ప్రముఖ వేద శాస్త్ర పండితులు, తెలంగాణలో వేద విద్యావ్యాప్తి కోసం అంకిత భావంతో అహరహం కృషి చేసిన మహనీయులు బ్రహ్మశ్రీ మాడుగుల మాణిక్య సోమయాజులు సోమవారం సాయంత్రం సంగారెడ్డి జిల్లా సదాశివపేట స్వగృహంలో ఆస్తమించారు. ఆయన వయస్స 81 సంవత్సరాలు. కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సోమయాజులు తాము నిష్క్రమించే సమయం సమీపించినట్టు గ్రహించి సోమవారం తెల్లవారు జామున సన్యాస ఆశ్రమాన్ని స్వీకరించి శ్రీ బ్రహ్మానంద తీర్థ మహాస్వామిగా దీక్షా నామం పొందారు.
6 దశాబ్దాల విద్యాదానం
ఆరు దశాబ్దాలకు పైగా తెలంగాణ రాష్ట్రంలో వేదపాఠశాలలు నెలకొల్పి వందలాది మంది శిష్యులకు వేదవిద్యాదానం చేశారు. పవిత్ర, వారణాసి క్షేత్రంలో కూడా వేద విద్యార్థులను మూడేళ్ళ పాటు తీర్చిదిద్దిన వేదమూర్తి. ఆ సమయంలోనే తెలంగాణ ప్రాంతం నుంచి కాశీ క్షేత్రానికి వెళ్ళే భక్త జనులకోసం కేదార ఘాట్ లో 400 గజాల స్థలాన్ని పవిత్ర గంగాతీరంలో ఉదారులైనదాతల విరాలతో సేకరించి, వదాన్యులకు గంగా తీరంలో ‘భూదానం’ కార్యక్రమాన్ని నిర్వహించి, కొన్నాళ్ళ క్రితం తిరిగి వచ్చారు. కాశీలో శ్రీమతి లలితతో కలిసి ఉండేవారు. అక్కడ బాలలకు వేదాలు బోధించేవారు.
కేసీఆర్ సన్మానం
ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు 2015లో నిర్వహించిన ఆయుత చండీయాగంలో స్వర్ణ కంకణంతో ముఖ్యమంత్రి సోమయాజులను సత్కరించారు. 2018లో కూడా ఆయనకు ముఖ్యమంత్రి పురస్కారం లభించింది. ముఖ్యమంత్రి చేసిన మహారుద్ర సహిత సహస్ర చండీయాగంలోనూ ప్రధాన అర్చకుడిగా సోమయాజులు వ్యవహరించారు. కేసీఆర్ తన ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో చేసిన రాజసంకల్ప యజ్ఞంలో కూడా సోమయాజులు ఉన్నారు. దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో మాణిక్య సోమయాజులవారికి సన్మానాలు, సత్కారాలతో వేద విద్యా వికాసం కోసం చేసిన కృషికి గుర్తింపు పొందారు. సోమయాజులు అస్తమయంతో రాష్ట్రం గొప్ప వేదమూర్తిని కొల్పోయింది.
వేదాధ్యయనం
సోమయాజులు 1941లో మాడుగుల పురుషోత్తం సోమయాజికీ, జానాబాయికీ పట్లూరు గ్రామంలో జన్మించారు. అక్కడే విద్యాభ్యాసం చేశారు. అనంతరం గుంటూరు జిల్లా పాపాయపల్లిలోని బ్రాహ్మణ గురుకులం పాఠశాలలో నాలుగు సంవత్సరాలు వేదాధ్యయనం చేశారు. కాశీలో ఉన్నప్పుడు సైతం ముఖ్యమంత్రి ఎప్పుకు కావాలనుకుంటే అప్పుడు వచ్చి ఆయన నిర్వహించే కార్యక్రమాలలో పాల్గొనేవారు.