30. తిరుప్పావై కథలు
తిరుప్పావై అంటే శ్రీ వ్రతం. తిరు అంటే శ్రీ అని, దివ్యమైన అని పవిత్రమైన అని అర్థం. పావై అంటే నోము అని గీతమని పాటలని అర్థం. కనుక తిరుప్పావై అంటే సిరినోము, గోదాదేవి ఈ పవిత్ర గీత వ్రతం, కవితానోము రచించి, ఆచరించి రంగనాథుణ్ణి పొందిన ఈ శుభదినాన్ని భోగి అంటారు. రంగనాథుణ్ణి భోగరంగడు అని అంటారు. భోగి దాటిన మరునాడే సంక్రాంతి. సంక్రాంతి నాడు దక్షిణాయనం పూర్తై ఉత్తరాయణం మొదలవుతుంది. సూర్యుడు ధనురాశినుంచి మకరరాశికి సంక్రమిస్తాడు కనుక ఇది మకరసంక్రాంతి.
Also read: పరమాత్ముడవని తెలియక చులకనగ పిలిచాము కృష్ణా
జీయర్ స్వామి సం అంటే మంచి అనీ, క్రాంతి అంటే అడుగుపెట్టడం అని, మంచిగా బతకడానికి నిర్ణయం తీసుకోవలసిన శుభదినం కనుక ఇది సంక్రాంతి అని వివరించారు. ధనుర్మాసంలో ప్రతి తెల్లవారుఝామున ఒక పాశురం భక్తితో పాడి రంగనాథుడిని పొందిన గోదాదేవి వలె, ప్రతి కన్య భర్తగా రంగనాధుడినే పొందినట్టు భావించి, ఆ అమ్మాయి తండ్రి విష్ణుచిత్తుడైన పెరియాళ్వారుగా మారి తన అల్లుడిని రంగనాథుడుగా సన్మానించి పండుగ చేసుకోవడమే సంక్రాంతి పండుగ.
“వంగ క్కడల్ = అలలతో కూడిన ఆ పాల సముద్రాన్ని, కడైంద = చిలికినప్పుడు “మాదవనై” ఆయన లక్ష్మీదేవిని పొందినవాడైయ్యాడు, ఆయనే “క్కేశవనై = కేశవుడు, అందమైన కేశపాశం కల వాడు. దేవ లోక ఐశ్వర్యాన్ని వెలికితీయడానికి పాల సముద్రంలో మందర పర్వతాన్ని వాసుకి అనే పామును తాడుగా కట్టి దేవతలు అసురులు పరస్పర మైత్రితో చిలికారు. ఆనాడు స్వామి వారి మైత్రిని కాపాడటానికి ఎన్నో రూపాలు ధరించాడు. పర్వతం క్రిందకు పడి పోకుండా కూర్మంగా ఒక రూపం, పైన పర్వతం నిలిచి ఉండటానికి మరోరూపం, ఇటు దేవతలకు అటు అసురలకు బలాన్నిచ్చేలా మరో రెండు రూపాలు ధరించాడు. కలిసి చేసే పనికి పరమాత్మ తనదిగా భావించి చేస్తాడనే దానికి ఇది నిదర్శణం. అలా మనం కలిసి ఆచరించే తిరుప్పావైకి ఫలితం ఆయన తప్పక ఇస్తాడు. ఆవిధంగా చిలికినందుకు అమృతానికి అమృతమైన అమ్మవారిని పొంది ఆయన మాధవుడైనాడు.
Also read: తెలివి లేమిగల మా గొల్లలందు నీవు బుట్టుటే మా భాగ్యమోయి
అసలు సాగర మధనం స్వామి జరిపింది అమ్మను తన వద్దకిచేర్చుకోవడానికే అని ఆండాళ్ అమ్మ “మాదవనై” అనే పద ప్రయోగం ద్వారా నారాయణ రహస్యం చెబుతుంది.
