హిందూమతంలో అత్యంత మౌలికమైన ప్రమాణంగా వేదాలను గుర్తిస్తారు. వేదములను శ్రుతులు (వినబడినవి) అనీ, ఆవృత్తి లేదా మననం ద్వారా నేర్చుకోబడేవి కనుక ఆమ్నాయములు అనీ అంటారు. “విద్” అనే ధాతువుకు “తెలియుట” అన్న అర్ధాన్నిబట్టి వేదములు భగవంతునిద్వారా “తెలుపబడినవి” అనీ, అవి ఏ మానవులచేతనూ రచింపబడలేదు అనీ విశ్వాసము. కనుకనే వేదాలను “అపౌరుషేయములు” అని కూడా అంటారు. వేదములను తెలిసికొన్న ఋషులను “ద్రష్టలు” అని అంటారు. ద్రష్ట అంటే దర్శించినవాడు అని అర్ధం. హిందూ శాస్త్రాల ప్రకారం వేదాలను, ఋషులు భగవంతుని నుండి విని గానం చేశారు. అందుకే వీటిని “శ్రుతులు” అని కూడా అంటారు.
ఏనం విందంతి
“ఏనం విందంతి వేదేన తస్మాద్వేదస్య వేదతా”, (ఇష్టప్రాప్తి, అనిష్టపరిహారం) కావల్సిన వాటిని తీర్చి అక్కర్లేని వాటిని రాకుండా చేసే ఆధ్యాత్మిక ఉపాయమే వేదం.
ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణవేదము…
వ్యాసుడు అలా వేదాలను విభజించి తన శిష్యులైన పైలుడు, వైశంపాయనుడు, జైమిని, సుమంతుడు అనేవారికి ఉపదేశించాడు. వారు తమ శిష్యులకు బోధించారు. అలా గురుశిష్యపరంపరగా ఈ నాలుగు వేదాలు వేల సంవత్సరాలుగా తరతరాలకూ సంక్రమిస్తూ వచ్చాయి. వేదాలను ఉచ్ఛరించడంలో స్వరానికి చాలా ప్రాముఖ్యత ఇస్తారు.
మళ్ళీ ఒక్కొక్క వేదంలోను నాలుగు ఉపవిభాగాలున్నాయి. అవి…మంత్ర సంహిత, బ్రాహ్మణము, ఆరణ్యకము, ఉపనిషత్తులు,
ఈ విభాగాలలో మొదటి రెండింటిని “కర్మకాండ” అనీ, తరువాతి రెండింటిని “జ్ఞానకాండ” అనీ అంటారు.
వేదాలలో ఋగ్వేదము అత్యంత పురాతనమైన వేదము. ఇది ప్రధానంగా యాగాలలో దేవతాహ్వానానికి ఉపయోగించేది. ఋగ్వేదం ఋక్కుల రూపంలో ఉంటుంది. వేదాలలో ఋగ్వేదం మొదటిది. ఋగ్వేదం దేవ వేదంగా చెప్పబడింది. యజుర్వేదం మానవులకు, సామవేదం పితరులకు అని మనుస్మృతి వివరిస్తుంది.
ఈ సాంకేతిక విప్లవం లేని రోజుల్లో పుస్తకాలు లేదా గ్రంధాలు కూడా లేని కాలం నుండి వేదం పదిలంగా గురు శిష్య పరంపర ద్వారా కొన్ని కోట్ల తరాలగా సాగుతూ వస్తోంది.
అసలు తప్పులు లేకుండా ఎక్కడా కూడా ఒక ఒత్తు, పొల్లు పోకుండా ఎలా వస్తున్నది.
వేదాలను శృతి అని అంటారు. అంటే విని మరల మననం చేసి శిష్యులకు సాంప్రదాయంగా నేర్పుతారు.
ఏ వేదమంత్రమైనా
వర్ణం,
స్వరం,
మాత్ర(ఎంతసేపు పలకాలో),
బలం(ఎక్కడ ఒత్తి పెట్టి పలకాలో),
సమం(ఏక పద్ధతి)* మరియు
సంతాన (ఎక్కడ విరవాలో, ఎక్కడ పొడిగించాలో) అనే
6 ముఖ్య ప్రామాణిక సూత్రాలకు లోబడి వుంటుంది.*
వీటిలో ఏది మారినా ఆ మంత్రానికి మొత్తం అర్ధం మారిపోతుంది. వాటి వలన అనుకున్న దానికి వ్యతిరిక్త ఫలితాలు రావచ్చును.
ఉదాహరణ
ఒక ఉదాహరణ ద్వారా స్పష్టమైన అవగాహన కలుగుతుంది.
ఇందుకు ఆంగ్ల వాక్యం(sentance) తీసుకుంటే…..
“I never said she stole my money”*
నేను ఆ అమ్మాయి నా డబ్బు తీసింది అని ఎప్పుడూ అనలేదు”*
ఈ వాక్యంలో, ఒక పదం మీద ఒత్తి పలికితే,ఆ పదానికి వున్న అర్ధం మొత్తం మారిపోతుంది.
ఈ పైన చెప్పిన వాక్యంలో ఒకొక్క పదం మీద బలం పెట్టి చూద్దాం.
1. I never said she stole my money.
“నేను” ఆ అమ్మాయి నా డబ్బు తీసింది అని అనలేదు. (అంటే ఇంకెవరో అన్నారు)
2. I *“never”* said she stole my money.
నేను *“ఎప్పుడూ”* ఆ ఆమ్మాయి డబ్బు తీసింది అనలేదు ( ఇది సూటిగా అర్ధమయ్యే వాడుక )
3. I never *“said”* she stole my money
నేనెప్పుడూ ఆ అమ్మాయి డబ్బు తీసింది “అనలేదు”.
