నేను SV యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు మా వార్షికోత్సవానికి వావిలాల గోపాలకృష్ణయ్య ముఖ్య అతిధి. ఆయన కోసం మా వాళ్లు కారు తీసుకుని రైల్వే స్టేషన్ వెళ్లి ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ దగ్గర వెతుకుతుంటే ఆయన థర్డ్ క్లాస్ లో వచ్చి, బయట రిక్షా ఎక్కి నేరుగా యూనివర్సిటీకి వచ్చి విద్యార్థులలో కలిసిపోయి నిలబడి ఉన్నారు. వేదిక పైన ఆయన పేరు చెప్పి ఆయన రాలేదని చెప్పేలోగా ఒకతను వేదిక దగ్గరకు వచ్చి ఎక్కబోతుండగా అక్కడ వలంటీరుగా ఉన్న నేను చెయ్యి అడ్డం పెట్టాను. ముతక పంచ, చొక్కా, చేతిలో ఒక గుడ్డ సంచితో పల్లెటూరు రైతులా కనిపించే అతను వేదిక ఎక్కడానికి ఎందుకు వచ్చాడో అనకుంటుంటే “నా పేరు పిలిచారు కదా” అన్నారు. అప్పుడు తెలిసింది ఆయన వావిలాల అని. నా ప్రవర్తనకు సిగ్గుపడి సారీ చెప్పి అడ్డు తొలిగాను.
అతిధులందరికి పూలమాలలు వేసి ఈయనకు మాత్రం కూరగాయల మాల వేశారు. ఆశ్చర్యంగా అదేమిటి అని అడిగితే ఆయనకు పూలు వృధా చేయడం కంటే ఇలా వేయించుకోవడం అలవాటు అన్నారు నా ప్రక్కనున్న వారెవరో. అది మాత్రం వృధాకాదా అనుకున్నా. చివర ఆయన వేదిక దిగి వెళ్ళేటప్పుడు మాల తీసుకువెళుతుంటే “అది ఏం చేస్తారండి” అని అడిగాను. “కూర వండుకుంటానండి. మీరు వండుకుంటానంటే మీకు ఇస్తాను” అన్నారు. వద్దని నమస్కారం పెట్టి మరోసారి సిగ్గు పడ్డాను ఆయన వ్యక్తిత్వాన్ని అనుమానించినందుకు.
సత్తెనపల్లిలో ఎన్నికల్లో పోటీ చేసేందుకు అయన నామినేషన్ పేపర్లు స్నేహితులు తెస్తే సంతకం పెడతారు. ఇళ్లముందు ఆడవాళ్లు “వావిలాల గోపాల కృష్ణయ్యకే మీ ఓటు” అని ముగ్గుతో రాస్తారు. అంతకు మించి ప్రచారం లేకుండా ఎన్నికల్లో గెలుస్తారు ఆయన. అదీ ప్రజా నాయకత్వం అంటే. అలాంటి మన ముందరి తరం నాయకులకు, కోట్లు ఖర్చుపెట్టి గెలిచే నేటి రౌడీ నాయకులకు ఎక్కడైనా పోలిక ఉందా!