“శేయిరైయార్” = భగవత్ కైంకర్య రూపమైన ఆభరణాలు కల “శెన్ఱిఱైంజ్ఞి” = ఆ గోపికలు “అంగ ప్పఱై కొండవాత్తై” = చంద్రుడి వలె ప్రకాశించే “తింగళ్ తిరుముగత్తు” = ఆ శ్రీకృష్ణుడి దివ్య అనుగ్రహం పొందారు. “అణి పుదువై” = భూమికి అలంకారమైన శ్రీవిల్లిపుత్తూర్ లో “ప్పైంగమల త్తణ్ తెరియల్” = చల్లటి తులసి మాలను ధరించి ఉన్న “పట్టర్బిరాన్” విష్ణుచిత్తుల వారి కూతురైన = “కోదై”= గోదాదేవి”శొన్న”= చెప్పిన “శంగ త్తమిళ్ మాలై” = తీపైన ఈ పాటల మాలయైన “ముప్పదుం తప్పామే”= ముప్పై పాటలను, ఒక్కటీ వదలకుండా చెప్పాలి.
తిరుప్పావై ఒక మాలిక కదా, మాలలో ఏ ఒక్క రత్నం లేకున్నా ఆ మాల అందం లేకుండా పోతుంది. ఈ తిరుప్పావై భగవంతుణ్ణి చేరే క్రమమైన మెట్ల వంటివి, పైకి వెళ్లాలంటే ప్రతి మెట్టూ ఎక్కవలసిందే. “శెంగణ్ తిరుముగత్తు” = వాత్సల్యమైన ఆ ముఖంతో “చ్చెల్వ త్తిరుమాలాల్”= ఉభయ విభూది అనే ఐశ్వర్యం కల నాథుడు,”ఇంగిప్పరిశురైప్పర్” = ఆయన చల్లని చూపులు తిరుప్పావై చదివే వారిపై ఉంటాయి.”ఈరిరండు మాల్ వరైత్తోళ్” = రెండు హస్తాలతో ఉన్న ఆయన నాలుగు హస్తాలు చేసుకొని నాలుగు పురుషార్థాలను ఇస్తాడు. “ఎంగుం తిరువగుళ్ పెత్త్” = అన్ని చోట్లా దివ్య అనుగ్రహాన్ని పొంది “ఇన్బుఱువర్” = ఆచరించిన వారు ఆనందాన్ని అనుభవిస్తారు అని గోదాదేవి పాశుర అంతరార్థాన్ని జీయర్ స్వామి సులువుగా తెలిసేట్టు వివరించారు.
Also read:గోవిందా నీతో నిత్య సాంగత్యమే మాసౌభాగ్యం
ప్రతి ఇంటా గోదమ్మ, ఇంటింటి అల్లుడు రంగయ్య
గొబ్బిళ్ల వ్రతంలో గోపికలు ఎవరికి వారు శ్రీకృష్ణుడిని కోరుకుని మధురభక్తిని ప్రకటిస్తారు. జీవాత్మ తాను స్త్రీగా భావించుకుని పురుషోత్తముడైన పరమాత్ముడిలో సమైక్యం కావాలను కోరుకోవడం తిరుప్పావై. ఈ రోజు దంపతులు రంగనాథుణ్ణి సత్కరించినట్లా అన్నట్లు తమ తమ అల్లుళ్లను సత్కరిస్తారు.
జనజీవనాన్ని ఆధ్యాత్మికతేజస్సుతో పరంధాముడి కాంతివైపు నడిపించి ఉజ్జీవింపజేసే తిరుప్పావై ఒక దివ్య ప్రబంధం. ప్రేమభక్తి కావ్యం. ఈ అత్యద్భుత ప్రబంధ విశేష ఫలాలను ప్రాధాన్యాలను ప్రస్తావిస్తూ ఫలశృతిని వినిపిస్తూ శుభం పలికేది ఈ చివరిపాశురం.
ఈ ముప్పై పాశురాలను రోజు చదవాలి, లేదా చివరి రెండు (29, 30వ) పాశురాలనయినా తప్పని సరి గా అనుసంధానం చేయాలి. ద్వాపరంలో గోపికలు ఈ వ్రతం ఆచరించి కృష్ణుణ్ణి పొందారు. కలియుగంలో గోదాదేవి ఈ వ్రతం ఆచరించి రంగనాథుణ్ణి చేరింది. ఇది కాత్యాయనీ వ్రతం. అందుకే శ్రీవ్రతం అనీ అంటారు.
