బౌద్ధుల ఆదర్శ పద్ధతులను, మానవీయ సిద్ధాంతాలను అనుసరించకుండా బ్రాహ్మణులు వారికి ఎదురు నిలవడం అసాధ్యమని తేలిపోయింది. బుద్ధుని మహాపరినిర్వాణం తర్వాత, బౌద్ధులు ఆయన స్ఫూర్తిమంతమైన మూర్తిని శిల్పించుకుని ప్రతిష్ఠించుకున్నారు. అనేక స్థూపాలను నెలకొల్పుకున్నారు. ఇక, తప్పని పరిస్థితుల్లో వైదిక మతస్థులయిన ఆర్యబ్రాహ్మణులు బౌద్ధారామాల్ని నాశనం చేసి, దేవాలయాలను నిర్మించుకున్నారు. బుద్ధుడి మూర్తిని మార్చి, వాటితో శివుడు, విష్ణువు, రాముడు, కృష్ణుడు వంటి వారి ఇష్టదైవాల విగ్రహాలను ఏర్పాటు చేసుకున్నారు. – డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్
ఈ చిన్న ప్రకటన విస్తృతమైన చరిత్రను మన కళ్ళముందుంచుతుంది. మధ్య ఆసియా, చైనా ప్రాంతం నుంచి వచ్చిన మంగోలాయిడ్ జాతికి చెందిన చెంఘిజ్ ఖాన్ వారసులు కుషాణులు. కుషాణుల్లో మూడవ రాజైన కనిష్కుడి నాణాలను ‘దీనార్’ లని అనేవారు. మొదటిసారి తన బంగారు నాణాలపై, అంటే దీనార్ లపై, కనిష్కుడు బుద్ధుడి రూపాన్ని ముద్రించాడు. ఈ చర్య వల్లనే బుద్ధుడి విగ్రాహాల తయారీ- ఆ తర్వాత విగ్రహారాధన, పూజలు – అన్నీ బౌద్ధం నుంచే మొదలయినాయనడానికి చారిత్రక ఆధారాలున్నాయి. వాటిని కొల్లగొట్టి వైదిక మతస్థులు తాము కల్పించుకున్నదేవుళ్ళను పూజించడం ప్రారంభించారు. అయితే వారు ఆ విషయం ఒప్పుకోరు. తమదే ప్రాచీన సంస్కృతి అని, తమదే సనాతన ధర్మమనీ ప్రకటించుకుంటూ ఉంటారు. మరి సాధారణ శకానికి ముందు, తాము తమ దేవుళ్ళకు కట్టుకున్న ఆలయాలు ఎందుకు లేవన్న ప్రశ్నకు జవాబు చెప్పలేరు. బౌద్ధారామాల విధ్వంసంతోనే తమ ఆలయాల నిర్మాణం ప్రారంభమైందని ఒప్పుకుంటే గొడవే ఉండదు. కానీ, వారు ఆ పని చేయరు. ఆంధ్రప్రదేశ్ లోని పంచారామలది కూడా అదే పరిస్థితి.
Also read: జీవిత సమస్యల్లోంచి బయట పడడం ఎలా?
1.ద్రాక్షారామం 2. భీమారామం .సర్పారామం 4. అమరారామం 5.కొమరారామం. ఈ పంచారామాలలో బౌద్ధభిక్షువులు ఉండేవారు. కొన్నింటిలో బౌద్ధభిక్షిణులు ఉండేవారు. ఏకాంత నివాస స్థలాన్ని బౌద్ధులు ‘ఆరామం’ – అని పిలిచేవారు. ఇందులో వారు ఉచితంగా బౌద్ధధమ్మాన్ని (బుద్ధుని బోధనల్ని) బోధించేవారు. వీటిలో గదులు నిర్మించబడి ఉండేవి. ఈ పంచారామాలలో1. సిద్ధార్థుడి జననం 2. మహాభినిష్క్రమణం 3. సంబోధిని పొందుట 4. సత్యాన్ని బోధించుట 5. మహాపరినిర్వాణం వంటి అయిదు ప్రధానమైన ఘట్టాలను తెలియజేసే విధంగా ఈ పంచారామాలలో బౌద్ధులు అయిదు స్తంభాలు నిర్మించారు. అయితే, వాటిని తొలగించిన బ్రాహ్మణులు పైన గుండ్రటి ఆకారాన్ని రూపొందించి ‘శివలింగం’ అంటూ నమ్మించారు. అందుకు తగినట్టుగా కట్టుకథలు ప్రచారం చేశారు. శ్రమ చేయకుండా జీవించాలన్న దురుద్దేశంతో శ్రమన సంస్కృతిని ఒక పథకం ప్రకారం నాశనం చేస్తూ వచ్చారు. ఆంధ్రదేశంలో సాధారణ శకం 9-10 (సీఈ) శతాబ్దాలలో తూర్పు చాళుక్య ప్రభువైన చాళుక్య భీముని కాలంలో బౌద్ధారామాలను శైవదేవాలయాలుగా మార్చారు.