అనలేదు కానీ నాకు అనుమానం వుంది, లేదా నమ్మకం వుంది)
4. I never said *“she”* stole my money
ఆ అమ్మాయి తీసిందని నేను అనలేదు.
(మరెవ్వరో తీసి వుండ వచ్చును)
5. I never said she “stole”* my money
ఆ అమ్మాయి “దొంగిలించింది” అని నేను అనలేదు. ( చేబదులు లేక మరో రకంగా మామూలుగా తీసుకుని ఉండవచ్చును
6. I never said she stole *“my”* money
– ఆ అమ్మాయి “నా” డబ్బు తీసింది అని అనలేదు
( *కానీ పక్క వాడి డబ్బు దొంగలించి ఉండవచ్చును, లేక ఆ డబ్బు నాది కాక పోవచ్చును*)
7. I never said she stole my “money”
– ఆ అమ్మాయి నా *“డబ్బు”* దొంగిలించలేదు.
( కానీ మరొకటి దొంగలించి ఉండవచ్చు).
ఇలా ఒకొక్క పదం మీద “ఒత్తి పలకడం” వలన ఒకొక్క అర్ధం మామూలు మన మాటల్లోనే వస్తున్నది.
వేద ప్రోక్తమైన మంత్రాలలో ఉచ్చారణ, స్వర, అనుస్వరం ఎంత ప్రాముఖ్యమో మనకు దీనివల్ల అర్థం అవుతుంది.
ఈ వేదం మంత్రరాశిని కాపాడుకోవడానికి ఎన్నో పద్ధతులను మన ఋషులు వాడారు. “వాక్య, పద, క్రమ, జట, మాల, శిఖా, రేఖా, ధ్వజ, దండ, రథ, ఘన” పద్ధతులలో నేర్చుకునేవారు.
“క్రమ” పాఠంలో 1-2; 2-3; 3-4; 4-5; పద్ధతిలో మంత్రాన్ని పఠిస్తారు. “జట”లో 1-2-2-1-1-2; 2-3-3-2-2-3;3-4-4-3-3-4; పద్ధతిలో, అదే “ఘన”లో 1-2-2-1-1-2-3-3-2-1-1-2-3; 2-3-3-2-2-3-4-4-3-2-2-3-4 పద్ధతిలో పాఠం నేర్చుకుంటారు. దీని వలన ఎక్కడా కూడా ఏ అక్షరం, స్వరం పొల్లు పోకుండా కాపాడబడుతుంది.
కృష్ణయజుర్వేదం
కృష్ణ యజుర్వేదంలో సంహితలో 44 పన్నాలు, బ్రాహ్మణంలో 38 పన్నాలు, అరణ్యంలో 20 పన్నాలు, పితృ పన్నాలూ రెండు కలిపి 84 పన్నాలు ఉన్నాయి. దీనికి పదం, క్రమం, జట, ఘనలతో 2000 పేజీల గ్రంథం అవుతుంది. వీటిని కంఠస్థంగా నేర్వాలంటే 12ఏళ్లు కనీస సమయం పడుతుంది. మూల మంత్రం కంఠస్థం చేసేందుకు గురువు, శిష్యునితో కూడి, ఉచ్చారించాలి. ఇదంతా ఒకే కృష్ణ యజుర్వేదమునకు సంబంధించిన అంశం. మొత్తం సంహితను క్రమతో చదివితే “క్రమాపాఠి, జటతో అయితే “జటాపాఠి”. ఘనతో
కంఠస్థం చేస్తే “ఘనాపాఠి”. ఇది ఈ ప్రక్రియలో పరాకాష్ఠ.
వేదాల కూర్పుకు నాలుగు స్వరాలు సమకూర్చారు. ఉదాత్త, అనుధాత్త, స్వరిత, ప్రచ్యయ అనేవి. కొన్నిచోట్ల ఏడు స్వరాలు కృష్ణ ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్ధ, మంద్ర, అతి స్వర అనే స్వరాలు ఉన్నాయి. అందుకే పేద పఠనానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. శాస్త్ర ప్రకారం చిన్న పదాన్ని తప్పుగా ఉచ్చరించడం అపరాధంగా భావించబడి, అలా ఉచ్చరించిన వాళ్లు ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సి ఉంటుంది. గురు శుశ్రూష తో, నియమిత, నిర్దేశిత సమయాల్లో, నియంత్రిత, పరిమిత ఆహార, కఠోర నియమాలతో వేదాధ్యయనం చేయడం, కంఠతా ఉంచుకోవడం అసామాన్య విషయమే మరి.
వేదాధ్యయనం
వేదాధ్యయనం… అధ్యయన, జ్ఞాపన, అధ్యాపన పద్ధతులలో రక్షింప బడుతూనే, తాను చేసిన కంఠస్థ పాఠాలను జీవితాంతం జ్ఞాపకం ఉంచుకునేందుకు, ఒక నెలంతా ప్రతి రోజూ మననం చేసుకోవాలి. పూర్తి చేసి తిరిగి మళ్లీ నెల రోజులు మననం చేసుకోవాలి. ఇలా తాను కంఠస్థం చేసిన వేద సంహిత, పదం, క్రమం, జట, ఘన అనే అధ్యాయన పద్ధతుల ద్వారా వేద మూల పాఠాన్ని ఒక్క అక్షరం మార్పు రాకుండా మరిచి పోకుండా, జాగ్రత్త పరిచేందుకు, నిరంతరం కంఠోపాఠంగా వల్లె వేస్తూ, పునరుక్త విధానాన్ని వేలాది సంవత్సరాలుగా అనుసరించడం కొనసాగుతున్నది… అంటే అది నిస్సందేహంగా ఒక తపస్సు కాక మరేమిటి.