Also read: గోదమ్మ మొక్కు తీర్చిన రామానుజస్వామి
విశేషార్థం
మనకు కావలసిన మోక్షమే అమృతం. అందుకు శాస్త్రమనే మహాసముద్రాన్ని మథించాలి. బుద్ధి మంధరం. అనుకూల ప్రతికూల శక్తులు దేవతలు రాక్షసులు. మంధరాన్ని తెచ్చి సముద్రంలో వేయాలని గరుడుని స్వామి ఆదేశిస్తాడు. బుద్ధిని భగవంతుడే ఇస్తాడు. బుధ్ది ఆచార్యుడి ద్వారా ఉద్దీప్తమవుతుంది. ఇక్కడ గరుడుడంటే ఆచార్యుడు.
సంసార సముద్ర మథనం
సంసారం మహాసముద్రం. శరీరం నావ, భగవత్సంకల్పమే మంధరం, భగవంతుడి కృప తాడు. ఆయన కటాక్షమే చేతులు. లక్ష్మి (పిరాట్టి) ఆత్మవస్తువు. తన సంకల్పమనే మంధరానికి కృప అనే తాడు గట్టి కటాక్షమనే చేతులతో సాగరమును మధించి, ప్రియమైన ఆత్మను పొందుతాడు. చేతనులు పరమాత్మకు కౌస్తుభమణి వంటివారు. వారి పాపపుణ్యాల వలన సంసారం సముద్రంలో పడిపోయారు. వారికి మార్గం లేక అలమటిస్తూ ఉంటే భగవంతుని నిర్హేతుక కటాక్షము పడుతుంది. సత్వగుణం పెరిగి ఆ ఆత్మ భగవంతుడిని ప్రగాఢంగా కోరుతూ ఉంటుంది. అదే సముద్ర ఘోష. ఈ ఘోషతో పరమాత్మ కృప పెరుగుతుంది. ఆయన సంకల్పాన్ని మార్చుతుంది. భక్తియోగాన్ని ప్రసాదిస్తాడు. భక్తిలో అజ్ఞానం పోవడం, జ్ఞానం రావడం జరుగుతుంది. అమృతమధనం అది. దాంతో లభించే అమృతం భగవత్ప్రాప్తి. అదేమోక్షం. ఈవిధంగా మోక్షం ప్రసాదించమని ప్రార్థించడం తిరుప్పావు వ్రతం. అమృతం లభిస్తుందని చెప్పడమనే ఫలశృతి ఈ పాశురం. వేదం సముద్రజలం వంటిది. కాని తాగడానికి పనికిరాదు. తిరుప్పావై గోదాదేవి ముఖారవిందంనుంచి వెలువడింది కనుక అది మేఘం వంటిది. సముద్రంనించి ఉప్పునీటిని త్రావి, మధురమైన జలాన్ని కురిపించే మేఘం తిరుప్పావై. ఉపనిషత్తుల సారం. అమృతం.
Also read: పరికరాలు కాదు పరమాత్ముడే కావాలి
తిరు అంటే శ్రీ అంటే లక్ష్మీదేవి. ప్పావై అంటే వ్రతం అనే అర్థం తోపాటు ఆమె దయ అనీ కరుణ అనీ అర్థం. బ్రతుకు అర్థం తెలియక అట్టడుగున పడి కొట్టుమిట్టాడుతున్న పిల్లలమైన మనందరినీ పైకి చేదుకోవడానికి ఆండాళ్ గా ఆ మహాతల్లి అవతరించి మనను మన జగన్నాధుడు, తండ్రి, పరమాత్ముడినిచేర్చడానికి చూపిన మార్గం తిరుప్పావై.