బ్రాహ్మణిజం చేసిన ఘోరాలువిద్యారంగంలో, భాషాసాహిత్యాల విషయంలో కూడా ఎంత ఘోరంగా ఉండేవో అర్థం చేసుకోవాలంటే ఈ ఉపోద్ఘాతం అవసరమనిపించింది. ఈ నేపథ్యంలోంచి ఆయా విషయాలను చూద్దాం! ‘వేదగణితం’ అని చెప్పబడుతున్నది అసలు వేదాలలో లేదు. మరి ఈ వేదగణితం అనే రోగం ఎలామొదలయ్యిందీ? అంటే – కొన్ని పూర్వాపరాలు తెలుసుకోవాలి! భారత దేశంలో సింధూ నాగరికతనాటి గణిత పరిజ్ఞానం కాలగర్భంలో కలిసిపోయింది. వేదకాలంలో గణిత శాస్త్రం అభివృద్ధి కానేలేదు. గణితాన్ని అభివృద్ధి చేసినవారు, గణితంలో సున్నాను (0) కనుగొన్నవారు – బౌద్ధులే. బౌద్ధుల గణిత పరిజ్ఞానమే అరబ్బులకు చేరింది. అతి పెద్ద సంఖ్యల వివరాలు, గణిత పరికర్మలు సాధారణ శకానికి ముందు మూడవ శతాబ్దం (బీఈసీ)నాటి బౌద్ధ గ్రంథం ‘లలిత విస్తరంలో విస్తారంగా ఉన్నాయి. ఆ తర్వాత సాధారణ శకంలో ఆర్యభట్ట (476 – 550 సీఈ) చేసిన కృషి ఎంతో విలువైనది. ఆర్యభట్ట మొదట నలందా విశ్వవిద్యాలయ విద్యార్థి. తరువాతి కాలంలో అందులో అధ్యాపకుడయ్యాడు. కాలక్రమంలో ఒక విభాగానికి అధిపతి అయి – ఖగోళశాస్త్రం, గణితం, భౌతికశాస్త్రాలలోనే కాక – జీవశాస్త్రం, వైద్యశాస్త్రాలలో ఎంతో మంది పరిశోధకులను ప్రోత్సహించాడు. మోసపొటేమియా, గ్రీకు ప్రాంతాల నుండి వచ్చిన పరిశోధనల సారాంశాన్ని అర్థం చేసుకుని, వాటిని మెరుగుపరిచాడు. ఆర్యభట్ట గణిత శాస్త్రంలో ముఖ్యంగా అర్థమెటిక్ (అంక గణితం) ఆల్ జీబ్రా (బీజగణితం) ప్లేన్ ట్రిగనామెట్రీ, స్పెరికల్ ట్రిగనామెట్రీ, కంటిన్యూడ్ ఫ్రాక్షన్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, పవర్ సీరీస్, టేబుల్ ఆఫ్ సైన్ వంటి వాటిని విస్తరించాడు.
