పందొమ్మిదవ శతాబ్ది ఉత్తరార్ధమున భారత దేశమంతటా అన్ని భాషలలో నూతన వికాసానికి తెర లేచింది. పాశ్చాత్య నాగరికత, అంగ్ల విద్య ప్రభావాలు ప్రజల వేష భాషలపై అనూహ్య ప్రభావాలు చూపాయి. ఇందుకు తెలుగు భాష, ప్రజలకు మినహాయింపు ఏమీ లేదు. ఆ సంధి కాలంలో వేంకటరాయ శాస్త్రి ఆగమనము ఆంధ్రవాఙ్మయమున క్రొత్త యుగమును సూచిక అయింది.
వేదం వెంకట రాయ శాస్త్రి అంటే ఒక ప్రాచీన పండితుడిని తప్ప, అయన గొప్పతనం గురించి, ఆయన తెలుగు భాషకు చేసిన అమూల్య, అపూర్వ సేవల గురించి, అయన చూపిన నూతన మార్గాల గురించి నేటి తరంలో చాలా మందికి తెలియదు. కనీసం శాస్త్రి ఏమి రచనలు చేశారో కూడా నేటి సాహిత్యాభిమానులకు తెలియదు. గద్య పద్య నాటక విమర్శకాది విషయములలో శాస్త్రి చూపినా మార్గములు అనేకాలు.
సుప్రసిద్ధ పండితుడు, కవి, విమర్శకుడు, నాటకకర్త
నాటి కాలంలో శాస్త్రి గ్రంథములు విమర్శకు గురి అయినట్లు ఆధునికులలో ఎవ్వరి గ్రంథాలు కాలేదన్నది వాస్తవం. సుప్రసిద్ధ పండితుడు, కవి, విమర్శకుడు , నాటకకర్త అయిన వేదం వేంకటరాయ శాస్త్రి వేంకట రమణశాస్త్రి, లక్ష్మమ్మ దంపతులకు డిసెంబర్ 21, 1853న చెన్నైలో జన్మించారు. 1886లో మద్రాసు క్రైస్తవ కళాశాలలో సంస్కృత పండిత పదవిని 25 సంవత్సరాలు సమర్థవంతంగా నిర్వహించారు. 1887లో బి.ఎ. పరీక్షలలో ఆంగ్లం, సంస్కృతంలలో ప్రథమస్థానంలో ఉత్తీర్ణుడయ్యారు.
తెలుగు భాషాభిమాని
పరవస్తు చిన్నయసూరికి సహపాఠు లైన, సంస్కృతాంధ్రములలో గొప్ప పండితులైన తండ్రి వేంకటరమణ శాస్త్రి ప్రభావం వేంకటరాయ శాస్త్రిపై పడింది. దాని ప్రభావం వ్యవహార భాషా సాంప్రదాయం అనుసరణకు ప్రేరణ అయింది. 1899లో ‘తెలుగు భాషాభిమాని’ పేరుతో నాటక సమాజాన్ని స్థాపించారు. ఈ సంస్థలో వెంకటరాయ శాస్త్రి వ్రాసిన నాటకాలని ప్రదర్శించేవారు. ఆయన మూల నాటకాలలో 1897లో వ్రాసిన ప్రతాపరుద్రీయం నాటకం, 1901లో వ్రాసిన ఉషా నాటకం ప్రముఖమైనవి. అనేక సంస్కృత నాటకాలను తెనుగించారు. 1916లో సూర్యారాయాంధ్ర నిఘంటువుకు ప్రధాన సంపాదకులుగా కొంతకాలం పనిచేశారు.
ఆముక్తమాల్యద, శృంగార నైషధంపై వ్యాఖ్యలు
అముక్తమాల్యద, శృంగార నైషధం తదితర వ్యాఖ్యలు శాస్త్రి పాండిత్యానికి నిలువుటద్దాలు. ఆముక్త వ్యాఖ్య శతాధిక వసంతాలను చూసింది. 24-6-1920 నాడు ప్రారంభించి 20-10-1920 నాటికి పూర్తి చేసినట్లు ఆయనే తన జీవిత చరిత్రలో సుస్పష్టంగా చెప్పుకున్నారు. ఆముక్తమాల్యద – సంజీవినీ వ్యాఖ్య, భోజ చరిత్రము, శ్రీకృష్ణ దేవరాయ, విజయము-నాటకము కథా సరిత్సాగరము పలు భాగాలు, దశకుమార చరితం, శతక వాఙ్మయ చరిత్ర – ప్రథమ సంపుటం, చరిత్ర రచన – ప్రథమ భాగం, తెనుగు లఘు వ్యాకరణము, వ్యామోహము తదితరులు అయన ప్రముఖ రచనలు. నాగానందం, బొబ్బిలి యుద్ధం, ఉత్తరరామ చరిత, ఆంధ్ర విక్రమోర్వశీయ, ప్రతాపరుద్రీయ, ఉషా నాటకము ప్రియదర్శికాది నాటకములు, అమర కావ్యం, ఆంధ్ర హితోపదేశము – చంపువు, శ్రీ శారదా కాంచిక, ఆంధ్ర బిల్హణియము, విక్రమార్క చరిత్రము, కావ్యాలంకార చూడామణి, మేఘ సందేశం వ్యాఖ్యానం, ఉదయన చరిత్రము, భరతాభారత రూపక మర్యాదలు, తిక్కన సోమయాజి విజయము, ఆంధ్రవ్యాకరణ సర్వస్వ తత్త్వము, ఆంధ్ర భాషా సర్వస్వ నియమ కతిపయములు, ఆంధ్ర సాహిత్య దర్పణము, విమర్శ వినోదము, ఆంధ్ర ప్రసన్నరాఘవ విమర్శనము, తానాషా అక్కన్న మాదన్నలు, ఆంధ్ర రత్నావళీ నాటిక, సారంగధర చరిత్రము, పుష్పబాణ విలాసం, రసమంజరీ, కుమార సంభవము వ్యాఖ్య, ఉదయన చరిత్రము, పంచ తంత్రం, ఆంధ్ర దశకుమార చరిత్రము తదితర రచనలు గావించారు.
విద్యాదానవ్రత మహోదధి
1920లో ఆంధ్ర మహా సభ చేత ‘మహోపాధ్యాయ’ బిరుదు పొందారు. 1922లో ద్వారక పీఠ శంకరభగవత్పాదులచేత ‘సర్వతంత్ర స్వతంత్ర’, ‘మహామహోపాధ్యాయ’, ‘విద్యాదానవ్రత మహోదధి’ అనే సత్కారాలు పొందారు. 1927లో ఆంధ్ర విశ్వకళా పరిషత్తు చేత ‘కళా ప్రపూర్ణ’ గౌరవంతో సన్మానించ బడ్డారు. 1958లో కుమార సంభవ ప్రబంధకర్త నన్నెచోడుని కవిత్వంపై వీరు రాసిన ‘నన్నెచోడుని కవిత్వము’ అనే విమర్శనా గ్రంథానికి ‘ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమి’ బహుమతి లభించింది.
వెంకటరాయ శాస్త్రి 1929, జూన్ 18న మద్రాసులో మరణించారు.
(డిసెంబర్ 21…వేదం వెంకట రాయ శాస్త్రి జయంతి)