ఓడలున్న సముద్రం అంటే చాలా పెద్ద సముద్రం అని భావం. దాన్నే మథించినారు. అప్పుడు ఉద్భవించిన అమృతమయి శ్రీ లక్ష్మీని స్వీకరించి ‘మా’ (లక్ష్మి) ధవుడు (భర్త) అయినాడు. వేదోపనిషద్ శాస్త్ర సాగరాన్ని మధించి గోదాదేవి తిరుప్పావైలోంచి శ్రీరంగడు ఆమెకు లభించాడు. క్షీరసముద్రాన్ని మథించడానికి సాయపడిని శ్రీమహావిష్ణువుకు శ్రీ మహాలక్ష్మి లబించినట్టే, వేద సాగర మథనానికి సహకరించిన గోదమ్మకు శ్రీరంగడు లభించినాడు.
పన్నిద్దరు ఆళ్వార్లలో గోదాదేవి పదకొండో ఆళ్వార్. శ్రీవైష్ణవ మతంలో మొత్తం పన్నెండు మంది ఆళ్వార్ పరమభక్తులు ఉన్నారు, అంటే భగవంతుడిని ప్రసన్నం చేసుకుని మంగళం పాడిన వారని అర్థం. విష్ణుభావ నిమగ్నులను ఆళ్వార్లని అంటారు. ఉన్నారు. వారిలో తండ్రీ కూతుళ్లిద్దరూ ఆళ్వార్ లు ఉన్నారు. వారే విష్ణుచిత్తులు, గోదాదేవి. ఈ పన్నెండు మంది తనను తాము స్త్రీ గా సంభావించుకుని పరమాత్మను పతిగా ప్రేమించి మధురభక్తి ఉప్పొంగి పోయి ఆయనను సాధించిన పరమ భక్తులు. భగవంతుని భక్తులను భాగవతులు అంటారు. ఆ భాగవతులలో ఉత్తముడిని భాగవతోత్తములని అంటారు. వీరు భాగవతోత్తములు.
- పోయ్ గై ఆళ్వార్… వీరిని సరోయోగి అంటారు.
- పూదత్తాళ్వార్ … వీరిని భూతయోగి అంటారు.
- పేయాళ్వార్ …. వీరిని మహాయోగి అంటారు.
- తిరుమళిశైయాళ్వార్ … భక్తిసారులని మరోపేరు.
- నమ్మాళ్వార్…వీరినే శఠగోపముని అంటారు.
- కులశేఖరాళ్వార్
- పెరియాళ్వార్ లేదా విష్ణుచిత్తులు, గోదమ్మ తండ్రి
- తొండరడిప్పొడి యాళ్వార్ – భక్తాంఘ్రి రేణువు విప్రనారాయణుడు
- తిరుప్పాణి ఆళ్వార్…వీరినే యోగివాహనులు అంటారు.
- తిరుమంగై ఆళ్వార్ ..పరకాల ముని అంటారు.
- ఆంఢాల్ గోదాదేవి
- మధురకవి ఆళ్వార్
‘గోవిందా నీకు మేము’ అను మాట ప్రయోగించి జగత్తుకు కారణం, జగత్తుకు రక్షణం పరమాత్మ అని ‘అ’ కారము చెప్పినారు గోదమ్మ. నీకే అనే ఏ కారములో ‘‘ఓం’ లోని ‘ఉ’ కార అర్థం తెలుపుతున్నారు. ‘మేము’ అనడంతో జీవసముదాయానికి చిహ్నమయిన ‘మ’ కారార్థము వివరిస్తున్నది. ఇది ఓం కారం అంటే ప్రణవం, ప్రణవార్థం. నీతో సర్వ విధ బంధుత్వం మాకు ఉంది అనడంతో నారాయణ శబ్దార్థము చెప్పారు. ఆ అనుబంధం ఏఢేడు జన్మల దాకా అని చెప్పడం (ఆయ) అనే చతుర్థీ విభక్తి అర్థమును తెలుపుతున్నది. ఈ విధంగా మూల మంత్రాన్ని 29వ పాశురంలో ప్రతిపాదించి, ప్రతిష్టించి, గోదాదేవి నారాయణునితో పత్నీ బంధుత్వాన్ని స్థాపించి జగన్నాథుడే తన నాథుడని నిరూపించి, 30వ పాశురంలో ఫలశృతి వివరించిన గోదా వ్రతం తిరుప్పావై.
Also read: శ్రీకృష్ణుడంటే కొంగు బంగారమే కదా