గోపాలకృష్ణ చిత్రించిన గురజాడ పెయింటింగ్ ను సి.వి.సుబ్రహ్మణ్యం ఫోటో తీసి ఇవ్వగా ముఖచిత్రంగా అలంకరించాం.
విలువైన పుస్తకం
07 అక్టోబరు 2006వ తేదీ విజయనగరంలో గిరిజన్ కోపరేటివ్ కార్పొరేషన్ (జి సి సి) జనరల్ మేనేజర్ డాక్టర్ అంగళకుర్తి విద్యాసాగర్ ‘వెలుగు జాడ’ సంకలనాన్ని ఆవిష్కరిస్తూ చక్కని ప్రసంగం చేశారు. ఇలా ఈ పుస్తకం అచ్చు విషయంలో కాస్త ఆలస్యం జరిగినా, ‘ఆంధ్రభూమి’ దినపత్రిక గురజాడ మీద విమర్శ ప్రచురించి సంచలనానికి తెరలేపిన రెండు రోజులకు మా పుస్తకం విడుదల కావడం ఆహ్వానించదగ్గ పరిణామమే అయ్యింది! నేటికీ విలువైన పుస్తకంగా నిలబడిన ‘వెలుగుజాడ’ పుస్తకంలో ముద్రా రాక్షసాలు మెండుగానే వుండడం ఓ విషాదం. ఈ పుస్తకం కాపీలు ఇప్పుడు దాదాపు లేవు. తప్పులను సవరించిన పునర్ముద్రణ వస్తే బావుంటుంది. విజయనగరం సోదరులు చేద్దాం అంటున్నారు, కానీ పనులు సాగడం లేదు.
అంశానికుండే విస్తృతి పట్ల పరిజ్ఞానం, వర్తమాన సమాజపు అవసరాలకు సంబంధించిన కోణాల అధ్యయనం, అందుబాటులో ఉండే మానవవనరులపై స్పష్టమైన అవగాహన కలగలిసిన చోట…. తపన తోడైతే కచ్చితంగా మంచి ఫలితాలే ఉంటాయి!
Also read: రాయదుర్గానికి కథాతోరణం
— డాక్టర్ నాగసూరి వేణుగోపాల్,
ఆకాశవాణి పూర్వ సంచాలకులు, మొబైల్ ఫోన్: 9440732392