వోలేటి దివాకర్
దివంగత మాజీ మంత్రి వట్టి వసంత కుమార్ సంస్మరణ సభను ఆత్మీయులు పేరిట ఎస్.ఎన్. రాజా, ప్రసాదుల హరినాధ్ రాజమహేంద్రవరం లో ఏర్పాటు చేశారు.
ఈసభలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వట్టితో ఉన్న అనుభవాలు, జ్ఞాపకాలను వెల్లడించారు. వట్టి వసంతకుమార్ కల్మషం లేని వ్యక్తి అని, ఎవరు ఏం అనుకున్నా సరే, తన మనసులో మాటను చెప్పగల ముక్కుసూటితనం, అందరితో కలివిడిగా ఉండే ఉన్నత వ్యక్తిత్వం ఆయన సొంతమని పేర్కొన్నారు.
తన కన్నా ఏడాది పెద్ద వాడైనా వట్టి ఎక్కడ చూసినా గురువు గాడు అంటూ కాళ్ల మీద పడిపోయేవారన్నారు. గురువు అంటూ గాడు ఏమిటి అంటే తనకు గురువు గాడ్ (దేవుడు) నువ్వే అని చమత్కరించేవారని గుర్తు చేసుకున్నారు.
ఉండవల్లి మాట్లాడుతూ ఎవరైనా ఒక వ్యక్తి రాకపోతే ఇంకా రాలేదేంటని ఎదురుచూడ్డంలోనే గొప్పతనం ఇమిడి ఉంటుందని, అలాంటి వ్యక్తి వసంత కుమార్ అని అన్నారు. సినిమాలో ఒక పాత్ర వచ్చి వెళ్ళిపోయినట్లుగా వసంత మరణం ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
విశాఖపట్నం ఉక్కు సభలో పాల్గొనేందుకు వెళ్ళినప్పుడు చూసేందుకు వస్తున్నా అని వసంత్ కు ఫోన్ చేస్తే వద్దని నిర్మొహమాటంగా చేప్పారని, కొద్ది సేపటి తరువాత సభలో వేదికపై కనిపించి మాయమయ్యాడని, ఆ తరువాత ఫోన్ చేసి చూడలనిపించి వచ్చినట్లు చెప్పాడని చివరి రోజులను గుర్తుచేశారు.
అగ్రికల్చర్ బీఎస్సీ, ఎంబీఏ, పిహెచ్ డి చేసి , ప్రొఫెసర్ గా చేసిన వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చిన ఆయన కు అవినీతి అంటే విరక్తి అని, అసలు అవినీతిని దరిచేరనీయకుండా హుందాగా వ్యవహరించాడని ఆయన కీర్తించారు. ఎవరినైనా ఒక మాట అన్నా, ఎవరైనా తనను ఒక మాట అన్నా వెంటనే మర్చిపోయే ఉన్నత వ్యక్తిత్వం గల వసంత కుమార్ ఇంత తొందరగా వెళ్ళిపోతాడని అనుకోలేదని ఉండవల్లి పేర్కొంటూ, సంతాప సభలో కూడా ఒక్క అబద్దం చెప్పే అవకాశం ఇవ్వని గొప్ప వ్యక్తిత్వం కలవాడని కొనియాడారు. ఉండవల్లితో పాటు పలువురు వసంత కుమార్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఆయన ఆత్మకు సద్గతులు కలగాలని ప్రార్ధిస్తూ మౌనం పాటించారు.