Also read: ఇంగితం లేని పండిత ప్రకాండులు
అర్థం చేసుకోవల్సిన ముఖ్యమైన విషయమేమంటే, నాటి పరిశోధకులు, శాస్త్రవేత్తలు అందరూ బౌద్ధులే. వారి చిత్రపటాలకు నిలువు బొట్లు, అడ్డం బొట్లు పెట్టి – వారు వైదక మతస్థులయినట్లు ప్రచారం చేశారు. ఒక రకంగా వైజ్ఞానిక శాస్త్ర చరిత్రను కూడా బ్రాహ్మణీకరించిన ఘనచరిత్ర వైదిక మతస్థులదే – తర్వాత కాలంలో వచ్చిన బ్రహ్మగుప్త (579 సీఈ). భాస్కర (1114 సీఈ) వంటి వారంతా ఈ కోవలోనివారే. భాస్కరుడు ‘సిద్ధాంత శిరోమణి’ (1150 సీఈ) కరణ కుతూహలం (1177 సీఈ) వంటి గ్రంథాలు రచించాడని తెలుస్తోంది. సిద్ధాంత శిరోమణిలోని తొలి భాగం ‘‘శుద్ధగణితం!’’ – దీన్నే తర్వాత కాలంలో ‘అంక గణితం’ అని అన్నారు. అదే లీలావతి గణితంగా ప్రసిద్ధిపొందింది. అయితే అంతకు ముందే 814 సీఈలో కర్ణాటకు చెందిన వీరాచార్యుడు ‘గణిత సార సంగ్రహం’ అనే గ్రంథం రచించాడు. కవి తిక్కన మిత్రుడైన పావులూరి మల్లన్న ఇదే గణిత సార సంగ్రహాన్ని చక్కటి పద్యకావ్యంగా తెలుగులోకి అనువదించాడు. ఈ విధంగా బౌద్ధులతో ప్రారంభించబడ్డ గణితశాస్త్రం – వారి తర్వాత అదే పేరుతో సామాన్య ప్రజలకు అందుబాటులోకొచ్చింది. 1965లో భవతీతీర్థ అనే అతను ‘‘వేదిక్ మేథమేటిక్స్’’ అనే గ్రంథం వెలువరించాడు. అబద్ధంతో సమాజాన్ని కలుషితం చేశాడు. ఆనాటి నుండి కొందరు ‘కుహనా గణితశాస్త్రవేత్తలు వేదగణితం పేరుతో ఉన్నవీ లేనివీ కలిపి – వ్యాపారం చేసుకుంటున్నారు. అందుకే, విషయాలు మూలాల్లోకి వెళ్ళి గ్రహించడం అవసరం!
ఆ కాలంలో దేశంలో ఉన్నవి మూడు భాషలు – పాలి, ప్రాకృతం, సంస్కృతం. పాలి భాషను బ్రహ్మీలిపిలలో రాసేవారు. జైనులు ప్రాకృతాన్ని ఉపయోగించేవారు. ఆనాటి ప్రజల భాష అయిన పాలి భాషలో బుద్ధుడు బోధనలు చేసేవాడు. ఈ భాషల్ని సంస్కరించుకుని ఏర్పరుచుకున్నదే సంస్కృతం. దీన్ని బ్రాహ్మణులే ఎక్కువగా ఉపయోగించేవారు. పైగా అది ప్రజలకు అందకుండా అడ్డుకునేవారు. ఆ రకంగా తమ ఆధిపత్యం కొనసాగాలని తాపత్రయపడ్డారు. కానీ, ఆ కారణంగానే అది ప్రజలకు చేరువకాకుండా క్షీణిస్తూ వచ్చింది. మరో ముఖ్యమైన విషయమేమంటే సంస్కృతం మాట్లాడటానికి పనికి వచ్చేది మాత్రమే! రాసుకోవడానికి వీలయ్యేది కాదు. ఎందుకంటే అది లిపిలేని భాష. అయితే వారు భారతదేశంలో చలామణిలో ఉన్న ‘నాగరి’ లిపిలో రాసుకొని కాపాడుకున్నారు. దాన్నే ఉన్నతీకరించి ‘దేవనాగరి లిపి’ – అని చెప్పుకున్నారు. ఏకంగా ఆ భాషను ‘దైవభాష’ అని కూడా ప్రచారం చేసుకున్నారు.
Also read: చదువురాని అవివేకులు పాలకులైతే?
మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించిన చంద్రగుప్తమౌర్యుడు, జైనమతాభిమాని. తరువాత వచ్చిన బిందుసారుడూ అదే మతాన్ని అవలంభించాడు. ఆ తర్వాత వచ్చిన అశోకుడే బౌద్ధమతం స్వీకరించి – దాన్ని దేశంలో ఉధృతంగా ప్రచారం చేశాడు. తన కుమారుడు మహేంద్రను, కూతురు సంఘమిత్రను శ్రీలంకకు పంపి, అక్కడ బౌద్ధం వ్యాపింపజేయడంలో చొరవ తీసుకున్నాడు. సర్వమానవ సమానత్వం, సౌభ్రాతృత్వం, శాంతి, అహింస వంటి బుద్ధుడి సూత్రాల్ని చక్రవర్తిగా అశోకుడు విస్తృతంగా ప్రచారం చేశాడు. ప్రపంచంలో భారతదేశానికి గౌరవప్రతిష్ఠలు పెరిగాయంటే ఈ సూత్రాలవల్లనే – సాధారణ శకానికి పూర్వం 3వ శతాబ్ది (బీసీఈ)లో సమ్రాట్ అశోక్ మౌర్య చేసిన ప్రకటన ఇలా ఉంది –
‘‘నా పుత్రపౌత్రాదులు జీవించినంతకాలం, సూర్యచంద్రులు వెలుగొందునంతకాలం, బౌద్ధధమ్మం మహోజ్వలంగా భాసిల్లుతుంది. బుద్ధుణ్ణీ, అతని ధమ్మ మార్గాన్నీ అనుసరించే ప్రజలు తమ జీవితాంతం సుఖశాంతులను పొందగలుగుతారు!!’’ యజ్ఞయాగాల వల్లగానీ, జంతుబలుల వల్లగానీ, వేదపురాణాల వల్లగానీ – కల్పించుకున్న దేవీదేవతల వల్లగానీ ఈ దేశప్రతిష్ఠ ప్రపంచంలో పెరగలేదు. పైగా అంధవిశ్వాసాలు మాత్రం విపరీతంగా పెరిగాయి. సమకాలీనంలో కూడా మన దేశనాయకులు ఇతర దేశాలకు వెళ్ళినపుడు తాము ‘బుద్ధభూమి’ నుండి వచ్చామనీ గర్వంగా చెప్పుకుంటున్నారుకదా? తాము యుద్ధభూమి నుండి రాలేదని తమ శాంతికాముకత్వాన్ని ప్రకటిస్తున్నారు కదా? తప్పదు – వారికి మరో మార్గం లేదు.
నాగార్జుని ‘శూన్యవాదం’లోని సారాన్నిపిండుకుని శంకరుడు అద్వైతాన్ని తయారు చేశాడంటారు. నిజం చెప్పాలంటే మహాయాన బౌద్ధం – మొదటి భాగమైతే, అద్వైతం – రెండవ భాగమవుతుంది! విశ్వంలో ప్రతిదీ పరస్పర ఆధారితం – ఏదీ స్వతస్సిద్ధం కాదు గనక, అంతా శూన్యమనే నాగార్జునుడి వాదనను శంకరుడు ‘జగన్మిథ్య’గా మార్చుకున్నాడు. బుద్ధుడు బోధించిన నిర్వాణంతో ‘కార్యకారణ బంధం’ అంతమవుతుంది. నిర్వాణం వైదిక పరిభాషలో ‘మోక్షం’ అయ్యింది. బ్రహ్మమొక్కటే – అని తెలుసుకోవడమే మోక్ష సాధనం అంటాడు శంకరుడు. అందువల్ల ఎంత నిరాకరించినా శంకరుడి ఆలోచనలు బౌద్ధంలోంచి వెలువడినవే! ఆయనను ‘ప్రచ్ఛన్న బుద్ధు’డన్నది కూడా అందుకే!
‘‘బౌద్ధాన్ని శ్రద్ధగా అధ్యయనం చేస్తే, ఇది హేతువు (కారణం/రుజువు)పై ఆధారపడి ఉందని స్పష్టమౌతుంది. ఏ ఇతర మతాలలో లేని సరళత బౌద్ధ జీవన విధానంలో మాత్రమే ఉంది’’ అని అన్నారు డా. బి. ఆర్. అంబేడ్కర్!
Also read: అంబేడ్కర్ : బౌద్ధ ప్రమాణాలు
(రచయిత సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త. మెల్బోర్న్ నుంచి)